Sunday, October 31, 2021

శివుడి జటాజూటం నుండి బయట కొచ్చిన గంగ ....... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-79 : వనం జ్వాలా నరసింహారావు

 శివుడి జటాజూటం నుండి బయట కొచ్చిన గంగ

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-79

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (01-11-2021)

"బ్రహ్మ దేవుడిలా చెప్పి మాయం కాగానే, భగీరథుడు కాలి బొటనవేలు నేలపై మోపి, నిలబడి, ఏడాదిపాటు శివుడి కొరకు తపస్సు చేశాడు. రెండు చేతులూ పైకెత్తి, ఏ ఆధారం లేకుండా, నిరాధారంగా నిట్టనిడివిగా నిలబడి, శివుడి కొరకు రేయింబవళ్లు తపస్సు చేయడంతో, ఆయన ప్రత్యక్షమైనాడు. భగీరథుడి తపస్సుకు ప్రీతి చెందానని, ఆయన కోరిక ప్రకారమే గంగానదిని తన శిరస్సుపై ధరిస్తానని మాటిస్తాడు. శివుడిలా చెప్పగానే, గర్వాతిశయంలో వున్న ఆకాశ గంగ, ఎలా శివుడు తనను సహించగలుగాతాడో పరీక్షించాలని-ఆయన్నెత్తుకుని పాతాళంలో పడేయాలని నిశ్చయించుకుంటుంది. భయంకరమైన ఆకారంతో, సహించరాని అధికమైన వేగంతో వస్తున్నా ఆకాశ గంగ పొగరు చూసిన శివుడు, రోషంతో విజృంభించి గంగ ఉనికి లేకుండా చేయాలనుకుంటాడు. హిమవత్పర్వతంతో సమానమైన గుహలాంటి రుద్రుడి జడలో భయంకరంగా ప్రవేశించిన ఆకాశ గంగ, వెలుపలకి రాలేక, అందులోనే తిరుగుతూ, చాలా సంవత్సరాలు సుళ్లు తిరుగుతూ బాధననుభవించింది. శివుడి జడలో ప్రవేశించిన గంగ, బయటకు రాలేకపోవడంతో భగీరథుడు మళ్లీ శివిడుగురించి మరింత నిష్ఠతో తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చిన శివుడు, తన జడల గుంపును కొంత సడలించి, ఆ సందులోంచి కొంచం పరిమాణంలో గంగను బిందు సరోవరంలో విడిచాడు. అక్కడినుంచి ఏడు పాయలుగా గంగా నది పారింది. హ్లాదిని, పావని, నళిని అనే మూడు పాయలు తూర్పు ముఖంగా-సుచక్షువు, సీత, సింధు అనే మూడు పాయలు పడమటి దిక్కుగా పారాయి. మిగిలిన ఏడో పాయ భగీరథుడి వెంట వచ్చింది. భగీరథుడు ఆకాశ గమనం గల దివ్యరథాన్నెక్కి- ఆకాశ మార్గంలో పయనం చేస్తుంటే, దేవతల పొగడ్తల మధ్య గంగ భూమ్మీదగా భగీరథుడి వెంట పోయింది. అప్పటి నళిని పాయనే ఇప్పుడు బ్రహ్మపుత్రి నదని అంటున్నారు"

"అలా నిర్మలమైన కాంతితో ఆకాశాన్నుండి చీలిపోయి, శివుడి జటాజూటంలోకి చొరబడి, అక్కడినుంచి భూమి పైకొచ్చి, తాబేళ్లు-చేపల్లాంటి జలచరాలతో నిండి, భూమిపై ప్రవహించ సాగింది గంగ. దేవతలు, మునులు, సురలు, యక్షులు, ఏనుగుల మీద-గుర్రాల మీద-విమానాల మీద అతి వేగంగా ఆకాశం పైకి చేరుకుని, ఆశ్చర్యంగా గంగా పతన దృశ్యాన్ని వీక్షించ సాగారు. దేవతల దేహ కాంతితో-వారు ధరించే ఆభరణాల కాంతితో భూమ్మీదకు దిగుతున్న గంగ కాంతితో, మబ్బుల్లేని ఆకాశం వంద మంది సూర్యులతో నిండినట్లు ప్రకాశించసాగింది. కదలాడే మిడిసిపడుతున్న చేపలు-పాముల గుంపులతో గగనం మెరుపులతో నిండిందా అన్న విధంగా వుంది. నీటి వేగానికి నలు దిక్కులా చెదరిన తెల్లటి నురుగుతో ఆకాశం, హంసలతో-శరత్కాల మేఘాల తునకలతో ప్రకాశిస్తున్నదాననిపించింది. ప్రవహిస్తున్న గంగానది, పల్లపు ప్రదేశాల్లో ధూర్త స్త్రీలాగా వేగంగా పరుగెత్తుతూ-సమ ప్రదేశాల్లో మెల్లగా గంభీరంగా పతివ్రతా స్త్రీలాగా నడుచుకుంటూ-ఇంకొక చోట వేశ్యలాగా వంకర టింకర తోవలో పోతూ-మిట్ట ప్రదేశాల్లో ఆటకత్తెలా గంతులు పెట్టుకుంటూ, తొక్కిసలాడుకుంటూ పోతూ-మరో చోట బలిసిన పిరుదులు కలదానిలా మందంగా నడుచుకుంటూ పోతూ దర్శనమిచ్చింది. పారుతున్న నీటికెదురుగా ఏదైనా అడ్డం వచ్చినప్పుడు, అది వెనక్కు మళ్లడంతో-వెనుకనుండి వస్తున్న నీరు ఈ నీటిని తాకి-కలిసిన నీళ్లు ఎగిరెగిరి పడుతుంటే, ఆ దృశ్యం చూసేవారికి, దరిద్రుడికి ధనం దొరికితే ఎలా మిడిసి పడతాడో అలా వుంది. పవిత్రమైన గంగా జలం శివుడి శిరస్సునుండి పడిందని భావించిన దేవతలు-దేవర్షులు-భూమిపైనున్నవారందరు అందులో స్నానం చేశారు. శాప కారణంగా భూమ్మీదనున్న దేవతలు కూడా గంగా స్నానం చేసి, పాపరహితులై తిరిగి దేవత్వాన్ని పొందారు. భూమ్మీదున్న ప్రజలు కూడా గంగలో స్నానం చేసి తరించారు. ఇలా గంగ భగీరథుడి రథం వెంట పోతుంటే, దాని వెంబడి దేవతల-రాక్షసుల-కిన్నరుల-యక్షుల గుంపులు పోతుండగా, మార్గమధ్యంలో, జహ్నుడు అనే ముని యజ్ఞం చేస్తున్న ప్రదేశాన్ని గంగ నీటితో ముంచింది".

