(Recovered and Reloaded)
దివికి గంగను తెచ్చిన భగీరథుడు
ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు
ఏడవ భాగం -బాలకాండ
వనం జ్వాలా నరసింహా రావు
సూర్య దినపత్రిక (13-06-2016)
సుమంత్రుడి సలహా విన్న దశరథుడు, వశిష్ఠుడికి
విషయాన్నంతా తెలియపరచి, ఆయన సూచన
ప్రకారం ఋశ్యశృంగుడిని తన రాజ్యానికి తీసుకొచ్చేందుకు రోమపాదుడి దగ్గరకు పోతాడు.
ఆయన పయనమై పోతున్న త్రోవను వర్ణిస్తూ "ప్రహరణకలిత" వృత్తంలో ఒక పద్యం
రాసారు వాసు దాసుగారీవిధంగా:
ప్రహరణకలిత: వనములు నదులున్ వరుసగఁ గనుచున్
జనపతి చనెఁ ది న్న నిపయనములన్
మునికులతిలకున్
మును చని కనెఁ బా
వనశుచిరుచిన్ వరఋషి తనయున్-7
ఛందస్సు:
"ప్రహరణకలిత" వృత్తానికి
న-న-భ-న-వ గణాలుంటాయి. ఎనిమిదో అక్షరం యతి.
తాత్పర్యం:
దారిలో నదులను-పర్వతాలను దాటుకుంటూ, రోమపాదుడి
చంపా నగరానికి చేరుకుంటారు. వెళ్లిన
వెంటనే, ముందుగా ఋశ్యశృంగుడి దర్శనం చేసుకుని, తర్వాత
రోమపాదుడి వద్దకు వెళ్తాడు దశరథుడు.
సంతాన లాభం అనుగ్రహించమని దశరథుడు యజ్ఞం చేస్తున్న సమయంలో, అక్కడకు, గంధర్వులు-దేవతలు-సిద్ధులు-ఇతర దేవతలు,పరమ ఋషులు, తమ తమ
హవిర్భావం కొరకై బ్రహ్మదేవుడితో కలిసి వచ్చారు. వచ్చిన
వారంతా బ్రహ్మను చూసి, రావణాసురుడు
తమను పెట్తున్న బాధలను ఆయనకు మొర పెట్టుకుంటారు. దశరథుడి
అభీష్ఠాన్ని నెరవేర్చేందుకు, పరమ
కరుణాలుడైన భగవంతుడు భూలోకంలో అవతరించదలచి దేవతలున్నచోటికే వచ్చాడు ఆ సమయంలో.
వచ్చిన విష్ణుమూర్తి ఏకాగ్రమనస్సుతో బ్రహ్మ సమీపంలో వుండగా, దేవతలాయనకు
నమస్కరించి, స్త్రోత్రం చేసి, ఆయన
మనస్సును సంతోష పరిచి, భక్తితో తమ
బాధలు చెప్పుకున్న విషయాన్ని "సుగంధి" పద్యంలో రాసారు కవి ఇలా:
సుగంధి: నిన్ను వేఁడు వార మయ్య నీరజాక్ష!
మమ్ము నా
పన్నులం బ్రపన్ను లం బ్రపంచము న్దయామతిం
జెన్ను మీరఁ గావవే, ప్రసిద్ధుఁ డిద్ధకీర్తిసం
పన్నుఁ డున్ వదాన్యుఁ డుం దపస్వితుల్య తేజుఁ డున్-8
ఛందస్సు: సుగంధికి ర-జ-ర-జ-ర గణాలు 9 వ అక్షరం యతి.
తాత్పర్యం:
కమలాలలాంటి కళ్ళున్న మహానుభావా! ఆపదలతో
బాధపడుతున్నాం. నిన్ను ప్రపత్తి చేసినవాళ్ళం. అందుకే
నిన్నే ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని-ప్రపంచాన్ని దయతో రక్షించు. ప్రపంచంలో
సత్ప్రవర్తనకలవాడని ప్రసిద్ధికన్నవాడు,మంచి కీర్తి సంపాదించినవాడు, దాత, ఋషితేజంకలవాడు,కకుత్థ్స వంశంలో పుట్టినవారిలో శ్రేష్ఠుడు దశరథుడు కొడుకులు కావాలని
సంకల్పించి యజ్ఞం చేస్తున్నాడు.
