Saturday, April 17, 2021

ఋశ్యశృంగుడి చరిత్ర, పరశురాముడి మహిమ (ఆస్వాదన-16) : వనం జ్వాలా నరసింహారావు

 ఋశ్యశృంగుడి చరిత్ర, పరశురాముడి మహిమ

(ఆస్వాదన-16)

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (18-04-2021)

పూర్వకాలంలో కశ్యపుడి కొడుకైన విభాండకుడు బ్రహ్మచర్య దీక్షతో తపస్సు చేస్తుండగా ఒకరోజున ఆ ఋషికి ఊర్వశి కనిపించింది. మన్మధ వికారానికి లోనైన అతడి వీర్యం జారిపడగా దాన్ని ఒక ఆడ దుప్పి తాగి గర్భం ధరించింది. దానికి ఋశ్యశృంగుడు అనే కొడుకు జన్మించాడు. అతడికి తన తండ్రి, ఆశ్రమం తప్ప వేరొకటి తెలియకుండా అమాయకంగా తపస్సు చేసుకునేవాడు. అదే సమయంలో రోమపాదుడు రాజ్యం చేస్తున్న అంగ దేశంలో వానలు కురవడం ఆగిపోయాయి. కరవు వచ్చింది. ఋశ్యశృంగుడుని రాజ్యానికి తీసుకువస్తే వానలు పడతాయన్నారు బ్రాహ్మణులు. రాజు వెంటనే వేశ్యలను పిలిచి, వారిని తమ చాకచక్యం ఉపయోగించి ఋశ్యశృంగుడిని తీసుకొని రమ్మంటాడు.

ఒకనాడు విభాండక మహాముని లేని సమయంలో ఒక ముసలి వేశ్య యవ్వనవతిగా మారి ఋశ్యశృంగుడిని సమీపించింది. ఆమెను చూసి ఋశ్యశృంగుడు ఒక ఋషికుమారుడు అని భావించాడు. వేశ్యపుత్రిక ఋశ్యశృంగుడికి వినోదం కలిగించింది. తన బిగి కౌగిలిలో చేర్చుకున్నది. ఆమె వెళ్ళిపోయిన తరువాత ఋశ్యశృంగుడు ఆమెపట్ల ఆకర్షితుడై, తండ్రికి తెలియకుండా తన ఆశ్రమాన్ని విడిచి పెట్టి, ఆ సుందరాంగి వెనుకనే అంగ దేశం చేరి అక్కడ రాజాజ్ఞప్రకారం ‘రాజాశ్రయం’ అనే తోటలో వున్నాడు. ఋశ్యశృంగుడు వచ్చిన వేళావిశేషంవల్ల అంగదేశంలో వానలు పుష్కలంగా కురిశాయి. రోమపాదుడు సంతోషించి తన కూతురు శాంతను ఇచ్చి పెళ్లి చేశాడు ఋశ్యశృంగుడికి. కొడుకు జాడ కనుక్కోవడానికి విభాండక మహాముని రోమపాదుడి రాజధానికి చేరి, అక్కడ శాంతాదేవితో పాటు వున్న ఋశ్యశృంగుడిని చూసి సంతృప్తి చెంది, కొడుకును, కోడలిని వెంటబెట్టుకుని తన ఆశ్రమానికి వెళ్లాడు. ఋశ్యశృంగుడు శాంతాదేవితో కలిసి సుఖంగా జీవితం గడిపాడు.           

(డాక్టర్ నండూరి రామకృష్ణమాచార్యులు ఈ సందర్భంగా విశ్లేసిస్తూ ఇలా రాశారు: ‘మహాభారతంలోని ఉపాఖ్యానాలలో ఋశ్యశృంగుడి గాథకు ఒక ప్రత్యేకత వున్నది. ఋశ్యశృంగుడికి నాగరిక జగత్తుతో బొత్తిగా పరిచయం లేదు. విభాండకుడు తన కొడుకును పుట్టినప్పటి నుండి తన ఆశ్రమంలోనే పెంచాడు. ఋశ్యశృంగుడు అమాయకంగా పెరిగాడు. తన దగ్గరికి వచ్చిన వేశ్యాంగనను ఋశ్యశృంగుడు మరొక ఋషికుమారుడే అనుకున్నాడు. స్త్రీపురుష లింగ విచక్షణ ఎరుగలేని అమాయక ప్రవృత్తి అతడిది’).