గంగా జలాన్నంతా తాగిన జహ్నుడు

"ఎప్పుడైతే నీటితో గంగ తన యజ్ఞ వాటికను ముంచేసిందో, జహ్నుడు కోపించి, గంగ గర్వం అణచాలనుకొని, నిమిషంలో గంగా జలాన్నంతా తాగేశాడు. అప్పుడు దాని వెంట వస్తున్న మునీంద్రులు-ఇతర దేవతా గణం ఆయన్ను ప్రార్థించి, గంగ ఆయన కూతురుగా ప్రఖ్యాతి వహిస్తుందని చెప్పి, ఆమెను వదిలిపెట్టమని కోరుతారు. వారి మాటలకు సంతోషించిన జహ్నుడు, గంగను తన చెవులలో నుండి బయటకొదిలాడు. గంగ అందువల్ల జాహ్నవిగా పిలువబడుతుంది. గంగ ఆ పిమ్మట భగీరథుడి రథం వెంట పోయి, సముద్రంలో ప్రవేశించి, ఆయన కోరిక నెరవేర్చేందుకు పాతాళానికి పోయి, భగీరథుడి తాతల బూడిదమీద దండిగా ప్రవహించడంతో, సగర పుత్రులంతా దోషరహితులై, స్వర్గానికి పోయారు".

(ఆకాశాన నున్న గంగ, స్థాన భ్రష్టురాలై, మధ్యలో ఆగకుండా, పాతాళ లోకానికి చేరుకుందని దీని సారాంశం. అంటే, ఉన్నత దశలో వున్నవాడు చెడిపోతే అధమాధమ దశకు చేరుకుంటాడు. చెట్టు పైనున్న పండు తొడిమ వూడితే, నేలపై పడుతుంది కాని మధ్యలో ఆగదు. ఉత్తమ బ్రాహ్మణుడు పతితుడై చెడిపోతే నీచుడవుతాడు. స్వబుద్ధితో కాకుండా దైవ వశంలో చెడితే మంచి పనులు చేసి కీర్తి పొందాలి గంగలాగా. గంగ పతనానికి దాని తప్పు కారణం కాదు. అది దైవాజ్ఞ. ఉత్తమ గుణాలు కలిగిన గంగ, దైవాజ్ఞ వల్ల హీన దశకు చేరుకున్నా లోకులను బాగుచేసి కీర్తి గడించింది).

Saturday, October 30, 2021

శాశ్వతమైన కీర్తిని ఆశించే అర్జునుడి పదిపేర్లు, వాటి వివరాలు ..... ఆస్వాదన-44 : వనం జ్వాలా నరసింహారావు

 శాశ్వతమైన కీర్తిని ఆశించే అర్జునుడి పదిపేర్లు, వాటి వివరాలు

ఆస్వాదన-44

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం సంచిక (31-10-2021)

బృహన్నల వేషంలో అజ్ఞాతవాసంలో వున్న ఆర్జునుడిని సారథిగా చేసుకుని ఉత్తర గోగ్రహణం చేసిన కౌరవుల మీదికి యుద్ధానికి పోతాడు విరాటరాజు కొడుకు ఉత్తరుడు. కౌరవసైన్యాన్ని చూసి బెదిరిపోయిన ఉత్తరుడు ఆవులను వాటి పాటికి వాటిని వదిలి పారిపోదామని అంటాడు. తాను ఎట్టి పరిస్థితిలోను యుద్ధం చేయలేనని స్పష్టం చేశాడు (బృహన్నల) అర్జునుడికి. శత్రువులకు బెదిరి పారిపోవడం పిరికితనం అన్నాడు అర్జునుడు. తానుండగా భయపడవద్దని చెప్పాడు. కౌరవ సైన్యం ఆశ్చర్యపడే విధంగా ఆవులమందను విడిపించుకుని తిరిగిపోదాం అన్నాడు. అయినా వినకుండా ఉత్తరుడు రథం దిగి పరుగుతీశాడు. అర్జునుడు రథం దిగి ఉత్తరుడి వెంట పట్టుకోవడానికి పరుగెత్తాడు. చివరకు పట్టుకున్నాడు.

