పోతన చెప్పిన కాలం కథ
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (18-04-2021)
ఈశ్వరుడు కాలానికి తగిన రూపం ధరించి, కాలానికి తగిన రూపాన్ని గైకొని, కేవలం వినోదానికై తనను తానే సృష్టించుకున్నాడు. ఆ
ఈశ్వరుడిలోనే లోకాలన్నీ ఉంటాయి. అన్ని లోకాలలోనూ ఈశ్వరుడు ఉంటాడు. ఈ అనంత
విశ్వానికి కార్యం, కారణం రెండూ ఆయనే! ఆ మహాపురుషుడి నుండి వెలువడి ఈ విశ్వం ప్రకాశిస్తున్నది.
శ్రీమహావిష్ణువు మాయవల్ల ఈ విశ్వమంతా ఒక పద్ధతిలో పుట్టి, పెరిగి, నాశనమవుతూ ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఇలాగే జరుగుతుంది.
పరమేశ్వరుడి సృష్టికి అంతం, అన్యవస్తు సంయోగం, రెండూ అవసరం లేదు. ఈ యావత్ ప్రపంచం పుట్టుక వేరు. సృష్టిలో విడదియ్యలేని
అత్యంత సూక్ష్మాంశానికే ’పరమాణువు’ అని పేరు. సూర్యకాంతి ఈ పరమాణువు ద్వారా
ప్రసరించేటప్పుడు పట్టే కాలానికి ’సూక్ష్మకాలం’ అని పేరు. దీన్ని మనం
ఊహించుకోవాల్సిందే! సూర్యుడు మేషాది పన్నెండు రాశులలో తిరిగే కాలానికి ’మహత్కాలం’
అని పేరు. దీనినే సంవత్సరం అని కూడా అంటాం. రెండు పరమాణువులు కలిస్తే ఒక ’అణువు’ అవుతుంది.
మూడు అణువులు ఒక ’త్రసరేణువు’. మూడు త్రసరేణువులు కలిస్తే ఒక ’త్రుటి’. నూరు
త్రుటులు కలిస్తే ఒక ’వేధ’. మూడు వేధలు కలిస్తే ఒక ’లవం’. మూడు లవములు ఒక
’నిమేషం’. మూడు నిమేషాలు ఒక ’క్షణం’. అయుదు క్షణాలు ఒక ’కాష్ట’. పది కాష్టలు ఒక
’లఘువు’. పదిహేను లఘువులు ఒక ’నాడి’. రెండు నాడులు ఒక ’ముహూర్తం’. అలాంటి నాడులు
ఆరు కానీ ఏడు కానీ అయితే ఒక ’ప్రహరం’. దానినే ’యామం’ అనీ, ’జాము’ అనీ అంటారు.
దిన పరిమాణాన్ని తెలిపే నాడిని కొలిచే
విధానం ఉన్నది. ఆరు ఫలాల రాగితో పాత్రను సిద్ధం చేసి, నాలుగు మినప గింజల బరువు కల బంగారంతో నాలుగు అంగుళాల
పొడవుకల కమ్మీ తయారు చేసి, దానితో ఆ పాత్ర కింద రంధ్రం చేసి, ఆ రంధ్రం గుండా తూమెడు నీరు పూర్తిగా కిందకు కారడానికి ఎంతకాలం పడుతుందో అంత
కాలాన్ని ’నాడి’ అంటారు. నాలుగు జాములు ఒక ’పగలు’ అవుతుంది. అలాగే నాలుగు జాములు
ఒక ’రాత్రి’ అవుతుంది. పగలు, రాత్రి కలిస్తే మానవులకు ఒక ’దినం’ అవుతుంది. పదిహేను దినాలు ఒక ’పక్షం’
అవుతుంది. ’శుక్ల పక్షం’, ’కృష్ణ పక్షం’ అని రెండు ఉన్నాయి. రెండు పక్షాలు కలిస్తే ఒక ’నెల’. అది
పితృదేవతలకు ఒక ’దినం’. రెండు నెలలు ఒక ’ఋతువు’. ఆరు నెలలు ఒక ’ఆయనం’. ఆయనాలు
రెండు. ’దక్షిణాయనం’, ‘ఉత్తరాయనం’. ఈ రెండూ
కలిస్తే ఒక సంవత్సరం. నూరు సంవత్సరాలు మానవులకు పరమాయువు. మానవుల సంవత్సరం దేవతలకు
ఒక్క దినం అవుతుంది.
