Monday, September 7, 2020

భూమి నైసర్గిక స్వరూపం .... శ్రీ మహాభాగవత కథ-29 : వనం జ్వాలా నరసింహారావు

 భూమి నైసర్గిక స్వరూపం

శ్రీ మహాభాగవత కథ-29

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

         శుకయోగి పరీక్షిన్మహారాజుకు భూనైసర్గిక స్వరూపాన్ని వివరిస్తూ ఇలా చెప్పాడు.

         ఈ భూమి ఒక పద్మం. దానికి మధ్యన జంబూద్వీపం ఉన్నది. దీని పొడుగు లక్ష యోజనాలు. వెడల్పు లక్ష యోజనాలు. ఇది తామర ఆకులాగా గుండ్రంగా ఉంటుంది. ఈ ద్వీపంలో వర్షాలు అనే విభాగాలున్నాయి. ఇవి తొమ్మిది. ఒక్కొక్క వర్షానికి వైశాల్యం తొమ్మిది వేల యోజనాలు. ఈ వర్షాలను విభజిస్తూ ఎనిమిది పర్వతాలు సరిహద్దులుగా ఉన్నాయి. తొమ్మిది వర్షాలలో మధ్యదాని పేరు ‘ఇలావృతం. దీనికి మధ్యభాగంలో బంగారు రంగుతో ‘మేరు పర్వతం ఉంది. భూమి అనే పద్మానికి నడుమ మేరు పర్వతం ప్రకాశిస్తూ ఉంటుంది. అది పద్మానికి మధ్యన ఉండే బొడ్డులాగా శోభిస్తూ ఉంటుంది. మేరువు కులపర్వతాలకు రాజు లాంటిది. దాని స్థితి దేవతలకే అర్థంకాకుండా, అంతుపట్టకుండా, విడ్డూరం కోల్పుతూ ఉంటుంది. (ఇలావృతం అంటే భూమి చేత ఆవరించబడ్డదని. భూగోళానికి నడిమి భాగం నాభి. ఇది భూగర్భానికి, భూమధ్యరేఖకు సూటిగా లోపాలు వైపున ఉంటుంది. మేరువు అంటే ఇరుసు, అంటే భూపరిభ్రమణానికి కేంద్రం, అని అర్థం. దేవతలు కూడా మేరువు మహిమకు ఆశ్చర్యపడతారంటే, భూపరిభ్రమణం ఎలా జరుగుతుందో ఎవ్వరికీ అంతుచిక్కని పరమేశ్వరుడి లీల!).

         మేరు పర్వతం ఎత్తు లక్ష యోజనాలు. దాని శిఖరం ఎత్తు పదహారువేల యోజనాలు. ఈ శిఖరం భూమిలోకి కూడా పదహారువేల యోజనాల లోతుకు చొచ్చుకుని ఉంటుంది. ఈ శిఖరం వైశాల్యం 32 వేల యోజనాలు. మేరువుకు ఉత్తరం వైపు నీలం, శ్వేతం, శృంగవత్తు అనే పర్వతాలు ఆకాశాన్ని తాకుతుంటాయి. ఇవి రెండు వేలయోజనాల విస్తీర్ణం ఉంటాయి. ఇవి తూర్పు పడమరలకు, దక్షిణ ఉత్తరాలకు విస్తరించి ఉన్నాయి, ఇదొక రమ్యమైన దృశ్యం! ఈ ‘నీలశ్వేతశృంగవత్తు’ పర్వతాలనే సరిహద్దు పర్వాతలని కూడా అంటారు. వీటికి తూర్పున, పడమరన, చిట్టచివర, ఉప్పు సముద్రాలు తాకుతూ ఉంటాయి. అంటే, తూర్పు పశ్చిమాలవైపు ఉప్పు సముద్రాలు తాకేవరకు ఈ పర్వతాలు విస్తరించి ఉన్నాయన్నమాట. ఇవి ఉత్తరం వైపు ఒకదానికంటే మరొకటి పదవ వంతు పొడుగు తగ్గుతూ ఉంటాయి. వీటి మధ్య ప్రదేశంలో రంయకం, హిరణ్మయం, కురు అనే పెర్లుకల వర్షాలున్నాయి. అవి తొమ్మిదివేల యోజనాల మేర విస్తరించి ఉన్నాయి. ఉప్పు సముద్రాల దాకా ఇవి వ్యాపించి ఉన్నాయి. ‘నీలశ్వేతశృంగవత్తు’ పర్వతాల మధ్యనున్న కొలతలలో సరిపడి ఉంటుంది ఈ వర్షాల విస్తీర్ణం.

