శుంగ వంశం (బ్రాహ్మణ రాజులు-1)
(స్వర్గీయ
బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)
వనం
జ్వాలా నరసింహారావు
మౌర్య రాజ్య పతనానంతరం శుంగ వంశీయులు మగధ సామ్రాజ్యాన్ని క్రీస్తు
పూర్వం 185 నుండి క్రీస్తు పూర్వం 73 వరకు 112 సంవత్సరాలు పాలించారు. మౌర్య
సామ్రాజ్యపు భాగాలన్నింటినీ ఈ వంశీయులు తమ ఏలుబడిలోకి తెచ్చుకొని సామంతులను తమ
అధీనంలో వుంచుకొని నిరాఘాటంగా పరిపాలించారు. శుంగ వంశపు రాజుల గురించి అనే
చారిత్రిక, శాసనపరమైన ఆధారాలున్నాయి.
శుంగ వంశపు రాజులు బ్రాహ్మణులు. భారద్వాజ గోత్రం వారిది.
వేదవేదాంగాలను అధ్యయనం చేసినవారు. సకల శాస్త్రాలను అవగతం చేసుకున్నారు. వైదిక
మతోద్ధరణకు పాటుబడ్డారు. మౌర్య వంశీయుల కాలంలో కుల బ్రాహ్మనులుగా వున్న శుంగ
వంశీయులు, వైదిక మతవ్యాప్తికి అధికార పదవులను ఆశించారు. కాలక్రమాన అమాత్య పదవులను
అధిష్టించి రాజకీయాలలో తలదూర్చారు. వైదిక ధర్మనిరతికల ఈ వంశీయులు ప్రజలను
ఉత్తేజితులను చేసి వారిని వైదిక మతం వైపు మరల్చారు.
శుంగ వంశీయులలో ప్రసిద్ధుడు పుష్యమిత్రుడు. గొప్ప రాజకీయవేత్త. యుద్ధ
విశారదుడు. అసాధారణ ప్రజ్ఞా పాటవాలు కలవాడు. రాజ్య పాలనా వ్యవహారాలను క్షుణ్ణంగా
తెలిసినవాడు. తన పూర్వీకులు ఆచరిస్తున్న పౌరోహిత్యానికి, రాజగురువు పదవికి స్వస్తి
పలికి, తన మేధాసంపత్తితో మౌర్య చక్రవర్తి బృహద్రథుడి మంత్రిగా నియమించబడ్డాడు. పుష్యమిత్రుడు
అమాత్య పదవిని చేపట్టిన తరువాత దేశ రాజకీయ పరిస్థితిని అవగాహన చేసుకున్నాడు.
అప్పట్లో మగధ రాజ్య పరిస్థితి అల్లకల్లోలంగా వుండేది. మగధ చక్రవర్తి బృహద్రథుడు
భోగలాలసుడు. పరిపాలనా దక్షత లేనివాడు. గర్వి. అవకతవక పనులు చేసేవాడు. అలాంటి
వాడిని, రాజ్యాన్ని
కోల్పోయే స్థితిలో వున్న బృహద్రథుడిని చంపి పుష్యమిత్రుడు మగధ రాజ్యాధికారాన్ని
చేపట్టి శుంగ వంశాన్ని స్థాపించాడు.
పుష్యమిత్రుడు తరువాత అగ్నిమిత్రుడు,
సుజ్యేష్ట, వసుమిత్రుడు, వజ్రమిత్రుడు,
భగవతుడు, దేవభూతి రాజ్యపాలన చేశారు.
పుష్యమిత్రుడు బృహద్రథుడిని సంహరించి మగధ రాజ్యాన్ని అధిష్టించిన
తరువాత 36 సంవత్సరాలు వైభవోపేతంగా పరిపాలించాడు. పాలనా వ్యవహారాలలో ఆయనకు కొడుకు, మనుమడు అండగా నిలిచారు. రాజ్యాన్ని అధిష్టించిన
తరువాత పుష్యమిత్రుడు అనేక యుద్ధాలలో పాల్గొనాల్సి వచ్చింది. వారిలో ముఖ్యులు
యవనులు. కాని పుష్యమిత్రుడి ముందు వారి ఆటలు సాగలేదు. యవనాధీశుడు డేమిట్రియాస్
యవనుల పరాజయాన్ని చవిచూసి భారతదేశాన్ని వీడిపోవాల్సి వచ్చింది. మగధ సైన్యం విజయం
సాధించింది. తిరిగి పుష్యమిత్రుడి వృద్దాప్యంలో యవనులు మీనాండర్ నాయకత్వంలో
భారతదేశం మీదికి దండయాత్రకు వచ్చారు. సమరశూరుడైన ఆయన మనుమడు వసుమిత్రుడు వారిని
విజయోపేతంగా ఎదుర్కొన్నాడు.
