Sunday, April 11, 2021

దశరథుడికి పాయసం ఇచ్చిన ప్రాజాపత్య పురుషుడు ..... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-52 : వనం జ్వాలా నరసింహారావు

 దశరథుడికి పాయసం ఇచ్చిన ప్రాజాపత్య పురుషుడు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-52

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (12-04-2021)

తనను ప్రార్థించిన సిద్ధులను-దేవతలను-అమరులందరినీ ఆదర బుద్ధితో-గౌరవంగా, తనకు తెలిసినప్పటికీ, వారిద్వారా విందామన్న భావంతో, రావణుడిని చంపే ఉపాయం చెప్పమని అడుగుతాడు శ్రీమన్నారాయణుడు. తమనా విధంగా పెద్దలను చేసి, గౌరవించి, సలహా అడిగినందుకు, మహాతేజవంతుడు-భగవంతుడు-కార్యం ఏవిధంగానైనా నెరవేర్చగల సమర్థుడు-మహానుభావుడు, అయిన ఆయన ఔదార్యాన్ని, గొప్ప గుణాన్ని, మరీ-మరీ తలచుకుంటూ ఆయనకు మ్రొక్కి, నరుడి ఆకారంలో జన్మించి రావణుడిని చంపమని ఉపాయమిస్తారు.

(దేవతల ప్రార్థన ప్రకారం దశరథ పుత్రుడై వున్నప్పుడు, దైవం లాగా వుండాల్నా-మనుష్యరూపంలో వుండాల్నా అన్న ప్రశ్నను దేవతలనే అడిగాడు నారాయణుడు. అది వారికి ఆయన ఇచ్చిన గౌరవం. వారు చెప్పబోయేది తాను అప్పటికే నిశ్చయించుకున్నప్పటికీ, ఎదుటివారి గౌరవార్థం, వారి మనస్సును పరీక్షించేందుకు, ఆవిధంగా ప్రశ్నించడం రామావతారంలో ఒక విశేష గుణం. ఇదే లక్ష్మణ-భరత-విభీషణుల రక్షా విషయంలో కనిపిస్తుంది. లోకులందరూ ఈవిషయాలు తెలుసుకోవాలి. నారాయణుడు సర్వాంతర్యామి-సర్వాధారుడు. ఇంతటి గొప్పవాడు దేవతల ఇష్టానుసారం చేయడమంటే, ఆశ్రిత పారతంత్ర్య గుణం అర్థమవుతోందిక్కడ. అదేవిధంగా, తమనొక పెద్దను చేసి, అడిగినపుడు, తగిన రీతి తమకు తోచినది తప్పో-ఒప్పో చెప్పకపోతే, ఆదరించినవారిని నిరాకరించినట్లవుతుంది కాబట్టి, తమకు తోచింది చెప్పదలచారు-చెప్పారు)

"అనేక సంవత్సరాలు రావణాసురుడు బ్రహ్మను గురించి ఘోరమైన తపస్సు చేసాడు. తన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన బ్రహ్మను, లోకాలన్నింటినీ బాధపెట్టేందుకు, తనకెవరిచేతిలో మరణం లేకుండా వరంకోరాడుకానీ, మనుష్యులను లక్ష్యపెట్టలేదు. వాడడిగిన వరమిచ్చాడు బ్రహ్మ. రావణుడు వర గర్వంతో అన్నిలోకాలవారిని-ముఖ్యంగా వయసులో వున్న స్త్రీల మాన ప్రాణాలను-పురుషుల ప్రాణాలను నాశనం చేసాడు. వాడు మనిషి చేతులో తప్ప ఇతరులకు చావడు. సామాన్య మానవులెవరు వాడిని చంపలేరు. అందువల్ల నీవే మానవావతారంలో వాడిని చంపాలి" అని చెప్తారు దేవతలందరూ.

