Sunday, September 20, 2020

 సర్వస్వం రామార్పణం

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-26

వనం జ్వాలా నరసింహారావు

సూర్య దినపత్రిక (21-09-2020)

         (శృంగిబేరపురమంటే, జింకా కారం గల వూరు. అక్కడుంది ఆత్మలాంటి ప్రియమైన రాముడి మిత్రుడు గుహుడు. ఆయన నిజమైన భక్తుడైనందునే రాముడు ఆయనున్న చోటికి పోయాడు. అంటే భగవంతుడిని మనం వెతుక్కుంటూ పోవాల్సిన పనిలేదు. భక్తి మనలో వుంటే భగవంతుడే మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. రాముడు శృంగిబేరపురం వచ్చాడన్న వార్త తెలుసుకున్న గుహుడు పరుగెత్తుకుంటూ వచ్చి రాముడిని కౌగలించుకున్నాడట).

"ఇట్లా రాజకుమారులిద్దరు-రాజకుమారి సీత, ముగ్గురు అడవి మార్గంలో గంగానదిని దాటి, భరద్వాజుడి ఆజ్ఞానుసారం చిత్రకూట పర్వతం చేరుకుంటారు. అక్కడ ఓ పర్ణశాల (లక్ష్మణుడు కట్టిన ఆకుల గుడిసె) నిర్మించుకుని అందులో సంతోషంగా నివసిస్తుంటారు. అక్కడ అయోధ్యలో (తన కొడుకులు చిత్రకూటం చేరారని తెలిసిన) దశరథుడు శ్రీరాముడిపై నున్న ప్రేమాతిశయంతో, ’రామా రామా’ అని ఏడ్చి-ఏడ్చి, చనిపోతాడు. తండ్రి మరణించడంతో, రాజ్యార్హుడైన జ్యేష్ఠ పుత్రుడు అరణ్యాలలో వున్నందున, రాజ్యం అరాజకం కాకుండా వుండాలని తలచిన వశిష్ఠుడు-ఇతర పెద్దలు, రాజ్యభారం వహించాలని భరతుడిని ప్రార్థించినా ఆయనొప్పుకోలేదు.

(సూర్య వంశపు రాజులకు పురోహితుడు వశిష్ఠుడు. ఆయన దశరథుడి అభిప్రాయం ప్రకారం చెప్పినా భరతుడు తిరస్కరించడం సబబేనా-గురు వాక్యం మీరినట్లు కాదా అన్న సందేహం రావచ్చు. అయితే రాజు చెప్పిన మాటలను మాత్రమే వశిష్ఠుడు చెప్పాడే కాని, పెద్దవాడుండగా చిన్నవాడు రాజ్యం ఏలడం అన్యాయమని ఆయనకూ తెలుసు. ఇక భరతుడేమో భగవత్ పరతంత్రుడు. తనను, తన దేహాన్ని, తన సర్వస్వాన్ని రామార్పణం చేసాడు. దాన్ని మరల గ్రహించడమంటే పారతంత్ర్య విరోధమే. అంటే స్వరూప హాని కలగడమే. ఇది ఆత్మహత్యలాంటి ఘోర పాపం. మాట వినకపోతే వశిష్ఠుడు శపించవచ్చు కాని ఆత్మ హాని కూర్చలేడు. అయినా వశిష్ఠుడు  ప్రార్థించాడే గాని శాసించలేదు).

         "రాజ్యమేలడానికి కావలసిన దేహ బలం, సేనా బలం, ఇంద్రియనిగ్రహ బలం భరతుడికున్నప్పటికీ, శ్రీరామచంద్రచరణారవిందాల అనుగ్రహం కొరకై చిత్రకూటానికి బయల్దేరి పోయాడు. ఒక్కడేపోలేదు. సర్వ సైన్యంతో వెళ్లాడు.


         (భరతుడు ఒంటరిగా పోతే అతడికొక్కడికి తప్ప తక్కినవారెవరికీ తాను రాజు కావాలన్న కోరికలేదేమోనని రాముడనుకోవచ్చునన్న సందేహమొక కారణం. సగౌరవంగా అన్నగారిని పిలవలేదని లోకులు సందేహించవచ్చు. తన ప్రార్థన వినకున్నా ఇంతమంది అడిగారు కదా అని ఒప్పుకోవచ్చు).