మగదాధిపతి పుష్యమిత్రుడు విదర్భ రాజ్యాన్ని నూతనంగా జయించి, కొత్తగా విదర్భ రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆ
రాజ్యాన్ని రెండుగా విభజించి యజ్ఞసేన, మాధవసేన అనే
ఇరువురికి సమానంగా పంచి ఇచ్చి తనకు సామంతులుగా చేసుకున్నాడు.
అదే సమయంలో కళింగ దేశాన్ని పాలిస్తున్న చేది వంశీయుడు ఖారవేల మహారాజు
మగధ రాజ్యం మీద క్రీస్తు పూర్వం 165 లో దండెత్తాడు. తిరిగి మరోమారు క్రీస్తుపూర్వం
161 లో దండెత్తి రాజధానిలో ప్రవేశించి, దుర్గాన్ని
ఆక్రమించాడు. పుష్యమిత్రుడు అతడితో సంధి చేసుకున్నాడు.
పుష్యమిత్రుడు రెండు అశ్వమేధ యాగాలను నిర్వహించాడు. పుష్యమిత్రుడు
బ్రాహ్మణుడు. వేదవేదాంగ వేత్త. వైదిక ధర్మనిరతుడు. వైదిక మతాన్ని వ్యాపింప
చేసినవాడు. బౌద్ధ మత పతనానికి
పుష్యమిత్రుడు సహకరించాడు. పతనమవుతున్న మగధ రాజ్యాన్ని, దాని వైభవాన్ని పునరుద్ధరించి, మహోన్నతాశయంతో శుంగ వంశాన్ని స్థాపించి, వైదిక మతోద్ధరణకు పాటుపడి, 36 సంవత్సరాలు పాలించిన పుష్యమిత్రుడు
చిరస్మరణీయుడు.
పుష్యమిత్రుడి మరణానంతరం అతడి కుమారుడు అగ్నిమిత్రుడు మగధ సింహాసనాన్ని
అధిష్టించాడు. అతడు కూడా తండ్రిలాగే యుద్ధ విశారదుడు. పాలనానుభవం కలవాడు. తండ్రికి
అనేక యుద్ధాలలో విజయాన్ని సాధించి పెట్టినవాడు. ఆయన మగధ రాజ్యాన్ని క్రీస్తుపూర్వం
149 నుండి క్రీస్తుపూర్వం 141 వరకు 8 సంవత్సరాలు పాలించాడు. అగ్నిమిత్రుడి తరువాత సుజ్యేష్టుడు
క్రీస్తుపూర్వం 141 నుండి క్రీస్తుపూర్వం 133 వరకు 7 సంవత్సరాలు పాలించాడు.
సుజ్యేష్టుడి అనంతరం వసుమిత్రుడు క్రీస్తుపూర్వం 133 నుండి
క్రీస్తుపూర్వం 123 వరకు 10 సంవత్సరాలు పాలించాడు. తండ్రి, తాతల కాలంలో గ్రీకులతో జరిగిన యుద్ధాలలో యితడు
మగధ సైన్యాధ్యక్షుడిగా అనేక విజయాలను సాధించాడు. ఇతడి పాలనాకాలంలో మగధ రాజ్యం
క్షీణించడం మొదలైంది. ఇతడిని మాలదేవుడు సంహరించినట్లు ఒక గాఢ ప్రచారంలో వున్నది.
వసుమిత్రుడి అనంతరం మగధ రాజ్య పాలకుడిగా సింహాసనం అధిష్టించిన వాడు
వజ్రమిత్రుడు. క్రీస్తుపూర్వం 123 నుండి క్రీస్తుపూర్వం 114 వరకు 9 సంవత్సరాలు
యితడు పాలించాడు. వజ్రమిత్రుడి అనంతరం రాజ్యానికి వచ్చిన భగవతుడు పుష్యమిత్రుడి
లాగానే చాలాకాలం పాలించాడు. క్రీస్తుపూర్వం 114 నుండి క్రీస్తుపూర్వం 82 వరకు 32
సంవత్సరాలు ఇతడి పాలన సాగింది.
భగవతుడి తరువాత దేవభూతి పాలనాబారాన్ని వహించాడు. యితడు విలాసపురుషుడు.
స్త్రీలోలుడు. రాజ్యపాలనా వ్యవహారాలను పట్టించుకోలేదు. చివరకు అంతఃపుర పరిచారిక
తనయ వల్ల వధించబడ్డాడు. అతడిని సంహరించడంలో ప్రధాన భూమిక ను నిర్వహించిన వాడు అతడి
అమాత్యుడైన వాసుదేవుడు. 9 సంవత్సరాల పాలన అనంతరం క్రీస్తుపూర్వం 73 లో దేవభూతి మరణానంతరం
వాసుదేవ మంత్రి మగధ సింహాసనాన్ని అధిష్టించి కాణ్వ వంశాన్ని స్థాపించాడు.
No comments:
Post a Comment