విష్ణుకుండిన వంశం (బ్రాహ్మణ రాజులు-9)
(స్వర్గీయ
బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)
వనం
జ్వాలా నరసింహారావు
శాతవాహన
సామ్రాజ్య పతనానంతరం ఆంధ్రదేశాన్ని ఏకఛ్చత్రాదిపత్యంగా
పాలించిన రాజవంశాలలో విష్ణుకుండిన వంశం పేర్కొనదగినది. మహోజ్వల చరిత్ర కల
విష్ణుకుండిన రాజన్యుల చరిత్ర అనుపమానమైనది. అసదృశమైనది. ఇక్ష్వాకు వంశీయుల
సామంతుడిగా లేదా మాండలికుడిగా వున్న విష్ణుకుండిన వంశ స్థాపకుడైన మహా రాజేంద్రవర్మ
మహబూబ్ నగర్ మండలంలోని అచ్చంపేట తాలూకాలో వున్న అమరాబాదు ప్రాంతాన్ని పాలించాడు.
శాలంకాయన వంశీయులలో బలహీనులైన రాజులు
ఆంధ్రదేశాన్ని ఏలుతున్న కాలంలో విష్ణుకుండిన వంశీయులు కృష్ణానది ఉత్తరాన వున్న
అత్యధిక భూభాగాలను ఆక్రమించుకుని రాజ్యాన్ని విస్తరించుకున్నారు. విష్ణుకుండిన
రెండవ మాధవ వర్మ వాకాటక రెండవ పృధ్వీసేనచక్రవర్తి ఏకైక కుమార్తె వాకాటక మహాదేవిని వివాహమాడి
విష్ణుకుండిన వాకాటక రాజ్యాలను పాలించాడు. బలవంతమైన రాజవంశాలతో సంబంధ బాంధవ్యాలను
ఏర్పరుచుకుని విష్ణుకుండిన వంశీయులు దీర్ఘకాలం ఆంధ్రదేశాన్ని పాలించారు.
విష్ణుకుండినులు మొదట్లో అమరాబాదు ప్రాంత పాలకులుగా వుండి, రాజ్యాన్ని విస్తరించి, ఇంద్రపురిని రాజధానిగా పాలించారు. వీరికి
దెందులూరు, వేల్పూరు, విజయవాడ,
విజయస్కంథావారములుగాను, అమరావతి, బెజవాడ, ఇంద్రపురి
రాజధానులుగాను వుండేవి.
విష్ణుకుండిన వంశ స్థాపకుడు
మహారాజేంద్రవర్మ, శాలంకాయన, ఆనందగోత్రిక, పల్లవ రాజన్యులు ఒకరితో ఒకరు కలహించే కాలంలో
అమరాబాదు, ఏలేశ్వరం
ప్రాంతాలలో తన అధికారాన్ని సుస్థిరపర్చుకుని, క్రీస్తుశకం 358 లో విష్ణుకుండిన
రాజ్యాన్ని స్థాపించి, క్రీస్తుశకం
370 వరకు 12 సంవత్సరాలు పాలించాడు. మహారాజేంద్రవర్మ అనంతరం అతడి కుమారుడు మొదటి
మాధవవర్మ క్రీస్తుశకం 370 లో సింహాసనం అధిష్టించి,
క్రీస్తుశకం 398 వరకు 28 సంవత్సరాలు పాలించాడు. ఇతడు అమరాబాదు, కీసర, భువనగిరి ప్రాంతాల దాకా తన రాజ్యాన్ని విస్తరించాడు.
మొదటి మాధవవవర్మ తరువాత అతడి కుమారుడు
మొదటి గోవిందవర్మ విష్ణుకుండిన రాజ్య పీఠాన్ని అధిష్టించినాడు. ఇతడు క్రీస్తుశకం
398 నుండి 435 వరకు సుమారు 38 సంవత్సరాలు పాలించాడు. గోవిందవర్మ గొప్ప విజేత. పరిపాలనాదక్షుడు.
బౌద్ధమతానుయాయి. శాలంకాయన రాజ్యం క్షీణదశలో వుండగా,
గోవిందవర్మ విజృంభించి, కృష్ణా-గోదావరీ నడులమధ్యన
వున్న భూభాగాలను జయించి, రాజ్యాన్ని విస్తరించాడు. గుంటూరు
ప్రాంతాన్ని కూడా జయించి మహాసామ్రాజ్య నిర్మాణానికి అంకురార్పణ చేశాడు.
మహారాజపదవిని అలంకరించాడు. మొదటి గోవిందవర్మ బౌద్ధమతానురక్తుడు. మహాజ్ఞాని. అనేక
దేవాలయాలను నిర్మించాడు. విష్ణుకుండిన తోలిరాజులలో ఇతడు అగ్రగణ్యుడు.
మొదటి
గోవిందవర్మ కుమారుడు రెండవ మాధవవర్మ తండ్రి అనంతరం రాజయ్యాడు. ఇతడు విష్ణుకుండిన
రాజన్యులలో అత్యంత ప్రతిభావంతుడు. అజేయుడు. సార్వభౌముడు. దక్షిణాపథం మాత్రమే
కాకుండా దక్షిణ భారతాన్ని కూడా జయించాడు. ఇతడు వైదికమత నిరతుడు. 11 సార్లు
ద్విగ్విజయ యాత్రలు చేసి శత్రురాజులను ఓడించి అశ్వమేధ యాగాలను, రాజసూయ యాగాలను చేశాడు. సువిశాలమైన
విష్ణుకుండిన సామ్రాజ్య నిర్మాణానికి రెండవ మాధవ వర్మ అనేక రాజ్యాలను జయించాడు.
