రాముడి కల్పిత శిరశ్చాపాన్ని సీత నమ్మిందా?
వనం జ్వాలా
నరసింహారావు
ఆకాశవాణి
హైదరాబాద్ కేంద్రం శనివారం (10-04-2021) ప్రసారం
శుకసారణులు, శార్దూలాదులు
చెప్పిన వివరాల ద్వారా వానర సేన విషయం విన్న రావణుడి గుండె ఝలుక్కుమ్మంది. కొంచెం
భయపడ్డాడు. మళ్లీ ధైర్యం తెచ్చుకున్నాడు. మహా బలవంతుడైన, మాయలు
చేయడం నేర్చిన విద్యుజ్జిహ్వుడనే వాడిని పిలిచాడు. సీతను మోసగించాలనీ, అందుకోసం కొంచెం కూడా తేడా లేకుండా శ్రీరాముడు శిరస్సును, బాణంతో సహా అతడి విల్లును, విద్యుజ్జిహ్వుడు తన
శక్తితో కల్పించి తానున్న చోటుకు తీసుకురమ్మని చెప్పాడు. ఆ తరువాత రావణుడు అశోకవనం
ప్రవేశించి, సీతను చేరబోయాడు. ఆమెతో ఇలా అన్నాడు.
“ఓసీ సీతా! నన్ను స్వీకరించమని నిన్ను
ఎంతగానో ప్రార్థించాను కదా! నామాట నువ్వు ఏమాత్రం లక్ష్యం చేయకుండా ఛీకొట్టి
పోమ్మన్నావు. నీమగడు, నీ ప్రియుడు యుద్ధంలో చనిపోయాడు. ఇక ఇప్పుడు ఎంత ఏడవాలని వుంటే అంత
ఏడువు. వేరే దిక్కులేక నువ్వే నా భార్యవవుతావు. చనిపోయినవాడు నువ్వు ఏడుస్తే
బతికొస్తాడా? నా భార్యలలో ఒకదానివై వుండు. రాముడు చనిపోయినా
నేను దిక్కుగా వున్నాను. నీ మగడు చనిపోయిన విధం చెప్తా విను. అతడు వానరసేనతో నన్ను
చంపడానికి సముద్ర తీరానికి వచ్చాడు. సూర్యాస్తమాన సమయంలో ఉత్తర దిక్కున నీ మగడు
బడలికతో నిద్రపోయినప్పుడు, ప్రహస్తుడు సైన్యంతో అక్కడికి
మెల్లగా పోయి అదను చూసి పైన పడి పెద్ద కత్తితో రాముడి గొంతు కరకరమని నరికాడు. ఇది
చూసి వానరసేన ఒక్కొక్కరే చస్తూ నేలకూలారు. కొందరు సముద్రంలో దూకారు. కొందరు
ఆకాశానికి ఎగిరిపోయారు. ఇలా నా సేనలు చంపగా నీ మగడు పరివారంతో సహా చచ్చాడు”.
ఇలా సీతాదేవితో అంటూనే,
రాముడి శిరస్సును యుద్ధభూమి నుండి తెచ్చిన విద్యుజ్జిహ్వుడిని పిలుచుకుని రమ్మని
ఒక రాక్షసుడికి చెప్పాడు. వాడలాగే రాముడి శిరశ్చాపాన్ని తెచ్చి జానకి ఎదుట పెట్టి
వెళ్లిపోయాడు. రావణుడు వాటిని సీతాదేవి ముందుకు తోసి, “ఓ
కమలాక్షీ! ఇదిగో మా ప్రహస్తుడు బహిరంగంగా, అందరూ చూస్తుండగా, యుద్ధభూమి నుండి తెచ్చిన రాముడు ఎక్కుబెట్టే విల్లు. ఇంకా ఎందుకు ఆలశ్యం
చేస్తావు? నాకు స్వాధీనపడు” అంటాడు.
