కుంభకర్ణుడు చావుతో రావణ వినాశనానికి బీజమా?
వనం
జ్వాలా నరసింహారావు
ఆకాశవాణి
హైదరాబాద్ కేంద్రం శనివారం (24-04-2021) ప్రసారం
ప్రప్రధమ రామ-రావణ యుద్ధంలో, రాముడి ధాటికి
నిర్వీర్యమైపోయిన రావణుడు గర్వం పోయి సంతోషహీనుడయ్యాడు. విల్లు విరిగిపోగా,
సూతుడు చావగా, గుర్రాలు మరణించగా, రామబాణాల దెబ్బలకు నొప్పులు పుట్టిన శరీరంతో, లంకకు
పోయాడు. యుద్ధభూమిని వదిలిపోయిన రావణుడు రామబాణాలు ఇంకా తనను తరుముతున్నాయేమోనని
నాల్గు దిక్కులా చూస్తూ భయపడ్డాడు. తన దగ్గరున్న రాక్షసులతో, దుఃఖిస్తూ, తన మనస్సులో వున్నదున్నట్లు ఇలా
చెప్పాడు.
"అయ్యో! ఎంతో మందిని జయించిన నేను ఈ రోజున యుద్ధభూమిలో ఒక మనుష్యుడిని
గెలవలేక పోయాను. ఎంతటి విపరీత కాలం వచ్చిందో కదా! నాకు వరాలిచ్చినప్పుడే
బ్రహ్మదేవుడు నాకు మనుష్యులవల్ల భయం కలుగుతుందని చెప్పాడు. ఆ మాటలు నేడు
యదార్థమయ్యాయి కదా! ఎవరితో చావకుండా బ్రహ్మ వరం పొందాను. అప్పుడు దురహంకారంతో
మనుష్యులు ఏమి చేయగలరని భావించి వారి పేరు చెప్పలేదు. అది ఇప్పుడు నా ప్రాణానికే
అపాయం అయింది. నాకు హితం బోధించిన కొందరు, విష్ణువే మనుష్య
రూపంలో రాముడిగా నన్ను చంపడానికి వచ్చాడనీ, అతడితో సంధి
చేసుకొమ్మనీ చెప్పారు. గతంలో, ఇక్ష్వాకు రాజైన అరణ్యుడనే వాడిని
యుద్ధంలో ఓడించాను. అతడు నన్ను తన వంశంలో నన్ను చంపేవాడు పుట్తాడని చెప్పాడు. ఆ
రాజు అన్న మాట నేటికి చెల్లుతున్నది కదా! ఇది వాస్తవం కాబట్టి దశరథుడి కొడుకు
రాముడు మనుష్యుడనే నమ్ముతాను. దశరథుడు మనుష్యుడైతే ఆయన కొడుకు కూడా మనిష్యుడే
కదా!".
“నేను చేసిన పనికి అవమానపడి, కోపంతో వేదవతి అనే ఒక
తపశ్శాలినైన స్త్రీ, నన్ను నా కులాన్ని నాశనం చేస్తానని
శపించింది. ఆ వేదవతే ఇప్పుడు విదేహరాజుకు కూతురై సీతగా పుట్టింది. ఆ వేదవతి ఋషి
కన్య. మానుష్య స్త్రీ కాబట్టి సీత కూడా మనుష్య స్త్రీనే. కాబట్టి సీతారములిద్దరూ
మనుష్య జాతివారే. మనుష్యులు కాబట్టే ఒకరినొకరు వివాహం చేసుకున్నారు కాని, రాముడు విష్ణువైతే మనుష్య స్త్రీని వివాహం చేసుకుంటాడా? సీత లక్ష్మి అయితే మనుష్యుడిని వివాహం చేసుకుంటుందా? కాబట్టి లక్ష్మీనారాయణుల వాదన నాకు సమ్మతం కాదు. పార్వతి, రంభ, నందీశ్వరుడు నన్ను గురించి చెప్పింది జరగడం
ఆరంభమైంది. ఇవి నాకున్న శాపాలు. ఇది తెలుసుకున్న మీరు విరోధులను సంహరించే ఉపాయం
ఆలోచించండి. ఈ శాపాలు నన్ను బాధిస్తాయికాని మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఇంకో విషయం,
నిద్రబోతున్న కుంభకర్ణుడిని లేపాలి".
