Sunday, April 4, 2021

దూతల మాటలు రావణుడి చెవికేక్కలేదా? : వనం జ్వాలా నరసింహారావు

 దూతల మాటలు రావణుడి చెవికేక్కలేదా?

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆదివారం (04-04-2021) ప్రసారం

శ్రీరాముడు వానర సైన్యంతో సముద్రం ఒడ్డున వున్న సంగతి రావణుడి వేగులవాడు శార్దూలుడు కనిపెట్టాడు. సుగ్రీవుడి సేనను చూసి వేగంగా రాక్షసరాజు దగ్గరికి పోయి, వానరుల, ఎలుగుబంట్ల సేన లంకా పట్టణం మీద పడడానికి వచ్చిందనీ, ఆ సేన పరిమాణం సముద్రంలా పదియోజనాల నేల ఆక్రమించి వుందనీ, రామలక్ష్మణులు సీతాదేవి దగ్గరికి రావడానికి సమీపంలోనే సముద్రం ఒడ్డున వున్నారనీ, వారి సమాచారం వివరంగా సర్వం తెలుసుకోవడానికి దూతలను పంపమనీ, ఈ సమయంలో సామమో, దానమో, భేదమో అవలంభించడం మంచిదనీ చెప్పడంతో, ఆ మాటలకు రావణుడు హెచ్చరికతో తదుపరి కార్యాన్ని ఆలోచించాడు.

         శుకుడు అనే పేరుకలవాడిని పిలిచాడు రావణుడు. వాడిని పోయి సుగ్రీవుడికి తన మాటలుగా ఈ విధంగా చెప్పమన్నాడు. “సుగ్రీవా! నాతో నిష్కారణ కలహం నీకు ధర్మం కాదు. నువ్వు, నేనూ ఇద్దరం బ్రహ్మ మనుమలం. కాబట్టి మనకు భందుత్వం వుంది. అల్పుడైన రాముడితో నీకేం పని? రాముడితో స్నేహం చేయడం వల్ల నీకు కలిగే లాభం లేదు. వదిలిపోతే నీకు కలిగే నష్టం లేదు. నువ్వు నాకు సోదరసమానుడివి. రాముడి భార్యను నేను అపహరిస్తే నీకు కలిగే నష్టం ఏమిటి? ఇది ఆలోచించి నీ వూరికి వెల్లిపో. మనకు విరోధం ఎందుకు? నువ్వు లేకపోతే, సముద్రాన్ని దాటి వానరులు ఇక్కడికి రాలేరు. ఇది నువ్వు ఆలోచించు”.

ఇలా చెప్పిన రాక్షసరాజు ఆజ్ఞానుసారం శుకుడు చిలుకలాగా ఆకాశమార్గాన పోయి, నేలదిగకుండా అక్కడినించే రావణుడు చెప్పిన మాటలను యథాతథంగా సుగ్రీవుడికి చెప్పాడు. ఆ మాటలకు వానరులు కోపించి, ఆకాశానికి ఎగిరిపోయి వాడిని పట్టుకుని, విసిరి నేలపైకి కొట్టారు. నేలమీదన  వాడు కలవరపడి, “రామచంద్రా! నేను దూతను కాబట్టి నన్ను చంపకూడదు. వీరు నన్ను చంపుతున్నారు. వారిని నివారించు” అని రాముడిని ఉద్దేశించి అన్నాడు. వాడి మొర విన్న రామచంద్రమూర్తి, ఆదరంతో వాడిని చంపవద్దని చెప్పడంతో చంపకుండా చెరలో వేశారు. సేతువు కట్టి, వానరులు ఆవలి ఒడ్డుకు చేరినతరువాతే వాడిని వదిలారు.