ఈశ్వరుడు అంశ అయిన సూర్యుడు గ్రహ, నక్షత్రాలతో కూడి తారాచక్రంలో ఉండి పరమాణువు మొదలు సంవత్సరం
వరకు వున్న కాలంలో పన్నెండు రాశులను చుట్టి వస్తాడు. ఈ సూర్యగమనమే సంవత్సరం, వలీసంవత్సరం, ఇడాసంవత్సరం, అనువత్సరం, వత్సరం అనే భేదాలు కలిగి
ఉంటుంది. సూర్యగమనం వల్ల సౌరమానం, చాంద్రమానం, నక్షత్రమానం, బార్హస్పత్యమానం అనే భేదాలతో సంవత్సర కాలం ఏర్పడుతుంది.
కాలాన్ని ప్రవర్తింప చేసే సూర్యుడు, విత్తనాల నుండి అంకురాలు మొలకెత్తినట్లు కాలరూపమైన తన శక్తితో అనుకూలంగా
మలచుకుంటూ, జీవుల ఆయువు మొదలైనవాటిని
తగ్గిస్తూ, ఆయువు తగ్గుతుంటే క్రమంగా
విషయాల పట్ల కోరికలు తగ్గుతూ, కోరికలతో యజ్ఞాలు చేసేవారికి గుణాలతో కూడిన స్వర్గాది లోకాలను సమకూరుస్తూ, ఆకాశంలో సంచరిస్తూ ఉంటాడు. ఈ విధంగా అయిదు విధాలైన
సూర్యభగవానుడిని ఆరాధించాలి.
ఇకపోతే కృతయుగ సంఖ్య నాలుగువేల దివ్య
సంవత్సరాలు. దాని సంధ్యాకాలం ఎనిమిదివందల ఏళ్లు. గతించిన యుగానికి, రాబోయే యుగానికి మధ్యకాలాన్ని ’సంధ్య’ అంటారు. త్రేతాయుగ
ప్రమాణం మూడువేల దివ్య సంవత్సరాలు. సంధ్యాకాలం ఆరువందల ఏళ్లు. ద్వాపరయుగ ప్రమాణం
రెండువేల దివ్య సంవత్సరాలు. సంధ్యాకాలం నాలుగువందల సంవత్సరాలు. కలియుగ ప్రమాణం
వెయ్యి దివ్య సంవత్స్రరాలు. సంధ్యాకాలం రెండువందల సంవత్సరాలు. ఈ సంధ్యాంశాల
మధ్యకాలంలో ధర్మం అతిశయిస్తుంది. సంధ్యాంశలో ధర్మం అల్పమై వుంటుంది. దర్మదేవత
కృతయుగంలో నాలుగు పాదాలు, త్రేతలో మూడు పాదాలు, ద్వాపరలో రెండు పాదాలు, కలియుగంలో ఒక్క పాదంతో సంచరిస్తుంది. ఈ పాదాల భేదం వల్ల ప్రజలలో మర్యాదలు
తగ్గుతాయి. అధర్మం పుట్టి వృద్ధిపొందుతుంది.
భూలోకం, భువర్లోకం, స్వర్గలోకం.....వీటికంటే పైన సత్యలోకం ఉంటుంది. అక్కడ ఉండే బ్రహ్మకు చతుర్యుగాలు
వేయి అయితే ఒక పగలు అవుతుంది. అలాగే రాత్రికూడా. బ్రహ్మ రాత్రి నిద్రపోతే
లోకాలన్నిటికీ ప్రళయం వస్తుంది. మేల్కొని చూస్తే తిరిగి లోకాలు పుట్తాయి. ఆ బ్రహ్మ
ఒక్క దినంలో పద్నాలుగు మన్వంతరాల కాలం గడుస్తుంది. వాళ్లలో ఒక్కొక్క మనువుకాలం 71 దివ్య యుగాలు. దీనికే మన్వంతరం అని పేరు. దేవతలు, మునులు, సప్తఋషులు వీళ్లంతా భగవదంశతో పుట్టి ఈ మన్వంతరాలలో ఈ లోకాలను పాలిస్తారు.
శ్రీహరి పితృ, దేవ, పశు, పక్షి, మానవ రూపాలలో జన్మించి ఈ
మన్వంతరాలలో తన సత్త్వగుణం వల్ల, పురుష భావం వల్ల ఈ విశ్వాన్ని పాలిస్తాడు. పగలు పూర్తికాగానే బ్రహ్మ
శయనిస్తాడు. ఆయన నిద్రలో ఉన్నప్పుడు ఆయన శక్తిసామర్థ్యాలు, పరాక్రమం అంధకారంతో ఆవరింపబడి వుంటాయి. బ్రహ్మ నిద్రించే
సరికి భువనత్రయం కూడా కటిక చీకటిలో సూర్యచంద్రులతో పాటు లీనమై పోతుంది. శ్రీహరి
శక్తిరూపమైన సంకర్షణాగ్ని ముల్లోకాలను దహిస్తుంది. ఆ అగ్నికీలలకు వ్యాపించిన
వేడికి తట్టుకోలేక మహర్లోకవాసులు జనలోకానికి పరుగెత్తుతారు. ఆ విలయ సమయంలో వీచే
భీకరమైన వాయువులకు ఎగిసిపడే మహా భయంకరమైన
సముద్ర జలాలు మూడులోకాలను కప్పేస్తాయి. ఆ మహార్ణవ మధ్యలో శయనించి ఉంతాడు శ్రీమన్నారాయణుడు.
