శాశ్వతమైన కీర్తిని ఆశించే అర్జునుడి పదిపేర్లు, వాటి వివరాలు
ఆస్వాదన-44
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక ఆదివారం సంచిక (31-10-2021)
బృహన్నల వేషంలో అజ్ఞాతవాసంలో వున్న ఆర్జునుడిని సారథిగా చేసుకుని
ఉత్తర గోగ్రహణం చేసిన కౌరవుల మీదికి యుద్ధానికి పోతాడు విరాటరాజు కొడుకు ఉత్తరుడు.
కౌరవసైన్యాన్ని చూసి బెదిరిపోయిన ఉత్తరుడు ఆవులను వాటి పాటికి వాటిని వదిలి
పారిపోదామని అంటాడు. తాను ఎట్టి పరిస్థితిలోను యుద్ధం చేయలేనని స్పష్టం చేశాడు
(బృహన్నల) అర్జునుడికి. శత్రువులకు బెదిరి పారిపోవడం పిరికితనం అన్నాడు అర్జునుడు.
తానుండగా భయపడవద్దని చెప్పాడు. కౌరవ సైన్యం ఆశ్చర్యపడే విధంగా ఆవులమందను
విడిపించుకుని తిరిగిపోదాం అన్నాడు. అయినా వినకుండా ఉత్తరుడు రథం దిగి పరుగుతీశాడు.
అర్జునుడు రథం దిగి ఉత్తరుడి వెంట పట్టుకోవడానికి పరుగెత్తాడు. చివరకు
పట్టుకున్నాడు.
అర్జునుడు ఉత్తరుడిని రథం దగ్గరకు బలవంతంగా తీసుకువచ్చాడు. ధైర్యం
నూరిపోశాడు. యుద్ధం చెయ్యకుండా తనకు సారథిగా వుండమని చెప్పాడు. అలా చేస్తే, తాను కౌరవ సైన్యంతో యుద్ధం
చేస్తానన్నాడు. ఆవులను కూడా మళ్లిస్తానని నమ్మబలికాడు. ఇద్దరూ కలిసి రథం మీద జమ్మి
చెట్టు దగ్గరికి వచ్చారు. వీళ్లిద్దరినీ దూరం నుండి చూస్తున్న కౌరవ వీరులకు
బృహన్నల వేషంలో వున్నది అర్జునుడేమో అన్న అనుమానం వచ్చింది. అదే విషయాన్ని భీష్మ, ద్రోణులు చర్చించుకున్నారు.
అర్జునుడు జమ్మిచెట్టు దగ్గర రథాన్ని ఆపి, అ చెట్టుమీద వున్న లక్ష ధనస్సులతో సమానమైన
గాండీవాన్ని కిందకు తెమ్మాని ఉత్తరుడికి చెప్పాడు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వారి-వారి ఆయుధాలను కట్టగట్టి ఆ
చెట్టుమీద పెట్టారని చెప్పాడు. వాటిలోనుండి ఒక్క గాండీవాన్ని మాత్రం తియ్యమన్నాడు.
ఉత్తరుడు ఆ కట్టను విప్పి అందులోని గాండీవాన్ని చూసి, ఆర్జునుడిని ‘సారథీ’ అని సంబోధిస్తూ, దాన్ని పాండవులలో ఎవరు
ఉపయోగిస్తారని ప్రశ్నించాడు. అది అర్జునుడు ఉపయోగిస్తాడని జవాబిచ్చాడు బృహన్నల
వేషంలోని అర్జునుడు. అలాగే అందులోని ఏ ధనుస్సు ఎవరు ఉపయోగిస్తారో కూడా వివరించాడు
ఉత్తరుడికి అర్జునుడు.
ఈ ఆయుధాలన్నీ జమ్మి చెట్టుమీద పెట్టి పాండవులు ఎక్కడికి పోయారని
ఉత్తరుడు ప్రశ్నించాడు. జవాబుగా అర్జునుడు, వాళ్లను గురించి చింతించవద్దనీ, వారంతా 12 సంవత్సరాల అరణ్యవాసం
ముగించుకుని, ఒక ఏడాది
అజ్ఞాతవాసం పూర్తి చేయడం కొరకు విరాటనగరంలోనే ఏ అపాయం లేకుండా వున్నారని, వారెవరో చెప్తాను వినమని అంటాడు.
కంకుభట్టు ధర్మరాజనీ, వలలుడు భీమసేనుడనీ, గుర్రాలను కాపాడుతున్న దామగ్రంథి నకులుడనీ,
గోవులను పాలించే తంత్రీపాలుడుసహదేవుడనీ, తాను అర్జునుడిననీ అన్నాడు. మాలిని (సైరంధ్రి)
అనబడే ఆమె ద్రౌపదీదేవి అని చెప్పాడు. అలా అయితే, శాశ్వతమైన కీర్తిని ఆశించే ఆ
అర్జునుడికి పది పేర్లున్నాయి, అవి ఏమిటో చెప్తే ఆయనే అర్జునుడు అని
నమ్ముతానన్నాడు ఉత్తరుడు.
