మొదట హితోక్తి చేవికేక్కినా....
వనం
జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ, చింతన (10,11-09-2020)
లక్ష్మణుడి చేతిలో పరాభవం పొంది,
ముక్కు-చెవులు కోయించుకుని, ఏడ్చుకుంటూ వచ్చిన శూర్పణఖ చెప్పుడు మాటలకు, దాని అన్న
ఖరుడు కోపంతో పద్నాలుగు మంది క్రూర రాక్షసులను రామలక్ష్మణుల మీదికి యుద్ధానికి
పంపాడు. శూర్పణఖ దారి చూపిస్తుంటే, దండకారణ్యానికి పోయారు వాళ్ళు. యుద్ధానికి
వచ్చిన వాళ్లను తన బాణాలతో ఎదిరించాడు రాముడు. ఆయన వేసిన బాణాలకు, వాళ్లు
వేళ్ళు తెగిన చెట్లలాగా నెత్తురుతో తడిసి, దేహాలతో
ప్రాణాలు పోయినవారై, భూమ్మీద పడ్డారు. అది చూసి శూర్పణఖ పరుగెత్తింది.
భయంకరంగా
గట్టిగా ఏడ్చుకుంటూ, జనస్థానంలో వున్న ఖరాసురుడి దగ్గరకు
వచ్చిన రాక్షస నాశనానికి కారకురాలు కాబోతున్న శూర్పణఖను చూసి ఖరుడు మళ్ళా ఎందుకు
ఏడుస్తూ వచ్చావని అడిగాడు. “నువ్వు పంపిన వారందరూ రాముడి బాణాలకు క్షణకాలంలో నిలబడి
చచ్చిపోయారు. అది చూసిన నేను,
అక్కడ వుంటే నన్నేం చేస్తారో అన్న భయంతో, గాలి వేగంతో పరుగెత్తుకుంటూ వచ్చానిక్కడికి. నువ్వు రాముడిని
ఎదిరించి, యుద్ధం చేసే ధైర్యం వుందా? వుంటే, ఏదీ చూద్దాం, తక్షణమే రాముడిమీదకు యుద్ధానికి బయల్దేరు” అని
శూర్పణఖ పెద్ద నగారా వాయించినట్లు కడుపు మీద బాదుకుంటూ, ఏడుస్తుంటే రాక్షస నాయకుడు ఖరుడు ఆమెను సమాధాన
పరచాడు.
శూర్పణఖ
నిందా వాక్యాలకు, తన పౌరుషాన్ని రెచ్చగొట్టే విధంగా
మాట్లాడిన మాటలకు జవాబుగా ఖరుడు “ఎందుకు ఏడుస్తావు? ఏడవ వద్దు. ఇదిగో ఇప్పుడే పోయి తమ్ముడితో సహా
రామచంద్రుడిని చంపుతా” అని చెప్పగానే శూర్పణఖ సంతోషించింది. తమ్ముడిని మరీ-మరీ
పొగిడింది. దూషణుడు అనే సేనానాయకుడిని పిలిచి యుద్ధానికి సన్నద్ధం కమ్మన్నాడు
ఖరుడు. భయంకరమైన బలం కలవారిని,
పద్నాలుగువేల రాక్షసులను శీఘ్రంగా సమకూర్చమని దూషణుడిని పురమాయించాడు ఖరుడు. వాడు
ఇలా చెప్పగా దూషణుడు రథాన్ని అతడి ముందు నిలిపాడు. దాని మీదకు కోపంతో ఎక్కాడు
ఖరుడు. ఖరుడు రథం ఎక్కగానే,
దూషణుడు పెద్ద సేనతో ఖరుడి పక్కన నిలిచాడు. సైన్యాన్ని కదలమని ఖరుడు ఆజ్ఞాపించాడు.
వారి వెంట పద్నాలుగు వేలమంది రాక్షసులు బయల్దేరారు.
