Monday, August 8, 2016

భూ పరిపాలనలో సంస్కరణలు : వనం జ్వాలా నరసింహారావు

(Recovered and Reloaded)
భూ పరిపాలనలో సంస్కరణలు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (02-06-2016)

             తెలంగాణ రాష్ట్రంలోని అసైన్డు భూముల సమగ్ర పరిశీలన, అంచనా, ధృవీకరణ, తప్పొప్పుల సవరణ, అవసరమైన మార్పులు-చేర్పులు, తగు విధంగా వీటన్నింటి అనుసంధానం, తదితర సంబంధిత అంశాలను బేరీజు వేసి, ఆ మొత్తం భూమిని ఒక క్రమ పద్ధతిలో వినియోగంలోకి తేవడం అనే విషయం, ఆద్యతన భవిష్యత్ లో, ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలలో అత్యంత ముఖ్యమైందిగా కాబోతున్నది. ఇదే ప్రధాన ఎజెండాగా, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, భూ పరిపాలనలో నూతన ఒరవడులతో, సంస్కరణలతో ముందుకు సాగడానికి జిల్లా కలెక్టర్లు సన్నద్ధమౌతున్నారు. మే నెల చివరివారంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల, జాయింట్ కలెక్టర్ల సమావేశంలో భూ పరిపాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, లక్షలాది మంది నిరుపేద రైతులు, ప్రధానంగా దళితులు లబ్ది పొందడానికి, అనేక దీర్ఘకాలిక ప్రయోజన చర్యలను ప్రకటించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఆసరా పెన్షన్లు, సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన-నిర్మాణ పనుల లాగానే భూ పరిపాలనా సంస్కరణలు కూడా బంగారు తెలంగాణకు బాటలు వేస్తాయి.

తెలంగాణలో సుమారు ఎనబై శాతం పైగా వ్యవసాయ భూమి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన చిన్న- సన్నకారు రైతులకు చెందిందే. భూ పరిపాలన లేదా రెవెన్యూ పరిపాలన అనాదిగా ఆచరణలో వున్న విషయం తెల్సిందే. ఇందులో భాగంగా గ్రామం ప్రాధమిక యూనిట్ గా భూమికి సంబంధించిన వ్యవహారాల పర్యవేక్షణ వుంటుంది. శతాబ్దాలుగా, మానవ సమాజంలో, సొంత భూమిని కలిగి వుండడం ఒక హక్కుగా భావించడం వ్యవసాయాధారిత దేశాలన్నింటిలో పరిపాటే. ప్రప్రధమ కమ్యూనిస్ట్ దేశం సోవియట్ యూనియన్ లో మొదట్లో యావత్ భూమిని జాతీయం చేసినప్పటికీ, కొద్ది కాలం తరువాత, లెనిన్ ఆలోచనలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న నూతన ఆర్థిక విధానం దరిమిలా, తిరిగి వ్యవసాయ భూమిలో చాలా భాగం ప్రైవేట్ ఆసాముల పరం చేయడం జరిగింది. దీనర్థం, ఏ దేశంలోనైనా భూమిపై హక్కు అంత తొందరగా వదులుకోవడం కష్టం అని. మరో విధంగా చెప్పాలంటే, భూమి-దానిపై హక్కు భుక్తం అనేది అత్యధిక శాతం గ్రామీణ ప్రజలకు, అందునా నిరు పేద ప్రజలకు చాలా ముఖ్యమైంది.

