దేవాసుర యుద్ధం, శ్రీమన్నారాయణ కవచం
శ్రీ మహాభాగవత కథ-35
వనం జ్వాలా నరసింహారావు
కంII చదివెడిది భాగవతమిది,
చదివించును
కృష్ణు, డమృతఝరి పోతనయున్
చదివినను
ముక్తి కలుగును,
చదివెద
నిర్విఘ్నరీతి ‘జ్వాలా’
మతినై
కశ్యప ప్రజాపతి భార్య అదితి కన్న పన్నెండు
మంది ఆదిత్యులలో త్వష్ట ఒకరు. ఆ త్వష్టకు, దైత్యుల చెల్లెలైన రచనకు, అధిక బలాఢ్యుడైన విశ్వరూపుడు జన్మించాడు. ఒకప్పుడు దేవతలు
బృహస్పతిని అవమానిస్తే అతడు కోపంతో వెళ్లిపోయాడు. అప్పటి నుండి దేవతలు
విశ్వరూపుడిని తమ ఆచార్యుడుగా వరించారు. దేవతల మీద బృహస్పతికి కోపం రావడానికి, ఆ కారణంగా దేవతలకు ఆపద వాటిల్లడానికి కారణం వున్నది. ఒకనాడు
ఇంద్రుడు ముక్కోటి దేవతలతో కొలువుతీరి వున్నప్పుడు, అప్సరసలు పాడుతు-ఆడుతుండగా సమస్త దేవతాగణానికి గురువైన
బృహస్పతి అక్కడికి వచ్చాడు. సన్మార్గాన్ని అతిక్రమించిన ఇంద్రుడు దేవగురువును
చూసికూడా తన సింహాసనం మీదనుండి లేవలేదు. ఆయనకు స్వాగతం చెప్పలేదు. కనీసం కూర్చోమని
కూడా అనలేదు. బృహస్పతి స్పందించకుండా వెనుతిరిగి తన నివాసానికి వెళ్లిపోయాడు. తను
చేసిన పనికి ఆ తరువాత ఇంద్రుడు ఎంతగానో చింతించాడు. ఆయన్ను ప్రసన్నం చేసుకోవాలని
గురువుగారింటికి బయల్దేరి వెళ్లాడు. ఇది గమనించిన బృహస్పతి ఆధ్యాత్మ మాయద్వారా
అదృశ్యుడై పోయాడు. బృహస్పతి జాడ కనుక్కోలేక ఇంద్రుడు అలజడి చెందాడు. ఇది తెలుసుకున్న
రాక్షసులు వారి గురువు శుక్రాచార్యుడి సలహామేరకు దేవతలమీద యుద్ధానికి బయల్దేరారు.
శుక్రాచార్యుల మంత్ర కళా విశేషం
వల్ల రాక్షసులు అస్త్రప్రయోగం చేసేసరికి దేవతా సమూహం బాణసమూహానికి నిలువలేక
పారిపోయారు. యుద్ధం చాలించి, భయంతో బ్రహ్మ దగ్గరకు పరుగెత్తారు.
బ్రహ్మ వారిని ఒకవైపు అనునయిస్తూనే, మరోవైపు వారు బృహస్పతి ఎడల
ప్రవర్తించిన తీరుకు మందలించాడు. బృహస్పతిని అధికార మదంతో దూరం చేసుకున్నారని, గురుద్రోహం చేసారని, ఆ దోషానికి ఫలం అనుభవిస్తున్నారని, ప్రస్తుతానికి విశ్వరూపుడిని ఆరాధించమని, అలా చేస్తే వారి కోరిక నెరవేరుతుందని చెప్పాడు. దేవతలు
విశ్వరూపుడి దగ్గరకు వెళ్లారు. శత్రుభయాన్ని పోగొట్టి ఆయన తపోమహిమ ద్వారా తమను
కాపాడమని దేవతలు విశ్వరూపుడిని ప్రార్థించారు. బ్రహ్మనిష్టుడైన ఆయన్ను ఆచార్యుడిగా
వరిస్తున్నామని, దేవతలకు పౌరోహిత్యం చెయ్యమని అడిగారు. విశ్వరూపుడు దేవతలను
ఊరడించి గురుభావాన్ని స్వీకరించాడు. ఏ విద్యద్వారా ఇంద్రుడు రాక్షసులను అంతం
చేయకలడో, ఆవిద్యను, విష్ణుమాయా తత్త్వాన్ని
విశ్వరూపుడు ఇంద్రుడికి చెప్పాడు.