ఉత్తరుడు అలా అనగానే, అర్జునుడు
చిరునవ్వుతో ఆ పదిపేర్లు ఇలా చెప్పాడు. ‘అర్జునుడు, ఫల్గునుడు, పార్థుడు, కిరీటి, శ్వేతవాహనుడు, బీభత్సుడు, విజయుడు, జిష్ణుడు, సవ్యసాచి, ధనంజయుడు. అవి ఎలా వచ్చాయో చెప్పమని మళ్లీ
అడిగాడు ఉత్తరుడు. భూమినంతా జయించడం వల్ల ధనంజయుడు అని; రథానికి ఎప్పుడూ తెల్లటి గుర్రాలే కట్టుతాను
కాబట్టి శ్వేతవాహనుడు అని; దేవేంద్రుడు
ఇచ్చిన (అభేద్యం, భయంకరం, సుస్థిరం) కిరీటం ధరించడం వల్ల
కిరీటి అని; యుద్ధంలో
శత్రువీరులు ఏవగించుకునే ఏపనీ చేయను కాబట్టి బీభత్సుడు అని; యుద్ధంలో ఏచేతితోనైనా అల్లెతాడు
లాగుతాను కాబట్టి సవ్యసాచి అని; అవదాత వర్ణం
తన శరీరానికి వున్నది కాబట్టి అర్జునుడు అని; ఉత్తరఫల్గునీ విశిష్ట కాలంలో పుట్టడం వల్ల
ఫల్గునుడు అని; యుద్ధంలో
ధర్మరాజు శరీరానికి ఎవరైనా గాయం కలిగిస్తే వారిని చంపుతాను కాబట్టి జిష్ణుడు అని; పృథ (కుంతీదేవి) కొడుకును కాబట్టి
పార్థుడు ని పది పేర్లు వచ్చాయని చెప్పాడు. వీటికి తోడు కృష్ణుడు అనే మరో పేరు
కూడా వున్నట్లు చెప్పాడు.
అర్జునుడే అన్న నమ్మకం ఉత్తరుడికి కలగగానే అతడికి సారథిగా మారిపోయి
యుద్ధానికి బయల్దేరారు ఇద్దరూ. గాండీవాన్ని ఎక్కుబెట్టి అర్జునుడు అల్లెతాటిని
మోగించాడు. ఆ ధ్వనికి ఆకాశం, దిక్కులూ
మారుమోగాయి. ఆ తరువాత దేవదత్తాన్ని పూరించడంతో ఏడు సముద్రాలు అల్లకల్లోలం అయ్యాయి.
ఏడు కులపర్వతాలు ఊగిపోయాయి. భూచక్రం అంతా కంపించింది. ఇదంతా విన్న దుర్యోధనుడు తన
లెక్క ప్రకారం 13 సంవత్సరాలు పూర్తి కాకుండానే, అంటే, అజ్ఞాతవాసం ముగియకుండానే, అర్జునుడు తమ ఎదుటికి వస్తున్నాడని
సంతోషించాడు. అయితే, భీష్ముడికి, ద్రోణుడికి అజ్ఞాతవాసం పూర్తయిందని
తెలుసు. దుర్యోధనాదులకు మాత్రం అజ్ఞాతవాసం పూర్తి కాలేదని నమ్మకం. వారి సందేహాన్ని
భీష్ముడు తీరుస్తూ ఇలా అన్నాడు.
‘రెండు సంవత్సరాలకు ఒక సారి అధికమాసం వస్తుంది. 13 ఏళ్లలోగా ఇలా
వచ్చిన అధికమాసాలను లెక్కించి చూస్తే నిన్నటితో గడువు పూర్తయింది. ఇది తెలిసే
అర్జునుడు యుద్ధానికి వస్తున్నాడు. దర్మపరులైన పాండవులు, ధర్మరాజు ఎప్పటికీ అధర్మమార్గంలో పోరు’. ఇక్కడ ఒక చక్కటి పద్యం రాశారు కవి
తిక్కన:
ఉ: వచ్చినవాడు
ఫల్గును డవశ్యము గెల్తు మనంగరాదు; రా
లచ్చికినై
పెనంగిన బలంబులు రెండును గెల్వ నేర్చునే?
