Thursday, September 23, 2021

బృహత్పలాయన వంశం (బ్రాహ్మణ రాజులు-6) ..... (స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా) : వనం జ్వాలా నరసింహారావు

 బృహత్పలాయన వంశం (బ్రాహ్మణ రాజులు-6)

(స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)

వనం జ్వాలా నరసింహారావు  

           ఇక్ష్వాకుల అనంతరం ఆంధ్ర దేశంలోని కొన్ని ప్రాంతాలను పాలించినవారు బృహత్పలాయన వంశీయులు. మూడవ శతాబ్ది ఉత్తరార్థంలో కృష్ణా నదికి ఉత్తరాన వున్న భాగాలను ఈ వంశీయులు తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. జయవర్మ మహారాజు ఇక్ష్వాకుల సామంతుడు. ఇక్ష్వాకుల అనంతరం ఆంధ్ర దేశ భూభాగాలను ఆక్రమించిన పల్లవ రాజులను యుద్ధంలో ఓడించి, ఆంధ్ర దేశం నుండి తరిమి వేసి, జయవర్మ మహారాజు బృహత్పలాయన వంశాన్ని స్థాపించి సుమారు 15 సంవత్సరాలు ఆంధ్ర దేశాన్ని పాలించాడు. ఆయన ఆ తరువాత ఆ వంశం వారు ఇంకెవరైనా పాలించారో లేదో ఆధారాలు లేవు. అతడితోనే బృహత్పలాయన వంశం అంతరించిందనాలి.

         జయవర్మ మహారాజు పల్లవ రాజులతో యుద్ధం చేసి, రాజ్యంలో శాంతి భద్రతలను నెలకొల్పి, చక్కటి పరిపాలన చేశాడు. జయవర్మ మహారాజు నిరంకుశుడు. కాకపొతే ప్రజాభీష్టాన్ని అనుసరించి, మంత్రుల సలహాలను పాటించి పరిపాలన చేశాడు. ఇతడి పాలనలో వేదం విదులైన విప్రులు గౌరవాదరాలు పొందారు. జయవర్మ మహారాజు స్వతంత్రుడు కావడానికి ముందర శాతవాహనులకు, తరువాత ఇక్ష్వాకులకు సామంతుడిగా వుంది, కృష్ణా నదీ దక్షిణ భాగాన్ని పాలించాడు. ఈ వంశీయులు బ్రాహ్మణులు. పల్లవులతో జరిగిన ఒకానొక యుద్ధంలో జయవర్మ మరణించి ఉండవచ్చని చరిత్ర చెప్తున్నది.

         బృహత్పలాయనులు కృష్ణానదీ ముఖద్వారం దాకా తమ రాజ్యాన్ని విస్తరింప చేసి కూదూరును రాజధానిగా చేసుకొని ఆంధ్ర దేశాన్ని పాలించారు. కంటక శైలం, కోడూరు, అల్లోసైని మొదలైన పట్టణాలు బృహత్పలాయన రాజ్యంలో వుండేవి. బృహత్పలాయనుల కాలంలో ఆంధ్ర దేశంలో బౌద్ధ మతం రాజాదరణ లేక విదేశాలలో వ్యాపించింది. బృహత్పలాయన జయవర్మ పాలించిన కాలంలో ప్రజలు ప్రశాంతమైన జీవనం గడిపారు. ఆనాడు శైవ మతం ఆదరించబడి పోషించబడింది. బౌద్ధ, జైన మతాలు క్షీణించాయి. ఇక్ష్వాకు వంశ పతనానంతరం ఆంధ్ర దేశం పల్లవుల బారిన పడకుండా ఆంధ్ర ప్రజలను ఆదుకున్నది బృహత్పలయానుల వంశం.

1 comment:

  1. పల్లవ రాజుల పాల పడనీయక బృహత్పాలాయన వంశంలోని జయవర్మ కాపాడారన్న మాట

    ReplyDelete