Sunday, September 26, 2021

విశ్వామిత్రుడిని గంగానదీ వృత్తాంతాన్ని అడిగిన శ్రీరాముడు ...... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-74 : వనం జ్వాలా నరసింహారావు

 విశ్వామిత్రుడిని గంగానదీ వృత్తాంతాన్ని అడిగిన శ్రీరాముడు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-74

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (27-09-2021)

ఆ విధంగా మిగిలిన రాత్రంతా మునీంద్రుల సమూహంతో, శోణ నదీతీరంలో హాయిగా నిద్రించిన "ముని సింహం"-విశ్వామిత్రుడు, తూరుపు తెల్లవారగా మేల్కొని, ఆ సమయంలో చేయాల్సిన స్నాన-సంధ్యావందనాది కార్యక్రమాల నన్నిటినీ పూర్తి చేసుకుని, మిక్కిలి ప్రీతితో-గౌరవంతో-శుభకరమైన మంచి మాటలతో, రామ లక్ష్మణులను మేలుకొలిపాడు. రామ లక్ష్మణులు బ్రహ్మచారులే కనుక, వారికి స్నానం-సంధ్య తప్ప వేరే కృత్యాలు ఉదయాన లేవు. కాబట్టి, తన కార్యక్రమాలన్ని నెరవేర్చుకుని వాళ్లను నిదురలేపుతూ: " నాయనా, రామచంద్రా ! తూర్పు తెల్లవారడం ప్రారంభమయింది. ప్రాతస్సంధ్య సమీపించింది. కమలాక్షా ! సూర్యుడు ఉదయించిన తర్వాత, కమలాలు ముకుళించి వుండవుకదా-కాబట్టి నిద్ర లే. మీరు సంతోషంతో ప్రయాణం చేయాలి-అలా ప్రయాణం చేసేందుకు మీకు మేలు కలగాలి" అని విశ్వామిత్రుడు అనడంతో, వారు నిద్రలేచి, స్నాన-సంధ్యావందనం చేసి, ప్రయాణానికి సిద్ధమయ్యారు. నిర్మలమై-శుభప్రదమై-శుభ్రమైన నీటినిగలదై-ఇసుక దిబ్బలతో సుందరమై-ఎంతో లోతుగా వున్న శోణ నదిని ఎలా దాటాలి అని మునిని అడుగుతాడు శ్రీరాముడు. మునిశ్రేష్ఠులందరు ఎలా దాటుతారో, మనమూ అలానే వెళ్దామని ఆయన జవాబివ్వడం, ఋషేశ్వరులందరూ సంతోషంతో నదిని దాటి, వనంలో ప్రవేశించి, దారి వెంటబడి నడుచుకుంటూ పోయి, మధ్యాహ్నం కల్లా హంసలు-చక్రవాకాలున్న గంగా తీరానికి చేరారు.