           తీర్థయాత్రలలో భాగంగా పాండవులు మహేంద్ర పర్వతాన్ని చూశారు. అక్కడున్న మహాత్ముడైన పరశురాముడిని మిగతా ఋషులతో పాటు ధర్మరాజు కూడా దర్శనం చేసుకోవచ్చని ఆయన శిష్యుడు అకృతవ్రణుడు చెప్పాడు. ధర్మరాజు కోరిక మీద అకృతవ్రణుడు పరశురాముడు వృత్తాంతం సవివరంగా చెప్పాడు.

         పూర్వకాలంలో కన్యాకుబ్జం అనే పట్టణంలో గాధి అనే రాజు కూతురైన సత్యవతిని భృగు మహర్షి కుమారుడైన ఋచీక మహాముని గాధి కోరిన కన్యా శుల్కాన్ని సమర్పించి వివాహం చేసుకున్నాడు. భృగుమహర్షి వరమహిమ వల్ల సత్యవతి ప్రసన్న గుణం కలవాడు, నాలుగు వేదాలలోను, విలువిద్యలోను నేర్పుకలవాడు, మహాత్ముడు అయిన జమదగ్ని అనేవాడిని కన్నది. జమదగ్ని ప్రసేనజితుడు అనే మహారాజు కూతురు రేణుకను వివాహమాడి, పరశురాముడితో సహా ఐదుగురు కొడుకులను పొందాడు. ఒకనాడు రేణుక అడవికి వెళ్లి, అక్కడ ఒక సరోవరంలో జలక్రీడలు ఆడుతున్న చిత్రరథుడనే రాజును చూసి మనస్సు చలించింది. మానసికమైన ఆమె చెడు నడవడికి జమదగ్నికి కోపం వచ్చి తల్లిని చంపమని తన నలుగురు కొడుకులను ఆదేశించాడు. వారు తల్లిని చంపడం పాపమని ఆ పని చేయలేదు. వారిని శపించాడు జమదగ్ని.

         రేణుకను సంహరించమని పరశురాముడికి చెప్పాడు. అతడు తక్షణమే తండ్రి ఆజ్ఞానుసారం తల్లిని సంహరించాడు. తన మాట నేరవేర్చినందుకు వరం కోరుకొమ్మన్నాడు. తల్లి బతకాలని, తల్లిని సంహరించినందుకు తనకు పాప విముక్తి కలగాలని, సహోదరులకు శాప విమోచన కలగాలని కోరాడు. తనకు యుద్ధంలో ఎదురులేని బలం కలగాలని, తాను చిరకాలం చిరంజీవిగా జీవించాలని కూడా కోరాడు. జమదగ్ని ఆ వరాలన్నీ ప్రసాదించాడు.

         ఇదిలా వుండగా ఒకనాడు కార్తవీర్యార్జునుడు అనే శౌర్యవంతుడైన రాజు జమదగ్ని ఆశ్రమానికి వచ్చి ఆయన్ను అవమానించి, ఆయన హోమధేనువును బంధించి తీసుకుపోయాడు. కాసేపటికి పరశురాముడు అడవి నుండి తిరిగి వచ్చాడు. విషయం తెలుసుకున్నాడు. పరశురాముడు యుద్ధానికి పోయి కార్తవీర్యార్జునుడిని చంపాడు. ఆయన కొడుకులు పగబట్టి పరశురాముడు లేనప్పుడు జమదగ్ని ఆశ్రమానికి వచ్చి, అతడిని బలవంతంగా పట్టుకుని ఆవేశంతో సంహరించారు. పరశురాముడు ఆశ్రమానికి తిరిగొచ్చి ఇదంతా చూసి, అలాంటి ఘోరకృత్యాలను చేయడానికి వెనుతీయని క్షత్రియజాతిని మొత్తాన్ని సంహరిస్తానని శపథం చేశాడు. ఆ ప్రకారమే క్షత్రియులందరినీ సంహరించి, భూమండలాన్ని అంతటినీ జయించి, దాన్ని కశ్యపుడికి దానం చేసి, మహేంద్రగిరి అనే కొండమీద తపస్సు చేసుకుంటున్నాడు.

         ధర్మారాజు అకృతవ్రణుడు చెప్పినట్లే, తన తమ్ములతో, బ్రాహ్మణులతో కలిసి చతుర్థశి తిథినాడు పరశురాముడిని సందర్శించి, అతడిని అర్చించి, అక్కడినుండి దక్షిణ దిశగా వెళ్లాడు.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, అరణ్యపర్వం, తృతీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

No comments:

Post a Comment