అప్పుడు సుగ్రీవుడు ఆ దూతను చూసి “రావణుడితో ఇలా చెప్పు. ఎప్పుడూ నీకూ, నాకూ స్నేహభావం లేదు. ఈ కారణాన రాక్షసరాజా! నీమీద దయ తల్చాల్సిన అవసరం లేదు. రామచంద్రమూర్తి నామీద స్నేహభావంతో వున్నాడు. అగ్నిసాక్షిగా స్నేహం చేశాడు. వాలిని చంపి నాకు ఉపకారం చేశాడు. రామచంద్రమూర్తి నీకు పగవాడు. నేనేమో ఆయన మేలు కోరేవాడిని. కాబట్టి నువ్వు నాకూ పగవాడివే. వాలి నాకు పగవాడు కాబట్టి చంపించాను. నిన్నూ అలాగే చంపిస్తాను. నిన్ను నీ జ్ఞాతులతో, హితులతో, చుట్టాలతో, కొడుకులతో ఒక్కడిని కూడా వదలకుండా అందరినీ యుద్ధంలో చంపుతాం. నువ్వు పాతాళంలో దాక్కున్నా, సీతాపతి యుద్ధంలో నీ తల నేలకూలుస్తాడు. ఇంద్రాదులకు కూడా జయించనలవి కాని రామచంద్రమూర్తిని సామాన్యుడని భావించావా? రామచంద్రమూర్తిని నీపాలిటి మృత్యువుగా అనుకో” అని అన్నాడు.

         సేతునిర్మాణ, సేనా స్థాపనాది కార్యక్రమాలు తీరాయి కాబట్టి, శుకుడిని వదిలిపెట్టమని రామచంద్రమూర్తి సుగ్రీవుడికి చెప్పాడు. ఆయన వెంటనే శుకుడిని వెళ్లగొట్టాడు. వాడు భయం-భయంగా బయల్దేరి రావణుడిని సమీపించాడు. తనకు జరిగిన పరాభవాన్ని గురించి చెప్పాడు. శ్రీరాముడు రక్షించక పొతే రానను చంపేవారని కూడా చెప్పాడు. ఇంకా ఇలా అన్నాడు: “రామచంద్రమూర్తి సుగ్రీవుడితో కలిసి సీతాదేవి సమీపానికి రానే వచ్చాడు. అదిగో అక్కడే వున్నాడు. రామచంద్రమూర్తి సముద్రం నీళ్ళలో సేతువు కట్టాడు. సముద్రం దాటి దాని దక్షిణ తీరంలో సేనలతో వచ్చి లంకను ముట్టడి చేశాడు. రాక్షసులను చంపడానికి విల్లు చేతపట్టి సిద్ధంగా వున్నాడు. వానరులు లంక కోటలమీదకు ఎక్కక ముందే సీతను ఇవ్వడమో, యుద్ధం చేయడమో నిర్ణయించు”.

         సీతను మళ్లీ రామచంద్రమూర్తికి అర్పించడమే శ్రేయస్కరమని శుకుడు చెప్పిన మాటలకు కోపం వచ్చింది రావణుడికి. దేవదానవులు గుంపుగా ఒక్కటై యుద్ధంలో తన్నెదిరించినా, రామలక్ష్మణులకు సీతను ఇచ్చేది లేదన్నాడు. రాముడికి తన బలం, వీర్యం, శక్తి, ఏమాత్రం తెలియదు కాబట్టి యుద్ధానికి వస్తున్నాడనీ, దానికే నువ్వు భయపడితే ఎలా అనీ, వేయికన్నుల ఇంద్రుడు వచ్చి ఎదిరించినా, పాశం పట్టుకుని వరుణుడు వచ్చినా, యమదండం చేతబూని యముడే వచ్చినా, ధనాధిపతి కుబేరుడే వచ్చినా, తనకే కీడు చేయలేరని ప్రగల్భాలు ఆడాడు.