అర్జునుడు ఉత్తరుడిని రథం దగ్గరకు బలవంతంగా తీసుకువచ్చాడు. ధైర్యం నూరిపోశాడు. యుద్ధం చెయ్యకుండా తనకు సారథిగా వుండమని చెప్పాడు. అలా చేస్తే, తాను కౌరవ సైన్యంతో యుద్ధం చేస్తానన్నాడు. ఆవులను కూడా మళ్లిస్తానని నమ్మబలికాడు. ఇద్దరూ కలిసి రథం మీద జమ్మి చెట్టు దగ్గరికి వచ్చారు. వీళ్లిద్దరినీ దూరం నుండి చూస్తున్న కౌరవ వీరులకు బృహన్నల వేషంలో వున్నది అర్జునుడేమో అన్న అనుమానం వచ్చింది. అదే విషయాన్ని భీష్మ, ద్రోణులు చర్చించుకున్నారు.

అర్జునుడు జమ్మిచెట్టు దగ్గర రథాన్ని ఆపి, అ చెట్టుమీద వున్న లక్ష ధనస్సులతో సమానమైన గాండీవాన్ని కిందకు తెమ్మాని ఉత్తరుడికి చెప్పాడు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వారి-వారి ఆయుధాలను కట్టగట్టి ఆ చెట్టుమీద పెట్టారని చెప్పాడు. వాటిలోనుండి ఒక్క గాండీవాన్ని మాత్రం తియ్యమన్నాడు. ఉత్తరుడు ఆ కట్టను విప్పి అందులోని గాండీవాన్ని చూసి, ఆర్జునుడిని ‘సారథీ అని సంబోధిస్తూ, దాన్ని పాండవులలో ఎవరు ఉపయోగిస్తారని ప్రశ్నించాడు. అది అర్జునుడు ఉపయోగిస్తాడని జవాబిచ్చాడు బృహన్నల వేషంలోని అర్జునుడు. అలాగే అందులోని ఏ ధనుస్సు ఎవరు ఉపయోగిస్తారో కూడా వివరించాడు ఉత్తరుడికి అర్జునుడు.

ఈ ఆయుధాలన్నీ జమ్మి చెట్టుమీద పెట్టి పాండవులు ఎక్కడికి పోయారని ఉత్తరుడు ప్రశ్నించాడు. జవాబుగా అర్జునుడు, వాళ్లను గురించి చింతించవద్దనీ, వారంతా 12 సంవత్సరాల అరణ్యవాసం ముగించుకుని, ఒక ఏడాది అజ్ఞాతవాసం పూర్తి చేయడం కొరకు విరాటనగరంలోనే ఏ అపాయం లేకుండా వున్నారని, వారెవరో చెప్తాను వినమని అంటాడు. కంకుభట్టు ధర్మరాజనీ, వలలుడు  భీమసేనుడనీ, గుర్రాలను కాపాడుతున్న దామగ్రంథి నకులుడనీ, గోవులను పాలించే తంత్రీపాలుడుసహదేవుడనీ, తాను అర్జునుడిననీ అన్నాడు. మాలిని (సైరంధ్రి) అనబడే ఆమె ద్రౌపదీదేవి అని చెప్పాడు. అలా అయితే, శాశ్వతమైన కీర్తిని ఆశించే ఆ అర్జునుడికి పది పేర్లున్నాయి, అవి ఏమిటో చెప్తే ఆయనే అర్జునుడు అని నమ్ముతానన్నాడు ఉత్తరుడు.