వారు రావడం చూసిన రాముడు, లక్ష్మణుడు చేయాల్సిన పనేదో చెప్పాడు. “సీతాదేవి ఇక్కడుంటే ఆమెకు వాళ్ళు కీడు
కలిగిస్తారు. కాబట్టి ఆమె ఇక్కడ వుండకూడదు. ఒంటరిగా ఎక్కడికీ పంపకూడదు. నువ్వు
ఆమెను పిల్చుకొని, విల్లు-బాణాలు ధరించి దట్టంగా వున్నా
చెట్ల గుంపులుకల కొండగుహలోకి పొండి. ఆమెను లోపల వుంచి నువ్వు బయట కాపలాగా వుండు.
ప్రయాణం కండి తొందరగా. లేలే. నేనొకపని, నువ్వొకపని చేయాల్సి వుంది. రెండూ ముఖ్యమైనవే కదా?” (వీటినే ఇప్పుడు “సీతమ్మ గుట్టలు” అని
అంటారు. రాక్షస సైన్యం తూర్పు ముఖంగా వచ్చింది. సీతాలక్ష్మణులు ఎటి ఒద్దు వెంట
ఉత్తర ముఖంగా పోయారు). రామచంద్రమూర్తి చెప్పినట్లే త్వరగా లక్ష్మణుడు తన విల్లు, బాణాలు ధరించి సీతాదేవితో వెళ్ళిపోయాడు.
సంతోషంతో యుద్ధ
ప్రయత్నం చేశాడు రాముడు. ఖరుడి సైన్యం రాముడిని చూసింది. అప్పుడు రాక్షస సైన్యం
రాముడిని సమీపించగా, రామభద్రుడు వారందరినీ తేరిపార చూశాడు. సైన్యంతో
శ్రీరాముడిని తాకాడు ఖరుడు. మిగిలిన రాక్షసులందరూ రాముడిని చుట్టుముట్టి గుడియలు, శూలాలు,
గండ్రగొడ్డళ్ళు, కత్తులు ఆయన
మీదికి విసిరారు. రామభద్రుడు ప్రతిగా, తన బాణ సమూహాలతో
వారందరినీ సర్వాయుధాలు లేకుండా చేశాడు. ఖరుడి సైన్యాన్ని హతం చేసాడు శ్రీరాముడు.
మిగిలిన వారంతా దుఃఖపడుతూ ఖరుడి చాటుకు పోయారు భయంతో. అప్పుడు దూషణుడు రోషంతో
రామభద్రుడి మీదకు యుద్ధానికి పోయాడు. శ్రీరాముడితో యుద్ధం చేసి మరణించాడు దూషణుడు.
శ్రీరాముడి చేతిలో కాలకార్ముకాది సేనాపతులు కూడా చనిపోయారు. శ్రీరాముడితో పోరాడి చనిపోయాడు త్రిశిరుడు
కూడా. అప్పుడు శ్రీరాముడితో యుద్ధం చేసాడు ఖరుడు. పదునైన బాణాలతో రాముడుని
నొప్పించాడు. శ్రీరాముడి కవచాన్ని కూడా భేదించాడు. చివరకు శ్రీరాముడి చేతిలో
మరణించాడు ఖరుడు సహితం.
ఇలా యుద్ధం ముగియగానే, లక్ష్మణుడు సీతాదేవితో సహా వచ్చాడక్కడికి. యుద్ధంలో గెలిచి
అపరాజితుడైన శ్రీరాముడు, మునులు పూజిస్తుండగా, సీతాలక్ష్మణులు తన తోడు
వస్తుంటే, విలాసంగా తన ఆశ్రమానికి వచ్చాడు. అక్కడికి చేరిన
తరువాత సీతాదేవి శత్రుసంహారుకుడు, ఋషులకు సంతోషం కలిగించిన
వాడు, తన భర్త అయిన శ్రీరామచంద్రమూర్తిని గట్టిగా
కౌగలించుకుంది.
