Wednesday, April 21, 2021

తన స్వయంవర వృత్తాంతాన్ని అనసూయకు చెప్పిన సీతాదేవి : వనం జ్వాలా నరసింహారావు

 శ్రీరామనవమి సందర్భంగా

తన స్వయంవర వృత్తాంతాన్ని అనసూయకు చెప్పిన సీతాదేవి

వనం జ్వాలా నరసింహారావు

(80081 37012)

రాముడెప్పుడైతే శివుడి విల్లు విరిచాడో, అప్పుడే అతడు శివుడి కంటే గొప్పవాడైన విష్ణువని జనకుడు గ్రహించాడు. అలాంటి ఆమెకు సాక్షాత్తు లక్ష్మీదేవైన సీతను ఇస్తున్నాననే అర్థమొచ్చే విధంగా వివాహం జరిపించే సమయంలో, 'ఈ సీత' అన్నాడు. సీత నాగటి చాలులో దొరికినప్పటికీ జనకుడు సగర్వంగా, 'నాదుకూతురు', అంటే, తన కూతురని చెప్పాడు. సీతే లక్ష్మీదేవి అయినందువల్ల, విష్ణువు అవతారమైన రాముడి కైంకర్యమే ఆమె స్వరూపం. సృష్టిలో, రక్షణలో, సంహారంలో ఆమె ఆయనకు సర్వకాల సర్వావస్థలందు తోడుగా వుంటుంది. వివాహ లీల కేవలం లోక విడంబనార్థమేనని, ఆయన సొత్తును ఆయనే తీసుకొమ్మని కూడా అర్థం. ఈ వివరాలను సాక్షాత్తూ ఆ మహాతల్లి సీతాదేవే అత్రి మహాముని భార్యైన, పరమ పతివ్రత, అనసూయాదేవికి వివరించింది. వివరాల్లోకి పోతే....  

అరణ్యవాసంలో భాగంగా చిత్రకూటం దగ్గర వున్న శ్రీరాముడికి, భరతుడు వచ్చి దుఃఖపడిన విషయం, తనను అయోధ్యకు వచ్చి రాజ్యా భారాన్ని స్వీకరించమని కోరిన విషయం పదే-పదే గుర్తుకు రాసాగాయి. మనసు అన్యాక్రాంతం అవుతున్నందున ఇక అక్కడ వుండడం వనవాసానికి ఏమాత్రం మంచిది కాదనుకుంటాడు. వెంటనే, సీతారామలక్ష్మణులు ముగ్గురూ బయల్దేరి అత్రి మహామిని ఆశ్రమానికి చేరుకుంటారు. అత్రి తన భార్య, సతీ అనసూయాదేవిని సీతాదేవికి పరిచయం చేశాడు.

         పరిచయం చేస్తూ అత్రి మహాముని సీతాదేవిని చూపిస్తూ అనసూయతో, “ఈ పతివ్రతా శిరోమణి భూదేవి కూతురు. ఈమెను నువ్వు గౌరవించు” అని చెప్పాడు. తరువాత అనసూయాదేవి గొప్పతనాన్ని అత్రి శ్రీరాముడితో ఇలా చెప్పాడు: “నువ్వు నీతల్లిలాగా ఈమెను పూజించు. నీపూజకు ఈమె యోగ్యురాలు. ఈమె సమస్త భూతాల నమస్కారాలకు యోగ్యురాలు. స్త్రీ ధర్మమైన పాతివ్రత్యానికి సంబంధించి ఇతరులకు సాధ్యంకాని కార్యాలు చేయడం వల్ల అసూయపడరానిదని కీర్తి పొందింది. నువ్వు సీతాదేవిని ఈమెకు నమస్కారం చేయమని చెప్పు”. అత్రిమహాముని అలా చెప్పగా శ్రీరామచంద్రమూర్తి సీతాదేవిని చూసి మునీంద్రుడు చెప్పినట్లు అనసూయను దర్శించమని చెప్పి అలా చేస్తే ఆమెకు మేలు కలుగుతుందని అంటాడు.

          భర్త చెప్పినట్లే సీతాదేవి పోయి, తన పేరు చెప్పి నమస్కారం చేసి రెండు చేతులు జోడించి నిలువబడి కుశలం అడిగింది అనసూయను. నిర్మలమైన మనసున్న అనసూయాదేవి సంతోషంతో ధర్మాత్మురాలైన సీతతో, “సీతా! నువ్వెంత పుణ్యచరిత్రవే! పాతివ్రత్యమే గొప్పదిగా భావించి చుట్టాలను, సంపదను, సౌఖ్యాన్ని వదిలి, మహారాజు కోడలినని కాని, మహారాజు కూతురునని కాని లక్ష్యపెట్టకుండా, తండ్రిని యదార్థవాదిని చేయాలన్న ఉద్దేశంతో అడవికి వస్తున్న భర్తతో  వచ్చావు. ఇలాంటి స్త్రీలు కూడా లోకంలో వుంటారా? పతివ్రతైన స్త్రీకి, భర్త ఎలాంటివాడైనా అతడే ఆమె పాలిటి దైవం. మగడి కంటే గొప్ప చుట్టం స్త్రీకి ఎవరూ లేరు. కుల ధర్మం పాటిస్తూ, మంచి పనులు చేసే పతివ్రతా రత్నానికి ఆమె ఇంకేమీ చేయకపోయినా, ధర్మాలన్నీ చేసినవారికి లభించే స్వర్గం లభిస్తుంది” అని చెప్పింది.

