Tuesday, September 22, 2020

బలి చక్రవర్తి, వామనావతారం .... శ్రీ మహాభాగవత కథ-43 : వనం జ్వాలా నరసింహారావు

 బలి చక్రవర్తి, వామనావతారం

శ్రీ మహాభాగవత కథ-43

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

దేవాసుర యుద్ధంలో పరాజితుడైన బలి చక్రవర్తితో ఆయన గురువు శుక్రాచార్యుడు విశ్వజిత్ యాగాన్ని శాస్త్రోక్తంగా చేయించాడు. ఆ హోమగుండం నుండి విల్లు, బాణాలతో కూడిన స్వర్ణమయ రథం వెలువడింది. అలాగే బలి తాతగారైన ప్రహ్లాదుడు మనవడికి వాడిపోని తామరపూల మాలను, శుక్రాచార్యుడు మెరిసే శంఖాన్ని ఇచ్చారు. ఇవన్నీ లభించడంతో బలి చక్రవర్తి శత్రువుల మీద పగతీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఉత్సాహంతో, సేనలతో సహా అమరావతికి బయల్దేరాడు. స్వర్గాన్ని సమీపించాడు. అక్కడికి చేరిన బలి చక్రవర్తి ఆ నగరం కోటను చుట్టుముట్టడానికి సైన్యాలకు ఆజ్ఞ ఇచ్చాడు. మార్గాలన్నీ అరికట్టాడు. దేవేంద్రుడు వెంటనే కోటకు రక్షణ ఏర్పాటు చేశాడు. గురువైన బృహస్పతికి బలి చక్రవర్తి దండయాత్ర గురించి వివరించాడు. ఆ రాక్షసరాజుకు విప్రుల ఆశీర్వాద బలం వున్నదనీ, అతడిని ఇప్పుడు ఎదుర్కోవాలంటే శ్రీహరికి, ఈశ్వరుడికి తప్ప వేరే ఎవరికీ సాధ్యం కాదనీ, ప్రస్తుతానికి రాజ్యం వదిలి వెళ్లిపోవడమే సరైన మార్గమనీ బృహస్పతి ఇంద్రుడికి చెప్పాడు. ఆయన సూచన మేరకు దేవతలు స్వర్గాన్ని వదిలి అనుకూల ప్రదేశాలకు వెళ్లిపోయారు. బలి ముల్లోకాలనూ తన వశం చేసుకుని నిరాటంకంగా రాజ్య పాలన చేయసాగాడు. అతడి పాలన సుబిక్షంగా సాగింది.

దేవతల తల్లి అదితికి తన కొడుకులు అమరావతిని వదిలి ఎక్కడో దాక్కోవడం బాధ కలిగించింది. మనస్సులో వ్యధ పడుతుంటే భర్త కశ్యపబ్రహ్మ కారణం అడిగాడు. తన చెల్లెలు దితి సంతానమైన రాక్షసులు అమరావతిని ఆక్రమించుకున్న సంగతి చెప్పి, దేవతలకు మేలు చెయ్యమని అడిగింది భర్తను. దేవతలను అమరావతికి రప్పించే ఉపాయం ఆలోచించమని ప్రార్థించింది. జ్ఞాన దృష్టితో జరగబోయే సంగతి తెలుసుకున్న కశ్యప ప్రజాపతి, శ్రీహరిని సేవించమని భార్యకు సలహా ఇచ్చాడు. భగవంతుడు సంతోషిస్తే ఆమె కోరికలన్నీ నెరవేరుతాయని అన్నాడు. ఆమెకు ’పయోభక్షణం’ అనే వ్రతాన్ని ఉపదేశించాడు. దానికి పాటించాల్సిన నియమాలన్నీ చెప్పాడు. అదితి ఆయన చెప్పినట్లే పన్నెండు రోజులు శ్రీహరిని నియమానుసారంగా పూజించింది. నారాయణుడు అదితికి సాక్షాత్కరించాడు. ఆమె భక్తితో స్తోత్రం చేసింది. తన బాధ చెప్పుకుంది. అప్పుడు నారాయణుడు, తాను, ఆమె గర్భంలో తేజోమూర్తినై జన్మిస్తానని, పుత్రుడనై పుట్టి ఆమె ఒడిలో ఆడుకోవాలని కోరికగా వుందని అన్నాడు. దైత్యుల నుండి స్వర్గాన్ని హరించి ఇంద్రుడికి ఇస్తానని హామీ ఇచ్చాడు.