ఆయన ఆజ్ఞానుసారం కుంభకర్ణుడిని నిద్రలేపడానికి రాక్షసులు
అనేకవిధాలైన ప్రయత్నాలు చేశారు. కుంభకర్ణుడు కళ్లు తెరిచి, తననెందుకు నిద్రలేపారని
వాళ్లను అడిగాడు. రావణుడి క్షేమం గురించి విచారించాడు. యూపాక్షుడనే మంత్రి అతడితో ఇలా అన్నాడు.
"ఇప్పుడు మనకు అర్థంకాని మహాభయం మనుష్యుల వల్ల కలిగింది. వానరులు లంకను
ముట్టడించారు. సీతాదేవిని అపహరించడం వల్ల బాధపడుతున్న రాముడితో రాక్షసులకు
చావుకాలం వచ్చింది. ఇంతకు ముందు ఒక వానరుడు వచ్చి లంకను కాల్చాడు. ఇప్పుడు
సూర్యతేజస్సుకల రాముడు బలవంతుడై వచ్చి రావణుడు చచ్చేట్లు యుద్ధంలో పరుగెత్తించి
మరీ కొట్టాడు. అవమానం వల్ల, రాముడి బాణాల
దెబ్బల వల్ల, రావణుడు నీమీద ఆశతో ఒక్క ప్రాణాన్ని మాత్రం
బిగబట్టుకుని బతికున్నాడు".
మత్తు వదిలించుకుని అన్న రావణుడిని చూడడానికి కుంభకర్ణుడు
త్వరగా పోయాడు. అన్నను చేరిన తమ్ముడిని చూడగానే రావణుడు "నాయనా
వచ్చావా!" అని సంతోషంగా లేచి కౌగలించుకున్నాడు. కళ్ళు తిప్పుకుంటూ ఇలా
అన్నాడు.
"తమ్ముడా!
సుగ్రీవుడి సహాయంతో వానరసేనతో రాముడు సముద్రం దాటివచ్చి రాక్షస సేననంతా నాశనం
చేస్తున్నాడు. యుద్ధానికి పోయిన రాక్షసులంతా అలాగే పోవడమే కాని మరలి రావడం లేదు. ఈ
నగరాన్ని నువ్వే రక్షించాలి. వానర సమూహాన్ని నువ్వు చంపాలని నిన్ను నిద్రలేపాను.
అసమాన తేజస్సుకలవాడా! నీ బలం అనే గాలితో విరోధులనే మేఘాలను చెదరగొట్టు".
ఇలా మాట్లాడుతున్న అన్న రావణుడిని చూసి నవ్వాడు
కుంభకర్ణుడు. “గతంలో ఆలోచన చేసే సమయంలో నీకు ఎలాంటి కీడు మూడుతుందో అని మేము
నిశ్చయించామో అలాంటి కీడే నేడు కలిగింది. దీంట్లో విపరీతం ఏదీ లేదు. యుద్ధం
జరిగితే మనవారిలో కొందరైనా చస్తారు కదా? చావకుండా
వుండరు కదా? ఒక ఆడదానికోసం
నీ మేలుకోరేవారిని చంపుకుంటున్నావు. చెప్పినా వినకపోతివి. ఆడదానిమీద వున్న
కామానికి ఫలితం అనుభవిస్తున్నావు. అనుకున్న దానికి విరుద్ధంగా ఏదీ జరగలేదు. పాపం
చేసినవాడికి నరకానుభవం తప్పదన్నట్లు నువ్వు చేసిన పాపకార్యానికి వెంటనే ఫలితం
కనబడ్దది. దాన్ని అనుభవిస్తున్నావు. చేసిన పుణ్యపాపాలు త్వరలోనేకదా ఫలితం చూపేది?. ఈ
చేత్తో చేశావు, ఆ చేత్తో
అనుభవిస్తున్నావు.
