Saturday, September 26, 2020

శ్రీరామ చరిత్ర .... శ్రీ మహాభాగవత కథ-47 : వనం జ్వాలా నరసింహారావు

 శ్రీరామ చరిత్ర

 శ్రీ మహాభాగవత కథ-47

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

దశరథ మహారాజు భార్యల్లో ఒకరైన కౌసల్య గర్భాన శ్రీమన్నారాయణుడి అంశతో శ్రీరామచంద్రుడు జన్మించాడు. విశ్వామిత్రుడి యాగ సంరక్షణార్థం, ఆయన కోరిక మీద, తండ్రి పంపగా వెళ్ళి, అక్కడ తాటకి అనే రాక్షసిని సంహరించాడు. ఆమెను వధించి విశ్వామిత్రుడి యాగం నిర్విఘ్నంగా పరిసమాప్తి పొందేట్లు కాపాడాడు. సుబాహుడనే రాక్షసుడిని ఘోర యుద్ధంలో సంహరించాడు. తన మోసపూరితమైన దేహకాంతులతో మోసపుచ్చిన మారీచుడిని వధించాడు. శివధనస్సును, విదేహ ప్రభువు జనకుడి సభామందిరంలో, సునాయాసంగా, విలాసంగా విరిచేశాడు శ్రీరామచంద్రుడు. ఆ తరువాత సీతాదేవిని సంతోషంగా పెళ్లిచేసుకున్నాడు. అయోధ్య తిరిగి వెళ్లిపోతుంటే దారిలో అడ్దగించిన, ఇలాతలంలోని రాజులందరినీ హతమార్చిన, పరశురాముడిని అవలీలగా జయించాడు. దశరథుడు తన భార్య కైకకు ఇచ్చిన మాట ప్రకారం శ్రీరామచంద్రుడిని అరణ్యవాసం చేయమని అడవులకు పంపాడు.

అడవులకు ఆయన వెంట భార్య జానకీదేవి, తమ్ముడు లక్ష్మణుడు కూడా వెళ్లారు. తన మరో తమ్ముడైన భరతుడికి రాజ్యం అప్పచెప్పాడు. అడవికి పోయిన శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా దండకారణ్యం చేరుకున్నాడు. అక్కడ ఒక పర్ణశాల నిర్మించుకుని అందులో నివసించారు. అప్పుడు రావణాసురుడి చెల్లెలు శూర్పణఖ రాముడిని మోహించి దగ్గరికి రాగా, లక్ష్మణుడు దాని ముక్కు-చెవులు కోసి అక్కడి నుండి వెళ్లగొట్టాడు. అది విన్న ఖరదూషణాది రాక్షసులు పధ్నాలుగు వేలమందితో యుద్ధానికి రాగా శ్రీరామచంద్రుడు వారందరినీ సంహరించాడు. రావణుడు సీతాదేవి చక్కదనాన్ని విని, మోహితుడై, మాయోపాయంతో అపహరించడానికి మారీచుడి సహాయం కోరాడు. వాడప్పుడు బంగారు లేడి రూపంలో వచ్చి సీత కంటబడ్డాడు. అదికావాలని సీత కోరడంతో దాని వెంటబడి ఆ నీచుడిని సంహరించాడు. ఇంతలో రావణుడు సీతను అపహరించి తీసుకుపోయాడు. వెళ్తున్నప్పుడు అడ్డుపడ్డ జటాయువును కూల్చివేశాడు రావణాసురుడు.   