గతంలో సమైక్య రాష్ట్రంలో అప్పటి పాలకుల నిర్వాకం వల్ల గ్రామ పరి పాలన పూర్తిగా నిర్వీర్యమైపోయింది. రెవెన్యూ పాలనకు కూడా అదే గతి పట్టింది. ఒకానొక రోజుల్లో రెవెన్యూ పాలన అంటే, అందులో ఆబ్కారీ ఆదాయం,  వాణిజ్యపన్నులు, దేవాదాయ-ధర్మాదాయాలకు సంబంధించిన కార్యకలాపాలు కూడా వుండేవి. కాలక్రమేణా రెవెన్యూ అంటే, ఆ పదమే మిగిలింది ప్రస్తుతానికి. అందులోనూ అనేక లోటు పాట్లున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కలిసి వున్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో పట్టణ భూ గరిష్ఠపరిమితి పేరుతో, అలాగే, గ్రామాల్లో భూసంస్కరణల పేరుతో మిగులు భూమిని తేల్చినప్పటికీ, దాని ఆజమాయిషీ, పంపిణీ విధానం, అసంబద్ధంగా, అశాస్త్రీయంగా, పేదవారికి లాభసాటి కాని విధంగా జరిగింది. అదే విధంగా అసైన్డ్ భూముల విషయంలో కూడా అనాలోచితంగా, అసంబద్ధంగా పంపిణీ చేయడం జరిగింది. ఉదాహరణకు, ఒక వంద ఎకరాల భూమిని అంతకన్నా ఎక్కువ మందికి-ఒక్కోసారి సుమారు నూట ఏబై మందికి అసైన్ చేయడం కాని, ఒకే చోట కాకుండా వివిధ జాగాల్లో చిన్న చిన్న అర ఎకరా-పావు ఎకరా ముక్కల్ని ఒకే రైతుకు అసైన్ చేయడం కాని జరిగింది. ఫలితంగా ఆ భూమిని ఎవరికైతే అసైన్ చేశారో వాళ్లు ఉపయోగంలోకి తెచ్చుకోవడం కష్టమై పోయింది. అసైన్ చేసిన భూమి దగ్గరకు పోవడానికి మార్గం కూడా లేని పరిస్థితి వుండడంతో, వ్యవసాయానికి అవసరమైన అరకలు కాని, ఎద్దుల బండ్లు కాని అక్కడకు తీసుకెళ్లడానికి వీలు కాని పరిస్థితి వుండేది. క్లిష్టతరమైన పరిస్థితిలో ఈ బాధలు పడలేక తమకు దక్కిన ఆ కాస్త భూమిని వదిలించుకునే మార్గం వెతికారు చాలా మంది. కొందరు చట్టం అనుమతించకపోయినా తక్కువ ధరకు అమ్ముకోగా, మరి కొందరి భూమి అన్యాక్రాంతమైంది. రియల్ ఎస్టేట్ వారి కళ్లు కూడా కొన్ని చోట్ల పడి భూమి వారి స్వాధీనంలోకి పోయింది.


నిరు పేద దళితుల ఆర్థిక-సామాజిక అభివృద్ధికి అంకితమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, భూమి లేని దళిత రైతుల కుటుంబానికి చెందిన మహిళ పేరు మీద మూడెకరాల వరకు భూమి కొని ఇవ్వాలని నిశ్చయించింది. లాంఛనంగా ఈ పథకాన్ని ఆగస్ట్ 15, 2014 న ప్రారంభించింది ప్రభుత్వం. అసలే భూమిలేని దళిత కుటుంబాలకు తొలి విడతలో మూడెకరాల భూమిని కొని ఇవ్వాలని, తరువాత అంచెలంచలుగా, వారికున్న అర ఎకరం, ఎకరం, రెండెకరాలకు అదనంగా మిగిలినది కలిపి మొత్తం మూడెకరాలయ్యే విధంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం మీద అందరూ మూడెకరాల భూమి సొంతదారులు కావలన్నది ఈ పథకం ఉద్దేశం. ఇంతవరకు ఈ పథకం కింద సుమారు 7685 ఎకరాల భూమిని 2937 మంది లబ్దిదారులకు సుమారు రు. 317 కోట్లు వ్యయం చేసికి భూమిని కొనుగోలు చేసి అందచేయడం జరిగింది. ఇందులో భాగంగానే "కమతాల ఏకీకరణ" కూడా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అసైన్డ్ భూములనీ, సాదా బైనామాలనీ, (తెల్ల కాగితం మీద క్రయ, విక్రయం సాగించటం) మ్యూటేషన్లు అనీ, నకలీ లేదా బహుళ రిజిస్ట్రేషన్లనీ, అనేక రకాల సమస్యలను వ్యవసాయాధారిత రైతులు అను నిత్యం ఎదుర్కొవడం జరుగుతోంది. వీటిని అధిగమించాలంటే ఒక సమగ్ర ప్రణాళికా బద్దమైన విధివిధానాలు రూపొందించుకోవాలి. చాలా మంది వ్యవసాయ దారులు చిన్న- చిన్న కమతాల భూమిని తెల్ల కాగితాల మీద రాయించుకుని కొనుగోలు చేసే సాంప్రదాయం వుండేది. అలా చేయడానికి ఒక కారణం చట్టంపై అవగాహన లేకపోవడం ఐతే, మరో కారణం గ్రామాల్లో అప్పట్లో నెలకొన్న ఒక రకమైన నమ్మకం. ఇటువంటి సాదా బైనామాల వల్ల అనేక రకాల సమస్యలు ఉత్పన్నమయ్యేవి. వాటిల్లో ప్రధానమైనవి, బ్యాంకులు, ఇతర రకాలైన ఆర్థిక సంస్థల నుంచి రుణ సదుపాయం పొందలేకపోవడం, అధిక వడ్డీకి ప్రైవేట్ వ్యక్తుల నుండి అప్పులు చేయడంవ్యవసాయ శాఖ అందించే కొన్ని సౌలభ్యాలను పొందలేక పోవటం, దాని మూలాన వివిధ పథకాల సమాచారం వారి వద్ద లేకపోవటం, భూమి హక్కు దారులైన వ్యక్తుల వారసులు ఇలా కొన్న వారిని కోర్టు వివాదాల్లో లాగడం లాంటివి వున్నాయి. వీటి మూలాన తెల్ల కాగితాల మీద సాదా మైనామాలు రాయించుకున్నావారు శాశ్వతంగా ఇబ్బందుల్లో కొనసాగాల్సి వస్తోంది.