ఉత్తరుడు అలా అనగానే, అర్జునుడు చిరునవ్వుతో ఆ పదిపేర్లు ఇలా చెప్పాడు. ‘అర్జునుడు, ఫల్గునుడు, పార్థుడు, కిరీటి, శ్వేతవాహనుడు, బీభత్సుడు, విజయుడు, జిష్ణుడు, సవ్యసాచి, ధనంజయుడు. అవి ఎలా వచ్చాయో చెప్పమని మళ్లీ అడిగాడు ఉత్తరుడు. భూమినంతా జయించడం వల్ల ధనంజయుడు అని; రథానికి ఎప్పుడూ తెల్లటి గుర్రాలే కట్టుతాను కాబట్టి శ్వేతవాహనుడు అని; దేవేంద్రుడు ఇచ్చిన (అభేద్యం, భయంకరం, సుస్థిరం) కిరీటం ధరించడం వల్ల కిరీటి అని; యుద్ధంలో శత్రువీరులు ఏవగించుకునే ఏపనీ చేయను కాబట్టి బీభత్సుడు అని; యుద్ధంలో ఏచేతితోనైనా అల్లెతాడు లాగుతాను కాబట్టి సవ్యసాచి అని; అవదాత వర్ణం తన శరీరానికి వున్నది కాబట్టి అర్జునుడు అని; ఉత్తరఫల్గునీ విశిష్ట కాలంలో పుట్టడం వల్ల ఫల్గునుడు అని; యుద్ధంలో ధర్మరాజు శరీరానికి ఎవరైనా గాయం కలిగిస్తే వారిని చంపుతాను కాబట్టి జిష్ణుడు అని; పృథ (కుంతీదేవి) కొడుకును కాబట్టి పార్థుడు ని పది పేర్లు వచ్చాయని చెప్పాడు. వీటికి తోడు కృష్ణుడు అనే మరో పేరు కూడా వున్నట్లు చెప్పాడు.

అర్జునుడే అన్న నమ్మకం ఉత్తరుడికి కలగగానే అతడికి సారథిగా మారిపోయి యుద్ధానికి బయల్దేరారు ఇద్దరూ. గాండీవాన్ని ఎక్కుబెట్టి అర్జునుడు అల్లెతాటిని మోగించాడు. ఆ ధ్వనికి ఆకాశం, దిక్కులూ మారుమోగాయి. ఆ తరువాత దేవదత్తాన్ని పూరించడంతో ఏడు సముద్రాలు అల్లకల్లోలం అయ్యాయి. ఏడు కులపర్వతాలు ఊగిపోయాయి. భూచక్రం అంతా కంపించింది. ఇదంతా విన్న దుర్యోధనుడు తన లెక్క ప్రకారం 13 సంవత్సరాలు పూర్తి కాకుండానే, అంటే, అజ్ఞాతవాసం ముగియకుండానే, అర్జునుడు తమ ఎదుటికి వస్తున్నాడని సంతోషించాడు. అయితే, భీష్ముడికి, ద్రోణుడికి అజ్ఞాతవాసం పూర్తయిందని తెలుసు. దుర్యోధనాదులకు మాత్రం అజ్ఞాతవాసం పూర్తి కాలేదని నమ్మకం. వారి సందేహాన్ని భీష్ముడు తీరుస్తూ ఇలా అన్నాడు.

‘రెండు సంవత్సరాలకు ఒక సారి అధికమాసం వస్తుంది. 13 ఏళ్లలోగా ఇలా వచ్చిన అధికమాసాలను లెక్కించి చూస్తే నిన్నటితో గడువు పూర్తయింది. ఇది తెలిసే అర్జునుడు యుద్ధానికి వస్తున్నాడు. దర్మపరులైన పాండవులు, ధర్మరాజు ఎప్పటికీ అధర్మమార్గంలో పోరు. ఇక్కడ ఒక చక్కటి పద్యం రాశారు కవి తిక్కన:

ఉ:       వచ్చినవాడు ఫల్గును డవశ్యము గెల్తు మనంగరాదు; రా

           లచ్చికినై పెనంగిన బలంబులు రెండును గెల్వ నేర్చునే?

           హెచ్చగు గుందగుం దొడరు టెల్ల విధంబుల కోర్చు; టట్లుగా

           కిచ్చ దలంచి యొక్కమెయి నిత్తఱి బొందగు చేతయుం దగున్

(ఇప్పుడు మనమీదికి దండెత్తి వచ్చిన వాడు అర్జునుడు. మనమే తప్పక జయిస్తామని చెప్పలేం. రాజ్యలక్ష్మి కొరకు పెనుగులాడితే రెండు బలాలు గెల్వలేవుకదా! జయం కలగవచ్చు, కలగక పోవచ్చు! ఇప్పుడు మనం చేయగలిగిందల్లా ఏమి వచ్చినా ఓర్చుకొనడమే. అంతే కాకుండా ఒకరకంగా ఇప్పుడు సంధి చేసుకోవడం కూడా మంచి పనే!)   

దీన్ని విశ్లేషిస్తూ డాక్టర్ మేడవరం వేంకట నారాయణశర్మ గారు ఇలా రాశారు: “ఈ పద్యం తెలుగునాట బాగా ప్రచారంలో ఉన్నది. ‘వచ్చినవాడు ఫల్గునుడు’ అనడం ఒక లోకోక్తి. అంటే వచ్చినవాడు సామాన్యుడు కాడని భావం. భీష్ముడి మనోభావం దీనివల్ల తెలుస్తున్నది. సంధి మంచిదని భీష్ముడి అభిప్రాయం. అంతేకాకుండా దుర్యోధనుడికి సూచన కూడ. ‘వచ్చినవాడు ఫల్గునుడు’ అనడంలో ఒక బెదిరింపు, జాగ్రత్త అన్న సూచన వున్నది. భీష్ముడి రాజనీతి కూడా తెలుపుతున్నది. ఏమివచ్చినా ఓర్చుకోవాలని హితం కూడా చెప్పాడు. గెలుపు నిశ్చయం కానప్పుడు అన్ని విధాలా సంధి మేలని సలహా. ఇన్ని భావాలకు సమాశ్రయం అయిన ఈ పద్యం తిక్కన ప్రతిభావిశేషజన్యమే. అసలు పద్యం ఎత్తుగడే ఉదాత్తంగా ఉన్నది. భీష్ముడంతడి వాడి అనుభవపూర్వకమైన ఇలాంటి సూచనను కూడా దుర్యోధనుడు గమనించలేదు”.

