శ్రీరామలక్ష్మణులు బ్రహ్మవాక్యం గౌరవించారా?
వనం జ్వాలా నరసింహారావు
ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆదివారం
(25-04-2021) ప్రసారం
బ్రహ్మాస్త్రంతో
సమానమైన ఐంద్రాస్త్రాన్ని రాముడు కుంభకర్ణుడు మీద వేయగా, అది పిడుగులాగా పోయి వాడి తలను నరికి చంపినా తరువాత, మిగిలిన మొండెం వానరులను
చంపుకుంటూ పోయి సముద్రంలో పడిన విషయాన్ని చావగా మిగిలిన హతశేషులు, రాక్షసులు రావణుడి దగ్గరికి పోయి వివరంగా చెప్పారు. యుద్ధంలో కుంభకర్ణుడు
చనిపోయాడని విన్న రావణుడు సహించరాని దుఃఖంతో గాఢంగా మూర్ఛపోయి నేలమీద పడ్దాడు.
ఏడుస్తున్న
రావణుడిని చూసి త్రిశిరుడు అనేవాడు ఓదార్చాడు. “నీ భుజబలంతో రామచంద్రుడిని
దండించు. ఆ మాటకొస్తే, అసలు నువ్వెందుకు యుద్ధానికి పోవాలి? నువ్వు సుఖంగా నీ ఇష్టప్రకారమే వుండు.
నేను పగతీర్చుకుంటాను. నీ శత్రువులను చీల్చి చెండాడుతాను. రామచంద్రుడిని
సంహరిస్తాను” అన్నాడు.
ఇలా త్రిశిరుడు చెప్పడంతో రావణుడు
సంతోషపడి దుఃఖం మానాడు. ఆ తరువాత యుద్దోత్సాహంలో వున్న దేవాంతక, నరాంతక, అతికాయ, త్రిశిరుడు, మత్త, యుద్ధోన్మత్తులను పిలిపించాడు. వీరంతా
యుద్ధంలో పరాజయం ఎరగనివారే. అందరూ వరాలు పొందినవారే. వీరిని పిలిపించిన రావణుడు, అందరినీ యుద్ధానికి పంపాడు. వారి
సింహనాదాలు,
వారి రెట్టలు,
వారి పాద ఘట్టనలు ఆకాశాన్ని పగిలేట్లు చేసింది. భూమిని వణికించింది. రాక్షస సేనలను
చూసిన వానరులు కొండలు, చెట్లు ఎత్తుకుని కేకలు వేశారు. రాక్షసులు ప్రతిధ్వని చేశారు.
రాక్షసులు కూడా వెనుదీయక పదునైన బాణాలను వానరుల మీద వేశారు. ఇరుసేనలు పరాక్రమించి
యుద్ధం చేశారు.
వానరుల
ధాటిని ఆపడానికి నరాంతకుడు రంగంలోకి దిగాడు. తన శక్తితో వానరులను చాలామందిని
క్షణంలో చంపాడు. వానరులు ఇలా పడిపోవడం చూసిన సుగ్రీవుడు, అంగదుడితో నరాంతకుడిని చంపమని చెప్పడంతో,
నరాంతకుడి మీదికి అతడు యుద్ధానికి పోయాడు. తన దృడమైన పిడికిలితో రాక్షసుడి రొమ్ము
నలిగిపోయేట్లు పొడిచాడు. ఆ దెబ్బకు వాడు దూరంగా కొట్టుకు పోయి కొండలాగా పడిపోయాడు.
నరాంతకుడు అలా చనిపోయాడు.
నరాంతకుడు
చావడం చూసిన త్రిశిరుడు, మహోదరుడు, దేవాంతకుడు ఒక్కసారిగా అంగదుడిని తాకి
బాధించారు. ఇలా ముగ్గురు రాక్షసులు బాలుడైన
అంగదుడిని తాకిన సంగతి తెలుసుకున్న హనుమంతుడు,
నీలుడు ఆ దిక్కుగా వచ్చారు. నీలుడు త్రిశిరుడితో, హనుమంతుడు దేవాంతకుడితో యుద్ధం చేశారు. హనుమంతుడి పిడికిటి పొడుపుకు
దేవాంతకుడు చచ్చాడు. నీలుడు చెట్లతో కూడిన ఒక పర్వతాన్ని తీసుకుని మహోదరుడి మీద
వేయగా వాడు దాని తాకిడికి నేలకూలి చచ్చాడు. పినతండ్రి చావు చూసిన త్రిశిరుడు
హనుమంతుడిని బాణాలతో నొప్పించాడు. హనుమంతుడు అప్పుడు తన కత్తితో త్రిశిరుడిమూడు
తలలను నరికి వేశాడు. ఆ తరువాత మహాపార్స్వుడు ఋషభుడి చేతిలో చచ్చాడు. ఇది
చూసి, అతికాయుడు యుద్ధానికి రాగా,
వాడిని లక్ష్మణుడు ఎదిరించాడు. ఇరువురి మధ్య యుద్ధం కొనసాగింది. లక్ష్మణుడు
ఆగ్నేయాస్త్రం వేస్తే, అతికాయుడు సౌరాస్త్రాన్ని సంధించాడు.
