Friday, September 11, 2020

పాతాళ, నరకలోక విషయాలు .... శ్రీ మహాభాగవత కథ-32 : వనం జ్వాలా నరసింహారావు

పాతాళ, నరకలోక విషయాలు 

శ్రీ మహాభాగవత కథ-32

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

         భూమండలానికి అడుగున ఏడు లోకాలున్నాయి. అవి: అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళ లోకాలు. ఇవి వరుసగా ఒకదానికొకటి కిందికి ఉన్నాయి. ఒక్కొక్కటి పదివేల యోజనాల లోతు. వీటినే బిల స్వర్గాలని కూడా అంటారు. పాతాళాల బిలాలలో మయుడు పట్టణాలను నిర్మించాడు. వాటికి ఎత్తైన ప్రాకారాలున్నాయి. గోపురాలు, సభామంటపాలు, చైత్య విహార స్థలాలు ఉన్నాయి. వాటిల్లో నాగులు, అసురులు జంటలు-జంటలుగా విహరిస్తుంటారు. అక్కడ చిలకలు, కోకిలలు, గోరువంకలు ఉంటాయి. కృత్రిమంగా నిర్మించబడిన భూములు, ఇళ్లు చక్కగా అలంకరించబడి ఉంటాయి. నీటితో నిండిన సరస్సులు ఉంటాయక్కడ. వాటిలో నీతి పక్షులు, కాలువలు, పద్మాలు ఉంటాయి. ఆ సరస్సులలో అక్కడివారు ఇళ్లు నిర్మించుకుని ఉంటారు. రాత్రి-పగలు తేడా లేకుండా, కాలం మారుతుందన్న భయం లేకుండా, విహారాలు చేసుకుంటూ, అక్కడి వారు హాయిగా ఉంటారు. అక్కడ ఎప్పుడూ పగలే! వారికి శరీర రుగ్మతలు ఉండవు. మానసిక వ్యాధులు రావు. జుట్టు తెల్లబడదు. ఒళ్లు ముడత పడదు. ముసలితనం రోగాలు లేవు. శరీరం పాలిపోవడం జరగదు.

         ఇలాంటి పాతాళలోకంలోకి విష్ణు చక్రం ఎప్పుడు ప్రవేశిస్తుందో అప్పుడు అక్కడి దైత్య కులకాంతల గర్భం స్రావమై సంతానం నశించిపోతుంది.

         ఆ లోకాలలో ‘అతలం మొదటిది. అక్కడ మయుడి కొడుకైన బలాసురుడు నివసిస్తున్నాడు. వాడి దగ్గర 96 మాయలున్నాయి. అవి వినోదాన్ని ఇస్తాయి. భూలోకంలో ఈ మాయలకు లొంగిపోయి మోహం పొందిన చిత్తంతో సంచరిస్తుంటారు. బాలుడు ఆవలించినప్పుడు అతడి ముఖం నుండి స్వైరిణులు, కామినులు, పుంశ్చలులు అనబడే మూడు తేగల స్త్రీ జనం పుట్టింది. ఈ కామినీ జనులు పాతాళ లోకానికి వచ్చిన మగవాడిని ఆకర్షించి వాడితో స్వేచ్చావిహారం చేస్తారు. వాడు అదే పరమానందంగా భావిస్తాడు.

         అతలానికి కింద ఉన్న వితల లోకంలో హాటకేశ్వరుడు అనే పేరుతొ హరుడు తన గణాలతో నివసించి ఉంటాడు. సృష్టిని వృద్ధి చేయాలని బ్రహ్మ చెప్పగా రుద్రుడు భవానితో కలిసి అక్కడ రమిస్తూ ఉంటాడు. భవుడికి భవానితో కలిగిన కలయిక వల్ల వెలువడిన వీర్యం హాటకి అనే నదిగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదీజలాన్ని అగ్ని పానం చేసింది. తాగి, వాటిని పుక్కిట పత్తి ఉమ్మి వేసింది. అది హాటకం అన్న పేరుతోమేలిమి బంగారం అయింది. వితల లోకం కింద సుతలం ఉన్నది. అక్కడ విరోచనుడి కొడుకైన బలి చక్రవర్తి నివసిస్తున్నాడు. భగవానుడైన శ్రీహరి వామనావతారంలో బలిని సుతలంలో ప్రవేశించేట్లు చేసి, అక్కడ పరిపాలకుడుగా నియమించాడు. అఖిల లోకాలకు గురువైన శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తి ఇంటి ముందు శంఖచక్రగదలను ధరించి ఉంటాడు.

