Saturday, April 24, 2021

చ్యవన మహర్షి వృత్తాంతం, సౌకన్యాఖ్యానం, మాంధాత కథ ఆస్వాదన-17 : వనం జ్వాలా నరసింహారావు

 చ్యవన మహర్షి వృత్తాంతం, సౌకన్యాఖ్యానం, మాంధాత కథ

ఆస్వాదన-17

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (25-04-2021)

తీర్థయాత్రలలో భాగంగా పాండవులు దక్షిణ గంగ అయిన గోదావరిని దర్శించారు. ఆ తర్వాత ప్రభాస తీర్థానికి చేరుకున్న పాండవులను సందర్శించడానికి శ్రీకృష్ణుడు, బలరాముడు వచ్చారు. కొంతసమయం వారితో గడిపి పాండవులను వీడ్కొని వెళ్లారు వారు. యధాప్రకారం పాండవులు తమ తీర్థయాత్రలు కొనసాగించారు. నర్మదా నదిలో స్నానం చేసిన తరువాత అక్కడి వైడూర్య పర్వతాన్ని చూపించి రోమశుడు ధర్మరాజుతో, శర్యాతి మహారాజు త్రేతాయుగం చివర్లో, ద్వాపర యుగం ప్రవేశించే ముందర యజ్ఞం చేసిన చోటది అని చెప్పాడు. భృగుమహర్షి కొడుకైన చ్యవన మహర్షి శర్యాతి రాజు కూతురును వివాహం చేసుకున్న వృత్తాంతాన్ని, సౌకన్యాఖ్యానాన్ని వివరంగా చెప్పాడు రోమశుడు ధర్మరాజాదులకు.

పూర్వం భృగుమహర్షి కొడుకైన చ్యవన మహర్షి ఎన్నోవేల సంవత్సరాలు నిష్ఠగా గొప్ప తపస్సు చేశాడు. ఆ ముని శరీరం చుట్టూ పుట్ట కప్పుకుంది. ఒకనాడు శర్యాతి మహారాజు అక్కడకు సమీపంలోని కొలనులో విహరించడానికి వచ్చినప్పుడు వెంట ఆయన కూతురు కూడా వుంది. పుట్టలో నుండి కనిపిస్తున్న చ్యవన మహర్షి కన్నులను మిణుగురు పురుగులుగా భావించిన ఆమె పుట్టను తవ్వించింది. చ్యవన మహర్షికి కోపం వచ్చి అందరినీ శపించాడు. విషయం అర్థం చేసుకున్న శర్యాతి పుట్ట దగ్గరికి పోయి చ్యవన మహర్షిని క్షమించమని వేడుకున్నాడు. రాజపుత్రిక సుకన్యను తనకిచ్చి పెళ్లి చేయమన్నాడు చ్యవనుడు. శర్యాతి అలాగే చేశాడు.

సుకన్య తన భర్త అయిన చ్యవనుడికి సేవలు చేస్తూ సుఖంగా వుండగా ఒకనాడు ఆమె దగ్గరికి అశ్వినీదేవతలు వచ్చారు. తామెవరో ఆమెకు చెప్పారు. ఆమె అందానికి తగ్గ మరెవ్వరినైనా పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు. ఆ విషయం ఆమె భర్తకు చెప్పింది. వారు చెప్పినట్లే చేయమని భర్త అన్నాడు. తర్వాత అశ్వినీదేవతలు, చ్యవనుడు ముగ్గురూ కలిసి అక్కడి కొలనులో ప్రవేశించారు. ముగ్గురూ బయటకు నవ యవ్వనులుగా తిరిగి వచ్చారు. తమ ముగ్గురిలో నచ్చినవాడిని ఒకడిని ఎన్నుకుని పెళ్లి చేసుకోమ్మన్నారు అశ్వినీదేవతలు. అప్పుడు సుకన్య తన భర్త అయిన చ్యవనుడినే వరించింది. కృతజ్ఞతగా చ్యవనుడు శర్యాతి చేసే యజ్ఞంలో దేవేంద్రుడు చూస్తుండగా ఆశ్వినీదేవతలతో సోమరసం తాగిస్తానన్నాడు. ఆ తరువాత అశ్వినీదేవతలు వెళ్ళిపోయారు సంతోషంగా.