అతికాయుడు ఐశీక బాణం వేస్తె, లక్ష్మణుడు ఐందాస్త్రాన్ని వేశాడు.
లక్ష్మణుడి బాణాలు అతికాయుడిని చంపలేక పోయాయి. చివరకు వాయుదేవుడు లక్ష్మణుడిని
సమీపించి వీడు అల్ప ప్రయత్నంతో చచ్చేవాడు కాదని చెప్పగా, లక్ష్మణుడు బ్రహ్మాస్త్రాన్ని సంధించి వేశాడు.
అది వాడి శిరస్సును కవచంతో సహా నేలకూల్చింది.
యుద్ధ
భూమిలో లక్ష్మణుడి బాణాలకు అతికాయుడు చచ్చాడని విన్న రావణుడు “నేను యుద్ధానికి
పొమ్మని పంపిన రాక్షసులు వానరుల బలానికి లోబడి చావడమే కాని తిరిగి రావడం లేదుకదా? రామచంద్రుడిని, సుగ్రీవుడిని, విభీషణుడిని గెలవడానికి సమర్థుడైనవాడు
ఒక్కడు కూడా ఈ లంకా నగరంలో వెతికినా కనపడడే! ఆహా! ఏమీ రాముడి పరాక్రమం? ఏమీ ఆ అస్త్రబలం? రాక్షస శ్రేష్టులందరూ ఆయన చేతిలో చచ్చారు కదా? అలాంటి రాముడిని, సర్వక్లేశరహితుడిని విష్ణుమూర్తి, ఆదినారాయణుడుగా నేను భావిస్తాను. ఆయనకాకుండా
మరెవ్వరూ ఈ కార్యం చేయలేడు. ఇక లంకంతా మీరు హెచ్చరికగా కాపలా కాయండి”. రావణుడి
ఆజ్ఞానుసారం రాక్షసులు వెళ్ళిపోయారు.
ఏం
చేయడానికి తోచక రావణుడు వుండగా ఇంద్రజిత్తు సమీపించి రామలక్ష్మణులను యుద్ధ భూమిలో
భయంకరమైన తన బాణాలతో పడగొట్టుతానని చెప్పి తండ్రి ఆజ్ఞ తీసుకుని యుద్ధానికి
బయల్దేరాడు. ఇంద్రజిత్తు రథం ఎక్కి,
కనపడకుండా ఆకాశానికి ఎగిరి, యుద్ధం చేయమని తన పక్కనున్న రాక్షసులను ప్రేరేపించాడు.
రాక్షసులు
పరాక్రమించి యుద్ధం చేశారు. ఇంద్రజిత్తు తన బాణాలతో వానరులను చంపాడు. వానరులు కూడా
భీకర యుద్ధం చేశారు. ఇంద్రజిత్తును ఎదిరించారు. ఇంద్రజిత్తు గంధమాదనుడిని, నలుడిని,
మైందుడిని, గజుడిని, జాంబవంతుడిని, నీలుడిని,
సుగ్రీవుడిని, అంగదుడిని,
ఋషభుడిని, ద్వివిదుడిని, తీవ్రమైన బాణాలతో నొప్పించాడు. వానరసేనను అల్లకల్లోలం చేశాడు.
అదృశ్యుడై ఆకాశాన్నుండి యుద్ధం చేశాడు. విక్రమిస్తున్న ఇంద్రజిత్తు వ్యవహారం చూసి
శ్రీరాముడు తమ్ముడితో ఇలా అన్నాడు.
“లక్ష్మణా!
రావణుడి కొడుకు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర బలంతో వానరసేనలను నేలపాలు చేసి మనల్ని
బాదిస్తున్నాడు. వీడిని మనం ఎలా జయించగలం?
ఇది స్వయంభు భగవంతుడైన బ్రహ్మదేవుడి బాణం. దీని మహిమ చాలా గొప్పది. దీన్ని నాలాగే
నువ్వు కూడా ఓర్చుకో. మనమంతా స్మృతి తప్పి ఏ ప్రయత్నం చేయకుండా వుండడం చూసి, జయలక్ష్మిని గ్రహించి, ఇంద్రజిత్తు తన నగారానికి పోతాడు”. ఇలా ఆయన
చెప్తున్నప్పుడే బాణవర్షం అధికమై, సహించరానిదై, రామలక్ష్మణులు మూర్ఛపోయారు. వారు మూర్ఛపోవడం చూసి
సంతోషించిన ఇంద్రజిత్తు వారిని ఓడించిన సంతోషంతో తన నగరానికి పోయాడు.