రావణుడు వర గర్వంతో అన్ని లోకాలవారిని-ముఖ్యంగా వయసులో వున్న స్త్రీల మాన ప్రాణాలను-పురుషుల ప్రాణాలను నాశనం చేసాడని, వాడు మనిషి
చేతులో తప్ప ఇతరుల వల్ల చావడని, సామాన్య
మానవులెవరు వాడిని చంపలేరని, అందువల్ల
విష్ణుమూర్తే మానవావతారంలో వాడిని చంపాలని దేవతలిచ్చిన సలహాను అంగీకరించిన
మహావిష్ణువు దశరథుడు పుత్ర కామేష్ఠి యాగం చేస్తున్న ప్రదేశం నుండి అదృశ్యమయ్యాడు. విష్ణుమూర్తి
యజ్ఞ సభనుండి అంతర్థానమైన తర్వాత ఆయనకు రామావతారంలో సహాయపడేందుకు, బలవంతులను - కామ రూపులను- గోళ్ళు, కోరలు
ఆయుధాలుగా కలవారిని-అసహాయశూరులను సృజించమని, దేవతలను
ఆదేశిస్తాడు బ్రహ్మ. ఇలా జన్మించిన వానరుల విషయం ప్రస్తావిస్తూ ఒక పద్యాన్ని
"ఉత్సాహం" లోనూ, మరొకటి
"మత్తకోకిలము" వృత్తంలోనూ,మూడోది "మనోహరిణి" వృత్తంలోనూ రాసారీవిధంగా కవి.
ఉత్సాహం: కామరూపధారులుం బ్ర కాశమాన తేజులున్
ధీమతుల్ ప్రధాయుతుల్ సుధీరతావిరాజియుల్
భీమవేగభూరిశౌర్య
విక్రమేడ్యయూథపుల్
భూమిశతసహస్రశతము పుట్టి క్రాలు చుండఁ గన్-9
ఛందస్సు:
ఉత్సాహం కు ఏడు సూర్య గణాలు, ఒక గురువు, ఐదవ గణం
మొదటి అక్షరం యతి.
మత్తకోకిలము: అట్టిమర్కటయూథపాళుల యందు మిక్కిలి
మేటులై
దిట్టలై రవిపుత్రుఁ డాదిగ దేజరి
ల్లిరి యూథనా
థేట్టు లీ ప్లవగేంద్రులున్ జని యింపఁ
జేసిరి ధీరతా
పట్టభద్రుల శౌర్య రుద్రుల స్వామికార్యవినిద్రులన్-10
ఛందస్సు: మత్తకోకిలము
వృత్తానికి ర-స-జ-జ-భ-ర గణాలు.పదకొండో అక్షరం యతి.
మనోహరిణి: జలధర బృందా
చలకూటనిభుల్
బలమదవంతుల్ ప్లవగ ప్రముఖుల్
వెలసిరి సీతా విభుసాహ్యముకై
బలకొని చక్షు ర్భయదాకృతులున్-11
తాత్పర్యం:
వారు కోరిన రూపాలు ధరించగలరు.తేజంతో ప్రకాశిస్తూ-బుద్ధివల్ల పూజించబడుతూ-కీర్తిమంతులుగా-మంచి ధైర్యవంతులుగా-భయంకర వేగంతో-గొప్ప శౌర్యంతో-పరాక్రమంతో ఆ వానర సేనానాయకులందరూ భూమిపై తిరగసాగారు. ఆ
సేనానాయకుల గుంపులలో,మిక్కిలి గొప్పవారైన
సుగ్రీవుడులాంటివారు,వారికి నాయకుడై వుండసాగారు.ఈ వానరులకు కూడా ధైర్యవంతులు, శౌర్యవంతులు, స్వామికార్యధురీణులు
పుట్టారు. మేఘ సమూహాలవలె బలసినవారై, కొండ
శిఖరాలలాగా ఉన్నత దేహాలు కలిగి, బల గర్వాలతో, భయంకర ఆకారాలతో, శ్రీరాముడికి
సహాయం చేసేందుకొరకు జన్మించారా వానర శ్రేష్ఠులు.
