Sunday, April 11, 2021

పాండవుల తీర్థయాత్రలు, వాతాపీ-ఇల్వలుల, అగస్త్యుడి వృత్తాంతం (ఆస్వాదన-15) : వనం జ్వాలా నరసింహారావు

 పాండవుల తీర్థయాత్రలు, వాతాపీ-ఇల్వలుల, అగస్త్యుడి వృత్తాంతం

(ఆస్వాదన-15)

వనం జ్వాలా నరసింహారావు

సూర్య దినపత్రిక ఆదివారం సంచిక (11-04-2021)

ఒకనాడు నారద మహర్షి ధర్మరాజు దగ్గరికి వచ్చాడు. వచ్చి, ధర్మరాజు గొప్ప నడవడికి, ధర్మబుద్ధికి సంపూర్ణంగా తృప్తి చెందానని, ఆయనకు ఇష్టమైనదేదైనా కోరుకొమ్మని అన్నాడు నారదుడు. పుణ్య క్షేత్రాలు సందర్శించి ధన్యులైన మహానుభావులు పొందే పుణ్యఫలం ఎలాంటిదో, అనేక దివ్య క్షేత్రాల  వర్ణనతో పాటు, తనకు తెలియచేయమని ప్రార్థించాడు ధర్మరాజు నారదుడిని. జవాబుగా నారదుడు, సత్యసంధులు, సదాచారులు, శాంత స్వరూపులు, ధర్మాత్ములు అయినవారు అఖిల తీర్థాలలో స్నానం చేసిన పుణ్యఫలం, సమస్త యజ్ఞాలు చేసిన ఫలితం పొందగలరని అన్నాడు. పాపాత్ములు తీర్థయాత్రలు చేసినా అలాంటి పుణ్యఫలం పొందలేరని చెప్పాడు. తీర్థయాత్రలు చేస్తే లభించే పుణ్యఫలం అనేక పుణ్యాలకంటే గొప్పదన్నాడు. ఒక్కొక్క తీర్థాన్ని వర్ణిస్తూ చేకూరే పుణ్యఫలం గురించి వివరించాడు.

ఆ పుణ్యఫలాలిలా వుంటాయి (కొన్ని): సమస్త పాపాలు తొలగిపోతాయి. వందల-వేల అశ్వమేధయాగాలు చేసిన పుణ్య ఫలాన్ని పొందుతారు. సర్వ యజ్ఞాలు చేసిన పుణ్య ఫలం, బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయి. అగ్నిష్టోమ యాగ ఫలం కలుగుతుంది. ఐశ్వర్యం లభిస్తుంది. నూరు, వేయి గోవులను దానం చేసిన పుణ్యం కలుగుతుంది. ధర్మ పురుషార్థం, కామపురుషార్థం, అర్థ పురుషార్థం సంప్రాస్తిస్తాయి. కైలాస ప్రాప్తి కలుగుతుంది. రాజసూయ యాగ ఫలం లభిస్తుంది. దేహ శౌచం సిద్ధిస్తుంది. తమతమ వంశాలను ఉద్ధరిస్తారు. సూర్యలోకం ప్రాప్తిస్తుంది. దేవత్వం పొందుతారు. కోటిమంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన పుణ్యం వస్తుంది. వాజపేయ యాగం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. పితరుల రుణాని తీర్చుకుంటారు. తపస్సు చేసిన పుణ్యం పొందుతారు. ఇలా...ఇలా...ఇలా...            

నారదుడు పేర్కొన్న తీర్థాలలో కొన్ని: పుష్కర పుణ్యతీర్థం, అగస్త్యవటం, కణ్వాశ్రమం, ధర్మారణ్యం, యయాతిపతనం, వసిష్టాశ్రమం, పింగం, వరదానం, పిండారకం, శంకుకర్ణేశ్వరం, వసుధార, వసుసరం, సింధూత్తమ తీర్థం, దేవిక, సరస్వతీ నది, నాగోద్భేదం, శివోద్భేదం, చమసోద్భేదం, కురుక్షేత్రం, నైమిశతీర్థం, పుష్కరత్రయం, రామహ్రదం, విష్ణుస్థానం, పారిప్లవ తీర్థం, శాలూకిని, వరాహ తీర్థం, అశ్వినీతీర్థం, సోమతీర్థం, కృతశౌచ తీర్థం, యక్షిణి తీర్థం, శమంతపంచకం, కాయశోధనం, శ్రీతీర్థం, కపిల తీర్థం, సూర్య తీర్థం, గోభవనం, శంఖినీ తీర్థం, శ్వావిల్లోమాపహం, మానుష తీర్థం, కేదారం, కపిల కేదారం, సరకం, ఇలాస్పదం, కిందానం, కింజప్యం, పుండరీకం, వైతరిణీ నది, ఫలకీ వనం, వ్యాసవనం, మనోజవం, మధువటి, వామనం, నైమిశకుంజం, బ్రహ్మతీర్థం, సన్నిహిత తీర్థం, సప్త గంగా సంగమం మొదలైనవి.  

