గుప్త వంశం (బ్రాహ్మణ రాజులు-12)
(స్వర్గీయ
బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)
వనం
జ్వాలా నరసింహారావు
కుషాణు,
శాతవాహన వంశాలు పతనమైన అనంతరం భారతదేశ చరిత్రలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించిన
రాజవంశం గుప్త వంశం.ఈ వంశీయుల పాలన క్రీస్తుశకం 275 నుండి ప్రారంభమైంది.కాకపోతే ఈ
వంశపు రాజుల అభ్యున్నతి మాత్రం క్రీస్తుశకం 320 నుండి ఆరంభమైంది. శక రాజులు, క్షహరాట వంశీయులు భారతావని పశ్చిమ భాగంలోను, ఉత్తర భాగంలోనూ,
చిన్న-చిన్న రాజ్యాలను స్థాపించుకుని పాలిస్తూ ప్రబల శక్తి సమన్వితులై వున్న సమయంలో
గుప్త వంశీయుల పాలన మొదలైంది. గుప్త రాజుల పరిపాలనను స్వర్ణయుగ పాలనగా
పరిగణింపబడుతున్నది. భారతీయ సంస్కృతీ వికాసానికి ఈ వంశీయులు దోహద పడ్డారు. భారత
జాతి ప్రపంచంలో ఉన్నత సంస్కారంగల జాతిగా గుప్తుల కాలంలో ప్రసిద్ధికెక్కింది.
పదమూడుమంది గుప్త వంశపు రాజులు క్రీస్తుశకం 275 నుండి క్రీస్తుశకం 600 వరకు భారత
భూభాగాన్ని ఏలారు. ఈ వంశీయులలో ప్రథముడు శ్రీగుప్తుడు.
గుప్త వంశ చక్రవర్తులు బ్రాహ్మణులు.
గుప్త వంశానికి చెందిన రెండవ చంద్రగుప్త సార్వభౌముడి కూతురు ప్రభావతీ గుప్త వాకాటక
ప్రభువైన రెండవ రుద్రసేనుడిని వివాహం చేసుకున్నది. వాకాటకులు బ్రాహ్మణులు. గుప్త, వాకాటక రాజ వంశాలకు చెందిన ధారణ, విష్ణువృద్ధ
గోత్రాలు బ్రాహ్మణులలో సుప్రసిద్ధమైన అగస్త్య, భారద్వాజ
గోత్రాంతర్గతాలు. గుప్త యుగానికి చెందిన రాజన్యులు బ్రాహ్మణులైనప్పటికీ, వారు తమ పేరు చివర పితృ వంశ నామాలనే
నిలుపుకున్నారు.
గుప్త వంశ స్థాపకుడు శ్రీగుప్తుడు. ఇతడి
పూర్వీకులు శాతవాహన నరేంద్రులకు, కుషాణు వంశపు
రాజులకు విదేయ సామంతులుగా వుండి పాటలీపుత్ర ఉత్తర పరిసర ప్రాంతాలను పాలించారు.
విదేశీయులైన శక, యవన, పహ్లవ, కుషాణు రాజ
వంశీయులు ప్రజా కంటకులుగా మారిన సమయంలో హైందవ మతాన్ని, హిందువుల ఆచార వ్యవహారాలను, సంస్కృతీ సభ్యతలను
ఒక శక్తియుతమైన రాజ్యాన్ని స్థాపించడం ద్వారా పూర్తిచేసిన ఘనత గుప్త వంశానికి
దక్కింది. శ్రీగుప్తుడు చిన్న రాజ్యాన్ని స్థాపించుకుని, చుట్టుపక్కల వున్న చిన్న సామంత రాజ్యాలను జయించి, తన ఆధిపత్యాన్ని నెలకొల్పాడు. మౌర్య, శాతవాహన సామ్రాజ్యాల నాటి ప్రాభవాన్ని
పునరుద్ధరించడానికి ఆవిర్భవించిన రాజ వంశం గుప్త వంశం. శ్రీగుప్తుడు యుద్ధ
విద్యలలో ఆరితేరినవాడు. అసహాయశూరుడు. గుప్త రాజ్యాన్ని అతి వైభవంగా పాలించాడు.
పరమత సహనం కల ఈ రాజు అనేక దేవాలయాలను నిర్మించాడు. పాటలీపుత్ర నగరాన్ని జయించి, దానిని తన రాజధానిగా చేసుకుని, చుట్టుపక్కల వున్న రాజ్యాలను జయించాడు. ఇతడు
సుమారు 25 సంవత్సరాలు (క్రీస్తుశకం 275-3000) పాలించాడు.
