Sunday, September 27, 2020

రామావతారం పూర్ణావతారమే .... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-27 : వనం జ్వాలా నరసింహారావు

 రామావతారం పూర్ణావతారమే

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-27

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (29-09-2020)

పంచవటిలో సీతారామ లక్ష్మణులు తమ ఇష్టప్రకారం తిరిగే సమయంలో, జన స్థానంలో నివసించే కామ రూపిణి-భయంకర రాక్షస స్త్రీ-శూర్పణఖ, ముక్కు చెవులు కోసి వికార రూపం వచ్చేటట్లు చేస్తాడు లక్ష్మణుడు. ఇది తెలిసిన జన స్థానంలోని ఖర-దూషణ-త్రిషిరుడితో సహా పద్నాలుగు వేల రాక్షసులు వీరిపైకి యుద్ధానికి వస్తారు. లక్ష్మణుడి సహాయం లేకుండానే, రణరంగంలో పరాక్రమవంతుడైన రామచంద్రమూర్తి, పద్నాలుగు వేల మందినీ, కేవలం భుజబలంతోనే వధిస్తాడు. తన బంధువుల మరణ వార్త విన్న రావణుడు, కోపంతో, తనకు సహాయం చేయమని మాయలమారి రాక్షసుడు మారీచుడిని ప్రార్థిస్తాడు. మహా బల పరాక్రమవంతుడైన శ్రీరామచంద్రమూర్తితో యుద్ధం చేయడం కీడని రావణుడికి సలహా ఇస్తాడు మారీచుడు. ఆ ఆలోచన మాను కొమ్మని బోధిస్తాడు. మృత్యువు ప్రేరేపిస్తుంటే, వాడిని తీసుకొని సీతారాములున్న చోటికి పోతాడు రావణుడు. వంచన చేసే స్వభావం కలిగిన మారీచుడు బంగారువన్నెగల జింక రూపంతో సీతకు కనిపిస్తాడు. ఆ జింక కావాలని సీత కోరితే, దాన్ని తేవడానికి పోయిన రాముడు అస్త్రంతో వధిస్తాడు. చస్తూ ’హా లక్ష్మణా’ అని అరుస్తాడు మారీచుడు. ఆ ధ్వని విన్న లక్ష్మణుడు అన్నకు సహాయం చేద్దామని వెళ్తాడు. ఒంటరిగా వున్న సీతను అపహరించుకుని పోతూ త్రోవలో అడ్డుపడ్డ జటాయువనే గద్దను చంపి లంకకు చేరి సీతను అశోక వనంలో వుంచుతాడు రావణుడు".

"సీతను విడిపించే ప్రయత్నంలో రావణాసురుడి చేతుల్లో దెబ్బతిని, చనిపోవడానికి సిద్ధంగా వున్న జటాయువును చూసి, ఆయన ద్వారా తన భార్యాపహరణం గురించి విని ఎంతో బాధపడ్తాడు రాముడు. తన తండ్రికి ఎలాచేయాల్నో అదే రీతిలో, చనిపోయిన జటాయువుకు దహనసంస్కారాలు చేశాడు రాముడు. తనవల్ల కదా జటాయువుకింత దుఃఖం కలిగిందని బాధపడి విలపిస్తాడు".