యజ్ఞం అయిన ఆరు ఋతువుల తర్వాత, పన్నెండో
నెలలో, చైత్ర మాసం - శుక్లపక్షం - నవమి తిథి నాడు, పునర్వసు
నక్షత్రంలో, అభిజిల్లగ్నం - కర్కాటక లగ్నంలో, చంద్రుడిని
కూడిన బృహస్పతి కలిగిన ఉదయం (గురుడు కర్కాటకరాశిలో చంద్రుడితో చేరి వుండడం -
చైత్రంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించడం కూడా ఉచ్ఛస్తానాలే), సూర్యుడితో
సహా ఐదు గ్రహాలు (అంగారక,సూర్య, గురు, శని, శుక్ర) వాటి-వాటి ఉచ్ఛ స్థలాల్లో(సూర్యుడికి మేషరాశి - గురువుకు
కర్కాటకం - శనికి తుల - శుక్రుడికి మీన రాశి - అంగారకుడికి మకర రాశి ఉచ్ఛస్తానాలు)
వుండగా, కౌసల్యా దేవి జగత్ పాలకుడైన శ్రీమహావిష్ణువు యొక్క అర్థాంశమూర్తి - శుభ లక్షణాలు కలవాడైన రఘువంశ వర్ధనుడిని, సర్వ లోకాలు
నమస్కారం చేసేవాడిని, రాముడిని కనింది.
శ్రీరాముడితో సహా నలుగురు రాజకుమారులు అల్లారుముద్దుగా పెరుగుతూ, విద్యలలో
ఆసక్తిగలిగి, సమస్త విద్యలను శ్రేష్ఠులైన గురువుల దగ్గర నేర్చుకున్నారు. తన నలుగురు
కుమారులకు వివాహం చేయాలని దశరథుడు ఆలోచన చేసే సమయంలో, ఆయన
సంకల్పబలానికి అనుగుణంగానే,జగత్ప్రసిద్ధిగాంచిన - మహాతేజస్సుగల
విశ్వామిత్ర మహర్షి ఆయనను చూడడానికి వచ్చాడు. యజ్ఞం
చేద్దామని సంకల్పించుకొని దీక్ష పూనానని,దాన్ని విఘ్నం చేయాలని మారీచ - సుబాహువులు
అనే ఇద్దరు రాక్షసులు పంతం పట్టారని, వారినుండి
కాపాడేందుకు శ్రీరాముడిని తనవేంట అడవులకు పంపమని కోరాడు విశ్వామిత్రుడు. తనకిష్ఠం
లేకున్నా, వశిష్ఠుడు చెప్పిందంతా విన్న దశరథుడు, సంతోషించి, లక్ష్మణుడితో
సహా రామచంద్రుడిని మునివెంట పంపేందుకు ఒప్పుకుంటాడు. బల-అతిబల విద్యలను నేర్చుకుంటారు రామలక్ష్మణులు.
తాటక వధానంతరం యుద్ధభూమిలో జయించగల శ్రేష్ఠమైన అనేక అస్త్రాలను
శ్రీరాముడికిచ్చి అవి ఎప్పుడు ఎలా ఉపయోగించాలో నేర్పుతాడు(తనవెంట అడవుల్లో తీసుకెళ్తున్న) విశ్వామిత్రుడు. శ్రీరామచంద్రుడు
సంతోషంతో వాటిని స్వీకరించి, విశ్వామిత్రుడికి
నమస్కరించి ప్రయాణమై పోతూ, తనకున్న
సందేహాలను ఆయన్నడిగి తీర్చుకుంటాడు. తాను
ప్రయోగించిన అస్త్రాన్ని తిరిగి ఉపసంహరించాలంటే ఏం చేయాల్నో, వివరంగా
చెప్పమని శ్రీరాముడు అడిగిన విషయాలన్నిటికీ వివరణ ఇచ్చాడు విశ్వామిత్రుడు. తదుపరి, విశ్వామిత్రుడి
ఆజ్ఞ ప్రకారం సంహారాస్త్రాలన్ని రామచంద్రమూర్తి లక్ష్మణుడికి ఇచ్చాడు. ఈ విధంగా
వారిద్దరూ ఆ విద్యలనన్నీ నేర్చినవారైనారు.