కుంభకర్ణుడి మాటలకు కోపం
తెచ్చుకున్న రావణుడు ఇలా అన్నాడు తమ్ముడితో: “నా మీద నీకు అమితమైన ప్రేమ వున్నా, నీ బలశౌర్యాలు ఎంతో నీకు తెలిసి వున్నా, ఇప్పటి
యుద్ధ ప్రయత్నం నిరాక్షేపకార్యమని నీకు తోచినా, వెంటనే నేను
నీతిమాలి చేసిన పనిని, దానివల్ల కలిగిన కీడును నీ శౌర్యంతో
సరిదిద్దు. ఆపద కలిగిందని తెలిసి దుఃఖపడేవాడిని చేరుకొని సహాయం చేసేవాడే
స్నేహితుడు. నీతిమాలిన పనిచేసి దుఃఖపడేవాడిని రక్షించేవాడే బంధువు. కాని సహాయం
చేయకుండా నువ్విలా చేశావు, అలా చేశావు అని దేప్పెవాడు బంధువు
కాదు. స్నేహితుడు కాదు”.
ఈ విధంగా రావణుడు చెప్పగా ఇక వాడికి నీతులు చెప్పి ప్రయోజనం
లేదని భావించాడు కుంభకర్ణుడు. వాడికి తియ్యగా మంచిమాటలు చెప్పాడిలా.
"రాక్షసరాజా! నీ మేలుకోరే వాస్తవాన్ని, హితాన్ని
చెప్పాను. అది నీకు రుచించలేదు. నా ఇష్టప్రకారం నువ్వు రానప్పుడు, నీ ఇష్టప్రకారం నేను రావాలి కాబట్టి, అసమానమైన నా శౌర్యంతో యుద్ధం చేసి నీ పగ
తొలగిస్తాను. సర్వ రాక్షసులు రాముడు చావగా నన్ను ప్రీతితో చూద్దురు గాక. రాముడు
మొదట నన్ను యుద్ధంలో చంపితే ఆ తరువాత నిన్ను చంపకుండా వదలడు. ఎందుకంటే అతడు
బలశ్రీమహితుడు కాబట్టి లక్ష్మీవంతుడికి పరాజయం వుండదు. ఇది సత్యం. నేను యుద్ధంలో
అవమాన పడతానన్న విచారం నాకు లేదు. కాబట్టి నన్నే పంపు. నేను చేతిలో త్రిశూలం
తీసుకుని యుద్ధంలో వుండగా నన్ను ఎదిరించడానికి ఇంద్రుడు, అగ్ని, వాయువు
కూడా సరిపోరు. శత్రువులంతా చావరా?”
అన్న రావణాసురుడి ఆజ్ఞ ప్రకారం కుంభకర్ణుడు యుద్ధ
ప్రయత్నాలు ఆరంభించి,
చేత శూలాన్ని ధరించి, అన్నతో తాను ఒంటరిగానే
యుద్ధానికి పోతానని తాను వచ్చేదాకా సైన్యాన్ని అక్కడే వుంచమని చెప్పి, అన్నకు ప్రదక్షిణ చేసి కౌగలించుకుని, నమస్కారం చెసి
యుద్ధానికి పోయాడు. బలశాలైన కుంభకర్ణుడు అన్న ఆశీర్వాదం తీసుకుని సింహనాదం చేస్తూ
యుద్ధానికి పోతుంటే ఆయన వెంట శస్త్రాలను ధరించి
సింహనాదాలు చేస్తూ భటులు పోయారు.