మనస్సుకింపైన గంగానదీ తీరంలో ఒక పెద్ద ఇసుక దిబ్బపై విశ్వామిత్రుడి చుట్టూ చేరి కూర్చున్నారందరు. ఆ సమయంలో గంగానదిని చూపిస్తూ, అదెలా మూడు మార్గాల్లో సముద్రాన్ని చేరడానికి కారణమేంటని రాముడు ఆయన్ను ప్రశ్నిస్తాడు. దశరథుడి ముద్దుల కొడుకైన రామచంద్రమూర్తి వేసిన ప్రశ్నకు సంతోషించిన విశ్వామిత్రుడు గంగానదీ వృత్తాంతాన్ని చెప్పసాగాడు. " అనేక రత్నాలను కూడిన శిఖరాలతో ఆకాశాన్నంటుతూ, నానా ధాతు వర్ణాలతో ప్రకాశిస్తూ, మిక్కిలి చల్ల గాలి వీచడంవల్ల అసమానమైనదిగా ప్రసిద్ధిగాంచిన హిమవత్పర్వతం గురించి తెలియనివారు లేరు. ఆ హిమవంతుడు మేరుపర్వతం కూతురైన మేనకనే మనోరమను పెళ్లి చేసుకుని, ఇద్దరు కూతుళ్లను కన్నాడు. వారిలో పెద్దది ’గంగ” , చిన్నది ’ఉమ’. వారిద్దరూ పెరిగి పెద్దవారైతున్నప్పుడు, దేవతలు ఆయన్ను కలిసి, తమ కొరకు గంగను మూడు మార్గాల్లో ప్రవహింపచేసి, అందులో ఒక మార్గాన్ని తమకిమ్మని వేడుకున్నారు. దేహి అని అడిగితే కాదనకూడదనుకున్న హిమవంతుడు, మూడు లోకాలను పావనం చేసేదై-స్వేఛ్చగా చరించేదై-ఆకాశ మార్గంలో పోగలిగేదైన గంగను, వారికి వెంటనే ఇవ్వడంతో వారామెను తమ లోకానికి తీసుకుపోయారు. ఇక రెండో కూతురైన ఉమా దేవి, ఆకులలాలు కూడా తినకుండా, అపర్ణగా, ఘోరమైన తపస్సు చేసింది. హిమవంతుడామెను సమస్త లోకాలు మ్రొక్కే శివుడికిచ్చి పెళ్లి చేశాడు. ఇలా పర్వతరాజు ప్రియపుత్రికలిద్దరు కీర్తిమంతులై ప్రకాశించారు" అని మొట్టమొదట పర్వతరాజు కూతురైన గంగ ఏ విధంగా జన్మించి ఆకాశానికి పోయిందో తెలియచెప్పాడు శ్రీరాముడికి విశ్వామిత్రుడు.

శ్రీరాముడికి గంగ "త్రిపథగ" అయిన వృత్తాంతాన్ని చెప్పిన విశ్వామిత్రుడు

గంగ వృత్తాంతాన్ని సంపూర్ణంగా వినాలన్న కోరికతో శ్రీరామ లక్ష్మణులు, పాప రహితమైన గంగ దేవలోకంలో-మనుష్యలోకంలో ఎలా సంచరించిందని విశ్వామిత్రుడిని అడుగుతారు. ఆమెకంత కీర్తి రావడానికి కారణమేంటని, ఏ పని చేయడంవల్ల ఆమె నదులన్నిటిలో ఉత్తమమైందిగా పిలువబడిందని అడుగుతారు. జవాబుగా, ఋషులందరు వినే విధంగా, రామచంద్రా అని సంబోధిస్తూ గంగా చరిత్రను చెప్పాడు విశ్వామిత్రుడు. "పూర్వకాలంలో శివుడు పార్వతిని పెళ్లి చేసుకుని, సంతోషంగా ఆమెతో నూరు దివ్య సంవత్సరాలు గడిపాడు. అయినా కొడుకు పుట్టలేదు. రేతస్ఖ్సలనం కాలేదు. ఇంతకాలం రేతస్ఖ్సలనం కాకపోతే-అయినప్పుడు ఎంత బలిష్ఠమైనవాడు పుడతాడోననీ, వాడెలాంటివాడవుతాడోననీ, వాడిని భరించడమెట్లాననీ దేవతలు భయపడి, తమ బాధను బ్రహ్మతో చెప్పుకుంటారు. అందరూ వెళ్లి శివుడిని కలిసి, నమస్కరించి, తమ మ్రొక్కులను గ్రహించి తమననుగ్రహించమని వేడుకుంటూ, ఆయన తేజస్సుతో పుట్టబోయే కుమారుడిని లోకాలెన్ని కలిసినా భరించలేవని విన్నవించుకుంటారు. మన్మథ విరోధైన శివుడిని-పార్వతిని, వేదోక్తంగా ఘోర తపస్సు చేయమని కోరుతూ, ఆయన నుండి వెలువడే కాంతి పూరితమైన తన రేతస్సును పార్వతిలో విడువకుండా తనలోనే వుంచుకొమ్మని ప్రార్థిస్తారు. అలా చేస్తే లోకాలన్ని సంతోషిస్తాయని, లోకాలకు అకాల ప్రళయం రాకుండా రక్షించమని స్తోత్రం చేస్తూ ప్రార్థించారు".