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ నిమిత్తమై శ్రీరాముడు దండకకు వచ్చాడు. దుష్టులను శిక్షించడం ప్రథమ కార్యం. ఖరాది వధకు కారణం, దానివలన ప్రయోజనం ఋషి సంరక్షణేకదా? శ్రీమహాలక్ష్మీదేవి స్త్రీలను బాధించే రాక్షసులను సమూలంగా నాశనం చేయడానికే భర్తను భూమిమీద అవతరించాలని కోరి, తానూ అవతరించింది. తన కోరిక నెరవేరే సమయం ఆసన్నమైంది కదా అన్న సంతోషంతో, తన కార్యాన్ని స్వకార్యంగా భావించిన భర్తకు తన సంతోషం వ్యక్తం చేయడానికి ఆయన్ను కౌగలించుకున్నది. రామచంద్రమూర్తి లేని సీత గుహనుండి వచ్చి రాముడిని కౌగలించుకున్నది అంటే, హృదయమనే గుహలో వుండే జీవుడు పరతంత్రుడై ఆచార్యులవలన సర్వస్వామిని దర్శించి దానితో సర్వ విరోధి వర్గం నశించగా, అందులోంచి వెలువడిన స్వామిని దర్శించాడని అర్థం. శ్రీరామచంద్రమూర్తి జయం విన్నవారు పాపబందాల వల్ల, కారాగార గృహ బంధాల వల్ల, ఋణబాధల వల్ల, ఎదుర్కొన్న ఇబ్బందులను విడవబడుతారు. పుష్పవతైన స్త్రీ వింటే రామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల వంశోద్ధారకుడైన కొడుకును కంటుంది.
జనస్థానం నుండి అకంపనుడనే రాక్షసుడు, రావణుడి
వేగులవాడు,
లంకకు
పోయి,
రావణాసురుడితో
జనస్థానంలో వున్న ఖరుడుతో సహా రాక్షసులందరూ యుద్ధంలో చంపబడ్డారాణి చెప్పాడు. ఈ
మాటలు విన్న రావణుడు అదిరిపడి, కళ్లల్లో నిప్పులు కురుస్తుంటే, ఎవరా పని
చేసారని అడగ్గా జవాబుగా రామచంద్రమూర్తి అని అంటాడు. రామచంద్రుడు ఒక్కడే ఆ పని
చేసాడా? లేక
యుద్ధానికి ఇంద్రాదులను తోడు తెచ్చుకున్నాడా? వివరాలు
చెప్పమని అడిగాడు. అప్పుడు శ్రీరాముడి పరాక్రమాన్ని వర్ణించి చెప్పాడు
రావణాసురిడికి అకంపనుడు. అకంపనుడు ఈ విధంగా చెప్పగానే విన్న రావణుడు ముఖం ఎర్రగా
చేసి తక్షణమే ఆ మనుష్యులను చంపుతానంటూ బయల్దేరడానికి సిద్ధమౌతాడు. అప్పుడు
అకంపనుడు రామభద్రుడి బలపరాక్రమాలను మరింత వివరంగా చెప్పాడు. బ్రహ్మేంద్రాదులు కూడా
ఆయన్ను గెలవలేరానీ, రాముడి మీదికి యుద్ధానికి పొతే లాభం లేదని సలహా
ఇచ్చాడు. శ్రీరామ వధోపాయంగా సీతాపహరణం చేయమని అకంపనుడు సూచించాడు. సీతాదేవి
అందాన్ని వర్ణించి చెప్పి రావణుడిని రెచ్చగొట్టాడు. ఆమెను రావణాసురుడు తెస్తే, ఆమె మీద
ప్రేమ కల రాముడు, ప్రియురాలి ఎడబాటుతో కలిగే తాపం అనే అగ్నిలో పడి చస్తాడని
అకంపనుడు చెప్పగా రావణుడు ఆ ఆలోచన బాగుందని ఆమోదించాడు. యుద్ధం లేకుండా శత్రువు
చనిపోతున్నాడనే ఆలోచన రావణుడికి రుచించింది.