భీష్ముడి మాటలను లెక్కచేయకుండా దుర్యోధనుడు, యుద్ధంలో పరాక్రమాన్ని చూపడానికే నిర్ణయించానని స్పష్టం చేశాడు. యుద్ధం మొదలైంది. ఉత్తరకుమారుడు సారథిగా అర్జునుడు యుద్ధానికి దిగాడు. ఉత్తరుడికి భీష్మద్రోణుల యుద్ధ వ్యూహాన్ని వివరించాడు. రథాన్ని సేనవైపుకు పోనీయమన్నాడు. ఉత్తరుడు అర్జునుడు చెప్పినట్లే రథాన్ని తోలాడు. ద్రోణాచార్యుడు ఆర్జునుడిని చూసి ప్రశంసించాడు. యుద్ధారంభంలో అర్జునుడు చిరునవ్వు నవ్వుతూ ఉత్తరుడికి కౌరవ వీరుల పరిచయం చేస్తూన్నప్పుడు తిక్కన అద్భుతమైన పద్యాన్ని రాశాడు ఈ విధంగా:

సీ:       ‘కాంచనమయ వేదికా కనత్కేతనో | జ్జ్వల విభ్రమమువాఁడు కలశజుండు;

సింహ లాంగూల భూషిత నభోభాగ కే | తు ప్రేంఖణమువాఁడు ద్రోణసుతుఁడు;

కనక గోవృష సాంద్రకాంతి పరిస్ఫుట | ధ్వజ సముల్లాసంబువాఁడు కృపుఁడు;

లలితకంబుప్రభాకలిత పతాకా వి | హారంబువాఁడు రాధాత్మజుండు;          

 

తే. మణిమయోరగ రుచిజాల మహితమైన | పడగవాఁడు కురుక్షితిపతి; మహోగ్ర

శిఖరఘన తాళతరువగు సిడమువాఁడు | సురనదీసూనుఁ; డేర్పడఁ జూచికొనుము.

         (ద్రోణుడిని, అశ్వత్థామను, కృపాచార్యుడిని, కర్ణుడిని, దుర్యోధనుడిని, భీష్ముడిని, పరిచయం చేశాడు అర్జునుడు ఉత్తరుడికి).

         చివరకు విజయం ఆర్జునుడిని వరించింది.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, విరాటపర్వం, చతుర్థ-పంచమాశ్వాసాలు  

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

Sunday, October 24, 2021

యజ్ఞాశ్వాన్ని వెతికేందుకు పోయిన అంశుమంతుడు ....... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-78 : వనం జ్వాలా నరసింహారావు

 యజ్ఞాశ్వాన్ని వెతికేందుకు పోయిన అంశుమంతుడు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-78

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (25-10-2021)

"కొడుకులు పోయి చాలా రోజులైందని, ఇంతకాలమైనా రాలేదని, వారి జాడ తెలవడంలేదని, యజ్ఞం పూర్తికాలేదని చింతించిన సగరుడు తన ముద్దుల మనుమడైన అంశుమంతుడిని పంపి అతడి పిన తండ్రులేమైనారో తెలుసుకుందామనుకున్నాడు. అంశుమంతుడు చిన్నవాడైనా విద్యావంతుడని-విలువిద్యలో చక్కగా చేయి తిరిగినవాడని, శూరుల్లో గొప్పవాడని, ధైర్యంలో ఉత్తమ పురుషులకుండాల్సిన సుగుణాలన్నీ వున్నాయని అంటూ అతడిని వెళ్లి పిన తండ్రుల జాడ, గుర్రం జాడ కనుక్కొని, యజ్ఞాన్ని నిర్వహించేటట్లు చేయమని కోరతాడు సగరుడు. భూమండలంలో బలవంతులను ఎదిరించి-వధించడానికి విల్లు బాణాలను తీసుకుని పొమ్మని, మొక్కదగిన వారికి మొక్కమని, అతడి కార్యాన్ని విఘ్నం చేయదల్చినవారిని చంపమని, ఎలాగైనా కార్యసాధకుడై ఆలస్యం చేయకుండా తిరిగి రమ్మని అంటాడు సగరుడు. సరేనన్న అంశుమంతుడు, వెంటనే ఆయుధాలు ధరించి, పినతండ్రులు వెళ్లిన మార్గంలో పయనించి-భూమిలో ప్రవేశించి, అక్కడ మేరుపర్వతంతో సమానమైన పెద్ద దిగ్గజాన్ని చూసి-ప్రదక్షిణ చేసి పినతండ్రుల జాడ చెప్పమంటాడు. సూర్యవంశంలో జన్మించిన అంశుమంతుడు, శీఘ్ర కాలంలోనే గుర్రాన్ని పొందుతాడని-కార్యాన్ని సాధించుకుని సుఖంగా ఇంటికి చేరతాడని ఆ ఏనుగు అంటుంది. ఆ స్థలాన్ని విడిచి వరుసగా దిగ్గజాలన్నిటినీ చూసుకుంటూ, పిన తండ్రుల జాడ-గుర్రం జాడ చెప్పమని ప్రార్థించాడు. యజ్ఞాశ్వాన్ని తీసుకుని త్వరలోనే అయోధ్యకు వెళ్తావన్న దిగ్గజాల మాట ప్రకారం, అవి పొమ్మన్న దారిలో పోతూ, పిన తండ్రుల బూడిద రాసులను చూసి-దుఃఖాన్ని ఆపుకోలేక, వాళ్లు మరణించినందుకు భోరున విలపిస్తాడు. కళ్లనుండి నీళ్లు ప్రవాహంలాగా వస్తుంటే, అక్కడే మేత మేస్తున్న గుర్రాన్ని గమనించి, ముందుగా మరణించిన వారికి తర్పణాలు వదలాలని, ఆ సమీపంలో ఎక్కడన్నా నీళ్లున్నాయేమోనని వెతుకుతాడు".