భగవంతుడు అన్న మాట ప్రకారం, ఒకనాడు కశ్యపుడిలో అచ్యుతుడి అంశ ప్రవేశించగా, దాన్ని అదితి గర్భంలో ప్రవేశపెట్టాడు ఆయన. గర్భాన్ని ధరించిన అదితి సంతోషించింది. క్రమేపీ ఆమె ప్రసవ సమయం దగ్గర పడింది. అదితి గర్భం నుండి వెలుపలికి రమ్మని, వచ్చి దేవతలను రక్షించమని, అక్కడికి వచ్చిన బ్రహ్మ నారాయణుడిని ప్రార్థించాడు. శ్రావణ శుద్ధ ద్వాదశినాడు శ్రవణా నక్షత్రంలో అభిజిత్తు లగ్నంలో శ్రీమహావిష్ణువు వామన రూపంలో, శంఖ-చక్ర-గద-కమలాలతో , నాలుగుచేతులతో, అదితికి జన్మించాడు. ఆయన పుట్టగానే లోకపాలకులందరూ సంతోషించారు. అనంతరం ఆయన తన దివ్యరూపాన్ని వదిలి, కపట బ్రహ్మచారి రూపంలో నిలిచాడు. అతడికి ఉపనయన కర్మకలాపాలను చేయించాడు కశ్యపుడు. ఉపనయనాన్ని పూర్తి చేసుకున్న వామనుడికి బలిచక్రవర్తిని ఆశ్రయిస్తే లాభం కలుగుతుందని చెప్పారు కొందరు బ్రాహ్మణులు. తల్లి-తండ్రుల ఆశీర్వచనం తీసుకుని బలి చక్రవర్తి దగ్గరికి బయల్దేరాడు.       

యాచనకు వచ్చిన వామనుడు బలి చక్రవర్తి యాగం చేస్తున్న ప్రదేశంలోని అశ్వమేధ వాటిక లోపలికి ప్రవేశించగానే అతడెవరా అని విస్మయంతో చూశారక్కడివారు. సభాస్థలిలో కలకలం చెలరేగింది. వామనుడు సభా ప్రాంగణమంతా కలియతిరిగి చాలామందిని కలిసి వారితో చర్చించడం, తర్కించడం చేశాడు. మెల్లగా బలి చక్రవర్తిని సమీపించాడు. పవిత్రమైన అక్షతలు కలిగున్న తన కుడి చేతిని చాచి, బలి చక్రవర్తికి జయమగు గాక అని దీవించి, అతడి ముందు నిలుచున్నాడు. చక్రవర్తి తన ఆసనం మీదనుండి లేచి, వామనుడి పాదాలు కడిగి తుడిచాడు. ఆ జలాలను తన తలమీద చల్లుకున్నాడు. వామనుడి వివరాలు అడిగి అతడికి ఏమికావాలని ప్రశ్నించాడు. తాను ఒకచోట వుండననీ, అన్ని ప్రదేశాలు తనవేననీ అంటూ, బలి చక్రవర్తి పూర్వీకులను పొగిడాడు. దానం ఇవ్వాలని కోరికున్న బలి చక్రవర్తి తనకు మూడడుగుల మేర భూమి ఇస్తే చాలని, దానితో తన కోరికలన్నీ తీరుతాయని చెప్పాడు. ఇంత చిన్న కోరికా? అని బలి చక్రవర్తి వ్యాఖ్యానించగా, తానడిగిన మూడు అడుగుల మేర కాదనకుండా ఇవ్వడమే తన పాలిటి బ్రహ్మాండం అని అన్నాడు వామనుడు. 

మూడు అడుగులు వామనుడికి దానం ఇవ్వడానికి సిద్ధపడ్ద బలి చక్రవర్తిని గురువు శుక్రాచార్యుడు వారిస్తూ, అతడు మామూలు బ్రాహ్మణుడు కాదని, సాక్షాత్తు శ్రీహరి అని, దానం ఇవ్వడం వల్ల రాజుకు ఉపద్రవం వస్తుందని, మూడు పాదాలతో వామనుడు ముల్లోకాలు ఆక్రమిస్తాడని, ఆయన సమస్త సంపదలు పోతాయని అన్నాడు. మాట తప్పమంటాడిలా:

ఆ: వారిజాక్షులందు  వైవాహికములందు, బ్రాణ విత్త మాన భంగమందు

జకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు, బొంకవచ్చు నఘము వొంద డధిప 

జవాబుగా బలి చక్రవర్తి:

శా: కారే రాజులు? రాజ్యముల్‌ గలుగవే? గర్వోన్నతిన్‌ బొందరే?

వారేరీ సిరి మూట గట్టుకొని పోవం జాలిరే? భూమిపై

బేరైనం గలదే? శిబి ప్రముఖులుం బ్రీతిన్‌ యశఃకాములై

యీరే కోర్కెలు? వారలన్‌ మరచిరే యిక్కాలమున్‌ భార్గవా!

అని అంటూ, శ్రీమహావిష్ణువంతటి వాడు చేయి చాచి అడిగితే ఇవ్వకుండా వుంటానా? అని ఇలా చెప్పాడు.

శా: ఆదిన్ శ్రీసతి కొప్పుపై, దనువుపై, నంసోత్తరీయంబుపై

బాదాబ్జంబులపై గపోల తటిపై బాలిండ్లపై నూత్న మ

ర్యాదం జెందు కరంబు గ్రిం దగుట మీదై నా కరంబుంట మేల్

గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే? కాయంబు నాపాయమే?

