Wednesday, September 16, 2020

పరమ విష్ణు భక్తుడైన చిత్రకేతువే వృత్రాసురుడు .... శ్రీ మహాభాగవత కథ-37 : వనం జ్వాలా నరసింహారావు

 పరమ విష్ణు భక్తుడైన చిత్రకేతువే వృత్రాసురుడు

శ్రీ మహాభాగవత కథ-37

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

         పాప చరితుడైన వృత్రాసురుడికి మాధవుడంటే భక్తి ఎలా కుదిరిందనేది ఆసక్తికరమైన విషయం. ఇలా జరగడానికి కారణం లేకపోలేదు. పూర్వం శూరసేన దేశాన్ని చిత్రకేతువు అనే రాజు పాలిస్తుండేవాడు. అతడి కీర్తి విశ్వమంతా వ్యాపించింది. ఆ మహారాజుకు అనేకమంది భార్యలున్నారు. అయినప్పటికీ ఆయనకు సంతానం కలగలేదు. లేదని బాధపడుతున్న ఆ రాజు మందిరానికి ఒకనాడు అంగిరసుడు అనే మహాముని వచ్చాడు. ఆయన విచారానికి కారణం అడిగాడు. రాజు మనస్సులోని అభిప్రాయాన్ని తెలుసుకుని అంగిరసుడు ఆయనతో పుత్రకామేష్టిని చేయించాడు. యజ్ఞశేషాన్ని అతడి పెద్ద భార్య కృతద్యుతికి ఇచ్చి వెళ్లిపోయాడు అంగిరసుడు. పుత్రుడు కలుగుతాడని, అతడి వల్ల సుఖ-దుఃఖాలు అనుభవిస్తాడని చెప్పాడు. అంగిరసుడు చెప్పినట్లే భార్య కొడుకును కన్నది. కుమారుడి జాతకం చూపించాడు చిత్రకేతువు. ఇదిలా వుండగా కృతద్యుతి సవతులు ఈర్ష్యతో బాలుడికి విషప్రయోగం చేయడంతో అతడు మరణించాడు. మహారాజు, ఆయన భార్య ఇది చూసి విలపించారు. రాజు దుఃఖాన్ని తెలుసుకుని అంగిరసుడు, నారదుడితో కలిసి అక్కడికి వచ్చాడు. 

రాజు ఎవరికోసం దుఃఖపడుతున్నాడనీ, ఈ జన్మలో కొడుకులైనవారు పూర్వజన్మలో ఏమవుతారో రాజుకు తెలుసునా అనీ, కాలప్రవాహంలో ప్రాణులు పుట్తూ-చస్తూ వుంటారనీ, విష్ణుమాయవల్లే జీవులకు జీవులు జన్మిస్తున్నట్లు కనిపిస్తుందనీ, చావు-పుట్టుకలు సత్యం కాదనీ, సృష్టి ఈశ్వరుడికి ఒక క్రీడ అనీ, బాంధవ్యాలు నిజం కావనీ, అజ్ఞానాంధకారం నుండి వెలువడి వాసుదేవుడి మీద చిత్తం నిలిపి నిర్మలాత్ముడివి కమ్మనీ బోధించాడు అంగిరసుడు చిత్రకేతుడికి. ఇలా దివ్యజ్ఞానం బోధించిన అతడెవరని, అతడి వెంట వున్నదెవరని అడిగాడు చిత్రకేతుడు. రాజు పుత్రకాంక్షతో వున్నప్పుడు అతడితో పుత్రకామిష్టి చేయించి పుత్రుడిని ప్రసాదించిన అంగిరసుడుని తనే అనీ, తనతో వచ్చిన వాడు బ్రహ్మమానస పుత్రుడైన నారదుడనీ, రాజును అనుగ్రహించి జ్ఞానబోధ చేయడానికి వచ్చామనీ చెప్పాడు. ఈ లోకంలో అన్నీ చంచలం అని అంటూ, నిర్మలమైన మనస్సుతో ఆత్మజ్ఞానాన్ని అలవరుచుకుని శాశ్వతమైన పదవిని పొందమని అంగిరసుడు చిత్రకేతుడికి చెప్పాడు.  

అప్పుడు నారదుడు రాజుతో ఇలా అన్నాడు: "ఉపనిషత్తులలో చెప్పబడిన ఒక మంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను. దాన్ని ఏడు రాత్రులు ఎవరు పఠిస్తారో అతడు సంకర్షుణుండైన భగవంతుడిని చూస్తాడు. శీఘ్రంగా ఉత్తమ పదాన్ని పొందుతాడు. ఇప్పుడీ కుమారుడికి నీకు ఎలాంటి సంబంధమూ లేదు". ఇలా చెప్తూ, బాలుడి మృత దేహాన్ని చూస్తూ "ఓ జీవుడా! నీకు శుభం! నువ్వు తిరిగి ఈ శరీరంలో ప్రవేశించి నీకున్న ఆయుశ్శేషాన్ని అనుభవించి పిత్రాధీనమైన రాజ్యాన్ని అనుభవించు" అని అన్నాడు. అప్పుడా బాలుడు, తాను కర్మవశాన అనేక జన్మలు ఎత్తాననీ, ఏ జన్మలో వీరు (రాజు-ఆయన భార్య) తనకు తల్లి-తండ్రులయ్యారో చెప్పాలనీ, వాస్తవంగా జీవుడికి ఎవరితోనూ సంబంధం వుండదనీ, శ్రీమన్నారాయణుడే శాశ్వతుడనీ, సర్వానికి సాక్షైన ఆయనకు ప్రియులు-అప్రియులు అంటూ ఎవ్వరూలేరనీ, తనకు రాజు దంపతులకు ఎట్టి సంబంధం లేదనీ, కాబట్టి తనకోసం వారు దుఃఖించాల్సిన అవసరం లేదనీ స్పష్టం చేశాడు. ఇలా పలికి ఆ జీవుడు వెళ్లిపోయాడు. అప్పుడు చిత్రకేతువు శోకాన్ని వదిలి యమునానదీ తీరానికి వెళ్లి కొడుకుకు ఉత్తర క్రియలు చేశాడు.   