"ఎంత వెతికినా ఎక్కడా నీళ్లు కనపడక పోవడంతో, ఏం చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు, అంశుమంతుడు పినతండ్రులకు మేనమామైన గరుత్మంతుడిని చూస్తాడు. అతడుకూడా రాజకుమారుడిని చూసి, సగరుడి పుత్రుల మరణం లోకసమ్మతమైందేనని, దానికి అతడు చింతించాల్సిన పనిలేదని అంటాడు. పరిమాణమింతని చెప్పనలవికాని విష్ణుమూర్తి, కపిలుడి ఆకారంలో వచ్చి, వాళ్లు చేసిన దుండగానికి కోపించి-చంపి బూడిద చేశాడని, క్షత్రియుడైన అంశుమంతుడు పరాక్రమవంతుల మరణానికి విలపించకూడదని నచ్చచెపుతాడు.

గంగను తెమ్మని అంశుమంతుడికి బోధించిన గరుత్మంతుడు

బ్రాహ్మణ కోపంతో చచ్చిపోయినవారికి, తగిన రీతిలో ఉదక దానం చేస్తేనే ఊర్థ్వగతులుంటాయని, అందువల్ల యోగ్యమైన పుణ్య తీర్థాలలోని నీళ్లతోనే ఉదక దానం చేయాలని, మామూలు తటాకాలలోని నీళ్లతో కాదని అంటాడు గరుత్మంతుడు. హిమవంతుడి పెద్ద కూతురైన గంగాదేవిని తెచ్చి, ఆ నీళ్లతో ఉదక దానం చేస్తేనే వారికి ఊర్థ్వ లోకాలు కలుగుతాయని, పవిత్రమైన ఆచారాలను పాటించే అంశుమంతుడు, వాళ్ల భస్మ రాసులమీద లోకపావనైన గంగను పారిస్తే, వారంతా నరకానికి పోకుండా గౌరవంగా స్వర్గానికి పోయి చెప్ప సాధ్యపడని సౌఖ్య పరంపరలను అనుభవిస్తారని అంటాడు. సమీపంలో వున్న గుర్రాన్ని తీసుకెళ్లి తాత చేస్తున్న యాగాన్ని పూర్తిచేయమని కూడా సలహా ఇస్తాడు. గరుత్మంతుడి మాట ప్రకారం అంశుమంతుడు గుర్రంతో తాత వున్న చోటుకు పోయి, ఆయనకు సంగతంతా చెప్పాడు. సగరుడు పుత్రశోకంలో వున్నప్పటికీ, మొదలుపెట్టిన అశ్వమేధ యజ్ఞాన్ని సాంతంగా నెరవేర్చి, అయోధ్యకు పోయి, ఆకాశగంగను భూమి పైకి ఎలాతేవాలో తెలియక, ఆ ఆలోచనతోనే ముప్పై ఏళ్లు భూమిని పరిపాలించి స్వర్గానికి పోయాడు".