         ఇలావృత వర్షానికి దక్షిణం వైపున నిషధం, హేమకూటం, హిమవంతం అనే పర్వతాలున్నాయి. అవి సరిహద్దు పర్వతాలు. తూర్పునుండి పడమరకు పొడవుగాను, ఉత్తరంనుండి దక్షిణానికి వెడల్పుగాను నీలాది పర్వతాల మాదిరిగానే ఇవీ నెలకొని ఉంటాయి. ఈ పర్వతాల మధ్య ప్రదేశంలో మూడు వర్షాలున్నాయి. కింపురుష వర్షం, హరి వర్షం, భారత వర్షం ఆ మూడిటి పేర్లు.  ఇలావృత వర్షానికి పడమట మాల్యవంత పర్వతం, తూర్పున గంధమాదన పర్వతం సరిహద్దు గిరులు. ఈ పర్వతాలు రెండూ, ఉత్తరం వైపు నీలం, దక్షిణం వైపు నిషధం అనే పర్వతాల వరకు పొడవుగా ఉంది, రెండువేల యోజనాల విస్తీర్ణం కలిగి ఉన్నాయి. ఆ మాల్యవంత, గంధమాదన గిరులు కేతుమాల వర్షానికి, భద్రాశ్వ వర్షానికి హద్దును నిర్దేశిస్తున్నాయి.

         మేరు పర్వతానికి నాలుగు దిక్కులలో నాలుగు పర్వతాలున్నాయి. అవి: తూర్పున మందర పర్వతం, దక్షిణాన మేరుమందర పర్వతం, పశ్చిమంలో సుపార్శ్వ పర్వతం, ఉత్తరంలో కుముద పర్వతం. ఇవి ఒక్కొక్కటి పదివేలయోజనాల ఎత్తు, పదివేలయోజనాల వైశాల్యం కలిగి ఉన్నాయి. ఇవి మధ్యలో ఉన్నతంగా, స్తంబంలా ఉన్న మేరువుకు చుట్టూ నాలుగు చిన్న స్తంబాలలో ఉంటాయి. ఈ నాలుగు పర్వతాలలో (మందరం) మామిడి, (మేరువు) నేరేడు, (సుపార్శ్వం) కదంబ, (కుముదం) మర్రి చెట్లు బాగా ఎత్తుగా పెరిగి పతాకాలలా ఉంటాయి. ఈ చెట్లు పదకొండు యోజనాల ఎత్తు, అంటే వైశాల్యంతో ఉంటాయి. ఈ పర్వతాల శిఖరాలమీద నాలుగు మడుగులున్నాయి. మందర పర్వత శిఖరం మీద పాలతో నిండిన మడుగు, మేరువులో తేనె నిండిన మడుగు, సుపార్శ్వంలో చెరకు రసం నిండిన మడుగు, కుముదంలో మంచినీళ్లు నిండిన మడుగు ఉన్నాయి. వాటిల్లో నిష్టగా స్నానం చేసినవారు సహజమైన సిద్ధుల వైభవాన్ని పొంది ఉంటారు. ఈ పర్వత శిఖరాల మీద నాలుగు ఉద్యానవనాలున్నాయి. ఇవి దేవోద్యానాలు. నందనం, చైత్రరథం, వైభ్రాజికం, సర్వతోభద్రం అని ఆ వనాల పేర్లు. వీటిలో దేవతా శ్రేష్ఠులు అప్సరసలతో కలిసి, గంధర్వ గానాన్ని వింటూ విహరిస్తారు.

