Saturday, September 25, 2021

ధౌమ్యుడు చెప్పిన సామాన్య సేవానియమావాలి ..... ఆస్వాదన-39 : వనం జ్వాలా నరసింహారావు

 ధౌమ్యుడు చెప్పిన సామాన్య సేవానియమావాలి

ఆస్వాదన-39

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం సంచిక (26-09-2021)

అరణ్యవాసం అనంతరం అజ్ఞాతవాసాన్ని విరాటరాజు ఏలికలో వున్న మత్స్యదేశంలో గడపాలని నిర్ణయించిన పాండవాగ్రజుడు ధర్మరాజు, తమ తదుపరి కర్తవ్యం నిశ్చయించాడు. తన వెంట వచ్చినవారందరినీ వెళ్లిపొమ్మన్నాడు. తమ వివరాలు ఏవీ, ఎవరికీ చెప్పవద్దని అన్నాడు. అగ్నిహోత్ర రక్షణకు పురోహితుడైన ధౌమ్యుడిని నియోగించాడు. అప్పుడు ధౌమ్యుడు పాండవులకు చెప్పిన సేవాధర్మాలు, బహుశా నాటి నుండి నేటి వరకు ఒకరి దగ్గర కొలువు (ఉద్యోగం) చేసే ఎవరికైనా ఆచరణ యోగ్యాలే. వాటిని అందరూ విధిగా తెలుసుకోవాల్సిందే, ఆచరణలో పెట్టాల్సిందే!!! అలా చేస్తే, కొలువు చేస్తున్న ప్రతివారికీ సర్వదా శ్రేయస్కరం. ధౌమ్యుడి మాటల్లోనే ఆ వివరాలు....

   “రాజులను (ఆధునిక యజమాని, లేదా బాస్) సేవించి జీవించేవాడు చాలా జాగ్రత్తగా వుండాలి. తగిన పద్ధతిలో సభలో (పని చేసే చోటులో) అడుగు పెట్టాలి. తన స్థానానికి తగిన ఆసనంలో కూర్చోవాలి. తన వేషధారణ, ఆకారం వికృతంగా వుండకూడదు. సమయం, సందర్భం తెలుసుకుని మసలుకోవాలి. అలా చేస్తే రాజుకు (యజమాని లేదా బాస్) గౌరవపాత్రుడు అవుతాడు. ‘నేను రాజు కొలువులో వున్నాను, రాజుతో చనువుగా వున్నాను, నాకేమిటి’ అని మర్యాదను అతిక్రమించ కూడదు. రాజుగారి ఇంటికన్నా అందంగా ఇల్లు కట్టుకోకూడదు. సేవకులు రాజు కంటే ఏ విషయంలోనూ అధికులుగా వుండకూడదు. రాజు (బాస్) తో సన్నిహితంగా ఉండడంలో తప్పులేదు కాని, రాజుగారి దగ్గర వుండే చాలామందికి కష్టం కలిగించే పనుల్లో మాత్రం జోక్యం చేసుకోకూడదు. అలా చేస్తే సేవకుడి (ఉద్యోగి) శక్తి బహిర్గతం కావచ్చును కాని, ఆ తరువాత హాని కలగడం మాత్రం తధ్యం”.

“రాజు దగ్గర మౌనంగా వుండకూడదు. అలా అని చెప్పి, పదిమందితో ఆర్భాటంగా మాట్లాడడం మంచిది కాదు. తనకు దగ్గరి వారైన ఇతరులతో కలిసి తాను రాజుతో మాట్లాడడం ఉత్తమం. రాజుగారి కొలువులో (ఆధునిక పరిభాషలో, యజమాని కార్యాలయంలో) రాజుకు మరీ ఎట్ట ఎదురుగా వుండకూడదు. అలాగని, మరీ వెనుకగా కూర్చోకూడదు. ఏదో ఒక పక్కన నిలబడి (వీలున్నంత సేపు) సేవించాలి. రాజు ముఖం మీదనే దృష్టి సారించి సభలో మెలగాలి. కార్యాలయంలో మాటలు ఎప్పటికీ, ఎక్కడా బయట పెట్టకూడదు. బయట ఎక్కడైనా రాజుకు సంబంధించిన మాటలు వింటే, అవి వినదగినవైతేనే రాజుకు చెప్పాలి. చెప్పేటప్పుడు సేవకుడు కొంత విచక్షణ చూపాలి. విన్న మాటల్లో నిజానిజాలు తెల్సుకోవాలి. రాజుకు అనవసరమైన విషయం అసలే చెప్పరాదు. రాజుకు అప్రియమైన విషయం ఎప్పుడూ చెప్పకూడదు”.

“రాజు అనుగ్రహిస్తేనే ఆసనాలు ఎక్కాలి (కుర్చీమీద కూర్చోవాలి). అలాగే వాహనాలు కూడా. రాజు అనుగ్రహించకుండా, రాజానుగ్రహం లేకుండా, శ్రేష్టమైన ఆసనాలు, పెద్ద పెద్ద వాహనాలు తమంతట తాము అధిరోహించడం తప్పు. రాజు (బాస్) తనను గౌరవించాడని ఉబ్బిపోకూడదు. అవమానించాడని కుంగిపోకూడదు. ఆ రెంటినీ లెక్కించకుండా ఎప్పటిలాగే రాజు దగ్గర పనిచేస్తే సేవకులకు మంచి జరుగుతుంది. ఆపదలు తొలగిపోతాయి. రాజు ఎవరినైనా రక్షించాలని కాని, శిక్షించాలని కాని నిర్ణయిస్తే, అ అవిషయాలు సేవకుడికి తెల్సినా, అవి అమలు కాకముందే బయట పెట్టకూడదు. రాజుకు (బాస్) దగ్గరగా మెలిగే ఏనుగుతో కాని, దోమతో కాని, వైరం కలిగే విధంగా ప్రవర్తించ కూడదు”.

ఇలా ఎన్నో విషయాలను చెప్పాడు ధౌమ్యుడు పాండవులకు.

“రాబోయే హితాన్ని సూచించేవాడు పురోహితుడు. అజ్ఞాతవాసంలో ప్రభువు దగ్గర వుండబోతున్న పాండవులకు ‘సామాన్య నియమావళిని’ ధౌమ్యుడు బోధించాడు. వాటిని ధారణలో వుంచుకొమ్మని హితవు పలికాడు. తిక్కన రచన తత్కాలోచిత వృత్తి ధర్మ ప్రభోధ ప్రవృత్తికి ప్రాధాన్యం ఇచ్చింది”.

ధౌమ్యుడు చెప్పిన సామాన్య సేవానియమావాలి ఎల్లకాలాలకు ఆచరణీయం.    

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, విరాటపర్వం, ప్రథమాశ్వాసం  

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

        

 

No comments:

Post a Comment