తన కడుపులో సమస్త లోకాలను పెట్టుకుని యోగనిద్రలో ఉంటాడు ఆయన.
ఈ విధంగా అనేక రాత్రుళ్లు, పగళ్లు గడుస్తుంది. మానవుల లాగానే బ్రహ్మ దేవుడి ఆయుర్దాయం
కూడా (ఆయన లెక్కలో) వంద సంవత్సరాలే. ఆ వంద సంవత్సరాలలో మొదటి 50 ’పూర్వ పరార్ధం’ అనీ, రెండవ 50ని ’ద్వితీయ పరార్ధం’ అనీ అంటారు. ఈ మొత్తం కాలాన్ని ’బ్రహ్మకల్పం’ అని
పిలుస్తారు. ఈ కల్పం ప్రారంభంలో బ్రహ్మదేవుడు ఉదయించిన కారణంగా బ్రహ్మకల్పం అని
పిలుస్తారు. దీనికే ’శబ్దబ్రహ్మం’ అని మరొక పేరుంది. ఎప్పుడైతే పంకజనాభుడి నాభి
అనే సరస్సులో సమస్త భువనాలకు ఆశ్రయభూతమై పద్మం ప్రకాశిస్తుందో అది ’పద్మకల్పం’ అనే
పేరుతో ఒప్పుతుంది. బ్రహ్మదేవుడి ఆయుర్దాయంలో మొదటి సగం అంటే ’పూర్వ పరార్ధం’
గడిచిపోయింది. ఇక రెండవది అయిన ’ద్వితీయ పరార్ధం’ ప్రారంభం ఎప్పుడంటే
సూకరాకారాన్ని ఎప్పుడు ధరిస్తాడో అప్పుడు ప్రారంభమవుతుంది. దానిని ’వరాహకల్పం’
అంటాం. ఇప్పుడు నడుస్తున్న కల్పం వరాహకల్పమే! ఈశ్వరుడికి పరమాణువు మొదలు పరార్ధం
వరకు గల కాలం ఒక్క నిమిషం మాత్రమే. ఈశ్వరుడే కాలానికి కర్తగాని, కాలం ఈశ్వరుడికి కాదు.
శ్రీమహావిష్ణువు అన్నిటికీ అతీతుడు. ఆ
మహాపురుషుడికి కాలం ఎన్నటికీ కర్తకాదు. ఈ బ్రహ్మాండం పదహారు వికారాలతో కూడి, పంచభూతాలు, పది విధాలైన ఆవరనాలు కలిగి, 50 కోట్ల యోజనాల విస్తీర్ణంలో ఉంటుంది. భగవంతుడు పరమాణు రూపంలో బ్రహ్మాండంలో
ప్రకాశిస్తూ ఉంటాడు. అసంఖ్యాకమైన మహాండ సమూహాలు ఆయనలో అణగి ఉంటాయి. ఆ
పరమపురుషుడిని వర్ణించడం ఎవరి తరం కాదు.
బ్రహ్మాండమధ్యంలో ఉన్న సూర్యుడికి ఏడాది సాగే నడకలో ఉత్తరాయణం దక్షిణాయనం, విషువం అనే మూడు గమనాలున్నాయి. ఉత్తరాయణంలో మీదికి
వెళ్తాడు. దక్షిణాయనంలో కిందకు వెళ్తాడు. ఉత్తరాయణంలో మెల్లగా నడుస్తాడు కాబట్టి
పగళ్లు ఎక్కువ, రాత్రుళ్లు తక్కువ. దక్షిణాయనంలో వేగంగా నడుస్తాడు కాబట్టి పగళ్లు
తక్కువ, రాత్రుళ్లు ఎక్కువ. విషువంలో సమానం. రాత్రింబగళ్లు ఎక్కువ-తక్కువలు ఉండవు.
సూర్యుడు మేషరాశిలోను, తులారాశిలోను ప్రవేశించినప్పుడు పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. మేషంలోకి వచ్చినప్పటి మర్నాటి
నుండి రోజు-రోజుకు పగలెక్కువ, రాత్రి తక్కువ అవుతుంటుంది. సూర్యుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య రాశుల్లో ప్రవేశించేటప్పుడు
నెలకు ఒక్కొక్క ఘడియ పగటిపూట పెరుగుదల, రాత్రిపూట తరుగుదల ఉంటాయి. అలాగే, సూర్యుడు వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం రాశుల్లోకి ప్రవేశించినప్పుడు నెలకు ఒక్కొక్క ఘడియ పగటిపూటలో తరుగుదల, రాత్రిపూటలో పెరుగుదల ఉంటాయి.