గంగను తెచ్చేందుకు తపస్సు చేసిన భగీరథుడు

             "సగరుడి మరణం తర్వాత మంత్రులు, సామంతులు, ధర్మనిష్ఠుడైన అంశుమంతుడినే రాజు కమ్మని కోరినప్పటికీ, అతడు, తన కొడుకైన మహా బలసంపన్నుడు దిలీపుడిపై రాజ్యభారం మోపి, హిమవత్పర్వతానికి పోయి గంగకొరకు ముప్పైరెండు వేల సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. చివరకు గంగను తేలేక మరణించాడు. తదనంతరం, దిలీపుడు గంగ నెలా తేవాలని-పితృల ఋణం ఎలా తీర్చుకోవాలని-గంగను తెచ్చి సగర పుత్రుల బూడిదరాసులనెలా తడపాలని-ఆ నీళ్లతోనే ఉదకాల నెలా వదలాలని-అదెట్లా సాధ్యపడుతుందని, విచారపడుతూ, అనేక యాగాలుచేసి, ముప్పైవేల ఏళ్లు పరిపాలన చేసి, శోకంతో-వికలమైన మనస్సుతో తుదకు తన కొడుకైన భగీరథుడిని రాజుగా చేసి మరణించాడు. భగీరథుడు రాజర్షిగా వుండి, పిల్లలులేనివాడైనందున, రాజ్యాన్ని మంత్రుల పరంచేసి, గంగను తెచ్చేందుకు గోకర్ణానికి తపస్సు చేసేందుకు పోతాడు. అక్కడ, పంచాగ్నుల (నాలుగు పక్కల మంటలు-పైన సూర్యుడు) మధ్య ఇంద్రియాలను జయించి, చలించని మనస్సుతో, వేయి సంవత్సరాలు చేతులెత్తి-గాలివానలను లక్ష్యంచేయకుండా-నెలకొక్కసారిమాత్రమే కంద మూలాలను తింటూ, గొప్ప తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు, దేవర్షులు తనను సేవిస్తుంటే ఆయన దగ్గరకు వచ్చి, అసమానమైన తపస్సు చాలించి ఆయనకోరికేదో తనకు తెలియచేయమని భగీరథుడితో అంటాడు".

"సౌజన్యమే ధనమనుకునే భగీరథుడు, తనననుగ్రహించి సగరకుమారులందరికి తాను తర్పణాలు వదిలేటట్లు చేయమని, బ్రహ్మదేవుడిని ప్రార్థించాడు. గంగా తీర్థంతో తన తాతల బూడిద రాసులను తడిపితే వారందరు స్వర్గానికి పోతారని-అలా వరమివ్వమనీ, తనకు పుత్రులనిచ్చి ఇక్ష్వాకుల వంశాన్ని నిలబెట్టమనీ బ్రహ్మనడిగాడు భగీరథుడు. ఆయన కోరినట్లే జరుగుతుందనీ, అయితే, ఆకాశగంగ భూమిపై పడితే ఆ వేగాన్ని-భారాన్ని భూమి భరించలేదుకాబట్టి దాన్ని భరించేందుకు శివుడిని ప్రార్థించమని సూచిస్తాడు. భగీరథుడికలా చెప్పి, తన మాట ప్రకారం ఆ పుణ్య చరితుడి కోరిక తీర్చేందుకు భూలోకానికి పొమ్మని గంగకు కూడా చెప్పి అంతర్థానమయ్యాడు ".

 

Saturday, October 23, 2021

ధర్మరాజున్న దేశంలో గో సంపదలు అభివృద్ధి చెందుతాయన్న భీష్ముడు ...... ఆస్వాదన-43 : వనం జ్వాలా నరసింహారావు

ధర్మరాజున్న దేశంలో గో సంపదలు అభివృద్ధి చెందుతాయన్న భీష్ముడు

ఆస్వాదన-43

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం సంచిక (24-10-2021)

అజ్ఞాతవాసంలో వున్న పాండవుల ఉనికిని గుర్తించడానికి దుర్యోధనుడు నలుదిక్కులా వేగులను పంపాడు. వారు అనేక రకాలుగా విడిపోయి, అనేక దేశాలలో తిరిగి, అనేక విధాలుగా వెతికి, విసిగి-వేసారి, పాండవులను చూడలేక తిరిగి ఒక సంకేత స్థలానికి చేరుకుంటారు. వారు చేసిన ప్రయత్నాలన్నీ దుర్యోధనుడికి తెలియచేసి, ఆయన ఆజ్ఞానుసారం నడుచుకోవాలని నిర్ణయించుకుంటారు. వారి ఉద్దేశంలో పాండవులు చనిపోయి వుంటారని, బతికి వుంటే కనపడేవారని. ఈ విషయమే ప్రభువుకు చెప్పి దాంతోపాటే మరొక మాట చెప్తారు.

మత్స్యదేశాధిపతైన విరటుడి బావమరది కీచకుడిని, పవిత్ర మూర్తైన ఒక సుందరాంగి కారణంగా అర్థరాత్రి వేళ గంధర్వులు అతి రహస్య పద్ధతిలో చంపారని, ఆ చంపడం కూడా ఆశ్చర్యకరంగా చంపారని, ఆయుధాలు వాడలేదని, పీనుగును ముద్దగా చేశారని, కీచకుడి తమ్ముళ్లను కూడా చంపారని, వారి చావు ఎలా జరిగిందో ఇదమిత్థంగా చెప్పలేమని అన్నారు. ఆ మాటలు విన్న దుర్యోధనుడు వేగుల వాళ్లను వెళ్లిపొమ్మని ఆలోచనలో పడి, పాండవులను ఎలాగైనా తెలుసుకోవాలని మంత్రులకు చెప్పాడు. దుశ్శాసనుడు మాత్రం వాళ్లు చనిపోయి వుంటారని అన్నాడు.