విష్ణుకుండిన వంశ ప్రతిష్టను ఇనుమడింప చేశాడు. ఇతడి పరిపాలనాకాలం క్రీస్తుశకం
435-470. సుమారు 35 సంవత్సరాలు పాలించాడు.
రెండవ
మాధవవర్మ పెద్దకొడుకు దేవవర్మ తండ్రి అనంతరం సింహాసనాన్ని అధిష్టించి కొద్దికాలం
మాత్రమే-3 సంవత్సరాలు, పాలించాడు. ఆయన తరువాత కుమారుడు మూడవ
మాధవవర్మ క్రీస్తుశకం 473 లో సింహాసనం అధిష్టించి, క్రీస్తుశకం 522 వరకు,
అంటే సుమారు 49 సంవత్సరాలు పాలించాడు. ఇతడి రాజధాని నేటి అమరావతి, నాటి అమరపురం. మూడవ మాధవవర్మ పరాక్రమవంతుడు.
పల్లవులు ఆక్రమించిన భూభాగాలను ఇతడు తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. సుదీర్ఘకాలం
పాలన చేసి, విష్ణుకుండిన ప్రతిష్టను ఇనుమడింప చేసి, వైదిక మతాన్ని ఆదరించాడు. ఇతడి పినతండ్రైన
విక్రమేంద్రవర్మ మూడవ మాధవవర్మ మీద యుద్ధాలు చేసి విజయం సాధించి రాజయ్యాడు.
విక్రమేంద్రవర్మ
క్రీస్తుశకం 522 నుండి 528 వరకు సుమారు 6 సంవత్సరాలు పాలించాడు. ఇతడు
బౌద్ధమతాభిమాని. మహాకవి. గొప్ప యోధుడు. అతడి అనంతరం కుమారుడు ఇంద్రవర్మ రాజ్యానికి
వచ్చాడు. ఇతడు గొప్ప శూరుడు. రాజ్య తంత్రజ్ఞుడు. అనేక యుద్ధాలలో విజయుడై, సుస్థిరమైన రాజ్యపాలన చేశాడు. ఇంద్రవర్మ విష్ణుకుండిన
సామ్రాజ్యాన్ని 29 సంవత్సరాలు (క్రీస్తుశకం 528-556) పాలించాడు. అనేక దేవాలయాలను
నిర్మించాడు. బ్రాహ్మణులకు అగ్రహారాలను దానంగా ఇచ్చాడు.
ఇంద్రవర్మ కుమారుడు
విక్రమేంద్ర భట్టారకవర్మ రాజ్యానికి వచ్చి సుమారు 15 సంవత్సరాలు (క్రీస్తుశకం
556-570) పాలించాడు. ఇతడి పాలనాకాలమంతా యుద్ధాలలో, సత్కార్యాలు చేయడంలో గడిచింది. దాయాదులతో పోరాడాల్సి వచ్చింది.
పల్లవులకు, విష్ణుకుండినులకు వున్న వైరం వల్ల ఆంధ్ర
భూభాగాల మీద పల్లవ సింహవర్మ ప్రచండ సైన్యంతో దండెత్తాడు. విక్రమేంద్ర భట్టారకవర్మ
పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా యుద్ధంలో వీరవిహారం చేశాడు. పృధ్వీమూలరాజు
సహాయం చేయడం వల్ల పల్లవ సైన్యం ఛిన్నా భిన్నమై పోయింది.
తండ్రి అనంతరం
విక్రమేంద్ర భట్టారక వర్మ కుమారుడు రెండవ గోవిందవర్మ రాజయ్యాడు. క్రీస్తుశకం 570
నుండి క్రీస్తుశకం 576 వరకు, సుమారు 6 సంవత్సరాలు మాత్రమే
పాలించాడు. గోవిందవర్మ పరాక్రమశాలి. రెండవ గోవిందవర్మ కుమారుడు నాల్గవ మాధవవర్మ
తండ్రి అనంతరం క్రీస్తుశకం 576 లో సింహాసనాన్ని అధిష్టించి, సుదీర్ఘకాలం పాలించాడు. అశ్వమేధ యాగాలు
చేశాడు. చాళుక్యులు ఆంధ్రదేశాన్ని ఆక్రమించే నాటికి మాధవవర్మ ముసలివాడు.
అయినప్పటికీ వీరావేశంతో యుద్ధంలో పోరాడి క్రీస్తుశకం 623 లో మరణించాడు.
నాల్గవ మాధవవర్మ
కుమారుడు మంచన భట్టారకుడు తండ్రి అనంతరం రాజై,
సామంత, మాండలికులను సమీకరించుకుని, చాళుక్యులతో పోరాటం కొనసాగించాడు. రాజధాని
లేని రాజుగా, అనుచరుల సహాయంతో సైన్యాన్ని సమకూర్చుకుని, చాలాకాలం యుద్ధాలు చేసి, చివరకు జయసింహ వల్లభుడి చేతిలో చనిపోయాడు.
ఇతడి పాలనాకాలం క్రీస్తుశకం 623-624. ఇతడితో విష్ణుకుండిన రాజ్యం అంతరించింది.
No comments:
Post a Comment