వెంటనే మారీచుడిని చూడడానికి పోయాడు రావణుడు. మారీచుడు ఆయనకు అర్ఘ్యపాద్యాలు ఇచ్చి, ఆసనం చూపించి, భక్ష్య
భోజ్యాలిచ్చి తృప్తి పరిచాడు. ఆయనతో రావణాసురుడు “తండ్రీ! రాముడనే ఒక్క మానవుడు
రాక్షసులందరినీ యుద్ధ సామర్థ్యంతో వధించి జనస్థానాన్ని పాడుచేశాడు. అతడి భార్యను
నేను అపహరించాలనుకుంటున్నాను. ఈ విషయంలో నాకు నీ సహాయం కావాలి. ఆ విధంగా నేను నా
పగ తీర్చుకుంటాను” అని అంటాడు.
రావణుడు ఈ విధంగా చెప్పగా విన్న
మారీచుడు, సీతాదేవి
గురించి లోపల శత్రుత్వం, బయటికి స్నేహం కలవాడెవడో, ఎప్పుడు
రావణుడు చెడిపోవాలో అని ఎదురు చూస్తున్నవాడు ఇలా చెప్పాడని అంటాడు.
ఇలా అంటాడు మారీచుడు. “పాతాళంలో పడి అక్కడి నుండి మళ్లీ
పైకి రాలేనట్లు రామపాతాళంలో నువ్వు పడ్డావా మళ్లా ఊపిరితో వెలుపలికి రాలేవు.
రామపాతాళం ఎలాంటిది అంటావా? విల్లే మొసలి. అది నీళ్లలో అడుగు పెట్టీ
పెట్టకముందే వాతవేస్తుంది. అది దాటిపోతే భుజ వేగమనే పెద్ద బురద వుంటుంది. దాంట్లో
దిగబడితే అంతే సంగతి ఇక. అదీ దాటిపోగలిగితే, బాణపరంపరలనే
అలలు మీదమీద వచ్చిపడి లోపలి ఈడ్చుకు పోయి చంపుతాయి. ఇలాంటి యుద్ధ ప్రవాహంకల
రామపాతాళంలో పడితే ఇక జీవితాశ లేదు. నేను పరుషంగా చెప్పానని కోప్పడవద్దు.
క్షమించు. వాస్తవంగా నీ మేలు కోరి చెప్పాను. కోపం తగ్గించుకొని లంకకు వెళ్లు. నీ
భార్యలతో సంతోషంగా జీవించు. ఆడవిలో ఆయన భార్యతో రాముడు వుంటాడు. ఆయన భార్యతో ఆయన
లేకుండా చేశావా,
నీ
భార్యలతో నువ్వు సుఖంగా వుండవు”.
ఇలా మారీచుడు చెప్పిన హితోక్తులు విన్న రావణుడు, అలాగే ఆయన
చెప్పినట్లే చేస్తానని జవాబిచ్చి, లంకకు పోయి సంతోషంగా తన ఇంటికి చేరాడు.
రాముడితో బలవద్విరోధం ఎందుకు? నేనొక్కడినే పోతే అందర్నీ చంపిన రాముడిని
తానొక్కడినే జయించగలనని నమ్మకం ఏమిటి? అని ఆలోచించి
సంతుష్టుడై ఇంటికి పోయాడు రావణాసురుడు.
ఇప్పటికింకా రావణుడికి శూర్పనఖ ముక్కు-చెవులు కోసిన సంగతి
తెలియదు. అకంపనుడు తెలిసినా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఖరుడికి, రాముడికి
యుద్ధం ఎందుకు జరిగిందని రావణాసురుడు అడగలేదు. అందరు ఋషులను చంపినట్లే రాముడిని
కూడా చంపడానికి పోయి చచ్చారేమో అనుకున్నాడు. తనంతట తానుగా అకంపనుడు చెప్పలేదు.
అసలు శూర్పనఖ రాముడి దగ్గరకు పోవాల్సిన అవసరం ఏమొచ్చిందని రావణుడు అడుగుతాడని
భావించి అకంపనుడు ఆ విషయాన్ని దాటేశాడు. అదే వచ్చి అన్ని సంగతులు చెప్పుకుంటుందిలే, మనకెందుకీ
బాధ? అనుకున్నాడు.
(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)
No comments:
Post a Comment