         చిత్రకూటం చేరిన భరతుడు, అన్నకు తెలియని ధర్మం లేదనీ, పెద్దవాడుండగా చిన్నవాడు పట్టాభిషేకం చేసుకోకూడదని, రాముడే రాజు కావాలనీ ప్రార్థిస్తాడు. తండ్రి ఆజ్ఞ మీరరాదని భావించిన రాముడు, ఇతరులను సంతోషపెట్టే స్వభావమున్నప్పటికీ, దానికొరకు ఎలాంటి త్యాగమైనా చేసేవాడైనప్పటికీ, అలా చేయడానికి బాధపడనివాడైనప్పటికీ, ఇతరుల మనోరథం వ్యర్థం చేయడన్న కీర్తి సంపాదించినప్పటికీ, జనకుడి ఆజ్ఞను స్మరించి, రాజ్యం అంగీకరించక-భరతుడి ప్రార్థన వ్యర్థం చేయక, తనకు ప్రతినిధిగా తన పాదుకలిచ్చి, భరతుడినప్పటికి సమాధాన పరిచి, బలవంతంగా పంపుతాడు. శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేసి, ఆయన దగ్గరుండి సేవ చేద్దామన్న కోరిక నెరవేరక పోవడంతో, ఆయన బదులు ఆయన పాదుకలకు సేవ చేస్తూ, రాముడెప్పుడొస్తాడా-ఎప్పుడు కళ్లారా చూస్తానా-ఎప్పుడు సేవిస్తానా అని ఎదురుచూస్తూ, శ్రీరాముడు లేని అయోధ్యకు పోవడం ఇష్టం లేక, భోగ కాంక్ష-ఫల కాంక్ష లేక, నంది గ్రామం అనె పల్లెటూరులో వుంటూ రాజ్యం చేస్తాడు భరతుడు".

(ఈ విధంగా నారదుడు అయోధ్యకాండ అర్థాన్ని సంగ్రహంగా చెప్పి, పితృవాక్య పాలన అనే సామాన్య ధర్మాన్ని, స్వామైన భగవంతుడి విషయంలో దాసుడు చేయాల్సిన కైంకర్య వృత్తిని, ప్రపన్నుడు భగవత్ పరతంత్రుడిగానే వుండాలన్న విషయాన్ని, ప్రపత్తికి భంగం కలిగే పనులు ఎవరు చెప్పినా చేయకూడదనే విశేష ధర్మాన్ని తెలియ పరుస్తాడు).

నారదుడు ఇంకా ఇలా చెప్తాడు: "భరతుడు తన ఆజ్ఞ ప్రకారం తన పాదుకలను తీసుకుని అయోధ్యకు పోయిన తర్వాత అక్కడి పురజనులు తానిక్కడున్నానని తెలిసి వీలున్నప్పుడల్లా తన్ను దర్శించడానికి వచ్చే అవకాశం వుందని గ్రహిస్తాడు రాముడు. దానివల్ల ఆశ్రమవాసుల తపస్సుకు భంగం కలుగుతుందని భావిస్తాడు. ఈ అలోచనరాగానే, ఇంద్రియాలను జయించిన సత్యస్వరూపుడైన రామచంద్రుడు దండకారణ్యం చేరుకుంటాడు. విరాధుడిని చంపుతాడు. శరభంగుడిని దర్శిస్తాడు. సుతీక్షణుడిని చూస్తాడు. అగస్త్యుడిని, ఆయన తమ్ముడు సుదర్శనుడిని దర్శిస్తాడు. అగస్త్యుడు చెప్తే, ఆయన దగ్గరున్న ధనస్సును, ఖడ్గాన్ని, రెండంబుల పొదలను,పదునైన అక్షయ శరాలను సంతోషంగా తీసుకుంటాడు.మునీశ్వరుల దగ్గరుంటూ,వాళ్ల కోరిక మేరకు వారి తపస్సు భంగం చేసే రాక్షసులను సంహరిస్తానని అభయమిస్తాడు రాముడు.

No comments:

Post a Comment