అప్పుడు
అక్కడ దుఃఖిస్తున్న వానర వీరులను చూసి విభీషణుడు “కపులారా! రామలక్ష్మణులు పరవశులై
పడ్డారని దుఃఖిస్తే లాభం ఏమిటి? ఇది దుఃఖించాల్సిన సమయం కాదు.
రాజకుమారులు బ్రహ్మవాక్యం గౌరవించాలి అనుకుని రాక్షసుల బాణాలకు చిక్కారేకాని, పరాక్రమహీనులై కాదు” అన్నాడు. అప్పుడు
హానుమంతుడి క్షేమం గురించి జాంబవంతుడు విభీషణుడిని అడిగాడు. అప్పుడు విభీషణుడు ఇలా
అన్నాడు. “రామలక్ష్మణులు క్షేమంగా వున్నారా అని అడగకుండా హనుమంతుడు బాగున్నాడా అని
ఎందుకు అడుగుతున్నావు? వాస్తవానికి నీకు హనుమంతుడి మీద వున్న
ప్రేమ రాజకుమారుల మీద కాని, బాలుడైన అంగదుడి మీదకాని, ప్రభువైన సుగ్రీవుడి మీదకాని లేకపోవడానికి
కారణం ఏమిటి?”. సమాధానంగా జాంబవంతుడు “హనుమంతుడు జీవించి
వుండి మన సేనలు హతమైనా మనకు మనుగడ వుంటుంది. అలా కాకుండా హనుమంతుడు లేకుండా మనమంతా
బతికున్నా లేనట్లే లెక్క. హనుమంతుడు గమనవేగాన వాయుదేవుడితోను, వీర్యాతిశయాన అగ్నిదేవుడితోను సమానం” అని
అన్నాడు.
“ఆంజనేయా!
నీ పరాక్రమం చూపాల్సిన సమయం ఆసన్నమైంది. నువ్వు సముద్రం దాటి చాలాదూరం పోయి
హిమవత్పర్వతం చూసి అక్కడ ఋషభ శైలం,
కైలాస పర్వతాలను చూడు. వాటి మధ్యన మిక్కిలి కాంతికలదై సర్వౌషధులు కలిగి అందమైన
మూలికల కొండ చూడు. ఆ పర్వతం కొనలో అధికమైన తమ కాంతితో దిక్కులను వెలిగించే నాలుగు
మూలికలను చూడు. వాటి కాంతిని బట్టి నువ్వు వాటిని గుర్తించగలవు. వాటిలో మృతసంజీవని
(చచ్చిన వారిని బతికించేది), విశల్యకరణి (దేహంలో నాటిన ఇతర
పదార్థాలను, బాణాలను,
ములుకులను వూడతీసేది), సావర్ణ్యకరణి (గాయాలతో వన్నె మారిన చోట మళ్లీ
వన్నె వచ్చేట్లు చేసేది), సంధానకరణి (విరిగిన ఎముకలను, అవయవాలను అతికించేది) వుంటాయి. నువ్వు వెంటనే
వెళ్లి వాటిని తెచ్చి వానరసేనకు ప్రాణాలను ఇవ్వు”. అని అంటాడు జాంబవంతుడు.
హనుమంతుడు
తన దేహాన్ని పెంచాడు వెంటనే. త్రికూట పర్వత శిఖరం ఎక్కాడు. సముద్రాన్ని దాటి పోయి
మనోహరమైన మంచుకొండ చేరి జాంబవంతుడి మాటలు జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. హనుమంతుడు
మూలికలకోసం వేయి యోజనాల స్థలాన్ని వెతికాడు. ఆ మూలికలు కనబడలేదు. అవి కనపడక
పోవడంతో హనుమంతుడు ఆ శైలాన్ని పాటులతో సహా పెళ్ళగించి ఆకాశానికి ఎగిరి, శీఘ్రంగా వచ్చాడు. హనుమంతుడు దూరం నుండి
వస్తుంటేనే మూలిక గాలి సోకడం వల్ల వానరులంతా ప్రాణాలతో లేచి కూర్చున్నారు.
హనుమంతుడిని చూసి కేకలు వేశారు. ఆ మహామూలికల వాసన చూసి రామలక్ష్మణులు స్మృతి తెచ్చుకుని
తెప్పరిల్ల్లారు. సుగ్రీవుడు తమ వానరసేనతో లంకను కాల్చమని చెప్పాడు. ఆ మాటలకు
వానరులు లంకలో ప్రవేశించి మేడలు, మిద్దెలు అగ్నికి సంతర్పణం చేస్తుంటే
అవి కూలిపడ్డాయి.
