Saturday, October 2, 2021

సౌందర్యాన్ని అలంకారికంగా వర్ణించిన తిక్కన మేటి పద్యం ..... ఆస్వాదన-40 : వనం జ్వాలా నరసింహారావు

 సౌందర్యాన్ని అలంకారికంగా వర్ణించిన తిక్కన మేటి పద్యం

ఆస్వాదన-40

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం సంచిక (03-10-2021)

ఆశ్చర్యాన్ని కలిగించే ద్రౌపది సౌందర్యం కీచకుడి హృదయాన్ని భరించలేనిదయింది. అతడి మనస్సు కలత చెందింది. అతడి నిబ్బరం చెదిరిపోయింది. ధైర్యం చలించింది. ఆ సుందరాంగి పొందు లభించినవాడి జీవితం నిజంగా పూర్వజన్మల పుణ్యాలపంట అనుకుంటూ ఆమె అందాన్ని వర్ణిస్తాడు. ఆ సందర్భంగా కవి తిక్క రాసిన పద్యం:

సి: ఇయ్యింతి ప్రాపున నయ్యనంగుఁడు పార్వ | తీశునైనను దక్కనేలకున్నె!

యిన్నాతి చెలువంబు గన్న శచీ ప్రియుం | డైనను గనుకలి నవియకున్నె!

యిత్తన్వి కెనలేమి కెదిరి పన్నిదము భా | షావిభుతోనైనఁ జఱవరాదె!

యిత్తలోదరి జీవితేశున కిందిరా | పతినైన మెచ్చక పలుకఁజనదె!.

తే. కుసుమబాణుని బాణముల్‌ గూడ నైదు | కరఁగి నేరిమి వాటించి కరువు గట్టి

పోసి చేసి చైతన్యసంపుటము దగ ఘ | టించెనో కాక యిట్టి చేడియలు గలరె!       

(ఈ అందమైన వనితా అండదందలుంటే అలనాడు మన్మథుడు పారవతీపతి అయిన పరమేశ్వరుడిని సైతం లొంగదీసికొని తన చెప్పు చేతలలో ఉంచుకొనకుండా ఉండేవాడా! ఈ వయసుకత్తె అందాన్ని చూస్తే శచీమనోహరుడైనఇంద్రుడు కూడా దృక్సంగమం వల్ల కలిగిన విరహంతో చిక్కి శల్యమై పోకుండా వుండేవాడా! ఈ సన్నటి మేనుకల అందగత్తెకు లోకంలో ఎవ్వరూ సాటిలేకపోవడం అనే విషయం మీద సరస్వతీదేవి భర్త అయిన బ్రహ్మదేవుడితో సహితం ఎదురుపందెం వేసి గెలువవచ్చును కదా! ఈ సుందరికి భర్త అయినవాడు లక్ష్మీపతి అయిన విష్ణుదేవుడి సంపదనూ, సౌందర్యాన్ని, సైతం లెక్కచేయకుండా మాట్లాడవచ్చును కదా! ఈమె అందాన్ని చూస్తే బ్రహ్మదేవుడు మన్మథబాణాలైదింటిని కలిపి ఒకేసారి కరిగించి, నేర్పుతో మూసలో పోసి, రూపు కట్టించి, ప్రాణం పోసి, చైతన్యస్ఫూర్తిని సంఘటించాడేమో! లేకపోతే ఇలాంటి అందగత్తెలు ఈ సృష్టిలో సామాన్యంగా వుంటారా?)

దీన్ని విశ్లేషిస్తూ డాక్టర్ ఆర్ అనంత పద్మనాభరావు గారు ఇలా రాశారు: “ఈ సీసపద్యం అల్లసాని పెద్దనాది ప్రబంధకవులకు (మనుచరిత్రలో) మార్గదర్శకమైనది”.   

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, విరాటపర్వం, ద్వితీయాశ్వాసం  

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

No comments:

Post a Comment