         ఆ తరువాత ఇలా అడిగింది అనసూయ సీతను. “నిన్ను రామచంద్రమూర్తి తన పరాక్రమంతో స్వయంవరంలో పెళ్లి చేసుకున్నాడని మాటమాత్రంగా వినడమే కాని, అదెలా జరిగిందో వివరంగా వినలేదు. అ కథ వినాలని వుంది. జరిగినదంతా వివరంగా చెప్పు” అని అనసూయ అడిగింది.

జవాబుగా సీతాదేవి, “అమ్మా! చెప్తా విను. నా తండ్రి జనకుడు క్షాత్ర ధర్మం అంటే ప్రీతికలవాడు. విదేహ దేశానికి రాజు. ఒకనాడు యజ్ఞం చేయడానికి నేల దున్నిస్తుంటే నాగేటి కర్రు తగిలి నేల పెళ్లలు లేచివచ్చి నేను భూమిలోనుండి బయటకు వచ్చా. అప్పుడు ధాన్యం చల్లడానికి పిడికిట్లో గింజలు వుంచుకున్న జనకుడు నన్ను చూసి ఆశ్చర్యపడి తన కన్నకూతురులాగా నన్ను ఆయన తన కుడి తొడమీద కూర్చుండబెట్టుకుని తన కూతురని చెప్పాడు. ఆకాశవాణి కూడా నేను ఆయన కూతురునే అంది. ఆకాశవాణి మాటలకు సంతోషించిన జనకుడు నన్ను తన పెద్ద భార్యకు ఇచ్చాడు. ఆమె నన్ను తన కన్నబిడ్డలాగా చూసుకుంది. పెంచింది. నాకు వివాహయోగ్య దశ రావడం గమనించిన తల్లిదండ్రులు ఆ దిశగా ఆలోచన చేయసాగారు. ఈ కన్య ఇలాంటి గొప్ప గుణాలు కలది కదా! దీనికి తగిన వాడిని, సద్గుణ సంపత్తికలవాడిని, గొప్పవాడిని, ఏవిధంగా భర్తగా సంపాదించగలనని జనకుడు విచార సముద్రంలో మునిగిపోయాడు. తల్లిగర్భంలో పుట్టని సుందరినైన నాకు, దేవకన్యలాంటి నాకు, తగినవాడిని, మన్మథాకారుడిని, సమానుడైన వాడిని సంపాదించాలని వెతికాడు కాని ఎవరూ దొరకలేదు. అప్పుడు స్వయంవరం చాటిస్తే బాగుంటుందని ఆలోచనచేశాడు”.

“ఈ ప్రకారం ఆలోచించి, తాను చేసిన ఒక గొప్ప యజ్ఞంలో వరుణుడు తనకు ఇచ్చిన మనుష్యులు కదిలించ సాధ్యపడని వింటిని, రాజులు కలలో కూడా ఎక్కుపెట్టలేని వింటిని, అక్షయబాణాలను, తాను పిలిపించిన రాజులందరికీ చూపించాడు. ఆ విల్లెక్కుపెట్టిన వాడు తన కూతురుకు భర్త కాగలడని ప్రకటించాడు. అక్కడికి వచ్చిన రాజులు దానిని ఎత్తలేక, చూడగానే భయపడి, దానికి ఒక నమస్కారం చేసి పోయారు. చాలాకాలం ఇలాగే గడిచి పోయింది. రాజకుమారులెవరూ దానిని ఎక్కుపెట్టలేక పోయారు”.