         ఇలా శుకుడికి చెప్పిన తరువాత శుక సారణులు అనే తన మంత్రులను చూసి, సముద్రం ఎక్కడ? దానిమీద సేతువు కట్టడం ఏమిటి? అదేమన్నా వాగా? వంకా? సేతు నిర్మాణం నిజమా? అబద్ధమా? అనేది తెలుసుకోవడంతో పాటు, వానర సేన సంఖ్య ఎంతో కూడా తెలవాలనీ, కాబట్టి వారు మారు వేషాలు వేసుకుని ఎవరూ చూడకుండా వానరసేనలోకి పోవాలనీ, పోయి, వానరుల శక్తి ఏమాత్రం? రాముడి, సుగ్రీవుడి మంత్రులెవరు? యుద్ధానికి ముందుగా కాలు దువ్వుతున్న వారెవ్వరు? ఎక్కువ శౌర్యం కల వానరులెవ్వరు? వానరసేన దిగింది ఎక్కడ? సేతువు ఎలా కట్టారు? వానర సేనానాయకుడు ఎవరు? లాంటివన్నీ చక్కగా తెలుసుకుని రమ్మన్నాడు.

         ఇలా రావణుడి ఆజ్ఞానుసారం శుకసారణులు వానరుల వేషాలు ధరించి పోయి వానరసేన చూసి భయపడ్డారు. భయంతో దేహాలు పులకరిస్తుంటే దిక్కు తెలియక వానర సేనను పరికించి చూశారు. లెక్కపెట్టడానికి వశం కాని ఆ వానర సేన కొండ గుహలలో, సముద్ర తీరంలో, ఉద్యానవనాలలో, సేతువు దాటిన వారిని, దాటుతున్నవారిని, వేచి చూస్తున్న వారిని చూసి దాని అంతం, ఆరంభం తెలుసుకోలేక తిరగసాగారు. ఆ సమయంలో, రావణుడు ఎవరినైనా వేగులవారిని పంపుతాడేమోనని అనుమానించి, వారిని కనిపెట్టాలని తిరుగుతున్న విభీషణుడు, శుకసారణులను పట్టుకుని, పెడరెక్కలు విరిచి, వీరు రావణుడి వేగులవారని చెప్తూ, రాముడి ఎదుట నిలబెట్టాడు. శుకసారణులు రావణుడి ఆజ్ఞానుసారం వానరసేన పరిమాణాన్ని తెలుసుకునేందుకు వచ్చామని చెప్పారు. ఇది తాము చేసిన దోషమని, అందుకుగాను తమను చంపదల్చుకుంటే చంపవచ్చని, రక్షించదల్చుకుంటే రక్షించవచ్చని అంటారు. శత్రువు, మిత్రుడు అన్న భేదం లేకుండా అందరి మేలుకోరే శ్రీరాముడు సంతోషంతో ఇలా అన్నాడు.

         “మీరు సమస్త సైన్యాన్ని చూసి వుంటే, మేమున్న విధానాన్ని చక్కగా పరీక్షించితే, రావణాసురుడు మీకు చెప్పిన పనులన్నీ చక్కగా నెరవేర్చినట్లయితే, మీరు వెళ్లిపొండి. మీ ఇష్టప్రకారం ఇంకా చూడాలనుకుంటే చూసి పొండి. ఆ తరువాత విభీషణుడితో వారిని వదలమని చెప్పాడు. శుకసారణుల కట్లు విప్పించాడు. వారు రామచంద్రుడిని “జయ జయ రామచంద్రా” అని పొగిడారు. ఆ తరువాత రావణుడి దగ్గరికి పోయారు. పోయి ఇలా చెప్పారు.