శ్రీరామచంద్రుడు తమ్ముడు లక్ష్మణుడితో కలిసి సీతాదేవిని వెతుక్కుంటూ బయల్దేరి, దారిలో తమకొరకు ప్రాణాలర్పించిన జటాయువుకు దహన సంస్కారాలు చేశాడు. అక్కడి నుండి ఋశ్యమూక పర్వతం చేరుకున్నాడు. సుగ్రీవుడితో స్నేహం చేసి, అతడి అన్న వాలిని సంహరిస్తానని, సుగ్రీవుడిని రాజుగా చేస్తానని అభయమిచ్చాడు. పరాక్రమవంతుడైన వాలిని ఒకే ఒక్క బాణంతో సంహరించాడు. ఆ తరువాత హనుమంతుడిని సీతాన్వేషణ నిమిత్తం నియమించాడు. హనుమంతుడు సముద్రాన్ని లంఘించి, లంకకు చేరుకుని, సీతను కనుగొని, రావణుడి కుమారుడైన అక్షుడనే వాడిని, పలువురు రాక్షస నాయకులను చంపాడు. రాక్షసులు అతడి తోకకు నిప్పంటించగా, దానితో లంకను దగ్దం చేశాడు. ఆ తరువాత తిరిగి వచ్చి, రాముడికి సీత జాడ చెప్పడంతో, ఆయన సుగ్రీవుడి వానర సైన్యాన్ని వెంటబెట్టుకుని యుద్ధానికి బయల్దేరాడు. 

లంకకు వెళ్లే దారిలో వున్న సముద్రాన్ని చేరుకున్నాడు రాముడు. తనకు పోవడానికి దారి ఇమ్మన్నాడు. ఇవ్వకపోవడంతో సముద్రుడి మీద కోపం తెచ్చుకున్నాడు. అప్పుడు నీరంతా ఇంకిపోయి సముద్రం బీడుభూమిగా మారిపోయింది. సముద్రుడప్పుడు బయటకు వచ్చి శరణు కోరాడు శ్రీరామచంద్రుడిని. ఆయన్ను స్తుతించాడు. అప్పుడు శ్రీరాముడు ఆయన్ను యథాపూర్వ స్థితిలో వుండుగాక అన్నాడు. సముద్రుడిచ్చిన ఉపాయం ప్రకారం వానరులు సముద్రం మీద వారధి కట్టారు. శ్రీరామచంద్రుడు సైన్యంతో సముద్రాన్ని దాటాడు. ఆవలి ఒడ్డుకు చేరిన శ్రీరాముడి శరణు జొచ్చాడు రావణుడి తమ్ముడు విభీషణుడు. అతడికి అభయమిచ్చాడు రాముడు. వానర సేన లంకలోకి ప్రవేశించింది. అక్కడ నానా భీభత్సాన్ని సృష్టించింది. అప్పుడు రావణుడు పంపగా ఆయన సేనానాయకులు పలువురు వచ్చి యుద్ధం చేసారు. వారిని ధీటుగా ఎదుర్కున్నారు వానర నాయకులు. అందరినీ చంపారు. లక్ష్మణుడు అతికాయుడిని, శ్రీరామచంద్రుడు కుంభకర్ణుడిని, లక్ష్మణుడు ఇంద్రజిత్తును వరుసవెంట చంపారు.

తన వారంతా యుద్ధంలో చనిపోగా రావణాసురుడు వచ్చి, రాముడితో బాణ యుద్ధం చేశాడు. ఇంద్రుడు పంపగా అతడి సారథి మాతలి తెచ్చిన దివ్యరథాన్ని ఎక్కి శ్రీరామచంద్రుడు యుద్ధం చేశాడు రావణుడితో. రావణాసురుడిని గురిచూసి మహాబాణాన్ని సంధించి వేశాడు రాముడు. ఆ బాణానికి దశకంఠుడు నేలకూలాడు. ఇది విన్న అసురకాంతలు యుద్ధభూమికి వచ్చి రావణ కళేబరాన్ని చూసి రోదించారు. మందోదరి విలపించింది. రాముడి ఆజ్ఞానుసారం, రావణుడికి అంతిమ సంస్కారం చేశాడు విభీషణుడు. తరువాత రాముడు సీత వున్న అశోకవనం లోని శింశుపా వృక్షం సమీపానికి వెళ్లాడు. సీతాదేవిని చూశాడు. ఆ స్థితిలో ఆమెను చూసిన శ్రీరామచంద్రుడు కూడా దుఃఖించాడు. సీతలో ఏ దోషం లేకపోయినా, అ పుణ్యచరితను అగ్నిముఖంగా ప్రకటింపచేసి, దేవతల మాట చొప్పున ఆమెను పరిగ్రహించాడు. తదనంతరం రావణ రాజ్యం విభీషణుడికి పట్టం కట్టాడు. సీతాలక్ష్మణ సమేతుడై శ్రీరామచంద్రుడు, హనుమంతుడితో సహా, పుష్పక విమానంలో నందిగ్రామానికి చేరుకున్నాడు. ఆయనకు శ్రీరాముడి పాదుకలు నెత్తిన పెట్టుకుని వచ్చిన భరతుడు స్వాగతం పలికాడు.