సీత చూసిన ఆ శిరస్సు అచ్చు రాముడిదిలాగా
వుండడంతో,
అది తన మగడి తల అని నమ్మి శోకాతిశయంతో ఏడిచింది. తాను పంపించిన
జడబిళ్ళను చూసిన సీతాదేవి అది తన మగడిదే అని నమ్మి బాగా ఏడ్చింది. “ప్రాణేశ్వరా!
నువ్వు అల్పాయువుడివి అయ్యావు. పాపరహితుడవైన నీకు మృత్యువు ఇప్పుడు రావాల్సిన
కారణం లేదు. నీకు నిష్కారణంగా అకాల మృత్యువు ఎలా వచ్చిందో? దీనికి దైవమే కారణం.
నీతిశాస్త్రాలు అన్నీ నీకు తెలుసుకదా? ఎప్పుడు ఏది చేయవచ్చు, ఏది చేయకూడదు అని తెలిసిన నీకు మృత్యువు కళ్ళకు కనపడకుండా వచ్చి పైన
పడింది. దైవ సంకల్పానికి అడ్డం లేదుకదా?” అనుకుంటూ ఏడ్చింది.
రావణుడిని
ఉద్దేశించి, “రావణా! ఆలశ్యం చేయకుండా రామచంద్రుడి మీద నన్ను పడేయి. భార్యను భర్తతో
కలిపి మంచి పనిచేయి. ఇలా చేస్తే, నీకు మేలు కలుగుతుంది. రాక్షసరాజా! రాముడి
దేహంతో నా దేహం, నాధుడి శిరస్సుతో నా శిరస్సు కూర్చు. సహగమనం
చేసి నా భర్త పోయిన లోకానికి నేను కూడా పోతాను”. ఈ విధంగా సీతాదేవి పలు విధాలుగా
దుఃఖిస్తూ, భర్త శిరస్సు, ధనుస్సు అనేక
పర్యాయాలు చూసి-చూసి ఏడుస్తూ, మూర్ఛ పోతుంది.
ఇలా సీత ఏడుస్తున్నప్పుడు రావణుడు
అశోకవనాన్ని వదిలి రాముడు చేయబోయే ప్రయత్నం తెలుసుకోవాలని సభకు పోయాడు. అక్కడ
యుద్ధ విషయంలో చేయాల్సిన ఆలోచన చేయసాగాడు. ఇక్కడ రావణుడు అశోకవనం నుండి వెళ్లగానే
రాముడి తల, విల్లు అదృశ్యం అయింది. ఆ సభలో రావణుడు చేయాల్సిన పని చక్కగా ఆలోచించి
దగ్గర వున్న మంత్రులతో, సేనానాయకులతో ఇలా అన్నాడు. “అందరూ
వినేట్లు భేరులు గట్టిగా వాయిస్తూ, రాక్షస సేననంతా యుద్ధ
ప్రయత్నంలో ఒక్కచోటికి తెండి. వారికి కారణం చెప్పవద్దు”. ఆ మంత్రులు, సేనానాయకులు అలాగే చేస్తామని చెప్పి, వారి-వారి
సేనలను ఒక్కో చోట చేర్చి, ఆ వృత్తాంతాన్ని రావణుడికి
చెప్పారు.
సీతను కాపాడే వారిలో సరస అనే ఒక రాక్షసి
ప్రాణమిచ్చైనా సీతాదేవిని రక్షించడమే వ్రతంగా పెట్టుకున్నది. స్వభావరీత్యా దయాగుణం
కలది. రావణుడి వల్ల మోసగించబడ్డ సీత దగ్గరికి పోయి, మెత్తటి వాక్యాలతో
ఊరడించి ఇలా అన్నది. “జానకీ! ఊరడిల్లు. సంతాప పడవద్దు. వాస్తవం చెప్తాను విను.