         “రాక్షసరాజా! భయంకర తేజంకల ఆ గొప్ప పరాక్రమవంతుడి గురించి మేమేమని చెప్పగలం? చెప్పడం సాధ్యం కాదు. దిక్పాలకులతో సమానమైన నలుగురు బలశాలులు రామలక్ష్మణ, సుగ్రీవ, విభీషణులు ఒక్కచోట చేరారు. ఈ నలుగురే మన పట్టణాన్ని పాడుతో సహా పీకి నాశనం చేయగల సమర్థులు. మిగతా వానరుల మాట అలా వుంటే, ఒక్క శ్రీరాముడే తన పరాక్రమంతో మన లంకను పొడిచేసి నేలపడేయగలడు. మిగిలిన ముగ్గురు కూడా అవసరం లేదు. రామలక్ష్మణ సుగ్రీవులు రక్షించే వానరసేనను మనుష్యులు, రాక్షసులే కాదు దేవతల గుంపంతా ఇంద్రుడితో సహా జయించలేరు. వానరసైన్యంతో యుద్ధం చేయడానికి దిగడం తగదు. కోపం తగ్గించి రాముడికి సీతను ఇవ్వడమే సరైన పని. దానివల్ల నీకు మేలు కలుగుతుంది”.

జవాబుగా రావణుడు దేవదానవులు కలిసి ఒక్కటిగా వచ్చి తన్ను ఎదిరించినా, లోకాలన్నీ కలిసి వచ్చి తన్ను చంపుతామన్నా, సీతను మళ్లీ ఇవ్వనన్నాడు. ఇలా అంటూ, తాటి చెట్టంత ఎత్తున్న ఆకాశాన్ని అంటుతున్న తన ప్రాసాదాన్ని ఎక్కాడు. అక్కడ నుండి కొండల్లో, అడవుల్లో, సముద్రంలో, వానరులతో నిండిన ప్రదేశాన్ని, అంతంలేని, లెక్కలేని, వానరసేనను చూసి సారణుడితో వానర వీరుల వివరాలు చెప్పమని అడిగాడు. ఆ విషయాలు తెలిసిన సారణుడు రావణుడితో నీలుడు, అంగదుడు, నలుడు, కుముదుడు, రంభుదు, శరభుడు, పనసుడు,  వినతుడు, క్రోధనుడు, హరుడు, గవయుడు, దూమ్రుడు, జాంబవంతుడు, దంభుడు, ప్రమాథి, గవాక్షుడు, కేసరి, శతవలి, గజుడు, గవాక్షుడు, నీలుడు, గవయుడు, మైందుడు, ద్వివిదుడు, సుముఖుడు, అసుముఖుడు, హనుమంతుడు....ఇలా ఒక్కొక్క వానర వీరుల బల పరాక్రమాల గురించీ వివరించాడు. వారంతా లంకను నాశనం చేయడానికి కాదు సమర్థులని చెప్పాడు. ఆ తరువాత రామలక్ష్మణుల గురించి, వారి వీరత్వం గురించీ వివరించాడు సమగ్రంగా.