అక్కడి నుండి శ్రీరామచంద్రుడు పుష్పక విమానంలో బయల్దేరాడు. అయోధ్యా నగరానికి చేరుకున్నాడు. ఆ నగరం అంతా అలంకరించబడి వుంది. నగరమంతా ఒకటే సందడిగా వుంది. రామచంద్రుడు అయోధ్య రాజమార్గంలో ప్రయాణించాడు. రాజగృహానికి చేరుకున్నాడు. తల్లులైన కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు మొక్కాడు. తమ్ముళ్లను కౌగలించుకున్నాడు. తల్లులు సీతాదేవికి స్వాగతం చెప్పారు. కౌగలించుకున్నారు. అప్పుడు కులగురువు వశిష్టుడు వచ్చి శ్రీరాముడి జడలు తీయించాడు. శ్రీరాముడికి అభిషేకం చేశారు. భరతుడు సమర్పించిన సింహాసనాన్ని అధిష్టించి, రాజ్యపాలన చేస్తూ వచ్చాడు రాముడు. ప్రజలంతా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సుఖ సంతోషాలతో వర్ధిల్లారు ఆయన పాలనలో.

ఆయన పాలన చేస్తుండగా ఒకనాడు....ఆ పట్టణంలోని ప్రజల్లో ఒకడు భార్యను ఎందుకు ఏలుకోవని అడిగినవారికి సమాధానంగా, ’ఆ చపల చిత్తురాలైన దాన్ని విడిచిపెట్టక ఏలుకోవడానికి నేనేమైనా రామచంద్ర ప్రభువునా’ అన్నాడు. ఈ మాట శ్రీరామచంద్రుడి చెవుల్లో పడ్దది. రాత్రికిరాత్రే, ఆమెను వాల్మీకి ఆశ్రమంలో విడిచి రమ్మని ఆజ్ఞాపించాడు. ఆ సమయంలో ఆమె గర్భవతి. ఆశ్రమంలోనే ఆమె కుశలవులనే ఇద్దరు కవలలను కన్నది. కొంతకాలం గడిచాక, రామచంద్రుడి కుమారులు లవకుశులు వాల్మీకి శిక్షణలో రామ కథను నేర్చుకుని గానం చేయడానికి శ్రీరాముడి యజ్ఞశాలకు వచ్చారు. ఆ బాలకుల మీద రాముడికి మక్కువ కలిగింది. తల్లి-తండ్రులెవరని అడిగాడు వారిని. జవాబుగా వాల్మీకి మహాముని మనుమలం అన్నారు. మర్నాడు వాల్మీకి మహాముని సీతాసమేతంగా వచ్చాడు. సీత కల్లాకపటం ఎరుగదని చెప్పాడు. శ్రీరాముడు అది పట్టించుకోకుండా కుశలవుల వివరాలు అడగడంతో, ఆయన పాదపద్మాలను మనస్సులో నిలుపుకుని ఆమె భూమిలోకి వెళ్లిపోయింది. రాముడు అమితంగా దుఃఖించాడు. ఆ తరువాత బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ శ్రీరాముడు పదమూడు వేల సంవత్సరాల పాటు జీవించి తన యథా పూర్వస్థానమైన వైకుంఠాన్ని చేరుకున్నాడు.   

(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

No comments:

Post a Comment