Sunday, September 12, 2021

వాయుదేవుడు తమను అవమాన పరిచాడని తండ్రికి చెప్పిన కుశనాభుడి కూతురులు.....శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-72 : వనం జ్వాలా నరసింహారావు

 వాయుదేవుడు తమను అవమాన పరిచాడని

తండ్రికి చెప్పిన కుశనాభుడి కూతురులు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-72

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (13-09-2021)

పూచిన తంగేడు చెట్ల లాంటి శరీరాలతో బంగారు కాంతులు వ్యాపింప చేస్తూ-వికసించిన మల్లె పూల లాంటి నడుంతో వయ్యారంగా వూదితే ఎగిరిపోతారానే సొగసుతో-విచ్చిన అశోకాల లాంటి సొమ్ములను, కెంపులను ధరించి తళ తళమనే కాంతులు చిమ్ముతూ-గాలికి వడికిన మన్మథ ధ్వజాలనదగిన పైటలు వంటి మీదనుండి జారుతుంటే, నిండు వయసు వికాసంతో అతిశయించిన చిలుకల దండు వచ్చిందా అన్న రీతిలో, ఒయ్యారాలొలికిస్తూ, ఆ వంద మంది గజగమనలు, ఒకనాడు ఉద్యానవనంలో ప్రవేశించారు. చేతుల్లో వీణలు ధరించి, విలాస చేష్టలతో మనసులు సంతోషిస్తుంటే, వానాకాలపు మెరుపులలాగా, మనోహరమైన శరీరాలను అందంగా ఆటల్లో ముంచి-విలాసంగా పాడుతూ-మబ్బుల మధ్య చుక్కల్లా వారందరు ఉద్యానవనంలో విహరించారు.

అలా సమానమైన అందంతో-ప్రాయంతో ప్రకాశిస్తూ, రత్నాలు చెక్కిన ఒడ్డాణాలు ధరించిన ఆ సుందరాంగులను చూసి, ఆశ్చర్య పడి, మన్మథుడి ప్రభావంతో వికసించిన మనస్కుడైన వాయుదేవుడు, ఆ కన్యలందరినీ తన భార్యలు కమ్మని కోరాడు. తన కోరికను వాళ్లు ఒప్పుకుంటే, వారికి మనుష్యత్వం పోయి-దీర్ఘాయువు, సంపద కలిగి ఆనందంతో వుండొచ్చని అంటాడు వాయుదేవుడు. "చక్కని అవయవాలున్న వనితలారా ! మిమ్మల్ని చూసినప్పటి నుండి, మదన తాపంతో-విస్తార మోహంతో బాధ పడుతున్నాను. కాబట్టి మిమ్మల్ని కౌగలించుకుంటే కలిగే సుఖాన్ని నా కివ్వండి. మీకు దేవత్వాన్ని కలిగిస్తాను. మీరు దీర్ఘకాలం యౌవనం కలిగి సుఖించవచ్చు. మనుష్యులలో యవ్వనం శాశ్వతం కాదనే విషయం మీకు తెలిసిందే. మీరు నాకు భార్యలై నాతో సాంగత్యం చేస్తే, మీకు మరణం లేకుండా దేవత్వం లభిస్తుంది" అన్న వాయుదేవుడితో పరిహాసంగా జవాబిచ్చారు ఆ కన్యలీవిధంగా:

