చంద్ర వంశరాజులు, పురూరవ, పరశురాముల కథ
శ్రీ మహాభాగవత కథ-48
వనం జ్వాలా నరసింహారావు
కంII చదివెడిది భాగవతమిది,
చదివించును
కృష్ణు, డమృతఝరి పోతనయున్
చదివినను
ముక్తి కలుగును,
చదివెద
నిర్విఘ్నరీతి ‘జ్వాలా’
మతినై
శ్రీరామచంద్రుడి కుమారుడు కుశుడికి
అతిథి, అతడికి, నిషధుడు జన్మించారు. అలా ఆ పరంపరలో, పద్దెనిమిదోవాడిగా మరువు అనే రాజశ్రేష్టుడు జన్మించాడు. ఆయన
కలాపమనే గ్రామంలో వుంటున్నాడు. కలియుగాంతంలో ఈ సూర్యవంశం నశిస్తుంది. అప్పుడు
మరువు తిరిగి సూర్యవంశాన్ని పునరుద్ధరిస్తాడు. మరువు కుమారుడు ప్రసుశ్రుతుడు. అతడి
కుమారుడు సంధి. అతడికి అమర్షణుడు, అమర్షణుడికి మహస్వంతుడు
జన్మించారు. మహస్వంతుడి కుమారుడు విశ్వసాహ్యుడు. అతడి కొడుకు బృహద్బలుడు. ఇతడినే
భారత యుద్ధంలో అభిమన్యుడు సంహరించాడు. బృహద్బలుడి తరువాత ఆ వంశక్రమంలో చివరగా
సుమిత్రుడు జన్మిస్తాడు. అతడి తరువాత సూర్యవంశం వుండదు.
ఇక్ష్వాకుడి మరో కుమారుడు నిమి.
ఇతడు వశిష్టుడి శాపానికి గురై మరణిస్తాడు. అలాగే నిమి శాపవశాన వశిష్టుడు
మిత్రావరుణుల వల్ల ఊర్వశికి జన్మించాడు. శాపగ్రస్తుడై మరణించిన నిమి కళేబరాన్ని
వృద్ధులైన మునులు మథించగా, ఒక కుమారుడు జన్మించాడు. లోకం
ఆయన్ను ’జనకుడు’ అని పిలవసాగింది. అతడినే వైదేహుడని, మిథిలుడని కూడా అన్నారు. అతడి వల్ల నిర్మించబడిన నగరమే
మిథిలానగరం. జనకుడి వంశంలో ఒకరి తరువాత ఒకరిగా, హ్రస్వరోముడికి సీరధ్వజుడు జన్మించాడు. అతడు యజ్ఞం
చేయడానికి భూమిని దున్నిస్తుంటే నాగలి కర్రుకు సీత జన్మించింది. సీరధ్వజుడికి
కుశధ్వజుడు, అలా, ఆవరుసలో చివరకు కృతికి మహావశి
జన్మించారు. వీరిని మైథిల ప్రభువులనేవారు. వీరంతా ఆత్మజ్ఞానం కలవారే!
ఇదిలా వుండగా, జగన్నాథుడైన శ్రీమహావిష్ణువు నాభి కమలం నుండి పుట్టిన
బ్రహ్మకు అన్ని విధాల సాటిరాగల వాడైన అత్రి జన్మించాడు. ఆయన ద్వారా చంద్రుడు
జన్మించి, తారా సమూహానికి ప్రభువైనాడు. ఒకనాడు అతడు దేవతల గురువు
బృహస్పతి ఇంట్లో చొరబడి ఆయన భార్యను ఎత్తుకొచ్చాడు. అదే సమయంలో దేవాసుర యుద్ధం
జరుగుతుండడం వల్ల, శుక్రుడు, రాక్షసులు చంద్రుడి పక్షం చేరి బృహస్పతిని తరిమేశారు.
శివుడు, దేవేంద్రుడు బృహస్పతికి అండగా నిలిచారు. చివరకు బ్రహ్మ
జోక్యం చేసుకోవడం వల్ల చంద్రుడు గర్భిణైన తారను ఆమె భర్త బృహస్పతికి అప్పచెప్పాడు.
