శాలంకాయన వంశం (బ్రాహ్మణ రాజులు-7)
(స్వర్గీయ
బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)
వనం
జ్వాలా నరసింహారావు
ఆంధ్రదేశాన్ని
శాతవాహనుల అనంతరం పాలించిన రాజ వంశాలలో శాలంకాయన వంశం పేర్కొనదగినది. ఈ వంశీయులు
గోత్ర నామాన్నే వంశ నామంగా ధరించారు. శాలంకాయనుడు వేదర్షి. విశ్వామిత్ర సంతతి
వాడు. ఈ వంశీయుల నామాంత్యంలో వర్మ పదం వుండడం వల్ల వీరు బృహత్పలాయన, ఆనంద గోత్రిక, కదంబ, విష్ణుకుండిన, పల్లవ
రాజన్యుల లాగా బ్రాహ్మణులు. శాలంకాయనులు ప్రాచీనాంధ్ర గణాలలోని వారు. శాలంకాయన
అంటే నంది అని అర్థం. వీరిది వృషభ లాంఛనం. శాలంకాయన రాజులు వరుసగా, విజయదేవ వర్మ, హస్తి
వర్మ, నంది వర్మ, చండ వర్మ, విజయనంది వర్మ, విజయస్కంద వర్మలు. శాలంకాయనులు క్రీస్తుశకం 300
నుండి 440 వరకు పాలించారు.
ఆంధ్రదేశ ప్రాక్తీర ప్రాంతాన్ని
ఆక్రమించి వేంగీ నగరం రాజధానిగా శాలంకాయన వంశీయులు పాలించారు. వీరు శాతవాహనుల
సామంతులు. వీరు కృష్ణా నదీ పరీవాహక ప్రాంత పాలకులుగా నియమించబడి, శాతవాహనుల తరువాత ఇక్ష్వాకుల సామంతులై, స్వతంత్రులై, బృహత్పలాయన
జయవర్మ మరణానంతరం రాజ్యాన్ని విస్తృతపరచుకున్నారు.
శాలంకాయన రాజ్య స్థాపకుడు విజయదేవ వర్మ.
ఇతడు క్రీస్తుశకం 300 నుండి క్రీస్తుశకం 335 వరకు శాలంకాయన రాజ్యాన్ని పాలించాడు.
ఇతడు ఇక్ష్వాకుల రాజ్య పతనానంతరం పల్లవులను ఎదిరించి, బృహత్పలాయన జయవర్మ మరణానంతరం వేంగిని ఆక్రమించి, స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. ఆంధ్రదేశం
పల్లవాక్రాంతం కాకుండా తెలుగువారి స్వాతంత్ర్య పరిరక్షణ కొరకు ఇతడు శాలంకాయన
వంశాన్ని స్థాపించాడు. ఇతడు అసహాయశూరుడు. అపరిమిత బలపరాక్రమ సంపన్నుడు.
విజయదేవ వర్మ తరువాత హస్తి వర్మ
సింహాసనాన్ని అధిష్టించి సుమారు 15 సంవత్సరాలు (క్రీస్తుశకం 335-350) శాలంకాయన
రాజ్యాన్ని పాలించాడు. ఇతడు వేంగి చుట్టుపక్కల వున్న అనేక సామంత రాజ్యాలను గెలిచి
శాలంకాయన రాజ్యాన్ని విస్తరించాడు. హస్తి వర్మ అనంతరం ఆయన కుమారుడు నందివర్మ రాజై
సుమారు 30 సంవత్సరాలు (క్రీస్తుశకం 350-380) పాలించాడు. ఇతడు పరాక్రమవంతుడు.
సముద్రగుప్తుడి దండయాత్ర నేపధ్యంలో సామంతుల తిరుగుబాటును అణచి, కృష్ణా నదికి దక్షిణాన వున్న భూభాగాలను
ఆక్రమించి, రాజ్య విస్తరణ
చేశాడు. ఇతడు ధర్మ చింతన కలవాడు.
నందివర్మ సోదరుడు దేవవర్మ ఆ తరువాత రాజ్య
పీఠాన్ని అలంకరించాడు. సుమారు 15 సంవత్సరాలు (క్రీస్తుశకం 380-395) పాలించాడు. ఇతడు
అనేక యుద్ధాలలో విజయం సాధించి అశ్వమేధ యాగం చేశాడు. ఇతడి పాలనాకాలంలో అన్నగారి
కుమారుడు, యువరాజుగా వున్న అచండ వర్మతో యుద్ధాలు
చేయాల్సి వచ్చింది. ఈ జ్ఞాతుల పోరాటాన్ని చూసి సామంతులు స్వతంత్రులయ్యే ప్రయత్నం
చేశారు. ఈ పరిస్థితులలో పినతండ్రి మీద యుద్ధం చేసి అచండవర్మ విజయం సాధించి రాజ్య
పీఠాన్ని ఆక్రమించాడు. అచండవర్మ పాలన కొద్ది కాలం (క్రీస్తుశకం 395-398) మాత్రమే
కొనసాగింది. అచండవర్మ సోదరుడు రెండవ హస్తివర్మ జాజ్ పుర ప్రాంతంలో రాజ ప్రతినిధిగా
వుండి స్వాతంత్ర్యాన్ని ప్రకటించి శాలంకాయన భూభాగాలను ఆక్రమించి పాలించసాగాడు.
హస్తివర్మ పాలనా కాలం క్రీస్తుశకం 395-405.
హస్తివర్మ కాలంలోనే అచండవర్మ రెండవ
కుమారుడు విజయనంది వర్మ పినతండ్రితో కలహిస్తూ, రాజ్యాన్ని
ఆక్రమించుకునే ప్రయత్నాలు చేశాడు. ఫలితంగా శాలంకాయన రాజ్యం రెండుగా చీలింది.
విజయనంది వర్మ వేంగి ప్రాంతాన్ని ఏలుతుండగా విజయస్కంద వర్మ తూర్పు తీర ప్రాంతాన్ని
ఆక్రమించి జాజ పురం రాజధానిగా పాలించ సాగాడు. నందివర్మ విజయస్కంద వర్మతో చేసిన
యుద్ధాలలో తాత్కాలిక విజయాలను సాధించినప్పటికీ, అన్య రాజ
వంశీయులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ రాజన్యులు శాలంకాయన రాజ్య భాగాలను
ఆక్రమించారు. విజయనంది వర్మ పరమ భాగవతోత్తముడు. ఇతడి పాలనా కాలం క్రీస్తుశకం
405-415.
రెండవ హస్తివర్మ కొడుకైన విజయస్కంద వర్మ
తండ్రి అనంతరం రాజ్యాన్ని సాధించడానికి రెండవ విజయనంది వర్మను ఎదుర్కోవాల్సి
వచ్చింది. విజయస్కంద వర్మ విష్ణుకుండినుల సామంతుడిగా కొంతకాలం పాలించాడు. విష్ణుకుండినులు
సర్వాంధ్ర భూభాగాలనే కాకుండా యావత్ దక్షిణా పథాన్ని, దక్షిణ భారతాన్ని తమ
ఏలుబడిలోకి తెచ్చుకోవాలనుకుని శాలంకాయన వంశాన్ని అంతరింప చేశారు. విజయస్కంద వర్మ
పాలనాకాలం క్రీస్తుశకం 415-440. ఇంతటితో శాలంకాయన వంశం అంతరించింది.
No comments:
Post a Comment