విదితాత్ముడైన రామచంద్రమూర్తిని నిద్రపోయే సమయంలో హింసించడం సాధ్యం కాదు. అలా
చంపబడనూలేదు. వానరులంతా క్షేమంగా వున్నారు. ఒక్కడు కూడా చావలేదు. వానరులను రాముడు
రక్షిస్తున్నందున వారిని బాధించడం ఎవరికీ సాధ్యంకాదు. రాముడి లాంటివాడికి మృత్యువు
ఎలా వస్తుందమ్మా? రావణుడు నిన్ను కావాలనే బాధపెట్టాడు”.
సరమ సీతాదేవికి ఇలా చెప్పసాగింది.
“సముద్రాన్ని దాటి వానరసేనతో నీ మగడు దక్షిణ తీరానికి వచ్చి వున్నాడు. వానరసేన
అంతా సముద్రం ఒడ్డున రాముడిని రక్షిస్తూ వుంది. యుద్ధానికి వానర సేనకు
కావాల్సినవన్నీ పూర్ణంగా సంపాదించి పెట్టుకున్నారు. రాముడు తమ్ముడితో వున్నాడు.
ఇవన్నీ నేను చూసి చెప్తున్నాను. విన్నమాటలు కావు. రావణుడు పంపించిన రాక్షసులు, రామచంద్రమూర్తి
దక్షిణ తీరానికి చేరాడని చెప్పారు. రావణుడు మంత్రులతో సమాలోచన చేస్తున్నాడు. సీతమ్మా
విను! ఘంటల ఘణఘణలు, రథాల దబదబలు, గుర్రాల
సకిలింపులు, వాద్యాల మోతలు. ఇవన్నీ యుద్ధ ప్రయత్నాలే.
కాబట్టి రామచంద్రమూర్తికి కీడు కలిగిందని విచారపడవద్దు. సంతోష లక్ష్మి నిన్ను
చేరుతుంది. రాక్షసులకు కీడు కలుగుతుంది. నీ మగడు రావణుడిని చంపి నిన్నేలుకుంటాడు.
లక్ష్మణుడితో కలిసి నీ మగడు రాక్షస సేనలను నాశనం చేస్తాడు. శత్రువులను జయించిన నీ
మగడితో కలిసి నువ్వు కులుకుతుంటే నేను చూడనా? సంతోషపడవమ్మా
జానకమ్మా! నీ మగడితో కూడి నువ్వు పూర్ణ సంతోషం అనుభవిస్తావు”.
సీతాదేవికి తనమాటలుగా చెప్పిన సరమ
రావణుడు వున్న చోటుకు పోయింది. అక్కడ వాడు తన మంత్రులకు చెప్పే విధం విని, వాడి
నిశ్చయం తెలుసుకుని ముహూర్తకాలంలో అశోకవనానికి తిరిగి వచ్చింది. మరలి వచ్చిన సరమను
చూసిన సీతాదేవి రావణుడి హృదయం ఎలా వుందో చెప్పమని అడిగింది. అప్పుడు సరమ మంత్రులతో, సహాయులతో కూడిన రావణుడి ఆలోచనను వున్నదున్నట్లు సర్వం చెప్పింది. “సీతమ్మా!
రావణుడి తల్లి కైకసి, వృద్ధమంత్రి యవిద్ధుడు ఇద్దరు కూడా
శ్రీరామచంద్రమూర్తికి సీతను ఇమ్మని నానా విధాలుగా బోధించారు. జన స్థానంలో ఖరాదులను,
పద్నాలుగువేల రాక్షసులను అల్పకాలంలో లక్ష్మణుడు కూడా తోడు లేకుండా
ఒంటరిగా, పాదచారై వధించడం అత్యాశ్చర్యమైన విషయమని వారు
చెప్పారు. ఇప్పుడు కూడా లక్ష్మణుడు, సేనలతో సుగ్రీవుడు
తోడుగా వున్నారని చెప్పారు. కాబట్టి వారు ఎంత పనైనా చేయగలరు అని బోధించారు”. అని
అన్నది.