         మందర పర్వతం చివరనున్న మామిడి చెట్ల పళ్ళు కొండమీద రాలి, చితికి, వాటి రసం అద్భుతమైన నదీ ప్రవాహంగా మారింది.దాని పేరు అరుణోదం లేదా అరుణోనది. ఆ నదిలో పార్వతీదేవికి అనుచరులైన పుణ్యస్త్రీలు స్నానం చేస్తారు. మేరు పర్వతాల మీద ఉన్న నేరేడు చెట్ల జంబూఫలాలు మగ్గి వాటంతట అవే రాలిపోయి, చిట్లి, ఆ రసం అమృత ప్రవాహంలాగా పారుతుంది. ఆ జంబూ ఫలాల రస ప్రవాహమే జంబూ నది. ఇది ఇలావృత వర్షానికి దక్షిణాన భూముల్లో ప్రవహిస్తుంది. ఆ నదీజలాల ఇసుక జంబూ నదీ రసంతో తడపబడి సూర్య కిరణాలకు, గాలికి బంగారంగా మారుతుంది. అందుకే స్వచ్చమైన బంగారానికి ‘జాంబూనదం’ అన్న పేరు వచ్చింది. దేవతలలో ముఖ్యులు ఈ జాంబూనదాన్ని ఆభరణాలుగా ధరిస్తారు. ఈ బంగారం మంచి వన్నె కలది. సుపార్శ్వ పరవటం పైకొన నుండి ఐదు తేనె ధారలు ప్రవహిస్తూ ఉంటాయి. ఐదు ముఖాలుగా ఆ ప్రవాహం సాగుతుంది. ఈ ధారలు ఇలావృత వర్షం పడమటి భాగాన్ని తడుపుతూ వుంటాయి. కుముద పర్వత శిఖరం మీద పుట్టిన ఒక పెద్ద మర్రిచెట్టు (శతవల్మ) కొమ్మల నుండి పాలు, పెరుగు, నేయి, తేనె, బెల్లం, విశిష్టమైన అన్నం కిందకు ఇలావృత వర్షం మీదకు జారుతాయి. అలాగే మానవుల కోర్కెలు తీర్చడానికి, బట్టలు, మంచాలు, ఆసనాలు, నగలు మొదలైన వస్తువులు ఇలావృత వర్షం మీద కుముద పర్వతం నుంచి వచ్చి పడతాయి.      

         మేరు పర్వతానికి చుట్టూ కురంగ, కురర, కుసుంభ, వైకంకత, త్రికూట, శిశిర, పతంగ, రుచక, నిషధ, శితివాస, కపిల, శంఖ (వైడూర్య చారుధి హంస విహంగా ఋషభ నాగ కాలంజర నారదాది) పర్వతాలుంటాయి. తూర్పు వైపున జఠరం, దేవకూటం అనే పర్వతాలున్నాయి. పశ్చిమాన పవన, పారియాత్రాలనే పర్వతాలున్నాయి. ఇవి ఒకదానికొకటి పద్దెనిమిది వేల యోజనాలు దక్షిణం నుండి ఉత్తరానికి పొడవుగా వ్యాపించి ఉంటాయి. తూర్పు నుండి పశ్చిమానికి రెండువేల యోజనాల వెడల్పు కలిగి ఉంటాయి. మేరువుకు దక్షిణ భాగంలో కైలాస, కరవీర పర్వతాలున్నాయి. ఉత్తర భాగంలో త్రిసృంగ, మకర పర్వతాలున్నాయి. వీటి పొడవు వెడల్పులు కూడా పై పర్వతాల ప్రమాణంలోనే ఉంటాయి. మేరునగానికి ఇలా ఎనిమిది పర్వతాలూ ప్రదక్షిణ చేస్తున్నట్లుగా ఉంటాయి. మేరు శిఖిరంలో మధ్య భాగాన పదివేల యోజనాల వెడల్పు, అంతే ప్రమాణం పొడవు ఉండి (సమచతురస్రంగా) బంగారుమయమైన ఒక పట్టణం ఉంది. దాని పేరు బ్రహ్మ పురం లేదా శాతకౌంభి. ఈ బ్రహ్మ పురానికి ఎనిమిది దిక్కుల్లోనూ 280 వేల యోజనాల లోకపాలకుల పురాలున్నాయి. వాటి పేర్లు: అమరావతి, తేజోవతి, సంజ్ఞమణి, కృష్టాంగన, శబ్దావతి, గంధవతి, మహోదయ, యశోమతి.      