         శుకుడు ఇంతవరకు వానర సేన వీరులను గురించి చెప్పి ఆ తరువాత వానర సేనా సంఖ్యను వివరించాడు. “రాక్షసరాజా! ఇక సంఖ్యా లక్షణం, వానర సేనా సంఖ్య చెప్తా విను. నూరు లక్షలు ఒక్క కోటి. లక్షకోట్లు ఒక్క శంఖం. లక్ష శంఖాలు ఒక మహాశంఖం. లక్ష మహాశంఖాలు ఒక బృందం. లక్ష బృందాలు ఒక మహాబృందం. లక్ష మహాబృందాలు ఒక పద్మం. లక్ష పద్మాలు ఒక మహాపద్మం. లక్ష మహాపద్మాలు ఒక ఖర్వం. లక్ష ఖర్వాలు ఒక మహాఖర్వం. వేయి మహాఖర్వాలు ఒక సముద్రం. లక్ష సముద్రాలు ఒక ఓఘం. లక్ష ఓఘాలు ఒక మహౌఘం అని గణిత శాస్త్రజ్ఞులు చెప్తారు. ఈ గణితం ప్రకారం వానరసేన సమాఖ్య చెప్తా విను. వేయి కోట్లు, నూరు శంఖాలు, వేయి మహాశంఖాలు, నూరు బృందాలు, ఒక మహాబృందం, వేయి నూర్ల పద్మాలు, వేయి మహాపద్మాలు, నూరు ఖర్వాలు, నూరు సముద్రాలు, నూరు మహౌఘాలు, పదివేల మహౌఘాలు కలిగి పెద్ద సముద్రంలాగా వున్న కపిసేనతో విభీషణుడు తనకు తోడుండగా, మంత్రులతో కలిసి సుగ్రీవుడు నీతో యుద్ధానికి సన్నద్ధంగా వున్నాడు. దేవరా! సుగ్రీవుడు నువ్వు అల్ప ప్రయత్నం చేస్తే వూరికే పోడు. మిక్కిలి బలశాలి. వీర్యం, విక్రమం సమృద్ధిగా కలవాడు. వానర సేనను బాగా తేరిపార చూసి, ఎలా చేస్తే ఓడిపోకుండా శత్రువును గెలుస్తావో అలాంటి ప్రయత్నం చేయి” అన్నాడు.

         శుకుడు ఈ విధంగా చెప్పగా వానర శూరుల సమూహాన్ని, రామచంద్రమూర్తి సమీపంలో వున్న తన తమ్ముడు విభీషణుడి అసమాన బలాన్ని, రాముడికి కుడి భుజమైన లక్ష్మణుడి పరాక్రమాన్ని, సర్వ వానర ప్రభువైన సుగ్రీవుడి శౌర్యాన్ని తలచుకుని భయంతో గుండె ఝల్లుమంది. అది బయటపడకుండా కోపం తెచ్చుకున్నాడు. తెచ్చుకుని, శుకసారణులను చూసి,  తనకు అప్రియమైన మాటలు చెప్పవచ్చునా? ఎందుకు మీ తెలివితేటలు బూడిదైపోయాయి? అని నిందించాడు. “మీలాంటి మూర్ఖులను మంత్రులుగా వుంచుకుని ఇన్నాళ్లు ఎలా రాజ్యం చేసానంటారా? మీలాంటి బుద్ధిమాలిన మంత్రులున్నప్పటికీ దైవ కృపవల్ల రాజ్యం చేస్తున్నాను కాని మీ ఆలోచనాబలం వల్ల మాత్రం కాదు” అని అంటాడు.

ఆ తరువాత శార్దూలాదులను శ్రీరాముడి చర్య కనుగొమ్మని రావణుడు ఆజ్ఞాపించాడు. వారు మారువేషాలు వేసుకుని, సముద్ర తీరానికి చేరారు. అక్కడ వానర సైన్యాన్ని చూసి భయపడి, వెలవెలబోయారు. విభీషణుడు వారిని వేగులుగా గుర్తించి, శార్దూలిడిని పట్టుకుని కొట్టుతుంటే వాడి ఏడుపు ధ్వని విన్న రామచంద్రుడు దయతో వాడిని విడవమని చెప్పాడు. తిరిగి వెనక్కు వచ్చి కపుల చేతుల్లో తానూ పడ్డ బాధలు రావణుడికి చెప్పాడు. కపుల పరాక్రమం గురించీ చెప్పాడు. వాళ్ళను యుద్ధంలో గెలవడం అసాధ్యమనీ, సీతను అప్పగించడమే మేలనీ చెప్పాడు. 

         వారంతా సువేలాద్రిమీద వున్నారనీ, తరువాత చేయాల్సిన పనులేంటో రావణుడే నిర్ణయించుకోవాలనీ అన్నాడు. సీతాదేవిని అప్పగించే సమస్యే లేదని అన్నాడు రావణుడు. యుద్ధానికి సిద్ధం అన్నాడు. (వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

No comments:

Post a Comment