Saturday, October 23, 2021

ధర్మరాజున్న దేశంలో గో సంపదలు అభివృద్ధి చెందుతాయన్న భీష్ముడు ...... ఆస్వాదన-43 : వనం జ్వాలా నరసింహారావు

ధర్మరాజున్న దేశంలో గో సంపదలు అభివృద్ధి చెందుతాయన్న భీష్ముడు

ఆస్వాదన-43

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం సంచిక (24-10-2021)

అజ్ఞాతవాసంలో వున్న పాండవుల ఉనికిని గుర్తించడానికి దుర్యోధనుడు నలుదిక్కులా వేగులను పంపాడు. వారు అనేక రకాలుగా విడిపోయి, అనేక దేశాలలో తిరిగి, అనేక విధాలుగా వెతికి, విసిగి-వేసారి, పాండవులను చూడలేక తిరిగి ఒక సంకేత స్థలానికి చేరుకుంటారు. వారు చేసిన ప్రయత్నాలన్నీ దుర్యోధనుడికి తెలియచేసి, ఆయన ఆజ్ఞానుసారం నడుచుకోవాలని నిర్ణయించుకుంటారు. వారి ఉద్దేశంలో పాండవులు చనిపోయి వుంటారని, బతికి వుంటే కనపడేవారని. ఈ విషయమే ప్రభువుకు చెప్పి దాంతోపాటే మరొక మాట చెప్తారు.

మత్స్యదేశాధిపతైన విరటుడి బావమరది కీచకుడిని, పవిత్ర మూర్తైన ఒక సుందరాంగి కారణంగా అర్థరాత్రి వేళ గంధర్వులు అతి రహస్య పద్ధతిలో చంపారని, ఆ చంపడం కూడా ఆశ్చర్యకరంగా చంపారని, ఆయుధాలు వాడలేదని, పీనుగును ముద్దగా చేశారని, కీచకుడి తమ్ముళ్లను కూడా చంపారని, వారి చావు ఎలా జరిగిందో ఇదమిత్థంగా చెప్పలేమని అన్నారు. ఆ మాటలు విన్న దుర్యోధనుడు వేగుల వాళ్లను వెళ్లిపొమ్మని ఆలోచనలో పడి, పాండవులను ఎలాగైనా తెలుసుకోవాలని మంత్రులకు చెప్పాడు. దుశ్శాసనుడు మాత్రం వాళ్లు చనిపోయి వుంటారని అన్నాడు.

అక్కడే వున్న ద్రోణాచార్యుడు, ఉత్తమ క్షత్రియ గుణాలున్న పాండవులను, దైవబలంతో ప్రకాశించే పుణ్యాత్ములైన పాండవులను గుర్తించడం అంత సులభం కాదనీ, వారికి ఆపదలు కలగవనీ, అది అసంభవం అనీ స్పష్టం చేశాడు. అలాగే భీష్మాచార్యుడు ధర్మరాజు గుణగణాలను దుర్యోధనుడికి చెప్పాడు. ద్రోణుడు చెప్పింది నిజమేననీ, పాండవులు బాహుబలం, బుద్ధిబలం, దైవబలం కలిగి వ్యవహరిస్తారని, అలాంటి మహాత్ములకు ఆపదలు ఎక్కడినుండి వస్తాయని, ఆ మహానుభావులను గుర్తించడం అసాధ్యమని అంటాడు. భీష్ముడు వారున్న చోటు తనకు తెలియదు కానీ, వారున్న చోటుని గుర్తించటానికి కొన్ని లక్షణాలు చెబుతాను విను చెప్పాడు. తనను సలహా అడిగారు కాబట్టి తనకు తెలిసిన వాస్తవాన్ని దుర్యోధనుడికి తెలియచెప్తానని అంటూ, ధర్మరాజు గుణగణాలను విశ్లేషించాడు. అప్పుడు తిక్కన చక్కటి పద్యాన్ని రాశారు ఈ విధంగా:

సి:       బ్రాహ్మణభక్తియుఁ, బరహిత శక్తియు నిర్మల మతియును, నీతి రతియు,

సత్యభాషణమును, సాధుపోషణమును జిరవితరణమును, సేవ్యగుణము,

సన్మార్గరక్షయు, నున్మత్తశిక్షయు నంచితోదయముఁ, గృపాతిశయము,

బంధు సంప్రీతియు, భవ్య విభూతియు శాస్త్రోపగమము, నస్ఖలితదమము

 

తే:       సజ్జన స్తవనీయ సౌజన్యములును ధర్మసంచిత బహు ధన ధాన్యములును

గలుగు నక్షీణ పుణ్యదోహలుఁడు ధర్మ సూనుఁ డున్న దేశంబున మానవులకు

(ధర్మరాజు నశించని పుణ్యాలను సాధించిన మహానుభావుడు. అతడే దేశంలో వుంటే ఆ దేశ ప్రజలు పుణ్యవ్రతులుగానే వుంటారు. వారు బ్రాహ్మణులమీద భక్తి, ఇతరుల సేవచేసే శక్తీ, నిష్కల్మషమైన బుద్ధీ, నీతివర్తనంలో అనురక్తీ, నిజం పలకడం, మంచివారిని గౌరవించడం, చాలాకాలం నిలిచే దానాలు చేయడం, సద్గుణశీలం, సన్మార్గ రక్షణం, దుష్ట శిక్షణం, న్యాయమైన అభ్యుదయం, దయావేశం, బందుజనాభిమానం, మాననీయ వైభవం, శాస్త్ర విజ్ఞానం, జారిపోని ఇంద్రియ నిగ్రహం, మంచివారు మెచ్చుకునే మంచితనం, న్యాయార్జితాలైన బహువిధ ధనధాన్యాల సంభారం కలిగి వుంటారు).

   

దీన్ని విశ్లేషిస్తూ సింగరాజు సచ్చిదానందం గారు ఇలా రాశారు: “ఈ సీస పద్యంలో మొత్తం 18 గుణాలు చెప్పబడ్డాయి. బ్రహ్మసంఖ్యలో వున్న ఈ మహనీయ గుణాలు ధర్మజుడి అక్షీణపుణ్యాలు. ఒక మహానుభావుడి వ్యక్తిత్వం మానవ ప్రకృతుల మీద వేసే ప్రభావాన్ని ఈ పద్యంలో వర్ణించి, పశుపక్ష్యాది జంతుజీవజాలం మీద పడే ప్రభావాన్ని ఆ తరువాత చెప్పాడు”.

చివరగా భీష్ముడు ఇలా అన్నాడు: “ధర్మరాజు వున్న చోట గోసంపద పెరుగుతుంది. పాడిపంటలు పరవళ్లు తొక్కుతుంటాయి. కాబట్టి అలాంటి లక్షణాలున్న దేశం ఏదో గుర్తించి, అక్కడ పాండవులను వెతకాలి”.

భీష్ముడు చెప్పిన గుర్తులన్నీ విరటుడి దేశంలో వున్నాయని, కాబట్టి ఆదేశం మీదికి దండెత్తిపోయి అతడి గోసంపదను గ్రహిస్తే ధర్మరాజు, అతడి తమ్ములు అడ్డగిస్తారని, అప్పుడు వారి అజ్ఞాతవాస దీక్ష భంగం అయిందని చెప్పాలని నిర్ణయించాడు దుర్యోధనుడు. అదే ఉత్తర-దక్షిణ గోగ్రహణాలకు నాంది.    

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, విరాటపర్వం, తృతీయాశ్వాసం  

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

    

No comments:

Post a Comment