కుంభకర్ణుడిని
చూసి కోతి గుంపులు చెల్లాచెదరై చెదిరిన పాదరసంలాగా అయిపోయాయి. పరుగెత్తిపోతున్న
నీలుడిని, గవాక్షుడిని, నలుడిని, కుముదుడిని, అంగదుడు సమీపించి బలవంతులైన వారే అలా
పరుగెత్తి పోవచ్చా అని అడిగాడు. "వీరులారా! ప్రాణాలను కాపాడుకోవడానికి
పరుగెత్తి పోవచ్చా? ఇక్కడ వుండే
కాపాడుకోలేరా? మనల్ని
రాక్షసులు భయపెట్తే భయపడాలా?
అందుకే
వారొక బొమ్మను తెచ్చారు. రండి, దాన్ని పడగొడ్దాం. శాశ్వత కీర్తిని సంపాదిద్దాం. వీడి
ప్రతాపం రాముడు కనిపించేదాకే కదా?
అంతవరకు
ధైర్యంతో వుండండి". ఇలా అంగదుడు వారికి చెప్పి వారిని తిరిగి యుద్ధభూమికి
మళ్లించాడు.
యుద్ధభూమికి
మరలి వచ్చిన వానరులను కుంభకర్ణుడు మింగుతున్నప్పటికీ మిగిలినవారు ఉత్సాహంగా యుద్ధం
చేశారు. అప్పుడు ద్వివిదుడు కోపంతో ఒక శిఖరాన్ని కుంభకర్ణుడి మీదికి విసిరాడు. అది
వాడిని తాకకుండా మధ్యలో వున్న గుర్రాలను, రథాలను, ఏనుగులను నాశనం చేసింది. యుద్ధం
భయంకరంగా మారింది. రాక్షస రక్తం నేలంతా నిండింది. అప్పుడు రాక్షసులు
భయంకరాకారులయ్యారు. వానర సేనమీద పడి రాక్షసులు నరకడం ప్రారంభించారు. ఆ సమయంలో
వచ్చాడు హనుమంతుడు.
ఆంజనేయుడు
అప్పుడు జడివాన కురిసినట్లు ఆకాశాన తిరుగుతూ కుంభకర్ణుడి తలమీద కొండ శిఖరాలను, చెట్లను వేశాడు. కుంభకర్ణుడు వాటిని తన
శూలంతో నరికాడు. అంతే కాకుండా వానర సైన్యాన్ని తన శూలధారతో సంహరించాడు. ఇలా
వారిద్దరి మధ్య యుద్ధం సాగింది. సాహసవంతులైన శరభుడు, నీలుడు, గవాక్షుడు, గంధమాదనుడు, ఋషభుడు చెట్లతో, కొడలతో, రాళ్లతో, పిడికిళ్లతో కుంభకర్ణుడిని నలుదిక్కుల
నుండి బాధించడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. వానర సమూహాన్ని కుంభకర్ణుడు గరుడు
సర్పాలను మింగినట్లు బక్షించాడు. అలా వానరులందరినీ చిటిక వేసేంతలో మింగాడు. వానరుల
మరణాలతో నేలంతా నెత్తురు మాంసాలతో తడిచి బురదయింది. వాడెమో వానర సేనను దహించాడు. చావగా మిగిలిన వానరులు రాముడి దగ్గరికి పోయి
శరణు జొచ్చారు.
అంగదుడు
పడిపోగానే కుంభకర్ణుడు తన శూలంతో సుగ్రీవుడి మీదికి పోగా, సుగ్రీవుడు ఒక శిఖరాన్ని ఎత్తుకుని అతడి
మీదికి వేశాడు. అది కుంభకర్ణుడిని తాకి ముక్కలవగానే రాక్షసులు సింహనాదాలు చేశారు.
కుంభకర్ణుడు కొండ దెబ్బకు బాధ కలిగి ఒక త్రిశూలాన్ని తీసుకుని సుగ్రీవుడి మీద
ప్రయోగించాడు. దానికి తటాలున ఆంజనేయుడు అడ్డుపడి దాన్ని విరిచి వేశాడు. వానరులు
అప్పుడు సింహనాదాలు చేసి హనుమంతుడిని పొగిడారు. తన శూలం విరిగి పోగానే కుంభకర్ణుడు
లంక దగ్గరున్న మలయ పర్వతం శిఖరాన్ని వూడబీకి దాంతో సుగ్రీవుడిని కొట్టాడు.