పుణ్య తీర్థాల విషయం చెప్పిన నారదుడు వాటిని సేవించడానికి వెళ్ళిరమ్మని పాండవులకు, ధర్మరాజుకు చెప్పాడు. రోమశుడు అనే దేవర్షి ధర్మరాజు దగ్గరికి వస్తాడని, ఆ మహర్షి ప్రబోధంతో వారి పురోహితుడైన దౌమ్యుడి అనుమతి తీసుకుని తీర్థయాత్రలకు పొమ్మని సూచించాడు నారదుడు. అర్జునుడు వచ్చే లోపున తీర్థయాత్రలకు పోదామని ధర్మరాజు దౌమ్యుడితో అన్నాడు. అప్పుడే రోమశ మహర్షి అక్కడికి వచ్చాడు. ఇంద్రలోకం నుండి తాను వస్తున్నానని, అక్కడ ఆర్జునుడిని చూశానని, శివుడు మున్నగు దేవతలు అర్జునుడికి కోరిన వరాలు అనుగ్రహించారని చెప్పాడు రోమశ మహర్షి.

రోమశ మహర్షి వెంటరాగా, ధర్మరాజు, అతడి తమ్ములు, ద్రౌపదీదేవి, ధౌమ్యుడు, కొందరు బ్రాహ్మణులు మార్గశిర మాసం చివర తీర్థయాత్రలకు బయల్దేరారు. వేదవ్యాసుడు, నారదుడు, పర్వత మహర్షి మొదలైన వారు పాండవులకు వీడ్కోలు పలికారు. రోమశ మహర్షి మార్గమధ్యంలో ధర్మరాజుకు ఆయన కోరిక మీద ధర్మ విశేషాలు చెప్పాడు. పాండవులు ఆ ముని వల్ల వేర్వేరు ధర్మ సూక్ష్మాలు తెలుసుకుంటూ పయనించి, నైమిశం నుండి గంగాయమునా సంగమం వరకు అనేక తీర్థాలలో స్నానం చేశారు. గయ, ప్రయాగ కూడా వెళ్లారు.

పాండవులు తీర్థయాత్రలు చేస్తున్న తరుణంలో పలు సందర్భాలలో, పలు ప్రదేశాలలో ఆయా సందర్భాన్ని పట్టి రోమశ మహర్షి ధర్మరాజుకు అనేక విషయాలను చెప్పాడు. అవన్నీ ఉపాఖ్యానాలుగా భారతంలో వర్ణించబడ్డాయి. వాటిలో కొన్ని:

వాతాపీ, ఇల్వలుల, అగస్త్యుడి వృత్తాంతం

         ఇల్వలుడు, వాతాపి అనే ఇద్దరు రాక్షసులు మణిమతీపురంలో వైభవోపేతంగా నివసిస్తుండే వారు. ఇల్వలుడు తన దగ్గరికి అతిథులుగా వచ్చే విప్రులకు వాతాపిని మేకగా మార్చి, ఆ మేక మాంసం వండి పెట్టేవాడు. ఆ తరువాత బ్రాహ్మణుడి పొట్టలో వున్న తమ్ముడిని ‘వాతాపీ! రమ్ము!’ అని పిలిచేవాడు. వాతాపి బతికి బ్రాహ్మణుల పొట్ట చీల్చి బయటకి వచ్చి బ్రాహ్మణుడిని చంపి తినేవారు.

         ఆ ప్రదేశం దగ్గరికి ఒకనాడు అగస్త్యమహాముని వచ్చాడు. అక్కడ ఒక చెట్టుకు తలకిందుగా వేలాడుతున్న తన పితృ దేవతలను చూసి అలా వుండడానికి కారణం ఏమిటని అడిగాడు. అగస్త్యుడి బ్రహ్మచర్యం వల్ల ఆయనకు పిల్లలు లేనందున తమకు ఉత్తమ గతులు లేకుండా పోయాయని చెప్పారు వాళ్లు. ఇకనైనా అగస్త్యుడు పెండ్లి చేసుకుని సంతానాన్ని కంటే తమకు పుణ్యగతి లభిస్తుందని చెప్పారు. ఆ తరువాత అగస్త్యుడు తన తపో మహిమ వల్ల విదర్భరాజుకు లోపాముద్ర అనే ఒక కూతురును పుట్టించాడు. పెద్దైన తరువాత ఆమెను అగస్త్యుడు వివాహమాడాడు. ఒకనాడు లోపాముద్రతో పొందు కోరిన అగస్త్యుడితో శోభాయమానమైన ఆభరణాలతో అలంకరించుకుని రమ్మని కోరిందామె. అగస్త్యుడు ధన సపాదన కొరకు రాజులైన శ్రుతర్వుడి దగ్గరికి, బ్రధ్నశ్వుడి దగ్గరికి, త్రసదస్యుడి దగ్గరికి వెళ్ళాడు.