హెచ్చగు
గుందగుం దొడరు టెల్ల విధంబుల కోర్చు; టట్లుగా
కిచ్చ
దలంచి యొక్కమెయి నిత్తఱి బొందగు చేతయుం దగున్
(ఇప్పుడు మనమీదికి దండెత్తి వచ్చిన వాడు అర్జునుడు. మనమే తప్పక
జయిస్తామని చెప్పలేం. రాజ్యలక్ష్మి కొరకు పెనుగులాడితే రెండు బలాలు గెల్వలేవుకదా!
జయం కలగవచ్చు, కలగక పోవచ్చు!
ఇప్పుడు మనం చేయగలిగిందల్లా ఏమి వచ్చినా ఓర్చుకొనడమే. అంతే కాకుండా ఒకరకంగా
ఇప్పుడు సంధి చేసుకోవడం కూడా మంచి పనే!)
దీన్ని
విశ్లేషిస్తూ డాక్టర్ మేడవరం వేంకట నారాయణశర్మ గారు ఇలా రాశారు: “ఈ పద్యం
తెలుగునాట బాగా ప్రచారంలో ఉన్నది. ‘వచ్చినవాడు ఫల్గునుడు’ అనడం ఒక లోకోక్తి. అంటే
వచ్చినవాడు సామాన్యుడు కాడని భావం. భీష్ముడి మనోభావం దీనివల్ల తెలుస్తున్నది. సంధి
మంచిదని భీష్ముడి అభిప్రాయం. అంతేకాకుండా దుర్యోధనుడికి సూచన కూడ. ‘వచ్చినవాడు
ఫల్గునుడు’ అనడంలో ఒక బెదిరింపు,
జాగ్రత్త అన్న సూచన వున్నది. భీష్ముడి రాజనీతి కూడా తెలుపుతున్నది. ఏమివచ్చినా
ఓర్చుకోవాలని హితం కూడా చెప్పాడు. గెలుపు నిశ్చయం కానప్పుడు అన్ని విధాలా సంధి
మేలని సలహా. ఇన్ని భావాలకు సమాశ్రయం అయిన ఈ పద్యం తిక్కన ప్రతిభావిశేషజన్యమే. అసలు
పద్యం ఎత్తుగడే ఉదాత్తంగా ఉన్నది. భీష్ముడంతడి వాడి అనుభవపూర్వకమైన ఇలాంటి సూచనను
కూడా దుర్యోధనుడు గమనించలేదు”.
భీష్ముడి మాటలను
లెక్కచేయకుండా దుర్యోధనుడు,
యుద్ధంలో పరాక్రమాన్ని చూపడానికే నిర్ణయించానని స్పష్టం చేశాడు. యుద్ధం మొదలైంది.
ఉత్తరకుమారుడు సారథిగా అర్జునుడు యుద్ధానికి దిగాడు. ఉత్తరుడికి భీష్మద్రోణుల
యుద్ధ వ్యూహాన్ని వివరించాడు. రథాన్ని సేనవైపుకు పోనీయమన్నాడు. ఉత్తరుడు అర్జునుడు
చెప్పినట్లే రథాన్ని తోలాడు. ద్రోణాచార్యుడు ఆర్జునుడిని చూసి ప్రశంసించాడు.
యుద్ధారంభంలో అర్జునుడు చిరునవ్వు నవ్వుతూ ఉత్తరుడికి కౌరవ వీరుల పరిచయం
చేస్తూన్నప్పుడు తిక్కన అద్భుతమైన పద్యాన్ని రాశాడు ఈ విధంగా:
సీ:
‘కాంచనమయ వేదికా కనత్కేతనో | జ్జ్వల విభ్రమమువాఁడు కలశజుండు;
సింహ
లాంగూల భూషిత నభోభాగ కే | తు ప్రేంఖణమువాఁడు ద్రోణసుతుఁడు;
కనక
గోవృష సాంద్రకాంతి పరిస్ఫుట | ధ్వజ సముల్లాసంబువాఁడు కృపుఁడు;
లలితకంబుప్రభాకలిత
పతాకా వి | హారంబువాఁడు రాధాత్మజుండు;
తే.
మణిమయోరగ రుచిజాల మహితమైన | పడగవాఁడు కురుక్షితిపతి; మహోగ్ర
శిఖరఘన
తాళతరువగు సిడమువాఁడు | సురనదీసూనుఁ; డేర్పడఁ జూచికొనుము.
(ద్రోణుడిని,
అశ్వత్థామను, కృపాచార్యుడిని, కర్ణుడిని, దుర్యోధనుడిని, భీష్ముడిని, పరిచయం చేశాడు అర్జునుడు ఉత్తరుడికి).
చివరకు
విజయం ఆర్జునుడిని వరించింది.
కవిత్రయ
విరచిత
శ్రీమదాంధ్ర
మహాభారతం, విరాటపర్వం, చతుర్థ-పంచమాశ్వాసాలు
(తిరుమల, తిరుపతి
దేవస్థానాల ప్రచురణ)
No comments:
Post a Comment