ఆనందగోత్రిక వంశం (బ్రాహ్మణ రాజులు-8)
(స్వర్గీయ
బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)
వనం
జ్వాలా నరసింహారావు
బృహత్పలాయన
జయవర్మ అనంతరం పల్లవులు ఆంధ్రదేశంలోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించారు. కృష్ణానదికి
దక్షిణాన వున్న చేజెర్లను లేదా కపోత కందరపురం రాజధానిగా చేసుకొని తీరాంధ్రాన్ని, కృష్ణా, గుంటూరు
మండలాలను ఆనందగోత్రికులు ఆక్రమించి పాలించారు. వీరు గోత్ర నామాన్ని వంశ నామంగా
ధరించారు. ఆనంద మహర్షి వంశానికి చంద్రుని లాంటి వాడు కందర రాజు. స్వశక్తితో
రాజ్యాన్ని స్థాపించి పల్లవ రాజులకు సామంతుడిగా ఆంధ్ర భూభాగాలను పాలించాడు.
ధాన్యకటక యుద్ధంలో ఇతడు శత్రువులను, ముఖ్యంగా శాలంకాయన నందివర్మను ఓడించి దాన్ని
ఆక్రమించుకున్నాడు. ఇతడి రాజ్యం త్రికూట పర్వతం నుండి కృష్ణానది వరకు
వ్యాపించినది. ఇతడి రాజధాని దాన్యవాటి అని అంటారు. తరువాత ఇతడు తన పేరుమీద కందరపుర
నిర్మాణం చేశాడు. ఆ తరువాత ఇతడి వారసులకు అదే రాజధాని అయింది. పల్లవ శివస్కంద వర్మ
ఇతడిని ఓడించి సామంతుడిగా చేసుకున్నాడు. ఇతడు 35 సంవత్సరాలు (క్రీస్తుశకం 290-325)
పాలించాడు.
కందర
రాజు తరువాత అత్తివర్మ రాజయ్యాడు. ఇతడు యమ నియమవంతుడు. ఆపస్తంబ సూత్రుడు. ఋగ్యజుస్సామ
వేదవిదుడు. ఈ మహారాజు శైవుడు, వైదిక మతోద్దారకుడు. ఇతడి కాలంలో బౌద్ధం క్షీణించినది.
అత్తివర్మ శక్తియుతుడు. అనేక రాజుల స్వాతంత్ర్యాన్ని హరించినవాడు. విజేత. పల్లవ, శాలంకాయన రాజన్యులు ఆక్రమించిన రాజ్య భాగాలను
అత్తివర్మ తిరిగి సాధించాడు. అత్తివర్మ పాలనాకాలం 45 సంవత్సరాలు (క్రీస్తుశకం
335-380).
అత్తివర్మ తరువాత అతడి తనయుడు దామోదర వర్మ పాలనా పగ్గాలను చేపట్టాడు.
ఇతడు ఆంధ్రదేశ భూభాగాలను పాలించినప్పటికీ, పల్లవ, శాలంకాయన, విష్ణుకుండిన
వంశీయులతో యుద్ధాలు చేయాల్సి వచ్చింది. విష్ణుకుండినులతో జరిగిన యుద్ధంలో ఓటమి
పాలై, ఆనందగోత్రికులు
త్రికూట మలయాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
దామోదర వర్మ అనంతరం రాజ్యానికి వచ్చిన ఆనందగోత్రికులు అతి బలహీనులు
కావడం వల్ల విష్ణుకుండినులు విజృంభించి
వారి రాజ్యాన్ని జయించి తమ సామంతులుగా చేసుకున్నారు. దామోదర వర్మ పాలనా కాలం 45
సంవత్సరాలు (క్రీస్తుశకం 380-425).
ఆనంద గోత్రికుల
పాలనాకాలంలో ఆంధ్రదేశంలో కరువుకాటకాలు లేవు. దేశం సుభిక్షంగా వున్నది. ఆనంద
గోత్రికులు శిల్ప కళను పోషించి అభివృద్ధి చేశారు.
No comments:
Post a Comment