శ్రీగుప్తుడు మరణించిన తరువాత అతడి
కుమారుడు ఘటోత్కచుడు మగథ సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతడు గుప్త సామ్రాజ్యాన్ని
విస్తృత పర్చాడు. ఇతడు అనేక సంస్కరణలను ప్రవేశ పెట్టి ప్రజాభిమానాన్ని
చూరగొన్నాడు. పాటలీపుత్ర మహానగరాన్ని తీర్చిదిద్దిన ఘనుడు. ఇతడు 20 సంవత్సరాలు
(క్రీస్తుశకం 300-320) పాలించాడు.
ఘటోత్కచుడి మరణానంతరం అతడి కుమారుడు మొదటి చంద్రగుప్తుడు మగథ రాజ్య
సింహాసనం అధిష్టించాడు. ఇతడు గొప్ప విజేతగా,
అరివీరభయంకరుడిగా కీర్తి గాంచాడు. లిచ్చవీ రాజవంశీయులతో సంబంధ బాంధవ్యాలను
ఏర్పరచుకున్నాడు. తనమీద దండెత్తిన లిచ్చవీ వంశీయులు ఇతడి పరాక్రమాన్ని చూసి సంధి
చేసుకున్నారు. వారి రాజ్యాలన్నీ మగథ సామంత రాజ్యాలుగా వుండడానికి అంగీకరించారు.
చంద్రగుప్తుడు రాజ్యానికి వచ్చిన క్రీస్తుశకం 320 నుండి గుప్త శకం ప్రారంభమైంది. ఇతడు
క్రీస్తుశకం 326 వరకు 6 సంవత్సరాలు పాలించాడు. గుప్తరాజ్యాన్ని ఉన్నత స్థితికి
తీసుకు రావడానికి కృషి చేసిన మహారాజుగా కీర్తి గాంచాడు.
మొదటి చంద్రగుప్తుడి అనంతరం అతడి కుమారుడు సముద్రగుప్తుడు మగథ
సామ్రాజ్యాధిపతి అయ్యాడి. సముద్రగుప్తుడు గుప్త రాజులలో గొప్ప విజేతగా కీర్తిని
పొందినవాడు. అసాదారణ ప్రజ్ఞాపాటవాలు వున్నవాడు. రాజకీయ పరిజ్ఞాని. శక్తిమంతుడు. యుద్ధవిద్యా
విశారదుడు. సంగీత సాహిత్యాలను క్షుణ్ణంగా అభ్యసించాడు. అనితర సాధ్యమైన దండయాత్రలు
నిర్వహించి, అనేకమంది
రాజులను ఓడించిన మహావీరుడు. ప్రపంచ విజేతలలో ఒకడు. పాటలీపుత్రనగరాన్ని
అన్నివిధాలుగా అభివృద్ధి పరచాడు. మగథ సామ్రాజ్యాన్ని క్రీస్తుశకం 326 నుండి
క్రీస్తుశకం 375 వరకు సుమారు 50 సంవత్సరాలు అతి వైభవంగా పాలించాడు. అనేక
దండయాత్రలు (ఉత్తర, దక్షిణ భారత)
చేశాడు. విశాల సామ్రాజ్యంగా మగథ రాజ్యాన్ని స్థాపించాడు. సముద్రగుప్తుడు
చక్రవర్తి. భారతదేశం విచ్చిన్నమై అదఃపతనమవుతున్న సమయంలో భారతజాతిని
ఉద్ధరించడానికి, దేశ సమగ్రతను కాపాడడానికి, భారత జాతి సంస్కృతీ సభ్యతలను, ఆచార వ్యవహారాలను పరిరక్షించడానికి దండయాత్రలు
చేసి మహాస్మారాజ్య నిర్మాణం చేసిన ఘనుడు.
సముద్రగుప్తుడి మరణం తరువాత అతడి జ్యేష్ట కుమారుడు రామగుప్తుడు
మగథరాజ్య పీఠాన్ని క్రీస్తుశకం 375 లో అలంకరించాడు. అతడు పిరికివాడు. రాజ్యపాలనా
విషయ పరిజ్ఞాని కాదు. శకరాజుల ప్రాబల్యానికి లోబడినవాడు. అతడెక్కువ రోజులు
పాలించలేదు. క్రీస్తుశకం 375 లోనే సముద్రగుప్తుడి రెండవ కుమారుడు రెండవ
చంద్రగుప్తుడు (చంద్రగుప్త విక్రమాదిత్యుడు) మగథరాజ్య సింహాసనం అధిష్టించాడు.
భారతదేశ చరిత్రలో అసలు సిసలు స్వర్ణయుగం చంద్రగుప్తుడి కాలంలోనే అని చరిత్రకారులు
అంటారు. చంద్రగుప్తుడు విద్యావైదుష్యాలు కలవాడు. ధర్మశాస్త్రజ్ఞుడు. వీరాధివీరుడు.
చంద్రగుప్తుడు కాశ్మీర దేశాన్ని జయించాడు. ఇతడు బలవంతులైన రాజులతో సంబంధ
బాంధవ్యాలు ఏర్పరచుకుని తన రాజనీతిజ్ఞతను ప్రకటించుకున్నాడు. ఇతడు మగథ రాజ్యాన్ని
38 సంవత్సరాలు (క్రీస్తుశకం 375-413) పాలించాడు.