లంచాలకు తావు లేకుండా, ప్రతి గ్రామీణ పేద రైతు, తన భూమికి సంబంధించిన మ్యూటేషన్ లాంటి ఏ పనైనా, ప్రభుత్వ కార్యాలయాల్లో సులువుగా చేయించుకోగల పరిస్థితి రావాలి. అలాగే గ్రామస్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో అసైన్డ్ భూముల పూర్తి వివరాలు క్రోడీకరించాలి. భూమి బంగారం లాంటిది. అందువల్ల ఎప్పటికప్పుడు ఒక క్రమ పద్ధతిలో భూములకు సంబంధించిన అన్ని రికార్డులను తాజా పరుస్తుండాలి. ఈ జాబితాలను క్రయవిక్రయాల ఆధారంగా మార్పులు కావిస్తూ కొత్త జాబితాలను అందుబాటులోకి తీసుకురావాలి. ఇక రిగిస్ట్రేషన్ల వ్యవహారానికొస్తే ఇతరుల  పేరిట భూములను మార్పు చేసి రిజిస్టర్  చేసుకునేటప్పుడు ఎన్నో తప్పుడు వ్యవహారాలు జరుగుతుంటాయి. నకిలీ ధృవీకరణ పత్రాలు, రెండు మూడు పేర్లతో ఇకే భూమిని రిజిస్ట్రేషన్లు చేసుకోవటం లాంటివి తరచు జరుగుతుంటాయి. ఇది కూడా ఒక రకమైన సమస్య. పాత కాలం నాటి కలం, ఇంక్, కాగాతాలు, స్టాంపులు ఉపయోగించి, వాటి ఆధారంగా తప్పుడు ధృవ పత్రాలు సమర్పించి రిజిస్టర్ చేసే విధానం ఇప్పటికీ కొనసాగుతూనే వస్తుంది. ఇదిలా వుంటే అసలు ప్రభుత్వ భూమి ఎంత ఉంది? అందులో ఎంతమేరకు కోర్టు వివాదాల్లొ చిక్కుకుని ఉన్నాయి? అనే గణాంకాలు పరిపూర్ణంగా ఇప్పటికీ లేవు. బహుశా సొంతదారులను మరో మారు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్న నిబంధన అమలులోకి తీసుకురావటం ద్వారా ప్రభుత్వ భూముల వివరాలు అందుబాటులోకి వచ్చే అవకాశం వుందేమో! ఇంతే కాకుండా ఇతర లోటుపాట్లలో భాగంగా కాగాతాలపై కనిపించే భూముల వివరాలు వాస్తవంగా వినియోగించే భూములు ఒకే తీరుగా వుండవు. ఇలాంటి రకరకాల సమస్యలతో సతమవుతున్న నేపధ్యంలో భూ వినియోగం, భూమిపై ఆధారపడాలన్న ఆసక్తి కూడా తగ్గిపోతున్నదేమో అనిపిస్తుంది.

            ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జిల్లాల కలెక్టర్లతో, జాయింట్ కలెక్టర్లతో, కొందరు క్యాబినెట్ సహచరులతో, సుధీర్ఘ సమీక్ష జరిపి అనేక సూచనలు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భూ పరిపాలన చీఫ్ కమిషనర్ కూడా ఉన్నారు. సమావేశంలోని ప్రాధాన్యతా అంశాలలో రెవెన్యూకు సంబంధించిన అంశాలు, సాదా బైనామాలు (తెల్ల కాగితాల మీద భూమికి సంబంధించిన క్రయ-విక్రయాలు), ల్యాండ్ హోల్డింగ్స్ ప్రస్థుత స్థితి, మ్యుటేషన్, భూమి అంశాలకు చెందిన వివాదాలు, అసైన్డ్ భూముల వివరాలు వున్నాయి. ఐదు ఎకరాల లోపు భూమి సాదా బైనామా ద్వారా కొన్నట్లయితే వాటిని క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించాలని, అందుకు విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన జూన్ 2, 2014 తేదీని కటాఫ్ డేట్ గా నిర్ణయించారు. రిజిస్ట్రేషన్ లకు వచ్చే వినతులను 2016 జూన్ 2 నుండి 10వ తేదీ అనగా స్వీకరించి, 15 రోజులలో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలని సీఎం ఆదేశించారు. ఎనిమిది రోజుల పాటు రిజిస్ట్రేషన్లు చేసిన తరువాత ఈ వివరాలన్నీ కంప్యూటర్ లో అప్ లోడ్ చేయాలని కూడా సీఎం ఆదేశించారు. నిరక్ష రాస్యులకు అవగాహన కల్పించాలి. డబ్బులు తీసుకోకుండా మ్యుటేషన్ చేయాలి అని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు.