ఇలా సరమ
చెప్తున్నప్పుడు వానరుల సింహనాదాలు, శంఖాల,
భేరుల ధ్వనులు భూమి తబ్బిబ్బు అయ్యేట్లు వినపడ్డాయి. ఆ ధ్వనులకు రాక్షసులు భయపడి, తెల్ల ముఖాలు వేసుకుని, తమ రాజు చేసిన దోషం వల్ల
ప్రాణాల మీద ఆశలు వదలుకున్నారు. వానరులు చేస్తున్న ధ్వనులు దిక్కులు
పిక్కటిల్లేట్లు వ్యాపిస్తుంటే, రాముడు లంక ముట్టడించడానికి
వస్తున్న విషయం అర్థం చేసుకున్న రావణుడు ఒక్క ముహూర్తకాలం ఏం చేయాల్నా అని
ఆలోచించసాగాడు.
ఇంతలో రావణుడి
తల్లికి పెదనాన్న అయిన మాల్యవంతుడు ఇలా అన్నాడు. “రాజధర్మం తెలిపే నీతి విద్యల్లో
పండితుడై,
నీతిమార్గాన్ని అనుసరించే రాజు, ఐశ్వర్యంతో
కూడి చిరకాలం రాజ్యం చేస్తూ, శత్రువులను తనకు
లోబర్చుకుంటాడు. కాలానుగునంగా శత్రువుతో సంధి చేసుకోవాల్సి వచ్చినప్పుడు సంధి, యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు యుద్ధం చేసేవాడు తన పక్షాన్ని వృద్ధి
చేసుకుని సంపద కలవాడవుతాడు. ఎప్పుడు సంధి చేసుకోవాలి,
ఎప్పుడు యుద్ధం చేయాలని అడుగుతావేమో? శత్రువు కంటే తనబలం
తగ్గినప్పుడు, లేదా, శత్రువు సమానుడైనప్పుడు
సంధి చేసుకోవాలి. శత్రువు బలం తగ్గి, తన బలం పెరుగుతుంటే
శత్రువులను ఉపేక్ష చేయకూడదు. యుద్ధం చేయాలి. నేను చెప్పేది నీతి పధ్ధతి కాబట్టి
ఇప్పుడు రాముడితో సంధి చేసుకోవడమే తగిన కార్యం. రాముడు తన భార్యను తీసుకుపోవడానికి
యుద్ధానికి వచ్చాడేకాని నీ రాజ్యం ఆశించి రాలేదు. కాబట్టి ఆమెను ఇవ్వడంతో పగ, కారణం తీరిపోతుంది. నీ రాజ్యంలో నువ్వు, ఆయన
రాజ్యంలో ఆయన సుఖంగా వుండవచ్చు”.
“నీకు దానవుల వల్ల,
రాక్షసుల వల్ల, దేవతల వల్ల చావులేకుండా వరం వుంది. ఇప్పుడు
యుద్ధానికి వచ్చినవారు వీరెవ్వరూ కాదు. నువ్వు వరం పొందని మనుష్యులు, వానరులు, ఎలుగులు వచ్చి లంకను ముట్టడించారు.
ఉత్పాతాలు కూడా పుట్టుతున్నాయి కాబట్టి బుద్ధి కలిగి ఇక చెడ్డ పనులు మానుకో. సంధి
చేసుకో”. మాల్యవంతుడి మాటలు రావణుడికి నచ్చలేదు.
మాల్యవంతుడు చెప్పిన మాటలు
విన్న రావణుడు కోపించి, కళ్లెర్రచేసి, కనుబొమలు
ముడివేసి, గుడ్లు తిప్పుకుంటూ,
చెప్పినవాడు పెద్దవాడన్న గౌరవం కూడా లేకుండా, సభలో అందరూ
వినేట్లు ఇలా అన్నాడు. “ రాముడిలో, నాలో లేని సామర్థ్యం
ఏముందని మాట్లాడావు? నేను రాక్షసులందరికీ ప్రభువును.