సుగ్రీవుడు
స్మృతి తప్పి పడిపోయాడు. కుంభకర్ణుడు పడిపోయిన సుగ్రీవుడి దగ్గరికి వచ్చి, అతడిని ఎత్తుకుని లంకకు పోయాడు.
సుగ్రీవుడు చిక్కడం అంటే రాముడి సేనంతా చిక్కినట్లే అని కుంభకర్ణుడు భావించాడు.
ఇదంతా చూస్తున్న ఆంజనేయుడు,
ఎలాగైనా సుగ్రీవుడు కుంభకర్ణుడి నుండి తప్పించుకుని వస్తాడని
నమ్మాడు. లంకకు తీసుకుని పోబడి, మూర్ఛనుండి
తేరుకున్న సుగ్రీవుడు, చంకనుండి
తటాలున దిగి చివాలున పైకెగిరి,
ఏకకాలంలో
నోటితో కుంభకర్ణుడి ముక్కు కొరికి, గోళ్లతో
చెవులు పెరికాడు. ఆకాశానికి ఎగిరి రామచంద్రుడి దగ్గరకు చేరాడు. అక్కడ లంకలో
కుంభకర్ణుడు అవాక్కయ్యాడు. అప్పుడు కుంభకర్ణుడు యుద్ధభూమికి పోయి దొరికిన వానరులను
దొరికినట్లే మింగసాగాడు.
అది చూసిన
లక్ష్మణుడు కుంభకర్ణుడి మీదికి యుద్ధానికి పోయాడు. కుంభకర్ణుడు లక్ష్మణుడిని
లక్ష్యపెట్టక రామచంద్రమూర్తి వున్న చోటుకు పరుగెత్తాడు. అప్పుడు రామచంద్రమూర్తి
రౌద్రాస్త్రం సంధించి కుంభకర్ణుడి విశాలమైన రొమ్ము తాకేట్లు వేశాడు. దానికి వాడు
చలించి బెదిరిపోయాడు. రామచంద్రమూర్తి వేసిన బాణాల బాదవల్ల వాడి చేతిలో వున్న
ఆయుధాలు వాటంతట అవే జారిపడిపోయాయి. అయుధాలు పడిపోవడంతో చేతులతో యుద్ధం చేస్తూ
రాక్షసులను, వానరులను
మింగుతూ, ఒక కొండ
శిఖరాన్ని తెచ్చి వడిగా రాముడి మీదికి వేశాడు. రాముడు దాన్ని ఏడు బాణాలతో
ఖండించాడు.
తరువాత రాముడు వాడి మీద విశేషమైన బాణాలను చిమ్మాడు కాని, వాడు
చలించలేదు. తాను వేస్తున్న బాణాలు కుంభకర్ణుడిని కొట్టే సామర్థ్యం లేదని గ్రహించిన
రామచంద్రమూర్తి వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించి అతడి హస్తాన్ని ఆయుధంతో సహా
నేలపడగొట్టాడు. రాముడు వేసిన బాణాలకు కాళ్లు విరిగి స్మృతి తప్పి పడిపోయాడు. అప్పుడు
రాముడు బ్రహ్మాస్త్రంతో సమానమైన ఐంద్రాస్త్రాన్నివిల్లులో సంధించి విడిచాడు. అది
పిడుగులాగా పోయి రాక్షసుడి తలను తుంపగా అది తటాలున పైకి ఎగిసి దభాలున నేలమీద పడగా, మొండెం వానరులను చంపుకుంటూ పోయి
సముద్రంలో పడింది. యుద్ధంలో అలా కుంభకర్ణుడిని సంహరించి రాముడు వానరుల నడుమ
ప్రకాశించాడు. (వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)
No comments:
Post a Comment