తార మగబిడ్దను కన్నది. బృహస్పతి, చంద్రుడు ఇద్దరూ ఆ బిడ్ద తనదే అను
వివాదపడ్డారు. బిడ్దకు తండ్రి ఎవరని బ్రహ్మ తారను అనునయంగా అడగ్గా, సిగ్గుతో ఆమె, చంద్రుడని సమాధానం ఇచ్చింది. ఆ
బిడ్డకు బుధుడు అని పేరు పెట్టి చంద్రుడికి అప్పగించాడు బ్రహ్మ.
చంద్రుడి కొడుకు బుధుడికి, ఇళాకన్యకు పురూరవుడు జన్మించాడు. పురూరవుడి శౌర్యపరాక్రమాలు
విన్న ఊర్వశి భూలోకానికి వచ్చి పురూరవుడిని ఆకట్టుకుంది. తనను ప్రేమించమని ఆమెను
వేడుకున్నాడు. ఊర్వశి రెండు గొర్రెలను చూపించి, ఆరెంటినీ ఎప్పుడూ వెంటవుండి కాయాలనీ, తన ఎదుట అతడు వివస్త్ర కాకూడదనీ నిబంధన విధించింది. దానికి
ఒప్పుకుని ఇద్దరూ ఒకటై ఆనందించసాగారు. ఊర్వశీ, పురూరవులు రాత్రీ-పగలు తేడా లేకుండా గడపసాగారు. దేవేంద్రుడు
ఊర్వశి లేదన్న విషయం తెలుసుకుని, ఆమెను వెతకడం కొరకు గంధర్వులను
పంపాడు. వారు భూలోకం వచ్చి ఊర్వశి గొర్రెలను పట్టుకోగా అవి అరిచాయి. వెంటనే ఊర్వశి
గొడవ చేయడంతో, తన ఒంటిమీద బట్ట వున్నదీ-లేనిదీ చూసుకోకుండా పురూరవుడు, దిగంబరంగా, దొంగల వెంటబడి, వారినుండి గొర్రెలను విడిపించాడు. ఆయన దిగంబరుడిగా
కనిపించడంతో ఊర్వశి మాయమై పోయింది. ఆయన ఆమె కోసం వెతకగా సరస్వతీ నది ఒడ్డున
కనిపించింది. రమ్మని అడిగితే రానని, ఏడాది తరువాత తన దగ్గరికి వస్తే
ఆయన కుమారులను చూపిస్తానని అన్నది. ఆయన రాజధానికి తిరిగి వెళ్లిపోయాడు.
సంవత్సరం తరువాత ఊర్వశి దగ్గరికి
వెళ్తే ఆమె తనను తీసుకుపోవాలంటే గంధర్వులను ప్రార్థించాలి అన్నది. ఆయన అలా చేయగా, వారు ఆమెకు మారుగా అతడికి ఒక అగ్నిస్థాలిని ఇచ్చారు. అది
ఊర్వశి కాదని తెలుసుకుని అడవిలో వదిలేశాడు. కొంతకాలానికి త్రేతాయుగం
ప్రవేశించింది. పురూరవుడి మనస్సులో మూడు వేదాలు మూడు కర్మ మార్గాలుగా పొడగట్టాయి.
అప్పుడాయన అడవికి పోయి, అక్కడ జమ్మి వృక్షంలో నుండి
పుట్టిన ఒక రావి చెట్టును చూశాడు. ఆ రావితో రెండు అరణులు తయారు చేశాడు. ఒకదాన్ని
తానుగాను, మరొకదాన్ని ఊర్వశిగాను, రెంటి మధ్యలో వున్న కొయ్యను కుమారుడిగాను భావించి, మంత్ర పఠన చేస్తూ మథించసాగాడు. అప్పుడు జాతవేదుడు అనే అగ్ని
సంభవించింది. ఆ అగ్ని మూడు రూపాలలో వర్ధిల్లి, పురూరవ కుమారుడని కల్పించబడింది. ఆ అగ్ని పురూరవుడిని
పుణ్యలోకాలకు పంపడానికి కారణమైంది. ఊర్వశిని కనుక్కోవడానికి ఆ అగ్నితో యజ్ఞం
చేశాడు పురూరవుడు. అతడే వేద విభాగం కూడా చేసి ఊర్వశి వున్న గంధర్వలోకానికి
వెళ్లాడు. ఊర్వశి ఆతడికి తన కడుపు పంటగా ఆరుగురు కుమారులను చూపింది. వారి సంతతి
వాడే గంగా ప్రవాహాన్ని పుక్కిట పట్టిన జహ్నుడు. అతడి సంతతికి చెంది, కుశాంబుడికి జన్మించినవాడే గాధి.