         సుతలానికి కింద తలాతలం ఉన్నది. దానికి అధిపతి మయుడు. తలాతలానికి కింద మహాతలం ఉన్నది. అక్కడ పాములు ఉంటాయి. వాటికి చాలా తలలు ఉంటాయి. దీని కింద  రసాతలం ఉన్నది. అక్కడ దేవతా విరోధులైన దైత్యులు, దానవులు ఉన్నారు. దాని కింద పాతాళం ఉన్నది. అక్కడ నాగ కులం ఉన్నది. ఆ పాముల మీదున్న మణుల కాంతులు పాతాళంలో అంధకారాన్ని పోగొటుతున్నాయి.

పాతాళ లోకానికి 30 వేల యోజనాల అడుగున ఆదిశేషుడు ఉన్నాడు. అతడు ప్రళయకాలంలో అఖిల లోకాలను సంహరించాలని అనుకున్నప్పుడు రుద్రమతులైన ఏకాదశ రుద్రులను సృష్టిస్తాడు. అలా సృష్టించబడిన వారికి మూడేసి కళ్ళు ఉంటాయి. వారంతా ఆదిశేషుడిని నీరాజనాలు ఇచ్చి అర్చిస్తూ ఉంటారు. ఆ శేషుడి పడగల మీద భూగోళం అణువంత మాత్రమే ఉంటుంది.

నరకలోక విషయాలు

         నరకాలు అనేవి ముల్లోకాల లోపల ఉన్నాయా? మధ్యలో ఉన్నాయా? బైట ఉన్నాయా? నరకాలకు ప్రత్యేకమైన ప్రదేశాలేమైనా ఉన్నాయా? అనేది ఆసక్తికరమైన విషయం. నరకాలు చాలా ఘోరమైనవి. ఇవి త్రిలోకాలకు చివరలో అంతరాళంలో (మధ్య భాగాలలో) దక్షిణ దిశగా ఉన్నాయి. నరకాలు దక్షిణం వైపున భూమి కింద అండానికి చుట్టూ ఆవరించుకుని ఉన్న జలాలకు పైన ఉన్నాయి. దక్షిణ దిక్కుకే అగ్నిష్వాత్తులు మొదలైన పితృగణాలు ఉంటాయి. వారు జ్ఞానంతో తమ గోత్రంలో జన్మించినవారి క్షేమం కోరుతూ ఉంటారు. ఆ దక్షిణ దిక్కుకే పితృదేవతలకు అధిపతైన యముడు ఉంటాడు. తనలోకానికి వచ్చిన జీవులకు వాళ్ల కర్మానుసారం యముడు తగిన ఫలాలను ఇచ్చి శిక్షిస్తుంటాడు.

         నరకాలు రక-రకాలు. అవి: తామిస్రం, అంధతామిస్రం, రౌరవం, మహారౌరవం, కుంభీపాకం, కాలసూత్రం, అసిపత్రవనం, సూకరముఖం, అంధకూపం, క్రిమి భోజనం, సందశం, తప్తసూర్మి, వజ్రకంటకశాల్మలి, వైతరణి, పూయోదం, ప్రాణరోధం, విశసనం, లాలాభక్షం, సారమేయాదనం, అవీచిరియం, రేతఃపానం అనే 21 మహానరకాలు. ఇంకా, క్షారకర్దమం, రక్షోగణభోజనం, శూలప్రోతం, దందశూకం, అవట నిరోధనం, పర్యావర్తనం, సూచీముఖం అనబడే మరో ఏడు విధాలైన నరకాలతో కూడి మొత్తం 28 నరకాలున్నాయి. ఒక్కొక్క నరకంలో ఒక్కొక్క రకాలైన శిక్షలు అమలు పరుస్తుంటారు జీవుల కర్మ ఫలాలకు అనుగుణంగా. వాస్తవానికి ఇలాంటి నరకాలు యమలోకంలో వెల కొద్దీ ఉన్నాయి. ధర్మాన్ని విడిచిన పాపాత్ముల్ని ఈ నరకకూపాలలో యమభటులు నిరంతరం బాధిస్తూనే ఉంటారు. ఇక, ధర్మాత్ములైన వారు తప్పకుండా స్వర్గానికి వెళ్లి స్వర్గ భోగాలను అనుభవిస్తారు. పుణ్య-పాపాలు మిగిలి పోవడం వల్ల కర్మను అనుభవించడానికి మరల-మరల భూమ్మీద పుడుతూ ఉంటారు. 

                      (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

    

 

No comments:

Post a Comment