శ్రేష్టమైన శ్రీమన్నారాయణ కవచాన్ని, భీకరమైన శత్రువుల నుండి రక్షించే వజ్రకవచాన్ని, తనను ఆశ్రయించిన వారిని రక్షించి మేలుకూర్చే కవచాన్ని
దేవేంద్రుడికి విశ్వరూపుడు బోధించాడు. విశ్వరూపుడు ఇంద్రుడికి తెలియచేసిన నారాయణ
కవచం విజయాన్ని చేకూరుస్తుంది. ఊహకు అందని ప్రభావం దానికుంది. మహాఫలవంతమైనది, గోప్యమైనది, హరి మాయా విశేషంతో కూడినది. ఏకాగ్ర
చిత్తంతో దాన్ని వినమనీ, మొట్టమొదట కాళ్లు చేతులు
కడుక్కోవాలనీ, తరువాత ఉత్తర ముఖంగా ఆసనం మీద కూర్చోవాలనీ, అంగన్యాస-కరన్యాస పూర్వకంగా ఈ నారాయణ కవచాన్ని
ప్రయోగించాలనీ విశ్వరూపుడు చెప్పాడు. ఇంకా ఇలా చెప్పాడు ఆయన ఇంద్రుడితో:
"నారాయణ కవచాన్ని కూర్చి ’ఓం
నమో నారాయణాయ’ అనే ప్రణవంతో కూడిన ఎనిమిది అక్షరాలను, పాదాలు, జానువులు, ఊరువులు, ఉదరం, హృదయం, వక్షఃస్థలం, ముఖం, శిరస్సు అనే అష్టాంగాలమీద విన్యాసం
చెయ్యాలి. తరువాత ’ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే ద్వాదశాక్షర మంత్రంతో కరన్యాసం
చెయ్యాలి. అంటే, మంత్రంలోని పన్నెండు అక్షరాలతో రెండు చేతుల వేళ్ల కణుపులలో న్యాసం
చేయాలి. తరువాత ’ఓం విష్ణవే నమః’ అనే మంత్రాన్ని గ్రహించి, హృదయంలో ’ఓం’ కారాన్ని, శిఖలో ’ణ’ కారాన్ని, నేత్రాలలో ’వే’ కారాన్ని న్యాసం చేయాలి. ’న’ కారాన్నిసరవ
సంధులలోను, అస్త్రముద్రతో ’మ’ కారాన్ని ఉంచి, మంత్రమూర్తి కావాలి. ఆ తరువాత ’అస్త్రాయ ఫట్’ అనే మంత్రంతో
దిగ్బంధనం చేసి పరమేశ్వరుడిని తన మనస్సులో ధ్యానిస్తే విద్యామూర్తి తపోమూర్తి
అవుతాడు. ఆ మంత్రరాజాన్ని పఠిస్తూ ఇలా చెప్పాలి".
"శ్రీమహావిష్ణువు కృపతో నన్ను
రక్షించు గాక; మత్స్యావతార మూర్తి నన్ను సదా రక్షించు గాక; అప్రమేయుడైన శ్రీ నృసింహస్వామి నన్ను రక్షించు గాక; ఆదివరాహమూర్తి నన్ను రక్షించు గాక; పరశురాముడు నన్ను రక్షించు గాక; రావణకుంభకర్ణాది వీరులను మట్టుబెట్టి, విభీషణుడిని లంకాధిపతిగా చేసిన శ్రీరామచంద్రుడు నన్ను
రక్షించు గాక; నారాయణుడు, దత్తాత్రేయుడు, కపిల మహర్షి, సనత్కుమారుడు, శ్రీ హయగ్రీవమూర్తి, నారద మహర్షి నన్ను రక్షించుదురు గాక; కూర్మమూర్తి, ధన్వంతరి, ఋషభుడు, అగ్నిదేవుడు, బలభద్రుడు, యముడు, ఆదిశేషువు, ద్వైపాయన మహర్షి, బుద్ధదేవుడు, కల్కి నన్ను రక్షింతురు గాక; ధర్మరక్షణపరుడైన శ్రీమన్నారాయణుడు నన్ను రక్షించు గాక!”.