తనకెలాంటి దుర్గతి ప్రాప్తించినా సరే, తనన్న మాటకు తిరుగులేదన్నాడు బలి చక్రవర్తి. ఆడిన మాట తప్పనని స్పష్టం చేశాడు. తన మాట విననందుకు ’పదభ్రష్టుడివి అవుతావు’ అని గురువు శుక్రాచార్యుడు శపించాడు. 

ఆ తరువాత, భర్త సంజ్ఞ మేరకు బలి చక్రవర్తి భార్య వింధ్యావళి, వామనుడు కాళ్లు కడగడానికి, బంగారుపాత్రలో జలం తెచ్చి భర్తకు అందించింది. వామనుడు రాజు కోరిక మేరకు తన కుడిపాదం ముందు పెట్టాడు. బలి చక్రవర్తి ఆ పాదాలను కడిగి, వామనుడిని పూజించి, ఆయనకు ’మూడు అడుగుల నేలను దానం చేస్తున్నాను’ అని అంటూ, సకల లోకాలు ఆశ్చర్య పోతుంటే, నీటిని ధార పోశాడు. ఆ సమయంలో నీటి ధారను అడ్డుకోవడానికి ఈగ రూపంలో కలశ రంధ్రంలో చేరిన శుక్రచార్యుడి కన్ను వామనుడు పుల్లతో పొడిచేసరికి అతడు ఏకనేత్రుడయ్యాడు. భూదానం చేసిన బలి చక్రవర్తి ఉభయ లోకాలలోనూ కీర్తి సుకృతాలు పొందుతాడని దీవిస్తూ, తనకు మూడడుగులు ఇవ్వడమంటే ముల్లోకాలు ఇచ్చినట్లే అని అన్నాడు వామనుడు. దానాన్ని స్వీకరిస్తూ వామనుడు విశ్వరూపాన్ని పొందాడిలా:

శా: ఇంతింతై, వటుడింతయై, మరియు దానింతై, నభోవీధి పై

నంతై, తోయదమండలాగ్రమున కల్లంతై, ప్రభారాశిపై

నంతై, చంద్రుని కంతయై, ధ్రువుని పైనంతై, మహర్వాటి పై

నంతై, సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై

 

మ: రవిబింబం బుపమింప బాత్రమగు చ్చత్రంబై, శిరోరత్నమై

శ్రవణాలంకృతమై గళాభరణమై సౌవర్ణ కేయూరమై

ఛవిమత్కంకణమై కటిస్థలి నుదుంచ ద్ఘంటయై నూపుర

ప్రవరంబై పదపీఠమై వటుడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్

ఇలా విశ్వరూపాన్ని ధరించిన వామనుడు ఒక అడుగుతో భూమిని కొలిచాడు. ఇంకొక అడుగుతో స్వర్గాది లోకాలన్నిటినీ కప్పేశాడు. అప్పుడాయన రూపాన్ని చూసి బ్రహ్మాది దేవతలతో సహా బలి చక్రవర్తి కూడా స్తోత్రం చేశాడు. తన మూడవ అడుగు ఎక్కడ అని అడిగాడు బలి చక్రవర్తిని వామనుడు. ఆయన మూడవ పాదాన్ని శాశ్వతంగా తన శిరస్సుమీద పెట్టమని అన్నాడు బలి చక్రవర్తి. ఇలా ఆయన చెప్తున్న సమయంలో ప్రహ్లాదుడు అక్కడికి వచ్చాడు. తన మనుమడిని రక్షించమని అడిగాడు. అదే సమయంలోనే, బలి చక్రవర్తి భార్య వింధ్యావళి తనకు పతిబిక్ష పెట్టమని వామనుడిని ప్రార్థించింది. అప్పుడే బ్రహ్మ కూడా వచ్చి బలి మీద కరుణ చూపమని వామనుడిని కోరాడు. అప్పుడు వామనుడు బలి చక్రవర్తిని ప్రశంసిస్తూ, అతడు సావర్ణి మనువు కాలంలో దేవతలందరికీ దేవేంద్రుడు అవుతాడనీ, అతడి దానం బహు ప్రశంసనీయమనీ, అతడు సుతల లోకంలో వుండాలనీ, అతడిని ఎల్లప్పూడూ తానే స్వయంగా రక్షిస్తూ వుంటాననీ, అతడు కోరినప్పుడల్లా కనిపిస్తాననీ అన్నాడు. బంధ విముక్తుడైన బలి చక్రవర్తి హరికి నమస్కరించి, బ్రహ్మకు ప్రణామం చేసి సుతల లోకానికి తనవారితో కూడి వెళ్లాడు.

అప్పుడు నారాయణుడు మిగిలిపోయిన యాగాన్ని పూర్తి చేయాల్సిందిగా రాక్షస గురువు శుక్రాచార్యుడిని కోరాడు. ఆయన అలానే చేశాడు. దానంగా గ్రహించిన ముల్లోకాలను దేవేంద్రుడికి ఇచ్చాడు వామనుడు. వామనావతార కథ విన్నవారికీ, చదివినవారికీ అన్నీ శుభాలే!

(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

 

 

No comments:

Post a Comment