"జగత్ ప్రాణా! ప్రీతితో సమస్త భూత కోటులను రక్షించే వాడవని కీర్తి పొందిన నిన్ను తెలియని వారు లేరు. చరా చరాలన్నిటికీ అంతరాత్మవైన నీవంటి మహాత్ములు, న్యాయ మార్గం తప్పి, దిగ్భ్రమ కలిగించే ఆడపిల్లలను చూడగానే ఇలా అవమానించే మాటలు అనదగునా? ఇంత గొప్పవాడవైన నీవు, కుల కన్యకా ధర్మం తెలియక, వార స్త్రీలతో-కులటలతో మాట్లాడినట్లు మాట్లాడడం నీతి కాదు. వాయుదేవా ! నువ్వు ఇతరులను పవిత్రులను చేసేవాడివి కనుకనే ’పవనుడు-పవమానుడు’ అన్న పేరొచ్చింది. ఇలా నీవు అధర్మ కార్యాలకు పూనుకుంటే, అపవిత్రుడవై, ఇతరులను పవిత్రులుగా చేయలేవు. అప్పుడు పవమానుడనే పేరు నీకు నేతి బీరకాయ లాంటిదే. ఇంత సాహసం చేసిన నిన్ను, మా తపోబలంతో శపించి-వధించగలం. కాని, కోపిస్తే, మా తపస్సు వ్యర్థమవుతుందని వూరుకుంటున్నాం. ఈ కుశనాభుడి కూతుర్లను నువ్వెరుగవు-అందుకే జారిణులతో మాట్లాడినట్లు మాట్లాడావు. మన్మథుడు నీ కళ్లల్లో దుమ్ము కొడుతుంటే, మేమేవరిమో తెలుసుకోవడం నీకు సాధ్యంకాదు. ఈ వార్త మా తండ్రికి తెలిస్తే, నిన్ను చంపకుండా వుండడు. ఆయనకు చేరక ముందే వెళ్లిపో. ఆయన్ను అలక్ష్య దృష్టితో చూడొద్దు-కన్యా దాన ఫలం ఆయనకు రాకుండా చేయొద్దు. రాకుమార్తెలమైనా, వయసొచ్చిన వారిమైనా, స్వయంవరాధికారం మాకున్నా, మా తండ్రికి కన్యాదాన ఫలం లేకుండా చేసే పనిని మేమంగీకరించం. మాకు తండ్రే దైవం-రాజు. ఆయన సమ్మతించి ఎవరికిస్తే వారే మా భర్త. మామాట విని నీచపు మాటలు మాని వెళ్లిపో".

ఇలా ఆ కన్యలు జంకు లేకుండా జవాబివ్వగా కోపించిన వాయుదేవుడు, వాళ్ల శరీరాల్లో జొరబడి, దయ లేకుండా, వారి అవయవాలు వంకర-టింకర పోయేటట్లు చేశాడు. బిగుసుకున్న దేహాలతో, వంకర నడకలతో, పొట్టి తొడలతో, చూసేందుకు వికారమైన శరీరాలతో రాకూడనంత వేగంతో ఇళ్లకు తిరిగొచ్చారు వారు. ఇంటికి పోయి-సిగ్గుతో నేలపైపడున్న బిడ్డలను చూసిన తండ్రి, నిబ్బరం వదిలి-విచారంతో-తొట్రుపాటుతో, ఏ పాపాత్ముడు నియమం చెడి వాళ్లనిట్లా చేశాడని అడుగుతాడు. కన్నీరు కారుస్తూ, నేలపై పడి పొర్లుతూ, ఏడుస్తుంటే ఎవరిలా చేటు కాలం సమీపించి వాళ్ల దుఃఖానికి కారణమయ్యారో చెప్పమని కుశనాభుడు కూతుళ్లనడిగి వారి జవాబుకొరకు నిరీక్షించాడు.

అమితమైన దుఃఖంతో, కళ్లనుండి నీళ్లు ప్రవాహంలాగా కారుతుంటే, బ్రహ్మతో సమానమైన తమ తండ్రి పాదాలపై శిరస్సుంచి చెప్పారు ఆ కూతుళ్లిలా: " ఏమని చెప్పాలి తండ్రీ?  మోహాంధుడై-గర్వంతో వాయువు మాలో పోకూడని మార్గంలో ప్రవేశించి, మాకిలాంటి సంతాపం కలిగించాడు. ఆయనకు మేం ఏ అపరాధం చేయలేదు. మమ్మల్నందరినీ పెళ్లి చేసుకుంటానని ఆయన అంటే, మా తండ్రిని అడగమని చెప్పాం. మా తండ్రి నీకిస్తే చేసుకుంటామన్నాం. మాకు మా తండ్రిని మించినదేదీ లేదు-ఆయన మాట జవదాటం అనీ, మాకు స్వాతంత్ర్యం లేదనీ, ఆకు చాటు పిందెలమనీ, తండ్రి చాటున వుండే వారిమనీ, ధర్మం తప్పి మాట్లాడ వద్దనీ, మాకు కోపం తెప్పించ వద్దనీ చెప్పాం. మేము ఆడపిల్లలమనీ, మేమేమీ చేయలేమనీ అనుకుని, ఆ పాపాత్ముడు మమ్మల్నిట్లా అవమానకరమైన మరుగుజ్జులలాగా తయారుచేశాడు". ఉత్తమ గుణాలను ప్రదర్శించిన తన కూతుళ్లతో, ఎలాంటి శత్రువైనా నమస్కరించేటంత శక్తిమంతుడైన కుశనాభుడు, వారి ఓర్పు శ్లాఘించదగిందనీ, తన కడుపున పుట్టినందుకు వారందరూ ఒక్క మాటపై వున్నారనీ, ఒక్కరు కూడా పొరపాటునైనా వాయుదేవుడిని శపించలేదనీ, ఆడవారికైనా-మగవారికైనా దేహ సౌందర్యం-భూషణ సౌందర్యం కంటే కష్టాల్లోనైనా క్షమా గుణమే భూషణమనీ అన్నాడు.