“అప్పుడు విశ్వామిత్రుడు మా తండ్రి చేసే యజ్ఞం చూడడానికి రామలక్ష్మణులను తీసుకొచ్చాడు. మా తండ్రికి, మన్మథులలాగా వున్న సుకుమారులైన వారిద్దరినీ, దశరథరాజ పుత్రులను పరిచయం చేశాడు. చేసి, ఆయన దాచిపెట్టిన వింటిని శ్రీరామచంద్రమూర్తికి చూపించమని అన్నాడు. జనకుడలాగే చేశాడు. విశ్వామిత్రుడి మాట ప్రకారం శ్రీరాముడు వింటిని సమీపించాడు. ఆ వింటిని శ్రీరాముడు అనాయాసంగా ఎక్కుపెట్టి, అల్లెతాడు గట్టిగాపట్టి లాగగా చూసేవారు భయపడేట్లు, పిడుగుపడ్డ ధ్వనితో అది రెండుగా విరిగింది. విల్లు ఎక్కుపెట్టిన, విరిచిన వారికి తన కూతురును ఇచ్చి వివాహం చేస్తానని ప్రతిజ్ఞచేసిన మా తండ్రి తన మాట ప్రకారం శ్రీరామచంద్రమూర్తికి నన్ను కన్యాదానం చేయడానికి జలపాత్ర చేతిలో తీసుకున్నాడు. కాని తమ తండ్రి అభిప్రాయం తెలుసుకోవాలని చెప్పి శ్రీరాముడు దానం తీసుకోలేదు. అప్పుడు మా తండ్రి దశరథ మహారాజు దగ్గరకు దూతలను పంపాడు. మా తండ్రి ఆహ్వానాన్ని ఆదరించి దశరథమహారాజు వచ్చాడు. శ్రీరామచంద్రుడికి నన్ను, నా చెల్లెలు ఊర్మిళను లక్ష్మణుడికి దానం చేశాడు జనకుడు. ఈ విధంగా నేను శ్రీరామచంద్రమూర్తిని వివాహం చేసుకున్నా”.

         సీతాదేవి ఇలా చెప్పగా విన్న అనసూయాదేవి సంతోషించింది. ఆ తరువాత అనసూయకు నమస్కారం పెట్టి శ్రీరామచంద్రమూర్తి దగ్గరకు పోయింది.

         శ్రీరామవతారం వైవస్వత మన్వంతరంలో ఐదవ మహాయుగమైన త్రేతాయుగంలో సంభవించింది. కృతయుగానికి 1728000 సంవత్సరాలు, త్రేతాయుగానికి 1296000 సంవత్సరాలు, ద్వాపరయుగానికి 864000 సంవత్సరాలు, కలియుగానికి 387000 సంవత్సరాలు కలిపి మొత్తం ఒక మహాయుగానికి 4275000 సంవత్సరాలు వుంటాయి. ఇలాంటి వేయి మహాయుగాలు బ్రహ్మకు ఒక పగలు, మరో వేయి మహాయుగాలు ఒక రాత్రి అవుతుంది. ఇవి రెండూ కలిస్తే ఒక రోజవుతుంది. దాన్నే కల్పం అంటారు. 360 కల్పాలు బ్రహ్మకు ఒక సంవత్సరం. 36000 కల్పాలు బ్రహ్మాయువు.  త్రిమూర్తులలో అవతారాలు ఒక్క విష్ణువుకే కాని మిగతా ఇద్దరికీ లేవు. ఆ క్రమంలోనే మనిషి రూపంలో త్రేతాయుగంలో, రామావతారంగా జన్మించాడు.

         శ్రీరాముడి జనన కాలంలో గురువు, చంద్రుడు, కర్కాటక లగ్నంలో వున్నారు. అంటే జన్మ లగ్నం కర్కాటకం కాగా, మేషంలో రవి-బుధులు, తులలో శని, మకరంలో కుజుడు, మీనంలో శుక్రుడు వున్నారు. ఆయన పుట్టిన సంవత్సరం విలంబి. నక్షత్రం పునర్వసువు. ఇది నిర్ధారించడానికి శ్రీమద్రామాయణంలో ఆధారాలు లేవు. శ్రీరంగమహాత్మ్యం అనే గ్రంథంలో భగవంతుడు బ్రహ్మకు చెప్పిన మాటల ఆధారంగా కొంత తెలుస్తున్నది. తాను రఘువంశం వారు పాలించే అయోధ్యకు పోవాలని అనుకుంటున్నాననీ, అక్కడ నాలుగు మహాయుగాలుంటాననీ, ఆ తరువాత కావేరీ తీరానికి పోయి చంద్ర పుష్కరిణీ తీరంలో శయనిస్తాననీ చెప్పాడు బ్రహ్మతో. విష్ణువు ఆజ్ఞానుసారం బ్రహ్మ తాను అర్చిస్తున్న శ్రీరంగధామాన్ని ఇక్ష్వాకు మహారాజుకు ఇచ్చాడు.