విశ్వామిత్రుడి యాగరక్షణచేసిన రామలక్ష్మణులను మిథిలానగారనికి
తీసుకొని పోతుంటాడు. రత్నాల లాగా శ్రేష్ఠమైన సద్గుణాలుగల ఆ బాలురు విశ్వామిత్రుడి
వెంట పోయే సమయంలో సమీపంలోని కొండ పక్క అందమైన చెట్ల గుంపు కనిపించింది. ఆ
సందర్భంలో "వనమయూరము" లో రాసారీ పద్యాన్ని:
వనమయూరము: మాణవకరత్నములు మౌనివరున్ వెంటన్
రాణమెయిఁ బోవునెడ రాముఁ డు మృదుశ్రీ
వాణి నిటు పల్కె ఋషి వర్య ! గిరిచెంతన్
బొణిమి నెసంగెఁ దరుపుంజ మది గంటే ? -12
ఛందస్సు:
వనమయూరము నకు భ-జ-న-స-గగ లు గణాలు. తొమ్మిదింట యతి.
గంగ ఎందుకు భూలోకంలో ప్రవహించవలసి వచ్చిందో, దానికి
కారణమేంటో చెప్పదల్చుకుని, రామ
లక్ష్మణులతో సగరుడి వృత్తాంతాన్ని వివరించాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు సగర
చక్రవర్తి వృత్తాంతాన్ని చెప్తూ ఆయనకు యజ్ఞంచేయాలన్న ఆలోచన కలిగిందంటాడు. యజ్ఞం
మధ్యలో ఇంద్రుడు రాక్షస వేషంలో వచ్చి,యజ్ఞాశ్వాన్ని దొంగిలించాడు. దాన్ని
వెతకడానికి వెళ్లిన సగరకుమారులు కపిలుడి కోపాగ్నిలో భస్మమై పోతారు. చనిపోయిన సగర
పుత్రులు స్వర్గానికి పోవాలంటే గంగలో వారి బూడిదలను తడపాలి.
ఆ వంశంలోని భగీరథుడు రాజర్షిగా వుండి, పిల్లలులేనివాడైనందున,రాజ్యాన్ని మంత్రుల పరంచేసి, పూర్వీకులెవరికీ
సాధ్యపడని గంగను తెచ్చేందుకు గోకర్ణానికి తపస్సు చేసేందుకు పోతాడు. ఆ తపస్సుకు
మెచ్చిన బ్రహ్మదేవుడు, అసమానమైన
తపస్సు చాలించి ఆయనకోరికేదో తనకు తెలియచేయమని భగీరథుడితో అంటాడు. భగీరథుడు, తనననుగ్రహించి
సగరకుమారులందరికి తాను తర్పణాలు వదిలేటట్లు చేయమని,బ్రహ్మదేవుడిని ప్రార్థించాడు. గంగా
తీర్థంతో తన తాతల బూడిద రాసులను తడిపితే వారందరు స్వర్గానికి పోతారని-అలా వరమివ్వమనీ, తనకు
పుత్రులనిచ్చి ఇక్ష్వాకుల వంశాన్ని నిలబెట్టమనీ బ్రహ్మనడిగాడు భగీరథుడు.ఇది వివరించేందుకు "తోటకము" వృత్తంలో రాసారో పద్యాన్నిలా:
తోటకము: జగదీశ్వర నాకు బ్ర సన్నుఁ
డవే
నొగినాతపమున్ ఫల యుక్తమయే
న్సగరాత్మజులందరు నావల నన్
వగదీరఁగఁ గాంత్రు నివాపములన్-13
ఛందస్సు:
తోటక వృత్తానికి నాలుగు
"స" గణాలు, తొమ్మిదో అక్షరం యతి.
మిధిలానగరానికి ప్రయాణం కొనసాగిస్తూ, విశ్వామిత్రుడు, శ్రీరామ
లక్ష్మణులతో-ఋషీశ్వరులతో కలిసి, గంగ దాటి, ఉత్తరం
వైపున్న ఒడ్డుకు చేరుకున్నాడు. అక్కడ, ప్రాకారాలతో, కుల
పర్వతాలను మించిన మేడల గుంపుల కాంతులతో, తియ్య
మామిడి లాంటి ఫల వృక్షాలతో స్వర్గాన్నే మరిపిస్తున్న విషాల నగరంలోకి ప్రవేశించగానే, రాజకుమారుడైన
రామచంద్రమూర్తి, మహాత్ముడైన విశ్వామిత్రుడితో, ఆ నగరాన్ని
ఏలే రాజెవ్వరని-ఏ వంశం వాడని, అడిగాడు. సమాధానంగా
మునీంద్రుడు ఆ కథంతా చెప్పాడు.