అక్కడే వున్న ద్రోణాచార్యుడు, ఉత్తమ క్షత్రియ గుణాలున్న పాండవులను, దైవబలంతో ప్రకాశించే పుణ్యాత్ములైన పాండవులను గుర్తించడం అంత సులభం కాదనీ, వారికి ఆపదలు కలగవనీ, అది అసంభవం అనీ స్పష్టం చేశాడు. అలాగే భీష్మాచార్యుడు ధర్మరాజు గుణగణాలను దుర్యోధనుడికి చెప్పాడు. ద్రోణుడు చెప్పింది నిజమేననీ, పాండవులు బాహుబలం, బుద్ధిబలం, దైవబలం కలిగి వ్యవహరిస్తారని, అలాంటి మహాత్ములకు ఆపదలు ఎక్కడినుండి వస్తాయని, ఆ మహానుభావులను గుర్తించడం అసాధ్యమని అంటాడు. భీష్ముడు వారున్న చోటు తనకు తెలియదు కానీ, వారున్న చోటుని గుర్తించటానికి కొన్ని లక్షణాలు చెబుతాను విను చెప్పాడు. తనను సలహా అడిగారు కాబట్టి తనకు తెలిసిన వాస్తవాన్ని దుర్యోధనుడికి తెలియచెప్తానని అంటూ, ధర్మరాజు గుణగణాలను విశ్లేషించాడు. అప్పుడు తిక్కన చక్కటి పద్యాన్ని రాశారు ఈ విధంగా:

సి:       బ్రాహ్మణభక్తియుఁ, బరహిత శక్తియు నిర్మల మతియును, నీతి రతియు,

సత్యభాషణమును, సాధుపోషణమును జిరవితరణమును, సేవ్యగుణము,

సన్మార్గరక్షయు, నున్మత్తశిక్షయు నంచితోదయముఁ, గృపాతిశయము,

బంధు సంప్రీతియు, భవ్య విభూతియు శాస్త్రోపగమము, నస్ఖలితదమము

 

తే:       సజ్జన స్తవనీయ సౌజన్యములును ధర్మసంచిత బహు ధన ధాన్యములును

గలుగు నక్షీణ పుణ్యదోహలుఁడు ధర్మ సూనుఁ డున్న దేశంబున మానవులకు

(ధర్మరాజు నశించని పుణ్యాలను సాధించిన మహానుభావుడు. అతడే దేశంలో వుంటే ఆ దేశ ప్రజలు పుణ్యవ్రతులుగానే వుంటారు. వారు బ్రాహ్మణులమీద భక్తి, ఇతరుల సేవచేసే శక్తీ, నిష్కల్మషమైన బుద్ధీ, నీతివర్తనంలో అనురక్తీ, నిజం పలకడం, మంచివారిని గౌరవించడం, చాలాకాలం నిలిచే దానాలు చేయడం, సద్గుణశీలం, సన్మార్గ రక్షణం, దుష్ట శిక్షణం, న్యాయమైన అభ్యుదయం, దయావేశం, బందుజనాభిమానం, మాననీయ వైభవం, శాస్త్ర విజ్ఞానం, జారిపోని ఇంద్రియ నిగ్రహం, మంచివారు మెచ్చుకునే మంచితనం, న్యాయార్జితాలైన బహువిధ ధనధాన్యాల సంభారం కలిగి వుంటారు).

   

దీన్ని విశ్లేషిస్తూ సింగరాజు సచ్చిదానందం గారు ఇలా రాశారు: “ఈ సీస పద్యంలో మొత్తం 18 గుణాలు చెప్పబడ్డాయి. బ్రహ్మసంఖ్యలో వున్న ఈ మహనీయ గుణాలు ధర్మజుడి అక్షీణపుణ్యాలు. ఒక మహానుభావుడి వ్యక్తిత్వం మానవ ప్రకృతుల మీద వేసే ప్రభావాన్ని ఈ పద్యంలో వర్ణించి, పశుపక్ష్యాది జంతుజీవజాలం మీద పడే ప్రభావాన్ని ఆ తరువాత చెప్పాడు”.

చివరగా భీష్ముడు ఇలా అన్నాడు: “ధర్మరాజు వున్న చోట గోసంపద పెరుగుతుంది. పాడిపంటలు పరవళ్లు తొక్కుతుంటాయి. కాబట్టి అలాంటి లక్షణాలున్న దేశం ఏదో గుర్తించి, అక్కడ పాండవులను వెతకాలి”.

భీష్ముడు చెప్పిన గుర్తులన్నీ విరటుడి దేశంలో వున్నాయని, కాబట్టి ఆదేశం మీదికి దండెత్తిపోయి అతడి గోసంపదను గ్రహిస్తే ధర్మరాజు, అతడి తమ్ములు అడ్డగిస్తారని, అప్పుడు వారి అజ్ఞాతవాస దీక్ష భంగం అయిందని చెప్పాలని నిర్ణయించాడు దుర్యోధనుడు. అదే ఉత్తర-దక్షిణ గోగ్రహణాలకు నాంది.    

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, విరాటపర్వం, తృతీయాశ్వాసం  

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)