వారసత్వంగా సంక్రమించిన భూములకు సంబంధించి మ్యూటేషన్లు (పేరు మార్పిడి) చేయడానికి అధికారులు అవినీతికి తావులేకుండా పనులు జరిగేట్లు చూడాలని సీఎం అన్నారు. సమావేశంలో సుదీర్ఘంగా ఈ అంశంపై చర్చ జరిగింది. వారసత్వ హక్కుల ప్రకారం పేరు మార్పిడి (పౌతి) చేసే విషయంలో కూడా 10 రోజుల వ్యవధి పెట్టుకోవాలి. దరఖాస్తు వచ్చిన పది రోజుల్లోగా పేరు మార్పిడి చేసి, 11వ రోజు కలెక్టరేట్ కు వివరాలు పంపాలి. దరఖాస్తు చేసినప్పుడే ఏదైనా అభ్యంతరముంటే చెప్పాలి. తెలవనోళ్లకు, నిరక్ష రాస్యులకు అవగాహన కల్పించాలి. డబ్బులు తీసుకోకుండా మ్యుటేషన్ చేయాలి అని సీఎం అన్నారు. అదే విధంగా సాధారణంగా జరిగే రిజిస్ట్రేషన్ల మ్యుటేషన్లను 15 రోజులలోగా పూర్తి చేసి రిజిస్ట్రేషన్లను కంప్యూటర్ లలో అప్ లోడ్ చేసి కలెక్టర్ కార్యాలయాలకు అనుసంధానం చేయాలని, కలెక్టర్లు అనునిత్యం వీటిని పర్యవేక్షిస్తూ ఉండాలని కోరారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటిదాకా 25 లక్షల ఎకరాలు ప్రభుత్వం పేదలకు అసైన్ చేసింది. కానీ చాలా మేరకు ఆ భూమి అసైన్డ్ దారుల స్వాధీనంలో లేదు.  చాలా భూమి వేరే వారి చేతుల్లో వుంది. అసైన్డ్ భూమి పేరుతో  పేదలకు పంపకం జరిగినట్లు రికార్డులలో వుండగా అది అసైన్డ్ చేయబడ్డ వారి వద్ద కాకుండా భూస్వాముల అక్రమణ క్రిందనో, లేదా భూ వ్యాపారుల (రియల్టర్ల) చేతుల్లోనో వుంది. ఈ భూములు ఎస్సీ, ఎస్టీ, బిసి, ఓసి లకు అసైన్డ్ చేయబడింది. ఎవరి పేరిట ఈ భూములు ఉన్నవి, ఎవరి ఆధీనంలో నలిగి పోతున్నాయి అనే లెక్కలు తేలాలి. అసైన్ మెంటు కూడా చాలా అశాస్త్రీయంగా పంపిణీ జరిగింది. కనీసం మూడు ఎకరాల వ్యవసాయ భూమి వుంటే ఆర్ధిక వనరుగా ఉపయోగ పడుతుంది. కానీ గతంలో వ్యవసాయానికి ఉపయోగపడని భూమిని, రాళ్లు రప్పలతో కూడిన భూమిని పంపిణీ చేశారు. ఫలితంగా లక్ష్యం నెరవేరలేదు. వ్యవసాయ శాస్త్రజ్ఙులు కూడా కనీసం మూడెకరాల భూమి తప్పని సరి అని పేర్కొన్నారుతెలంగాణ వచ్చిన తర్వాతనైనా పరిస్థితి మారాలి. ఇప్పుడిక అసైన్డ్ భూముల వివరాలు సేకరించడం మొదలైంది. అసైన్డ్ దారుల  వద్దే భూమి వుందా? ఆ భూమిలో వ్యవసాయం చేస్తున్నారా? అసలు ఆ భూమి ఎక్కడుంది? అనే వివరాలు జూన్ 30 లోగా తేల్తాయి. ఈ లెక్కలు తేలితే కమతాల ఏకీకరణ కూడా సులభతరమౌతుంది. ఇలా చేయడం వల్ల మెరుగైన వ్యవసాయ ఉత్పత్తి వీలవుతుంది.


ఇలా...ఈ విధంగా.. తెలంగాణ రాష్ట్రంలో భూ పరిపాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టడం జరిగింది. బంగారు తెలంగాణ దిశగా మరో అడుగు వేయడం జరిగింది. End

No comments:

Post a Comment