పాలసముద్రం చిలికి-అందులోంచి పుట్టిన అమృతాన్ని భుజించినట్లైతే,తమకు మరణముండదని-ముసలితనం రాదని ఆలోచించి, మందర
పర్వతాన్ని కవ్వంగా-వాసుకు తాడుగా, పాలసముద్రాన్ని
చిలకడం మొదలెట్టారు దేవదానవులు. అలా వారు
వేయి సంవత్సరాలు చిలకగా, ఆ రాపిడిని
సహించలేక, వాసుకి విషాన్ని కక్కాడు. ఆ వేడికి
కొండ రాళ్లు పగలడంతో పాటు, భయంకరమైన
హాలాహలం రాక్షసులను, దేవతలను భస్మం చేయసాగింది. అంతులేని
తాపాన్ని కలిగిస్తున్న హాలాహలాన్ని విష్ణువు చెప్పినట్లే మింగి, విషాన్ని
కంఠంలో ధరించాడు. దేవతలు తిరిగి పాలసముద్రాన్ని చిలుకుతుండగా మందర పర్వతం
పుటుక్కున మునిగింది సముద్రంలో. అది చూసిన
దేవతలు, ప్రపంచాన్ని-ముఖ్యంగా తమను రక్షించే విష్ణుమూర్తిని, కొండ
మునుగుతున్నదని-దాన్ని పైకెత్తి పట్టగల
సమర్థుడు ఆయనేనని-ఆయనను సేవిస్తుండే వారు ఆపదల
పాలవుతుంటే వూరకుండరాదని-ఆశ్రిత రక్షణ చేసి, తమను
కాపాడమని ప్రార్థించారు. ఈ సందర్భంగా
"మత్తకోకిలము" వృత్తంలో రాసారీపద్యాన్ని కవి.
మత్తకోకిలము: ఆ హరించి విషంబు నిట్లు పురారి యేగిన, దేవతల్
మొహరించి మరిన్ మధింపఁ గ మున్గెఁ గొండ పయోనిధిన్
బాహి యందు నుతించి రంతటఁ బంకజాక్షుని నీజగ
ద్వ్యూహరక్షకు నందు మాకును బూఁ ట వీవ కదా హరీ ! -14
ఛందస్సు: మత్తకోకిలము
వృత్తానికి ర-స-జ-జ-భ-ర గణాలు.పదకొండో అక్షరం యతి.
ఆ తర్వాత
విశాలదేశ వృత్తాంతాన్ని, గౌతమి ఆశ్రమ
వృత్తాంతాన్ని, అహల్యని-ఇంద్రుడిని గౌతముడు శపించాల్సిన కారణాన్ని వివరించాడు
విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడిలా చెప్పడంతో, లక్ష్మణుడితో
కలిసి రామచంద్రమూర్తి,విశ్వామిత్రుడు ముందు నడవగా, గౌతముడి
ఆశ్రమంలోకి ప్రవేశించాడు.ఆశ్రమంలో శ్రీరామచంద్రమూర్తి ప్రవేశించగానే, శాపం
తొలిగిన అహల్య,పూర్వరూపంలో లోకానికి కనపడింది. ఆ తర్వాత
అందరు కలిసి మిథిలానగరం చేరుకుంటారు. విశ్వామిత్రుడొచ్చాడని తెలుసుకున్న జనక మహారాజు
తన పురోహితుడైన శతానందుడుతో కలిసి వారున్న ప్రదేశానికి వచ్చాడు.శతానందుడు, శ్రీరామచంద్రుడికి
స్వాగతం పలికి, విశ్వామిత్రుడి చరిత్రను-ఆయన గొప్పదనాన్ని వివరించాడు. వశిష్టుడు విశ్వామిత్రుడి విందు ఇవ్వడం,కామధేనువు గురించి ఇద్దరి మధ్య యుద్ధంజరగడం చెప్పాడు.
No comments:
Post a Comment