“కేశవుడు, గోవిందుడు, నారాయణుడు, విష్ణువు, మధుసూధనుడు, త్రివిక్రముడు, వామనుడు, హృషీకేశుడు, పద్మనాభుడు, శ్రీవత్సధాముడు, సర్వేశ్వరుడు, జనార్ధనుడు, విశ్వేశ్వరుడు, కాలమూర్తి అనే నామరూపాలున్న భగవంతుడు నన్ను రక్షించు గాక!; సుదర్శన చక్రమా! శత్రు సైన్యాలను దగ్దం చెయ్యి!; గదాదండమా! దుష్త శక్తులను చూర్ణం చేయి!; పాంచజన్యమా! భీకరమైన నాదం చెయ్యి!; నందకమనే ఖడ్గమా! శత్రువులను ఖండించి చెండాడు!; చర్మాయుధమా! వెలుగును వ్యాపింప చేసి శత్రువులను అంధకారంలో
పడెయ్యి!; భగవంతుడి రూపం, నామం, వాహనం, దివ్యాయుధం నన్ను రక్షించు గాక!; గరుత్మంతుడు నన్ను రక్షించు గాక; శ్రీహరి నామ రూప వాహన దివ్యాయుధ పారిషదులు నన్ను రక్షించు
గాక; శేషడు ఉపద్రవాలను నాశనం చేయు గాక; లక్ష్మీనారాయణుడు నన్ను రక్షించు గాక; ఆ పరమేశ్వరుడు నన్ను రక్షించు గాక".
ఈ విధంగా నారాయణ కవచాన్ని, దాని ప్రభావాన్ని తెలుసుకున్న ఇంద్రుడు, దాన్ని ధ్యానం చేసి శత్రువులను జయించాడు. తరువాత ఇంద్రుడు
విశ్వరూపుడి వల్ల నేర్చుకున్న ఐశ్వర్యకరమైన విద్యతో ముల్లోకాలకు ప్రభువై సకల
భోగభాగ్యాలను అనుభవించాడు.
ఇదిలా వుండగా, విశ్వరూపుడికి అరుదైన తలలు మూడున్నాయి. మొదటిది సురాపానం
చేస్తుంది. రెండవది సోమపానం చేస్తుంది. మూడోది అన్నాన్ని తింటుంది. దేవతలతో
విశ్వరూపుడు కలిసి-మెలిసి వుంటూ, వారి యజ్ఞభాగాలు స్వీకరిస్తూనే ఒక
దుష్కర్మ చేశాడు. రాక్షసుల ఇంటి ఆడపడుచైన తన తల్లి రచన మీద వున్న అభిమానంతో, దేవతలకు తెలియకుండా యజ్ఞభాగాన్ని అసురులకు ఇవ్వడం
ప్రారంభించాడు. ఇది తెలుసుకున్న ఇంద్రుడు విశ్వరూపుడి మూడు తలలను ఖండించాడు. ఇలా
చేసే సరికి మూడు తలల్లో సోమపానం చేసే శిరస్సు కౌజు పిట్టగా మారిపోయింది. సురాపానం
చేసే శిరస్సు పిచ్చుకగా, అన్నం తినే శిరస్సు తీతువు పిట్టగా
మారిపోయాయి. బ్రహ్మహత్యా పాతకం మూడు పక్షి రూపాలుగా వచ్చి ఇంద్రుడిని కమ్ముకున్నాయి.
ఇంద్రుడు ఆదోషాన్ని ఒక్క సంవత్స్రర కాలం అనుభవించాడు. ఆ తరువాత ఆ పాపాలను
వదిలించుకోవడానికి భూమిని, జలాన్ని, వృక్షాలను, స్త్రీలను ప్రార్థించి వారు కోరిన
వరాలు ఇవ్వగా ఆ నలుగురు ఇంద్రుడి పాప భాగాలను పంచుకున్నారు.
(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం,
రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)
No comments:
Post a Comment