      (రామచంద్రమూర్తి విష్ణువు అవతారమైనందున ఆయనకు ఇతర మానవులవలె శోక మోహాలుంటాయా అన్న సందేహం కలగొచ్చు. మనుష్యులకెలాంటి శోక మోహాలు ప్రాప్తిస్తాయో, అలానే రాముడికి ప్రాప్తించాయని భావించరాదు.   మనిషికి శోక మోహాలు కలగడానికి కారణం కామ-క్రోధాలే. ప్రకృతి పరిణామమే దేహం. ప్రకృతి గుణమే రజస్సు. రజో గుణాలవల్ల జన్మించినవే కామ-క్రోధాలు. కామం విఘ్నమైతే కోపంగా మారుతుంది. ఇష్టపడే వస్తువు దొరక్కపోయినా-పోగొట్టుకున్నా శోకం కలుగుతుంది. మోహానికీ కారణం కోపమే. ప్రకృతి పరిణామమైన దేహం, ప్రకృతి గుణాలైన సత్వ-రజస్సు-తమస్సులను కలదై వుంటుందనీ, కొద్దో-గొప్పో ఈ మూడు గుణాలు లేకుండా దేహి వుండడనీ, రజస్సు కారణాన శోక-మోహాలు కలుగుతాయని, ఇవన్నీ పూర్వ జన్మలో చేసిన పాపాల మూలాన ఈ జన్మలో ఫలితం అనుభవించాల్సివస్తుందనీ శాస్త్రం చెప్తుంది.

అంటే, ప్రకృతి బద్ధుడైన పురుషుడు, ప్రకృతి గుణాలైన శోక-మోహాల వలన పీడించ బడుతాడని అనుకోవాలి. అలాంటప్పుడు ప్రకృతికి అతీతుడైన విష్ణువు, ప్రకృతి గుణాల మూలాన ఎలా పీడించబడుతాడన్న సందేహం కలగొచ్చు. అవతార దశలో ప్రకృతికి విష్ణువు కూడా బద్ధుడనే సమాధానం చెప్పుకోవాలా?


రామావతారం పూర్ణావతారమే. అంటే ప్రకృతి సంసర్గం లేదు. శరీరం అప్రాకృతం. ప్రకృతి గుణాలు ఆయన్ను బాధించవు. రామచంద్రమూర్తి శోకించాడని వాల్మీకి రాసిందీ అసత్యం కాదు. నిజంగానే శోకం కలిగిందాయనకు. అయితే శోకం కలిగింది తనకొచ్చిన కష్టానికి కాదు. తమకు దుఃఖాలొచ్చాయని మనుష్యులు దుఃఖిస్తారు. తనకై, తన ఆప్తులకు దుఃఖం కలిగిందికదానని, తన మూలాన వీరికింత దుఃఖం ప్రాప్తించిందికదానని, వారి దుఃఖాన్ని ఆపాల్సిన తానే వారి దుఃఖానికి కారణమయ్యానేనని మాత్రమే రాముడు శోకించాడు. అలానే, సీతాదేవి విషయంలోనూ దుఃఖించాడు శ్రీరాముడు. తనను నమ్మి అడవులకు వచ్చిన సీతను, రాక్షసుడు ఎత్తుకుపోతే, తనను వదిలిన బాధతో, అమెకెంత దుఃఖం కలిగిందోనని రామచంద్రమూర్తి దుఃఖించాడు. వియోగంవల్ల తమకు కలిగిన నష్టానికి దుఃఖించే వాళ్లు మనుష్యులు. జీవులకు కలిగిన నష్టానికి దుఃఖించేవాడు భగవంతుడు).

అడవులన్నీ వెతుక్కుంటూ పోయి, శ్రీరాముడు భయంకర-వికార స్వరూపుడైన కబంధుడనే రాక్షసుడిని చంపి దహనం చేసాడు. శాప విముక్తుడైన కబంధుడు, పంపా తీరంలో వున్న శబరిని చూసిపొమ్మని బోధించాడు. ఆమె శ్రేష్ఠ ధర్మమైన గురు శుశ్రూషను ఆచరించేదనీ, అతిథి పూజలాంటి సకల ధర్మాలను ఎరిగినందున, ఆ బోయసన్యాసినిని తప్పక చూడమనీ అంటాడు”.

(సన్యాసిని అంటే, కాషాయ వస్త్రాలు కట్టి, బోడి తల చేయించుకుని, చతుర్థాశ్రమస్వీకారం చేసిందని అర్థంకాదు. కామ్యకర్మాలు చేయకపోవడమే నిజమైన సన్యాసం. జ్ఞానం సన్యాస లక్షణం).

 

No comments:

Post a Comment