తూర్పు కదంబ వంశం (బ్రాహ్మణ రాజులు-19)
(స్వర్గీయ
బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)
వనం
జ్వాలా నరసింహారావు
తూర్పు కదంబ
వంశరాజులు కళింగ కాదంబులుగా వ్యవహరించబడినారు. వీరు కళింగ సామ్రాజ్యంలోని ఒక
భాగాన్ని ఏలారు. కదంబ రాజవంశీయులు నేటి బెల్గాం,
ధార్వార్ జిల్లాలను వైజయంతి, బనవాసి
రాజ్యాలుగా పాలించారు. ఈ కదంబ రాజులను పశ్చిమ కదంబ వంశీయులు అనేవారు. కళింగ
దేశంలోని భాగాలు పాలించిన వారిని తూర్పు కదంబులనీ, కళింగ కదంబులనీ పిలిచేవారు. వీరు
కళింగ గాంగ వంశపు రాజుల సామంతులు. ఇప్పటికీ అనేక కదంబ కుటుంబాలవారు గంజాం మండలంలో
వున్నారు. మరికొందరు కటక్ రాజస్వ విభాగంలో నివసిస్తున్నారు.
తూర్పు కదంబ వంశీయులు తొలుత గంగానదీ
మైదాన ప్రాంతంలో వుండేవారు. వారు క్రమంగా కళింగానికి వచ్చి స్థిర నివాసం
ఏర్పరుచుకున్నారు. క్రీస్తుశకం తొలి శతాబ్దంలో వీరి వలస ప్రారంభం అయింది. ఇకపోతే
పశ్చిమ కదంబులు లేక వనవాసీ కదంబులు నేటి తెలంగాణాలోని మహబూబ్ నగర్ జిల్లా కందూరు
గ్రామ వాస్తవ్యులు. కదంబ వృక్షాన్ని పూజించేవారు. వీరిలో సంపన్న బ్రాహ్మణ
కుటుంబంలో జన్మించిన మయూరశర్మ సంతతి వారు కదంబ రాజ్యాన్ని అతి వైభవోపేతంగా పాలించి,
వాకాటక, గుప్తవంశపు
రాజులతో వైవాహిక సంబంధాలను ఏర్పరుచుకొని ప్రబల శక్తి సమన్వితులై వుండేవారు.
తొలుత తూర్పు కదంబులు మగధ రాజ్య భాగాన్ని
పాలిస్తూ కళింగానికి వలస వచ్చి స్థిరపడ్డారు. అలా స్థిరపడిన కదంబులు శివపూజా
దురంధరులు. కదంబ వృక్షాల వల్లే ఈ వంశీయులను కదంబులు అని పిలిచారు. కాదంబులు మత్స్య
వంశీయులు. బహుశా అలనాటి విరాటరాజు వంశానికి చెందిన వారై వుండవచ్చు. తూర్పు కదంబ
వంశీయులు ప్రాచీన అర్వాచీన గాంగ వంశపు రాజుల సామంతులుగాను, బందువులుగాను వర్దిల్లారు. పశ్చిమ కదంబ వంశీయులు
ఏ విధంగానైతే పశ్చిమ గాంగ వంశపు రాజులతో సత్సంబంధాలు కలిగి వున్నారో, అలాగే తూర్పు కదంబ వంశీయులు తూర్పు గాంగ వంశపు
రాజులతో సంబంధ బాంధవ్యాలు కలిగి వుండేవారు.
తూర్పు కదంబ వంశీయులు ఖేతపురం రాజధానిగా కళింగ
గాంగ వంశపు రాజుల సామంతులుగా, కళింగావనిలోని
ఒక భాగాన్ని పాలించారు. తూర్పు కదంబ వంశీయులు వేద విద్యలను ప్రోత్సహించి అనేక
దేవాలయాలను నిర్మించారు. వేదవేదాంగేతిహాసాలను అభ్యసించారు. నాగఖేడి కదంబ వంశీయుడు.
గాంగ సామ్రాజ్యంలో ఉన్నత పదవిలో నియమించబడ్డాడు. ధర్మఖేడి తండ్రి భీమఖేడి. తాత
నియర్ణవ. జయంతీపురం ధర్మఖేడి నివాసం. అతడికి అనేక బిరుదులున్నాయి.
తూర్పు కదంబ రాజ వంశీయుల శాసనాలు వారు
మహేంద్రగిరి ప్రాంతాన్ని పటిష్టపరిచి పాలించినట్లు తెలియచేస్తున్నాయి. కదంబ రాజ
వంశీయులు గాంగ వంశపు రాజుల విదేయ సామంతులుగానే కాకుండా వారి సేనానాయకులుగానూ, మంత్రులుగానూ వ్యవహరించారు. గాంగ వంశపు రాజులు
కదంబ రాజ కుమారుల మీద సంపూర్ణంగా రాజ్య రక్షణా బాధ్యతలను మోపినారు. కళింగ దేశంలో గాంగ
శకంతో పాటు కదంబ శకం కూడా వ్యాప్తిలోకి వచ్చింది.
గాంగ వంశపు రాజులలాగానే కదంబులు కళింగ
దేశంలో రాజ్యాన్ని స్థాపించుకుని, వైదిక మతాన్ని
ఉద్ధరిస్తూ, బ్రాహ్మణులకు, దేవాలయాలకు,
విద్యాసంస్థలకు అనేక అగ్రహారాలను ఇస్తూ తమ ప్రభు భక్తిని, దైవ భక్తినీ చాటుకున్నారు. చిన్న-చిన్న
రాజ్యాలను స్థాపించుకున్న ఈ వంశపు రాజులు, కాకతీయులు కళింగ రాజ్యాన్ని జయించిన
తదుపరి వారి సామంతులుగా స్వీకరించబడినారు.
No comments:
Post a Comment