ఇక్ష్వాకు వంశం (బ్రాహ్మణ రాజులు-4)
(స్వర్గీయ
బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)
వనం
జ్వాలా నరసింహారావు
శాతవాహన
సామ్రాజ్యం అస్తమించిన తరువాత దక్షిణాపథాన చిన్న-చిన్న రాజ్యాలు స్థాపించబడ్డాయి.
సామంతులు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు. అలా చేసినవారిలో ఇక్ష్వాకులు కూడా
వున్నారు. ఇక్ష్వాకు వంశీయులు విజయపురి రాజధానిగా సుమారు 75 సంవత్సరాలు ఆంధ్రదేశంలోని
కొన్ని ప్రాంతాలను పాలించారు. వీరి పాలన క్రీస్తుశకం 225 నుండి క్రీస్తుశకం 300
వరకు సాగింది. గుంటూరు, నల్లగొండ, మహబూబ్ నగర్, కృష్ణా, పశ్చిమ గోదావరి,
జగ్గయ్యపేట, మధిర, నేలకొండపల్లి ప్రాంతాలు ఇక్ష్వాకు వంశీయుల
పాలనలో వుండేవి. ఈ వంశంలో శాంతమూల మహారాజు, వీరపురుష
దత్తుడు, ఎహువుల
శాంతమూలుడు, రుళు పురుష
దత్తుడు ఒకరి తరువాత ఒకరు పాలించారు.
శాతవాహన
రాజులు అంతఃకలహాల్లో మునిగి వున్న కాలంలో ఇక్ష్వాకు వంశీయుడైన శాంతమూల మహారాజు
విజయపురిలో స్వాతంత్ర్యం ప్రకటించి, సైన్యాన్ని
సమకూర్చుకొని, ధాన్యకటకం మీద
దండెత్తి, శివమకసద
శాతకర్ణిని ఓడించి, రాజ్యాన్ని
ఆక్రమించి, క్రీస్తు శకం
225 లో ఇక్ష్వాకు రాజ్యాన్ని స్థాపించాడు. రాజకీయ చతురుడు, మహాశూరుడైన శాంతమూల మహారాజు రాజ్యాన్ని
విస్తరించాడు. తనకు వ్యతిరేకంగా ఉన్నవారిని ఓడించి అశ్వమేధ, రాజసూయ యాగాలను చేశాడు. అన్యరాజ వంశీయులతో వివాహ
సంబంధాలు ఏర్పరుచుకున్నాడు. శాంతమూల మహారాజు పరమ వైదికుడు. వైదిక మతోద్దారకుడు. కుమారస్వామి భక్తుడు. పరమత సహనం వున్నవాడు. మాఢరీ
గోత్రంలో జన్మించిన విప్రకన్యను వివాహం చేసుకొన్న శాంతమూల మహారాజు బ్రాహ్మణ వంశ
సంజాతుడు. శాంతమూల మహారాజు సుమారు 20 సంవత్సరాలు (క్రీస్తుశకం 225-245) ఇక్ష్వాకు
రాజ్యాన్ని పాలించాడు. ఈతడి పాలనా కాలంలోనే విజయపురి మహానగరంగా రూపుదిద్దుకున్నది.
శాంతమూల
మహారాజు అనంతరం అతడి కుమారుడు వీరపురుష దత్తుడు ఇక్ష్వాకు రాజయ్యాడు. తండ్రిలాగానే
అన్య రాజవంశీయులతో వివాహ సంబంధాలు ఏర్పరుచుకున్న కారణాన అది ఇక్ష్వాకు రాజ్య
పటిష్టతకు దోహదకారి అయింది. ఉజ్జయినీ రాజకుమార్తె ఆయన పట్టపురాణి. ఇతడు మేనత్త
శాంతిశ్రీ ప్రభావాన బౌద్ధమతాభిమానాన్ని కలిగినవాడు. ఇతడి పాలనాకాలంలో నాగార్జునకొండలోని
బౌద్ధ ఆరామవిహారాలు, చైత్యాలయాలు,
పారావత మహావిహారం, కొత్త అందాలను
సంతరించుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వున్న బౌద్ధ సన్యాసులు, ప్రచారకులు, గురువులు, మతాభిమానులు, వేల
సంఖ్యలో నాగార్జునకొండ బౌద్ధ క్షేత్ర సందర్శనానికి వచ్చేవారు. తనపాలనా కాలంలో
చోటుచేసుకున్న విప్లవాన్ని ద్విగ్విజయంగా అణచి వేశాడు వీరపురుష దత్తుడు. ఇతడు 20
సంవత్సరాలు పాలించాడు.
వీరపురుష
దత్తుడి అనంతరం ఆయన కుమారుడు ఎహువుల శాంతమూలుడు
ఇక్ష్వాకు రాజ్యాన్ని 25 సంవత్సరాలు పాలించాడు. ఇతడి కాలంలో వైదిక, బౌద్ధ మతాలూ ఆదరించబడ్డాయి. ఇతడి తరువాత ఆయన
కుమారుడు రుళుపురుష దత్తుడు సింహాసనాన్ని అధిష్టించి 10 సంవత్సరాలు పాలించాడు. పల్లవ
రాజులు ఇక్ష్వాకులకు బద్ధ విరోధులు. వారు సమయానుకూలంగా ఇక్ష్వాకు రాజ్యభూభాగాల మీద
దండయాత్ర చేసేవారు. రుళుపురుష దత్తుడి కాలంలో ఒక పథకం ప్రకారం విజయపురి రాజ్య
విధ్వంసానికి పూనుకున్నారు.
పల్లవ సింహవర్మ ఇక్ష్వాకు రాజైన రుళుపురుష
దత్తుడిని ఓడించి విజయపురిని ఆక్రమించాడు. అలా ఆక్రమించి పల్లవ రాజ్యాన్ని
స్థాపించాడు. అంతటితో ఇక్ష్వాకు రాజ్యం అంతరించింది.
No comments:
Post a Comment