కొన్నాళ్ళకు శర్యాతి మహారాజు యజ్ఞాన్ని నిర్వహించాడు. ఆ యజ్ఞంలో ఆశ్వినీదేవతలకు సోమరసం ఇవ్వడానికి సిద్ధపడ్డ చ్యవనుడి మీద కోపం వచ్చింది ఇంద్రుడికి. అతడి కోపాన్ని లెక్క చెయ్యకుండా చ్యవన మహర్షి ఆశ్వినులకు సోమరసాన్ని ఇచ్చి తాగించాడు. కోపంతో ఇంద్రుడు చ్యవనుడి మీద వజ్రాయుధాన్ని ఎత్తాడు. అప్పుడు చ్యవనుడు ఇంద్రుడు ఎత్తిన చేతిని స్తంబింపచేసి అతడిని చంపడానికి ప్రయత్నించాడు. తాను చేయిస్తున్న యజ్ఞం నుండి ఒక భయంకరమైన రాక్షసుడిని సృష్టించాడు. దేవేంద్రుడు భయపడి చ్యవనుడికి నమస్కరించి, ఇక ముందు అశ్వినీదేవతలు కూడా సోమరసం తాగడానికి అర్హులు అని ప్రకటించాడు. తరువాత సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. అశ్వినీదేవతలు కూడా స్వర్గానికి వెళ్లారు.

చ్యవనుడు సృష్టించిన మదుడు అనే ఆ రాక్షసుడు ఆ ముని ఆదేశం ప్రకారం కల్లులోను, స్త్రీలలోను, వేటలోను, పాచికలలోను ప్రవేశించాడు. చ్యవన మహర్షి మహిమ వెలుగొందిన ఆ ప్రదేశానికి, అక్కడి కొండకు అర్చీకపర్వతం అన్న పేరొచ్చింది. ఆ తరువాత అక్కడి పుణ్య సరస్సులో పాండవులు స్నానం చేశారు.

అక్కడి నుండి యమునానదిని చేరారు పాండవులు. అక్కడి విశేషాలు చెప్తూ మాంధాత్రుడు చేసిన యాగాల గురించి చెప్పాడు. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన యువనాశ్వుడు సంతానం కలగనందువల్ల పరితపించి మంత్రులమీద రాజ్య భారం మోపి, భృగుమహర్షి ఆశ్రమానికి వెళ్లి అతడిని ఆరాధించాడు. భృగుమహర్షి అతడితో పుతకామేష్టి యజ్ఞం చేయించి, పుత్రుడు పుట్టడానికి, పవిత్ర జలాలతో కూడిన పాత్రను ఇచ్చాడు. యజ్ఞం ముగిసిన రాత్రి పాత్రకు కాపలా వున్న ఋత్విజులు అంతా అలసి నిద్రపోయినప్పుడు  యువనాశ్వుడికి దాహం వేసి మంత్రపూతమైన యజ్ఞోదకాన్ని పొరపాటున మొత్తం తాగాడు. అది వాస్తవానికి ఆయన భార్య తాగడానికి ఉద్దేశించబడినది.

భృగుమహర్షి ఆ విషయాన్ని తెలుసుకుని యువనాశ్వుడిని చూసి, దైవఘటనను ఎవ్వరూ తప్పించలేరని, అలా తాగడం వల్ల యువనాశ్వుడు కడుపుతో వుంటాడని చెప్పాడు. ఇంద్రుడితో సమానుడైన కొడుకు పుడుతాడని కూడా చెప్పాడు. నూరు సంవత్సరాల తరువాత యువనాశ్వుడి ఎడమ పక్కను చీల్చుకుని కుమారుడు పుట్టాడు. అప్పుడు అక్కడికి వచ్చిన ఇంద్రుడు, దేవతలు ఆ బాలకుడికి మాంధాత్రుడు అని పేరు పెట్టారు. ఆ విధంగా జన్మించిన మాంధాత్రుడు ధ్యానం చేయడం చేత మాత్రమే నాలుగు వేదాలు, వివిధ శాస్త్రాలు, విలువిద్య మొదలైనవన్నీ నేర్చుకున్నాడు. ముల్లోకాలలో గౌరవించదగిన వ్యక్తి అయ్యాడు. ఆ మాంధాత సమస్త భూమండలానికి రాజరాజుగా దేవేంద్రుడి వల్ల పట్టాభిషిక్తుడై దేవేంద్రుడి సింహాసనం కూడా అధిష్టించి, ‘ఆజగావంఅనే విల్లును చేబట్టి, కవచాన్ని ధరించి, లోకాలన్నీ జయించాడు. ఇంద్రుడి మీద యుద్ధం చేసి గెలిచాడు. భూమ్మీద వానలు కురిపించాడు. పాండవులు అప్పుడు వున్న ప్రదేశంలోనే మాంధాత యజ్ఞం చేశాడని చెప్పాడు రోమశుడు.  

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, అరణ్యపర్వం, తృతీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

No comments:

Post a Comment