దేవతలిచ్చిన సలహాను "సరే" నని అంగీకరించిన మహావిష్ణువు అదృశ్యమయ్యాడు. అదిలా వుండగా మరోవైపు దశరథుడి పుత్రకామేష్ఠి యాగం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. అలా కొనసాగుతుండగా, అగ్నిహోత్రం మధ్యనుండి ప్రాజాపత్య మూర్తి దర్శనమిస్తాడు. ఆయన దర్శనమిస్తున్న సమయంలో అగ్నిహోత్రం నడుమనుండి, తేజస్సొకటి దిక్కులన్నీ వెలుగులందించేటట్లు - చూసేవారికి దిగ్భ్రమ కలిగించేటట్లు - నలుపు,ఎరుపు కలిసిన వస్త్రం ధరించి, రక్త వర్ణం ముఖంతో, దుందుభిలాంటి కంఠీరవం కలిగున్న ఆకారం కనిపించింది. నునుపైన సింహం మెడమీదుండే వెంట్రుకలలాంటి వెంట్రుకలు-ప్రకాశిస్తున్న మీసాలు-శుభ చిహ్నాలు-శుభకరమైన సొమ్ములు-కొండలాంటి ఉన్నతమైన దేహం-మదించిన వ్యాఘ్రం లాంటి పరాక్రమం-సూర్య తేజస్సు-మండుతున్న అగ్ని తేజస్సు-గొప్ప వీర్యం-అధికమైన బలం కలిగి, భుజంమీద దివ్యపరమాన్నం వున్న బంగారు పాత్రతో బయట కొచ్చిన ప్రాజాపత్య మూర్తి దశరథుడితో ఆయన్ను చూడటానికి వచ్చానని అంటాడు.

తననేమి చేయమంటాడో తెలియచేయమని-శలవివ్వమని, దశరథుడు ఆ మహాశక్తిని వేడుకుంటాడు. జవాబుగా: " సంతానం కోరి నీవు యజ్ఞం చేస్తుంటే, దేవతలందరూ సంతోషించి నన్ను పంపిస్తే వచ్చాను. దేవతలచే నిర్మితమైనది-ఇతరులకు లభించనిది-సంతాన కారణమైంది-ఆరోగ్యకరమైంది-మేలుకలిగించేది-నిన్ను ధన్యుడిని చేసేదయిన ఈ పాయసాన్ని తెచ్చాను. దీనిని తీసుకో" మని పుణ్యాత్ముడైన దశరథుడితో అంటాడు ప్రాజాపత్య మూర్తి. దశరథుడు ఆ పాయసాన్ని తనకిష్ఠమైన భార్యలకు-తనకు గల గుణచేష్టాకీర్తులలో తగినవారని తోచిన వారికి, దయతో ఇమ్మని చెప్తాడాయన. దశరథుడు కోరినట్లే కొడుకులు పుట్తారని కూడా చెప్పగా విని సంతోషిస్తాడు. దేవతలు అనుగ్రహించినది-దివ్య పాయసాన్నంతో నిండినదైన బంగారు పాత్రను దశరథుడు తీసుకొని, శిరస్సున ధరించి, ప్రాజాపత్య పురుషుడికి ప్రదక్షిణ చేసి, భక్తితో నమస్కరించాడు.

నిరుపేదకు గొప్ప నిక్షేపం దొరికినట్లు దశరథుడు సంతోషించాడు. దివ్య పురుషుడు అదృశ్యమయ్యాడు. అంతఃపురంలోని దశరథుడి భార్యలు-స్త్రీలందరు, ఈవార్తవిని, చంద్రమండలంలోని ఆకాశ కాంతిలాగా సంతోషించారు. దశరథుడు తన భార్యలుండే చోటికి పోయి (యజ్ఞ శాల వద్దనే వున్న ప్రత్యేక స్థలం) పట్టపు దేవైన కౌసల్యతో సంతోషంతో జరిగిన విషయాన్నంతా చెపుతాడు.

 

No comments:

Post a Comment