అజ్ఞాతవాసం ఆరంభం, మారుపేర్లతో పాండవులు
ఆస్వాదన-38
వనం
జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక
ఆదివారం సంచిక (19-09-2021)
అరణ్యవాసం అనంతరం ఒక ఏడాది అజ్ఞాతవాసాన్ని విరాటరాజు ఏలికలో వున్న
మత్స్యదేశంలో గడపాలని నిర్ణయించుకున్న పాండవులు, మారు పేర్లతో అక్కడున్న ఏడాది కథే
విరాటపర్వం.
ధర్మరాజు సన్యాసి వేషంలో కంకుడనే పేరుతో, భీమసేనుడు వంటలాడుగా వలలుడనే
పేరుతో, అర్జునుడు
బృహన్నలగా, నకులుడు
దామగ్రంథిగా, సహదేవుడు తంత్రీపాలుడుగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు.
ఇక ద్రౌపదీదేవి సైరంధ్రిగా సుదేష్ణారాణి కొలువులో చేరి మాలిని అనే
పేరుతో వ్యవహరించాలన్న నిర్ణయం పూర్వ రంగంలో ఆమెను ఉద్దేశించి ధర్మరాజు పలికిన
పలుకులు తిక్కన సోమయాజి చక్కటి పద్యంలో రాశారు ఈ విధంగా:
చ: ఇది కడు ముద్దరాలు, పను లేమియు జేయగా నేర, దెంతయున్
మృదు, వొక
కీడుపాటునకు మేకొనజాల, దుదాత్తచిత్త, యొం
టి
దిరుగు దాని కోర్వ, దొకటిం దను దా సవరించుచొ ప్పెరుం
గడు, తగ నొడ్లనుం
గొలువగా వేర వెమ్మెయి గల్గు నక్కటా!
(ఈమె సుకుమారి. ఏ పనినైనా చేయించుకోవడమే కాని చేయడం చేతకాని
సుతిమెత్తనిది. నీచమైన పనులకు దూరంగా వుంటుంది. ఒంటరిగా తిరగడం ఎప్పుడూ అలవాటు
లేదు. చాలా పెద్ద మనసు కలిగింది. ఏ ఒక్కటి కూడా తనంత తాను చక్కబెట్టుకునే తీరు
తెలియనిది. ఇలాంటి ఈమె ఇతరులను ఏవిధంగా
సేవిస్తుందో? అ నేర్పు ఈమెకు ఎట్లా అలవడుతుందో?)
ఇక్కడ వ్యాఖ్యానం రాస్తూ (డాక్టర్ కె సర్వోత్తమరావు) ఇలా విశేషించి
చెప్పారు. “తిక్కనగారి ప్రసిద్ధ పద్యాలలో ఇది ఒకటి. అర్థగుణమైన ప్రసాదం ఈ రచనకు
ప్రాణం. ఈ ఘట్టాన్ని మూలంతో పోలిస్తే తిక్కన కవితాశిల్పం మరీ తేటపడుతుంది. తిక్కన
పద్యంలో ద్రౌపదిని వర్ణించిన తీరు అనుభావ వ్యంజకంగానూ, భావికథార్థ సూచకంగానూ, వుండడం తిక్కన కావ్య కళాశిల్పం. విరాటపర్వంలో,
విశేషించి కీచక ఘట్టంలో, ద్రౌపది
పడనున్న పాట్లను ప్రచ్చన్నంగా ధ్వనింపచేసే వాక్య విన్యాసం గమనార్హం. ద్రౌపదీదేవికి
వాడిన విశేషణాలన్నీ ఆమె మహారాజ్ఞీత్వాన్ని సూచించేవి. సేవలు చేయించుకునే
స్నిగ్ధమూర్తి ఎవరిని సేవించగలదు? తిక్కన తెలుగు
పదాల జిలుగు రచనకు ఈ పద్యం హృద్యమైన ఉదాహరణ”.
కవిత్రయ
విరచిత
శ్రీమదాంధ్ర
మహాభారతం, విరాటపర్వం, ప్రథమాశ్వాసం
(తిరుమల, తిరుపతి
దేవస్థానాల ప్రచురణ)
No comments:
Post a Comment