         తదనంతరం జరిగిన పరిణామంలో, ఐదవ త్రేతాయుగంలో కొడుకులకై దశరథుడు అశ్వమేధ యాగాన్ని చేశాడు. ఆ యుగంలోనే శ్రీరామ జననం అయింది. జన్మించింది విలంబినామ సంవత్సరం కాబట్టి హేవిలంబిలో అశ్వమేధయాగం, పుత్రకామేష్టి చేశాడు. దుర్ముఖి చైత్రమాసంలో అశ్వం విడిచారు. పునర్వసువు నక్షత్రంలో బుధవారం నాడు శ్రీరామజననం. భరతుడు గురువారం పుష్యా నక్షత్రంలోను, లక్ష్మణ-శత్రుఘ్నులు శుక్రవారం ఆశ్లేషా నక్షత్రంలోనూ జన్మించారు. చైత్ర బహుళ పంచమి నాడు నామకరణం జరిగింది. పరాభవ సంవత్సరంలో తొమ్మిదో ఏట ఉపనయనం జరిగింది. అరణ్యవాసానికి పోయేటప్పుడు శ్రీరాముడికి 25 సంవత్సరాలు కాగా, సీతాదేవికి 18 సంవత్సరాలు. శ్రీరాముడికి 12 ఏళ్ల వయసున్నప్పుడు, సౌమ్యనామ సంవత్సరంలో యాగరక్షణ కొరకు విశ్వామిత్రుడి వెంట అరణ్యాలకు పోయాడు. ఈ విషయం మారీచుడు రావణాసురుడితో సీతాపహరణం ముందర చెప్పినట్లు రామాయణంలో వుంది. దశరథుడు విశ్వామిత్రుడికి చెప్పిన మాటలనే మారీచుడు రావణుడికి చెప్పాడు.

శ్రీరాముడికి 12 సంవత్సరాల వయసున్నప్పుడు, సీతకు ఆరేళ్ళ వయసులో వారి వివాహం జరిగింది. దీనికి దృష్టాంతరంగా విశ్వామిత్రుడి యాగం కాపాడడానికి రామలక్ష్మణులు వెళ్లిన రోజు నుంచి మిథిలా నగరం వెళ్లడం వరకు తీసుకోవచ్చు. సౌమ్యనామ సంవత్సరం మాఖ బహుళంలో శ్రీరామలక్ష్మణులు విశ్వామిత్రుడి వెంట పోయారు. 15 వ నాటి ఉదయం మిథిలా ప్రవేశం చేసి, శివ ధనుర్భంగం చేశాడు. 27 వ రోజున శుక్ల త్రయోదశి శుభ దినం కాబట్టిఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో సీతారాముల కల్యాణం జరిగింది. ఉత్తర ఫల్గుణీ నక్షత్రం శ్రీరాముడి జన్మ నక్షత్రానికి ఆరవది.

అంటే, 27 వ రోజు ఫాల్గున శుద్ధ త్రయోదశి అయితే, అయోధ్య నుండి బయల్దేరిన రోజు మాఘబహుళ విదియ కావాలి. విదియ-హస్తా రోజు ప్రయాణానికి మంచి రోజే. అది శ్రీరాముడికి ధృవతార కూడా అవుతుంది. కాబట్టి ఆ రోజున హస్త పోయిన తరువాత అభిజిల్లగ్నంలో ప్రయాణమై వుండాలి. సీతారాముల కళ్యాణమైన తరువాత, అంటే, బహుళ విదియతో ముగిసి, తదియనాడు జనకుడు బిడ్డలకు అరణాలిచ్సిన తరువాత, చవితినాడు అప్పగింతలై, ఫాల్గుణ బహుళ పంచమి నాడు అయోధ్యకు ప్రయాణమయ్యారు. షష్టి-సప్తముల్లో పరశురాముడి గర్వభంగం అయింది. దశమినాడు అయోధ్య ప్రవేశం జరిగింది. ఆ తరువాత 12 సంవత్సరాలు సుఖసంతోషాలతో గడిచింది.

దుందుభి నామ సంవత్సర చైత్ర శుద్ధ చవితినాడు దశరథుడు, శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలని పౌరులతో-మంత్రులతో ఆలోచన చేసి, పంచమి నాటి ఉదయం పుష్యా నక్షత్రంలో యౌవరాజ్య పట్టాభిషేకం జరిపించాలని నిర్ణయించాడు. చివరకు కైకేయి వల్ల అది విఘ్నమైపోయింది.

(వావిలికొలను సుబ్బారావు-వాసుదాసు గారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

1 comment:

  1. >> కృతయుగానికి 1728000 సంవత్సరాలు, త్రేతాయుగానికి 1296000 సంవత్సరాలు, ద్వాపరయుగానికి 864000 సంవత్సరాలు, కలియుగానికి 387000 సంవత్సరాలు కలిపి మొత్తం ఒక మహాయుగానికి 4275000 సంవత్సరాలు వుంటాయి.

    కలియుగప్రమాణం 4,32,000సంవత్సరాలండీ. మహాయుగం ప్రమాణం 43,20,000 సంవత్సరాలు. వ్యాసంలో సరిచేయ ప్రార్ధన.

    ReplyDelete