దేవగంధర్వులకు భయంకరుడిని. విశేష పరాక్రమవంతుడైన నన్ను ఎందుకు మిక్కిలి నీచుడిగా
లెక్కించావు? సీతను దండకారణ్యం నుండి తెచ్చిన నేను ఇప్పుడేమి
మునిగి పోయిందని రాముడికి బెదిరి నా కోరిక తీర్చుకోకుండా అప్పగించాలి? వానరులతో, లక్ష్మణుడితో, సుగ్రీవుడితో
కూడిన రాముడిని యుద్ధభూమిలో నేను గద్దలపాలు చేస్తుంటే నువ్వే చూస్తావు. వీరాగ్రణి రావణుడు
యుద్ధకేళికి భయపడుతాడా? నువ్వు చెప్పినట్లు రాముడు నీ
అభిప్రాయం ప్రకారం గొప్పవాడే కావచ్చు. వాడేకాదు, వాడికి నూరింతలు ఎక్కువ గొప్పవాడు
వచ్చినా నేను లోబడేవాడిని కాను. ఈ దోషం నాకు పుట్టుకతోనే వచ్చింది. దోషం అని
తెలిసి కూడా ఎందుకు సవరించుకోనంటావా? స్వభావ గుణం దాటరానిది
కదా? దాన్ని అతిక్రమించి ఎవడు పోగలడు? సముద్రం
మీద రాముడు సేతువు కట్టాడని ఏదో గొప్ప పనిగా చెప్తున్నావు. అదొక లెక్కా? దానికి నేను భయపడ్తానా? ఆ రామచంద్రుడు వానరులతో
ఇక్కడికి వస్తే మళ్లీ దేహంతో తిరిగి పోలేడని ప్రమాణం చేసి చెప్తున్నాను”.
ఇలా రావణుడు చెప్పిన తరువాత మాల్యవంతుడు
రావణుడి ఆజ్ఞ తీసుకుని జయ జయ అంటూ ఇంటికి పోయాడు. రావణుడు మంత్రులతో సమాలోచన చేసి
లంకలో అన్ని వైపులా రాక్షసులను నియమించాడు.
తూర్పు పక్కన వున్న పురద్వారాన్ని
రక్షించడానికి ప్రశస్తబలసంపత్తి కల ప్రహస్తుడిని, దక్షిణాన మహోదర, మహాపార్స్వులను నిలిపాడు. పడమటి దిక్కున అనేక మాయలు నేర్చిన
ఇంద్రజిత్తును విస్తార సేనతో సహా వుంచాడు. ఉత్తరపు దిక్కు కాయడానికి శుకసారణులను
పంపి అక్కడికి తానే వస్తానని చెప్పాడు. ద్వీపం దక్షిణ భాగంలో పడమటి దిశగా నైరుతి
మూలాన లంక వుంది. సేతువు ఉత్తరాన వుంది. ఉత్తరం-పడమర తాకుడు ఎక్కువ కాబట్టి అక్కడ
ఒక చోట తాను నిలిచి ఒకచోట ఇంద్రజిత్తును వుంచాడు. పుర మధ్యభాగం రక్షించడానికి
గొప్ప సైన్యంతో విరూపాక్షుడిని పెట్టాడు. ఈ విధంగా లంకకు నాలుగు వైపులా పదిలంగా
రక్షకులను నియమించి, రావణుడు దైవ ప్రేరణ వల్ల, తాను కృతకృత్యుడైనానని అనుకున్నాడు. వారివారికి చెప్పాల్సిన పనులు
అప్పచెప్పి వారందరినీ వారి సంస్థానాలకు పొమ్మని చెప్పి, తన
అంతఃపురానికి సచివులు ఆశీర్వదిస్తూ వుంటే వెళ్లాడు రావణుడు.
(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)
No comments:
Post a Comment