చిత్రకేతువు యమునానదిలో స్నానం చేసి నారదుడికి నమస్కరించాడు. అతడు ప్రసన్నమై భగవ్మంత్రాన్ని ఉపదేశించాడు. తరువాత అంగిరసుడితో కలిసి బ్రహ్మలోకానికి వెళ్లిపోయాడు. చిత్రకేతువు నారదుడు చెప్పిన విధంగా నిరాహారుడై సమాధిలో వుండి నారాయణ స్వరూపాన్ని ధ్యానం చేశాడు. ఏడు రాత్రులు ఆ విద్యను ఆరాధించే సరికి విద్యాధర చక్రవర్తిత్వం లభించింది. నారాయణుడి అనుగ్రహంతో ఒక దివ్య విమానాన్ని అదిరోహించి మనోవేగంతో ముల్లోకాలు సంచరించసాగాడు. ఆల తిరుగుతున్న సమయంలో శ్రీమహావిష్ణువు పాదపీఠమైన ఆదిశేషుడిని చూశాడు. ఆయన్ను చూసేసరికి ఆయన పాపాలన్నీ హరించిపోయాయి. ఆదిశేషుడిని స్తుతించాడు. దానికి ఆయన ప్రసన్నుడయ్యాడు, సంతోషించాడు. తనను భక్తిశ్రద్ధలతో, విజ్ఞానంతో కూడిన వాక్కులతో స్తోత్రం చేసి ముక్తుడయ్యాడని చెప్పి అంతర్థానమయ్యాడు ఆదిశేషుడు. ఆ తరువాత చిత్రకేతువు గగనచారిగా లక్షల దివ్య సంవత్సరాలు అనేక రమ్యమైన ప్రదేశాలలో విహరించాడు. తన మనస్సులో వైష్ణవ జ్ఞానాన్ని, భాగవత అర్చనాన్ని నింపుకున్నాడు. ఎల్లప్పుడూ ఆ పుండరీకాక్షుడినే స్తుతిస్తూ ఆ హరి కథలనే వినేవాడు. 

ఇలా హరినే కీర్తిస్తూ, మనస్సులో సేవిస్తూ చిత్రకేత మహారాజు హిమవత్పర్వత ప్రాంతంలో పర్యటించసాగాడు. అలా సంచరిస్తూ కైలాస పర్వతాన్ని సందర్శించాడు. అక్కడ పార్వతీ-పరమేశ్వరుల కొలువుకూటంలో, గౌరీదేవితో కూడి వున్న పరమేశ్వరుడిని చూశాడు చిత్రకేతుడు. అప్పుడు బ్రహ్మాది దేవతాసమూహం సేవిస్తుంటే, తన తొడమీద కూచున్న భవానీదేవిని కౌగిట్లో చేర్చుకున్నాడు పరమేశ్వరుడు. అది చూసిన చిత్రకేతుడు పకపక నవ్వి "పరమేశ్వరుడు లౌకికుడిలాగా, పదిమంది చూస్తుండగా, అనురాగబద్ధుడై భార్యను కౌగలించుకున్నాడు. ఎవరైనా ఏకాంతంగా సతులతో క్రీడిస్తాడుకాని ఇలా ధర్మ సభలలో సరస సల్లాపాలు చేయవచ్చా?" అని అన్నాడు. ఈ మాటలు పార్వతీదేవి విన్నది. పరమేశ్వరుడు వినికూడా ఒక చిరునవ్వి నవ్వి వూరుకున్నాడు.

పార్వతీదేవి చిత్రకేతువు మీద ఆగ్రహించి, సర్వేశ్వరుడిని దూషించిన ఆ పాపాత్ముడు దండానర్హుడని, శ్రీమహావిష్ణువు పాదపద్మాలను పూజించడానికి ఎంతమాత్రం అర్హుడు కాదని, అతడు చేసిన పాప ఫలంగా రాక్షస జన్మ ఎత్తుతాడని శపించింది. వెంటనే ఆమె పాదాల మీద పడ్ద చిత్రకేతువు ఆమె శాపాన్ని స్వీకరిస్తున్నానని, కర్మఫలం అనుభవిస్తానని, తనను అనుగ్రహించమని, జగన్మాతైన ఆమెను శంకించిన పాపానికి భయపడుతున్నానని చెప్పి తన విమానం ఎక్కి వెళ్లిపోయాడు. వాస్తవానికి చిత్రకేతువు పార్వతీదేవికి ప్రతిశాపాన్ని ఇవ్వగల సమర్థుడైనప్పటికీ ఆమె మాట శిరస్సున ధరించాడు. కారణం అతడు గొప్ప విష్ణు భక్తుడు కావడమే! ఇలా శాపానికి గురైన చిత్రకేతుడు త్వష్ట చేసే యజ్ఞంలో దక్షిణాగ్నిలో దానవ యోనిలో పుట్టి వృత్రాసురుడు అనే పేరుతో భగత్ భక్తుడయ్యాడు. అలా వృత్రాసురుడు రాక్షస జన్మ ఎత్తినప్పటికీ పూర్వజన్మలో పరమ విష్ణుభక్తుడు.         

           (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

 

No comments:

Post a Comment