(దీన్నే "మహా మైథునం" అని వాడుకలో పిలుస్తారు. పంచమ కారులైన శాక్తేయులకు ఇది పరమ పవిత్రమైన వ్రతం)

"ఇలా ప్రార్థించిన దేవతలను ప్రేమతో చూసిన శివుడు, వారి కోరినట్లే చేస్తానంటాడు. తను వీర్యాన్ని, పార్వతి శోణితాన్ని తమలోనే ధరించెదమని-రెంటినీ కలవనీయమని-వేర్వేరుగా వుంచుతామని అంటూ, మనుష్యులు, దేవతలు సుఖంగా వుండమని చెప్తాడు. ఇలా శివుడు తన గౌరవం అతిశయించే విధంగా చెప్పగా, ఆయన తేజం జారితే, దాన్ని భూదేవి ధరిస్తుందని దేవతలంటారు. అప్పుడు శివుడు దాన్ని వెలుపలకి వదిలాడు. అది, అడవులు-కొండలు తో సహా భూమంతా వ్యాపించే విధం చూసిన దేవతలకు భయమేసింది. వారప్పుడు ఆ శివ తేజస్సును భూమి భరించలేకపోతున్నదని భావించి, అగ్నిహోత్రుడిని-వాయుదేవుడిని సంయుక్తంగా భరించమని కోరగా, అగ్నిహోత్రుడందులో ప్రవేశించాడు. ఆకారణాన అదొక పెద్ద మంచు కొండలాగా యింది. సూర్యాగ్నుల సంపూర్ణ కాంతితో మనోహరంగా లోకసమ్మతమయింది. కాలక్రమంలో అది శరవణం అయింది. దానిలో పుట్టినందున కుమారస్వామి అగ్నిపుత్రుడయ్యాడు. ఆయనే కృత్తికల పుత్రుడై కార్తికేయుడయ్యాడు".

దేవతలను శపించిన పార్వతి

"ఇదంతా జరిగినందున దేవతలపై పగబట్టిన పార్వతి, వారుచేసిన పాప ఫలం అనుభవించమని నిష్ఠురాలాడింది. దోసిట్లో నీళ్లు తీసుకుని, కళ్లల్లో కోపం కనపడుతుంటే, తనకు కొడుకు కనాలన్న కోరికని విఘ్న పరిచిన దేవతల భార్యలు బిడ్డలను కనరని-వారు గొడ్రాళ్లవుతారని శపించింది పార్వతి. ఆ తర్వాత భూమిపైనా కోపించింది పార్వతి. తను బిడ్డలను కనడం సహించలేకపోయిన భూదేవి, అనేక మందికి భార్యగా-అనేక రూపాలుగలిగుండి, ప్రీతితో బిడ్డల్ని కనే సంతోషం లేకుండా పోవాలని శపించింది పార్వతి. అందుకే, భూపుత్రి-సీత-నరకాసురుడు భూ పుత్రులైనా రేతస్సువల్ల గర్భం ధరించి కనే సుఖాన్ని భూమికి కలిగించలేదు. ఇలా పార్వతీదేవి అహంకార-రోషాలతో శపించడంతో దేవతలు సిగ్గుతో తలలు వంచుకుని దుఃఖించారు. వారి దుఃఖం చూడలేక శివుడు పార్వతితో కలిసి హిమవత్పర్వతం ఉత్తర శిఖరానికి తపస్సు చేసేందుకు పోయాడు" ఇలా పార్వతి చరిత్రను ఉపోద్ఘాతంగా చెప్పిన విశ్వామిత్రుడు తదుపరి గంగ చరిత్ర చెప్పసాగాడు.

 

1 comment:

  1. From your postings, I am learning a lot about things I was never taught as a student. Many thanks and regards.

    ReplyDelete