చంద్రగుప్త విక్రమాదిత్యుడి రెండవ రాణి ద్రువాదేవికి జన్మించిన మొదటి
కుమార గుప్తుడు యువరాజుగా వుండి తండ్రి మరణానంతరం గుప్త సామ్రాజ్యాధినేత అయ్యాడు.
తాత, తండ్రులు
ఆర్జించి ఇచ్చిన సామ్రాజ్యాన్ని అన్యాక్రాంతం కాకుండా మొదటి కుమారగుప్తుడు జీవిత
చరమ దశ దాకా పాలించాడు. సముద్రగుప్తుడి లాగానే ఇతడు అశ్వమేధ యాగం చేశాడు.
కుమారగుప్తుడి అవసాన దశలో పుష్యమిత్ర జాతులవారు మగథ రాజ్యం మీద దండెత్తారు. మగథ
సైన్యం ఓటమి చవి చూసింది. ఓడిపోయే సమయంలో ఆ ఆటవిక సైన్యాన్ని కుమారగుప్తుడి
కుమారుడు, యువరాజైన స్కందగుప్తుడు ఎదిరించి పోరాడి వారిమీద విజయం సాధించాడు. ఆ
విధంగా గుప్త వంశీయుల గౌరవాన్ని కాపాడాడు. కుమారగుప్తుడు విశాల మగథ సామ్రాజ్యాన్ని
42 సంవత్సరాలు (క్రీస్తుశకం 413-455) పాలించాడు.
మొదటి కుమారగుప్తుడి మరణానంతరం అతని కుమారుడు స్కందగుప్తుడు
రాజయ్యాడు. స్కందగుప్తుడు సమర వ్యూహ రచనా నిపుణుడు. స్కందగుప్తుడి పాలనారంభ కాలంలో
అతడు హూణుల మీద సాధించిన విజయం దేశంలో శాంతి భద్రతలు నెలకొల్పడానికి తోడ్పడింది.
కాని, క్రీస్తుశకం
465 లో హూణుల దండయాత్రలు తిరిగి మొదలయ్యాయి. గుప్తసామ్రాజ్యంలో అనేక భూభాగాలను
జయించారు వారు. మగథ సైన్యం హూణులను ఎదిరించి ఓడిపోయింది. రాజ్య భాగాలను హూణుల పరం
చేయాల్సి వచ్చింది. ఈ యుద్ధం వల్ల గుప్త సామ్రాజ్యం ఆర్థికంగా క్షీణించింది.
స్కందగుప్తుడి సవతి సోదరుడు పూరుగుప్తుడు తిరుగుబాటు చేశాడు. ఇంతలో హూణులతో జరిగిన
యుద్ధంలో స్కందగుప్తుడు మరణించాడు. ఇతడి పాలనాకాలం 18 సంవత్సరాలు (క్రీస్తుశకం 455-473).
స్కందగుప్తుడి తరువాత పూరుగుప్తుడు గుప్త సామ్రాజ్యాధిపతి అయ్యాడు. ఇతడు
మూడు సంవత్సరాలు మాత్రమే (క్రీస్తుశకం 473-476) పాలించగలిగాడు. వాస్తవానికి
స్కందగుప్తుడి తరువాత గుప్తరాజుల చరిత్ర సమగ్రంగా లేదు. పూరుగుప్తుడి కాలం నుండి
గుప్తవంశం రెండు శాఖలుగా చీలిందని కొందరు చారిత్రకారులు అంటారు కాని అది వాస్తవం
కాదు. పూరుగుప్తుడి కుమారుడు బుధగుప్తుడు తండ్రి తరువాత రాజయ్యాడు. ఇతడు సుమారు 19
సంవత్సరాలు (క్రీస్తుశకం 476-495) రాజ్యం ఏలాడు. బుధగుప్తుడు నామ మాత్రపు రాజు
మాత్రమే. బుధగుప్తుడి తరువాత వైశ్యగుప్తుడు, భానుగుప్తుడు నరసింహగుప్త
బాలాదిత్యుడు పాలించారు.
ఆ తరువాత మిహిరకులుడు, మూడవ
కుమారగుప్తుడు, యశోధర్మ
విక్రమాదిత్యుడు, మాతృగుప్తుడు,
ప్రవరసేనుడు రాజులయ్యారు. మూడవ కుమారగుప్తుడి తనయుడు దామోదరగుప్తుడు రాజ్యానికి
వచ్చిన కొద్ది కాలానికే మౌఖరి ఈశానవర్మ సంతతివారితో సంభవించిన యుద్ధంలో మరణించాడు.
ఇంతటితో గుప్తవంశం సమూలంగా నిర్మూలించబడింది.