కాణ్వ వంశం (బ్రాహ్మణ రాజులు-2)
(స్వర్గీయ
బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)
వనం
జ్వాలా నరసింహారావు
శుంగ వంశపు చివరి రాజు దేవభూతి. అతడి మంత్రి వాసుదేవుడు. అతడికి రాజ్య
కాంక్ష ఎక్కువ. భోగలాలసుడైన దేవభూతిని, వాసుదేవుడు అంతఃపుర దాసీ పుత్రికతో హత్య
చేయించాడు. తరువాత సింహాసనాన్ని ఆక్రమించుకొని కాణ్వ వంశాన్ని స్థాపించాడు.
వాసుదేవుడు కణ్వ మహర్షి వంశానికి చెందిన వాడు. కణ్వ మహర్షి వల్ల
వాసుదేవ మంత్రి గోత్రం కాణ్వ గోత్రంగానూ, వంశం కాణ్వాయన వంశం గానూ
ప్రసిద్ధికెక్కింది. కాణ్వ వంశానికి చెందిన నలుగురు రాజులు మగధ సామ్రాజ్యాన్ని
పాలించారు. వారిలో వాసుదేవుడు 9 సంవత్సరాలు, భూమిపుత్రుడు
14 సంవత్సరాలు, నారాయణ 12
సంవత్సరాలు, సుశర్మ 10
సంవత్సరాలు పాలించారు.
ఈ రాజులంతా అనేక మంది మాండలిక రాజులను, అన్య
రాజవంశీయులను తమ సామంతులుగా చేసుకొని ధర్మబద్ధంగా పాలన చేసినట్లు చరిత్ర
తెలియచేస్తున్నది. కొంత కాలానికి ఆంధ్ర శాతవాహన వంశ ప్రభువులు వీరిని జయించి మగధ
రాజ్యాన్ని ఆక్రమించి పాలించారు. ఆంధ్ర శాతవాహనుల రాజు కాణ్వాయన వంశం వారినే
కాకుండా శుంగ వంశానికి చెందిన రాజులందరినీ ఓడించి రాజ్యాన్ని ఆక్రమించినట్లు
చారిత్రిక ఆధారాలున్నాయి. శుంగ వంశపు రాకుమారులు బలహీనులగుటవలన కాణ్వాయన వంశీయులు
వారిని నామ మాత్రపు ప్రభువులుగా లెక్కించి, రాజ్య పాలనా
వ్యవహారాలను చేజిక్కించుకొని, చివరికా
వంశాన్ని నిర్మూలించారు.
శుంగ వంశపు 112 సంవత్సరాల రాజ్యపాలనలో చివరి 45
సంవత్సరాలు కాణ్వ వంశీయుల పాలన ఇమిడి వున్నది. శుంగ వంశపు రాజులలో చివరి వారు నామ
మాత్రపు ప్రభువులైనందున కాణ్వ వంశపు అమాత్యులు సమస్త పాలనాధికారం కలిగి వుండేవారు.
కాణ్వ వంశపు మొదటి రాజైన వాసుదేవుడి కాలంలో శుంగ వంశీయులు విదిశ రాజ్యాన్ని
చిన్న-చిన్న భాగాలుగా చేసి పాలించేవారు. కాణ్వ వంశీయులు శుంగ వంశీయుల చిన్నచిన్న
రాజ్యాల జోలికి పోలేదు. శుంగ వంశ పాలనానంతరం కాణ్వాయనులు క్రీస్తుపూర్వం 76 నుండి, క్రీస్తుపూర్వం 30 వరకు 45 సంవత్సరాలు మగధ
రాజ్యాన్ని పాలించారు.
కాణ్వాయన వంశీయుల తరువాత క్రీస్తు శకం మొదటి, రెండు శతాబ్దాలు భారతదేశాన్ని శాతవాహనులే
చక్రవర్తులుగా పరిగణించబడ్డారు. వారు అజేయులై అనేక రాజవంశాలను రూపుమాపి, మగధ సామ్రాజ్యాన్ని జయించి, సువిశాల
భారత భూభాగాన్ని పాలించారు. కాణ్వ వంశం అంతరించిన తరువాత గుప్త సామ్రాజ్య
స్థాపన వరకు మగధ రాజ్య చరిత్ర అనిశ్చితంగా వున్నది. ఆ సమయంలోనే శాతవాహనులు విజృంభించి మగధను ఆక్రమించి భారతదేశ
చక్రవర్తులయ్యారు. శాతవాహన చక్రవర్తులలో గౌతమీపుత్ర శాతకర్ణి అమితమైన బలపరాక్రమ
సంపన్నుడు.
No comments:
Post a Comment