ఇలా దినాలు, ఉత్తరాయణం, దక్షిణాయనం, పెరగడం, తరగడం ఏర్పడుతున్నాయి. సూర్యుడు తన
రథం మీద మానసోత్తర పర్వతం చుట్టూ తిరగడానికి ఒక పగలు, ఒక రాత్రి పూర్తవుతాయి. ఆ పర్వతం చుట్టు కొలత తొమ్మిది
కోట్ల ఏభై ఒక్క లక్షల యోజనాలు. జ్యోతిశ్చక్రం భ్రమించడం వల్ల భూమిలో సూర్యుడు కనిపించడం
ఉదయం, ఆకాశంలో కనిపించడం మధ్యాహ్నం, భూమిలోకి చొచ్చినట్లు కనిపించడం అస్తమయం, దూరంగా ఉండడం రాత్రి. ఈ ఉదయాస్తమయాదులు జీవుల ప్రవృత్తి,
నివృత్తులకు హేతువులై ఉంటాయి.
సూర్యుడు ఇంద్రపురం నుండి యమపురానికి వెళ్లేటప్పుడు పదిహేను గడియలలో రెండు
కోట్ల ముప్పై ఏడు లక్షల డెబ్బై అయుదు వేల (2,37,75,000) యోజనాల దూరం దాటి వెళ్తాడు.
యమపురి నుండి వరుణపురి, అట్నుంచి సోమపురి ఇలా పోతుంటాడు. ఇలా చంద్రగ్రహనక్షద్రాదులతో కూడి తిరుగుతూ
వున్న సూర్యుడి రథచక్రానికి పన్నెండు అంచులు, ఆరు కమ్ములు, మూడు నాభులు ఉంటాయి. ఆ చక్రానికి సంవత్సరం అని పేరు. సూర్యుడి రథానికి ఒకటే
చక్రం. ఈ ఏకచక్ర రథం ఒక్క ముహూర్త కాలంలో ముప్పై నాలుగు లక్షల ఎనిమిది వెల యోజనాల
మేర సంచరిస్తుంది. సూర్యుడు తొంభై కోట్ల ఏభై ఒక్క లక్షల యోజనాల పరిమాణం ఉన్న
భూమండలాన్ని అంతటినీ ఒక్క పగలు, రాత్రిలో సంచరించి వస్తూ ఉంటాడు. అంటే ఒక్క క్షణానికి రెండువేల యోజనాలు
సంచరిస్తాడు.
ఆదిపురుషుడైన భగవానుడే, ఆ నారాయణుడే, లోకాలకు యోగ క్షేమాలను కూర్చడానికై సూర్యుడి రూపంలో మనకు దర్శనం ఇస్తున్నాడు.
సూర్యుడు మూడు వేదాల స్వరూపం. నారాయణుడే సూర్యుడిగా ప్రకాశిస్తున్నాడు. ఆ
పరమపురుషుడే తనను పన్నెండు విధాలుగా విభజించుకుని వసంతం మొదలైన ఆరు ఋతువులను ఆయా
కాలాలలో జరిగే విశేషాల్ని బట్టి ఏర్పాటు చేశాడు. ఆ పరమపురుషుడు జ్యోతిశ్చక్రం లోపల
ప్రవర్తిస్తూ తనదైన తేజస్సుతో సకల జ్యోతిర్గణాలను దీవింప చేస్తున్నాడు. మేషాది
పన్నెండు రాశులలోను ఒక్కో మాసం వంతున ఒక సంవత్సరం సంచరిస్తాడు. ఆయన గమనంలోని
విశేషమైన కాలాన్ని అయనాలుగా, ఋతువులుగా, మాసాలుగా, పక్షాలుగా, తిథులుగా వ్యవహరిస్తారు. రాశులలో ఆరవ అంశం ఆయన సంచరించినప్పుడు దానిని ఋతువు
(అంటే సంవత్సరంలో ఆరవ వంతు, రెండు మాసాల కాలం) అని అంటారు. కాలచక్రంలో సూర్యుడు సగభాగం, అంటే, ఆరు రాశులలో సంచరించే కాలాన్ని అయనం అంటారు.
పూర్తిగా సూర్యుడు పన్నెండు
రాశులలో సంచరించిన కాలం ఒక సంవత్సరం.
(బమ్మెర పోతన మహాభాగవతం ఆధారంగా)
No comments:
Post a Comment