మాళవ గుప్త వంశం (బ్రాహ్మణ రాజులు-13)
(స్వర్గీయ
బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)
వనం
జ్వాలా నరసింహారావు
గుప్త
చక్రవర్తుల సామంతులుగా మాళవ గుప్తులు వ్యవహరించబడ్డారు. గుప్తరాజ్య పతనానంతరం ఈ
వంశీయులు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నారు. అప్షద్ శాసనం వల్ల వీరు నృపశబ్ద
వాచ్యులని అర్థమవుతున్నది. ఈ వంశీయుల వారైన కృష్ణగుప్త, హర్షగుప్త, జీవితగుప్తులు
గుప్త చక్రవర్తుల సామంతులుగా వుండి, అనేక యుద్ధాలను చేశారు. ఈ వంశీయులలో నాల్గవ వాడైన
కుమారగుప్తుడు అతి బలసంపన్నుడు. గొప్ప విజేత. అతడు మౌఖరి ఈశానవర్మను యుద్ధంలో
ఓడించి విజయుడై, ఈ వంశ
విజయానికి, అభ్యుదయానికి
తోడ్పడ్డాడు.
కుమారగుప్తుడి అనంతరం అతడి కుమారుడు
దామోదర గుప్తుడు మౌఖరులను ఓడించాడు. ఆ తరువాత మౌఖరి ప్రభువులు ఇతడిని ఓడించారు.
దామోదర గుప్తుడి కుమారుడు మహాసేన గుప్తుడు. ఇతడు పాలనా బాధ్యతలు వహించేనాటికి మాళవ
గుప్త రాజ్యం తూర్పు మాళవం దాకా అనగా లోహితీ నది పర్యంతం వ్యాపించినది. ఈ వంశీయులు
సుస్థిరవర్మను ఓడించి కామరూప రాజ్యాన్ని ఆక్రమించారు. మహాసేన గుప్తుడు దండయాత్రలు
నిర్వహించి విజయాలు సాధించినప్పటికీ, చాలాకాలం
జయించిన భూ భాగాలను నిల్పుకోలేకపోయాడు. వల్లభిరాజు మొదటి శిలాదిత్యుడు దండయాత్ర
నిర్వహించి పశ్చిమ మాళవ రాజ్యాన్ని జయించాడు. కాలచురి శంకర గణరాజు ఉజ్జయినీ
నగరాన్ని క్రీస్తుశకం 595 లో జయించాడు. ఇదే సమయంలో మహాసేన గుప్తుడు మాళవ రాజ్యం
మీద తన అధీనాన్ని కోల్పోయాడు. అతడి సామంతుడైన శశాంకుడు వంగ దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలో స్వాతంత్ర్యాన్ని
ప్రకటించుకున్నాడు.
మహాసేన గుప్తుడి ఇద్దరు కుమారులు కుమార
గుప్తుడు, మాధవ గుప్తుడు
రాజ్యంలేక స్థానేశ్వర ప్రభువైన ప్రభాకరవర్మ శరణుజొచ్చారు. మహాసేన గుప్తుడి సోదరి
మహాసేన గుప్త ప్రభాకర వర్ధనుడి మాతృమూర్తి. కుమార గుప్తుడికి, మాధవ గుప్తుడికి ఆమె మేనత్త. మాధవ గుప్తుడు
స్తానేశ్వరంలో పెరిగి పెద్దవాడయ్యాడు. అతడి కుమారుడు ఆదిత్య గుప్తుడు. ఆదిత్య
సేనుడి పినతండ్రి కుమారుడు దేవగుప్తుడు. ప్రభాకర వర్ధనుడి సహాయంతో తన పూర్వుల
రాజ్యాన్ని సాధించాడు.
ఇదిలా వుండగా దేవగుప్తుడు మాళవ
రాజ్యాన్ని ఆక్రమించి పాలించాడు. కాకపోతే సంపూర్ణంగా జయించలేదు. దేవగుప్తుడు
శశాంకుడి స్వాతంత్ర్యాన్ని అంగీకరించి అతడితో స్నేహంగా వుండేవాడు. మహాసేన గుప్తుడి
మనుమడు, మాధవ గుప్తుడి కుమారుడు ఆదిత్యగుప్తుడు , దేవగుప్తుడి తరువాత మాళవ
రాజ్యాన్ని ఆక్రమించి మగథను సాధించి, గుప్త వంశపు
కీర్తిని పునరుద్ధరించాడు.
మహాసేన గుప్తుడి వరకు ఈ రాజ వంశీయులు
మాళవ రాజ్య పాలకులుగా వుండేవారు. తరువాత మగథ రాజ్యాన్ని ఏలారు. మహాసేన గుప్తుడు
మగథ, గౌడ రాజ్యాలను
జయించి పాలించాడు. అతడు తన రాజ్యంలోని ప్రాగ్భాగాలను కోల్పోయినప్పటికీ, వున్న మగథ రాజ్యాన్ని పాలించాడు. ఆదిత్యగుప్తుడి
అనంతరం అతడి కుమారుడు, ఆ తరువాత అతడి
కుమారుడు రెండవ జీవిత గుప్తుడు మాళవ గుప్త రాజ్యాన్ని పాలించారు.
No comments:
Post a Comment