ఇదిలా వుండగా
అక్కడ యుద్ధభూమిలో బాణాల బాధ తొలగగానే రామలక్ష్మణులు విల్లులు ధరించి, అల్లెతాడు మీటి టంటమ్మనే ధ్వని పుట్టించారు.
కుంభకర్ణుడి కొడుకులైన కుంభనికుంభులు సేనలతో సహా యుద్ధానికి బయల్దేరారు. అలా
గుంపులుగుంపులుగా వస్తున్న రాక్షస సేనను చూసి వానరసేన సింహనాదాలు చేసింది.
రాక్షసుల, వానరుల మధ్య యుద్ధం జరిగింది.
ఆ
తరువాత జరిగిన యుద్ధంలో సుగ్రీవుడు యముడిలాగా కుంభుడి మీద పడ్డాడు. అదను చూసి, సుగ్రీవుడు కుంభుడిని పట్టుకుని ఎత్తి
సముద్రంలో పారవేశాడు. బయటకు వచ్చిన వాడిని సుగ్రీవుడు తన పిడికిలి బిగబట్టి కొట్టగా, ఆ దెబ్బకు కుంభుడు నేలకూలాడు. అప్పుడు
నికుంభుడు యుద్ధానికి దిగాడు. అప్పుడు హనుమంతుడు నికుంభుడి మీదికి దూకి మెడపట్టి
గిరగిరా తిప్పి కొట్టి, గొంతు నులుమి చంపాడు. ఇలా అంతా దాదాపు
ఏకకాలంలోనే చచ్చారు.
ఆ తరువాత ఖరుడి
కొడుకు మకరాక్షుడు రావణ అజ్ఞానుసారం యుద్ధానికి పోయాడు. వానరులకు, రాక్షసులకు భయంకరమైన యుద్ధం జరిగింది.
మకరాక్షుడి బాణాలకు, అతడి ప్రతాపానికి, భయపడి వానరులు రాక్షసులు తరుముకుని వస్తుంటే, పరుగెత్తారు. ఇలా వానరులను తరుముతున్న
రాక్షసుల మీదికి రామచంద్రమూర్తి కోపంతో తన వాడి బాణాలను వేసి వానరుల పైన పడకుండా
నిలిపాడు. అప్పుడు మకరాక్షుడు రామచంద్రమూర్తితో ఇలా అన్నాడు. “నిలు నిలు రామా!
ఎందుకు గర్వంతో మిడిసిపడతావు? నీ బలం ఏమాత్రమో నాకు చూపు.
ద్వంద్వయుద్ధంలో నీ ప్రాణాలను బలి ఇస్తాను. పారిపోకు. నేను లేని చోట నా తండ్రిని
నువ్వు దండకారణ్యంలో చంపావు. నువ్వు నా చేతుల్లో చచ్చి త్వరగా యమపురికి పోయి అక్కడ
నీతో పూర్వం చచ్చిన రాక్షసులతో స్నేహంగా ఆడుకో. నీ ఇష్ట ప్రకారం, నీకే యుద్ధం కావాలనుకుంటే ఆ యుద్ధమే చేయి”.
ఇలా
అన్న మకరాక్షుడిని చూసి “ఓరీ! రాక్షసుడా! యుద్ధంలో నీ శౌర్యం చూపు. ఖరదూషణులను, నీ తండ్రిని, పద్నాలుగు వేల రాక్షసులను చంపాను. నిన్నూ అలాగే చంపుతాను” అంటాడు. శ్రీరాముడు
ఇలా అనగానే, మకరాక్షుడు ఆయన్ను తన బాణాల వర్షంలో
ముంచెత్తాడు. రామచంద్రమూర్తి ఆ బాణాలన్నిటినీ తన బాణాలతో ఖండించాడు. ఇరువురూ
సమానంగా యుద్ధం చేశారు. తనతో సమానంగా పోరాడుతున్న రాక్షసుడిని చూసి శ్రీరాముడు
ఆశ్చర్యపోయాడు. వెంటనే వాడి ధనస్సును తెగగొట్టి, ఎనిమిది బాణాలతో సారథిని చంపి,
గుర్రాలను ఖండించి, రథం ఎగిరిపోయేట్లు కొట్టగా మకరాక్షుడు
శూలం తీసుకుని కిందకు దూకాడు. దాన్ని రాముడి మీదకు విసిరాడు. దాన్ని రాముడు
తుంచాడు. శూలం విరిగిపోగా రాక్షసుడు పిడికిలి పట్టి రాముడిని నిలబడమని అంటూ మీదికి
దూకాడు. రాముడు చిరునవ్వు నవ్వి ఆగ్నేయాస్త్రాన్ని సంధించి వాడి రొమ్ము చీల్చి
చంపాడు.
(వాసుదాసుగారి
ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)
No comments:
Post a Comment