వారంతా తమ ఆదాయ-వ్యయాలు సమానంగా వున్నాయని చెప్పి, తాము ధన సహాయం చెయ్యలేమని అంటూ, మణిమతీ పట్టణంలోని ఇల్వలుడి దగ్గరికి తీసుకుపోయారు అగస్త్యుడిని. ఇల్వలుడు వారినందరినీ అతిథి సత్కారాలతో ఆదరించి, వాతాపి మాంసాన్ని ఎప్పటిమాదిరిగానే వండించి అగస్త్యుడికి పెట్టాడు. ఆ విషయం తెలిసిన ముగ్గురు రాజులు అగస్త్య మహర్షికి నమస్కరించి అసలు విషయం చెప్పారు. తినవద్దన్నారు. ఆహారంగా మారిన వాతాపి పొట్టలు చీల్చే విషయం కూడా చెప్పారు అగస్త్యుడికి. మహర్షి భీతి చెందలేదు. పెట్టిన ఆహారాన్ని చక్కగా తిన్నాడు. ఇల్వలుడు ఎప్పటిలాగానే తమ్ముడిని పిలిచాడు. ఆ సంగతి గ్రహించిన అగస్త్యుడు పొట్ట నిమురుకుంటూ, గర్రున త్రేన్చాడు. ఆ క్షణంలోనే అగస్త్య మహర్షి పొట్టలో వాతాపి రాక్షసుడు జీర్ణమైపోయాడు.                          

(డాక్టర్ నండూరి రామకృష్ణమాచార్యులు ఈ సందర్భంగా విశ్లేసిస్తూ ఇలా రాశారు: ఒక రాక్షసుడిని తిని అలా పొట్ట నిమురుకుని, పూర్తిగా జీర్ణించుకుని, గర్రున త్రేన్చిన అగస్త్య మహర్షి జీర్ణశక్తి అనుపమానం. అంత జీర్ణశక్తి తమ బిడ్డకు కూడా వుండాలని తెలుగు నేలలో ప్రతితల్లి తన బిడ్డకు పాలు త్రాపి, గోరు ముద్దలు తినిపించి, పొట్ట నిమురుతూ ‘జీర్ణం-జీర్ణం-వాతాపి జీర్ణం అని అంటుంది).

ఇల్వలుడు అగస్త్య మహర్షి మహిమకు భయపడి కూడా తన మోసం బయట పడకుండా పైకి ఏమీ మాట్లాడలేదు. అగస్త్యుడు కోరిన ధనం ఇచ్చి పంపాడు. బంగారు రథాన్ని కూడా ఇచ్చాడు. అగస్త్యుడు ఆ ధనంతో లోపాముద్ర కోరిక నెరవేర్చాడు. ఆమెకు గర్భాదానం చేసి, ఆమె కోరుకున్నట్లే గుణవంతుడైన కొడుకు పుడుతాడన్నాడు. లోపాముద్రకు ఏడేళ్ల తరువాత దృడస్యుడు అనేవాడు వేదాలను అంతరార్థాలతో వల్లె వేస్తూ జన్మించాడు. అతడికి తేజస్వి (ఇద్మవాహుడు) పుట్టారు. ఆ విధంగా అగస్త్యుడు పుత్ర పౌత్రవంతుడు కావడం వల్ల అతడి పితృదేవతలకు పుణ్యగతులు ఏర్పడ్డాయి.

ఇదిలా వుండగా కాలకేయులు అనే రాక్షసులు సాటిలేని ఆయుధాలు ధరించి దేవతలకు లొంగకుండా పగలంతా సముద్రంలో దాక్కొని రాత్రులు దేవతలమీదికి దండయాత్ర చేస్తుండేవారు. వారింకా చాలా ఆగడాలు చేసేవారు. దేవతలంతా విష్ణుమూర్తిని తమను కాపాడమని ప్రార్థించారు. బలవంతులైన కాలకేయులను సంహరించాలంటే ముందు సముద్రాన్ని ఇంకించి అందులోని సమస్త ప్రాణికోటిని బయటకు రప్పించాలన్నాడు శ్రీహరి. ఆ పని చేయడానికి అగస్త్య మహర్షి ఒక్కడే సమర్ధుడు అని చెప్పాడు. దేవతలంతా అప్పుడు అగస్త్య మహర్షిని వేడుకున్నారు. వింధ్య పర్వతం పెరుగుదలను నివారించిన మహానుభావుడని పొగిడారు. సముద్రంలోని జలాన్నంతా తాగమని ప్రార్థించారు. సరేనన్న అగస్త్యుడు దేవతలంతా చూస్తుండగా ఆ మహా సముద్రజలాలను త్రాగాడు. కాలకేయులు బయటకొచ్చారు. దేవతలు వారిని యుద్ధంలో ఓడించారు.

తిరిగి సముద్రాన్ని నీటితో నింపమన్నారు కాని అది వీలు కాదన్నాడు. చివరకు భగీరథ ప్రయత్నం వల్ల గంగానది భూలోకానికి దిగి వచ్చి సముద్రాన్ని నింపింది.     

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, అరణ్యపర్వం, ద్వితీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

No comments:

Post a Comment