"స్త్రీలకు, అందునా బాలికలకు తమనవమానించిన వారిని సహించడం సాధ్యం కాని పని. రూప యౌవనాలతో వున్న మీరు, మీ సౌందర్యాన్ని-యౌవనాన్ని చూసి, కామానికి వశ పడక, తండ్రికొరకై, సహించి వుండడమంటే గొప్ప విషయమే. దానికి కారణమైన వారిని శపించక రక్షించడం మరీ శ్లాఘ్యం. ఒక్కరు కూడా కామ-క్రోధాలకు వశ పడకుండా వుండడం ఉత్తమోత్తమం. క్షమే దానం-యజ్ఞమంటే క్షమే-క్షమే సత్యం-సత్కీర్తి క్షమే-క్షమే మేలైన ధర్మం-క్షమలోనే జగమంతా ఆధారపడి వుంది. క్షమను సాధిస్తే ప్రపంచాన్ని జయించినట్లే-అన్నీ సాధించినట్లే" అని కుశనాభుడు తన కూతుళ్లను సమాధాన పరిచి, కొలువు తీరి, మంత్రులందరినీ పిలిచి, అన్నివిధాలా ఆలోచించించి, తన కూతుళ్లకు తగిన వరులెవ్వరని యోచన చేశాడు. అదే సమయంలో "చూళి" అనే రేతస్స్ఖలనం లేని (ఊర్థ్వ రేతస్కుడు) మునీశ్వరుడు తపస్సు చేస్తుంటే, ఊర్మిళనే గంధర్వ స్త్రీ కూతురు-సోమదనే కన్య ఆ మునికి శుశ్రూష చేస్తూండేది.

బ్రహ్మ దత్తుడి చరిత్ర

కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత, సోమద శ్రద్ధా భక్తులకు సంతోషించిన చూళి, ఆమెకేం కావాల్నో అడగమంటాడు. తనకు కలగనున్న అదృష్టానికి ఆనందపడ్డ సోమద, తియ్యటి మాటలతో, దివ్య మహర్షులలో శ్రేష్ఠుడు-అసమాన తపఃప్రకాశంతో సూర్యుడిని జయించినవాడు-అపర బ్రహ్మ అయిన చూళి తో, తనకు " మిగుల పవిత్రుడు, బ్రహ్మ జ్ఞానంతో కూడినవాడు" అయిన కొడుకును అనుగ్రహించమని అంటుంది. తనకు మొగుడు లేడనీ, వివాహం కాలేదనీ, ఆయన్నే శరణుజొచ్చాననీ, ఆయన తపో మహిమతో తనకు పుత్రుడు కలిగేటట్లు చేయమనీ ప్రార్థిస్తుంది. ఆ మాటలకు సంతోషించిన చూళి తన సంకల్ప బలంతో ఆమెకు కొడుకును-మంచి నడవడి గలవాడిని కలిగేటట్లు చేసి పంపించాడు. సోమద కొడుకైన బ్రహ్మదత్తుడు కాంపిల్యమనే పురానికి రాజై, కీర్తిమంతుడై, ఇంద్రుడు అమరావతిని పాలించినట్లే, పాలించాడు. ఆ బ్రహ్మదత్తుడిని తన యోగ్యతకు తగిన మార్గంలో పిలిపించి, తన అభిప్రాయాన్ని తెలిపి, ఆయనకు తన వందమంది కుమార్తెలనిచ్చి వివాహం జరిపించాడు కుశనాభుడు. బ్రహ్మదత్తుడు వివాహ సమయంలో, ఆ కన్యలను చేత్తో ముట్టుకోగానే, వారందరి వికార దేహాలు పోయి, పూర్వంలాగానే మనోహరమైన సుందర శరీరాలొచ్చాయి. అలా ప్రకాశిస్తున్న తన కూతుళ్లను చూసి, కుశనాభుడు ఆశ్చర్యంతో-సంతోషంతో మైమర్చి, వారిని బ్రహ్మదత్తుడితో పంపాడు. బ్రహ్మ దత్తుడి తల్లి సోమద కూడా వారిని చూసి సంతోషించింది. ఆ కన్యలున్న ప్రదేశానికే "కన్యాకుబ్జం" అని పేరొచ్చింది. దాన్నే ఇప్పుడు "కనోజ్" అంటారు.

 

No comments:

Post a Comment