         బ్రహ్మ పట్టణంలో పూర్వం హరి వామనావతారం ఎత్తి ఎదిగినప్పుడు ఆ త్రివిక్రముడి కాలిగోటి దెబ్బకు ఉర్ధ్వాండం పగిలిపోయింది. ఇలా అపగిలిన బ్రహ్మాండం పై భాగంలో కన్నం పడి నీటిధార అండంలోకి ప్రవేశించింది. ఆ జలదార శ్రీహరి కాలిని తాకడం వల్ల సకల జనుల పాపాల్ని నశింప చేస్తూ, ‘భగవత్పది’ (విష్ణుపది) అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది. ఆ పుణ్యధార చాలాకాలం స్వర్గంలో విహరించింది. అదే విష్ణుపదం (ఇది ద్యులోకం). ఉత్తానపాదుడి కొడుకు ధ్రువుడు ఉండే మండలం అదే. భగవత్పది ధ్రువమండలం చేరి కొన్ని యుగాలయింది. ధ్రువమండలానికి కింద సప్తర్షిమండలం ఉంది. సప్తర్షులూ ఆకాశగంగను తమతమ జటాజూటాలలో ధరిస్తూ ఉంటారు. ఆ నది ఆక్కడ నుండి అసంఖ్యాకమైన విమానాలు ఆవరించి, కిక్కిరిసి ఉన్న మార్గాల గుండా వచ్చి, విశాలమైన దేవయాగ మార్గం ద్వారా చంద్ర మండలాన్ని చుట్టి, తడిపి, మేరు పర్వత శిఖరమందున్న బ్రహ్మలోకం మీద పడుతోంది. అక్కడ నాలుగు ద్వారాలలోనూ నాలుగింటిగా విడిపోతుంది. విష్ణుపదికి ఇక్కడా నాలుగు పేర్లు. అవి: సీత, అలకనంద, చక్షువు, భద్ర. ఈ నాలుగు నదులూ దీర్ఘంగా ప్రవహించి ఉప్పు సముద్రంలో కలుస్తాయి. ఇలా ప్రవహిస్తోంది విష్ణుపది.

         నాలుగింటిగా విడిపోయి ప్రవహిస్తున్న ఈ నది పాయలలో సీతానది తూర్పు వైపు ప్రవహిస్తుంది. బ్రహ్మసదనం నుండి కేసర పర్వత శిఖరాలమీద పడి కిందకు పారి, గంధమాదన పరవటం శిఖరాల పైభాగంలో పడి భద్రాశ్వవర్షాన్ని ఏలుతూ తూర్పున ఉప్పు సముద్రంలో ప్రవేశిస్తోంది. చక్షువు అన్న పేరుతో ప్రసిద్ధి పొందిన నది పశ్చిమ ద్వారం నుండి వచ్చి మాల్యవత్పర్వతం మీద పడి, అటునుండి కేతుమాల వర్షాన్ని పవిత్రం చేస్తోంది. అలా వచ్చి పడమటి లవణ సాగరంలో కలుస్తుంది. భద్ర నది తన సాటిలేని ప్రవాహంతో ఉత్తరద్వారం నుండి వచ్చి కుముద, నీల శ్వేతాఖ్య పర్వత శిఖరాల మీద క్రమంగా ప్రవహించి, శృంగపర్వతానికి వచ్చి, మానసోత్తరాలైన కురు భూములను పవిత్రం చేస్తోంది. అల అవచ్చి ఉత్తరపు ఉప్పు సముద్రంలో లీనమవుతున్నది. అలకనంద నది బ్రహ్మ సదనం నుండి దక్షిణంగా ప్రవహిస్తోంది. వెళ్లడానికి అసాధ్యమైన పర్వతాల మీదకు పోతుంది. హేమకూట, హిమకూట పర్వత శిఖరాలను త్రుళ్ళి పడుతూ తాకి, మహావేగంతో కర్మ క్షేత్రమైన భారత వర్షాన్ని పవిత్రం చేస్తోంది. అలా వచ్చి దక్షిణపు లవణ సముద్రంలో కలుస్తున్నది. అలా లోకంలో మేరువు మొదలైన పర్వతాలకు పుత్రికలై జన్మించిన పుణ్యతీర్థాలు (నదులు) వేలాదిగా ఉన్నాయి.

                      (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

    

 

No comments:

Post a Comment