గాధికి సత్యవతి అనే కుమార్తె
పుట్టింది. ఆమెను ఋచికుడు అనే బ్రాహ్మణుడు వివాహమాడాడు. సత్యవతికి జమదగ్ని
జన్మించాడు. సత్యవతే కౌశికి అనే నది పేరుతో లోకపావనిగా ప్రవహించింది. జమదగ్ని
రేణువు కుమార్తె రేణుకను వివాహమాడాడు. పురుషోత్తముడైన విష్ణుమూర్తి అంశగా
పరశురాముడు జమదగ్నికి పుత్రుడుగా జన్మించాడు.
ఇదిలా వుండగా, హైహయవంశంలో కార్తవీర్యార్జునుడనే రాజు దత్తాత్రేయుడిని
ఆరాధించి వేయి చేతులను పొందాడు. అణిమాదిసిద్ధులను పొంది భూమ్మీద వెలుగొందాడు.
ఒకనాడు అతడు విర్రవీగుతూ రేవానది సఛ్చమైన జలాల్లో క్రీడిస్తూ, తన చేతులతో నదీప్రవాహాన్ని అడ్డుకున్నాడు. పైకుబికిన నీరు
దండయాత్రకై బయల్దేరిన రావణాసురుడిని చుట్టుముట్టింది. రావణుడు వెంటనే
కార్తవీర్యార్జునుడి మీద యుద్ధానికి దిగాడు. కార్తవీర్యార్జునుడు రావణుడిని పట్టి, మోకాళ్లతో తన్ని, తన సేవకులతో బోనులో పెట్టించి, తనతో మాహిష్మతీ నగరానికి తీసుకువచ్చాడు. ఆ తరువాత విడిచి
పెట్టి, ఎక్కడా వీరుడనని చెప్పుకోవద్దని అవమానకరంగా మాట్లాడాడు.
మరో రోజున కార్తవీర్యుడు వేటకు
వెళ్లి, జమదగ్ని ఆశ్రమానికి పోయాడు. ఆయన రాజును గౌరవించి, తన హోమధేనువును రప్పించి, రాజుకూ-అతడి సేనకూ మృష్టాన్నాన్ని సమకూర్చాడు. రాజు ఆ
హోమధేనువును పట్టి తెమ్మన్నాడు తన భటులను. అది అంబారావం చేస్తున్నా
వినిపించుకోకుండా భటులు దాన్ని లాక్కొచ్చారు. రాజు వెళ్లిన తరువాత ఆశ్రమానికి
వచ్చిన పరశురాముడికి తండ్రి ఈ విషయం చెప్పాడు. రాజుమీద యుద్ధానికి బయల్దేరాడు
పరశురాముడు. అతడిని ’వెర్రి బాపనయ్’ అని హేళన చేశాడు కార్తవీర్యార్జునుడు. అతడి సైనికులు
పరశురాముడిని ఆయుధాలతో బాధించారు. ఆ సేనలను తన బాణవర్షంతో ముంచెత్తి రూపుమాపాడు
పరశురాముడు. కార్తవీర్యార్జునుడు స్వయంగా యుద్ధానికి దిగాడు. భీకరమైన
బ్రాహ్మణ-క్షత్రియ యుద్ధం కొనసాగింది. ధనుర్విద్యలో మేటైన పరశురాముడు తన
గండ్రగొడ్దలితో కార్తవీర్యార్జునుడి చేతులను, తరువాత తలను తెగనరికాడు. పరశురాముడు హోమధేనువును తోలుకొచ్చి
తండ్రికి అప్పచెప్పాడు. రాజును చంపిన పాప పరిహారార్థం ఏడాది పాటు తీర్థయాత్రలు
చేయమని కొడుక్కు సలహా ఇచ్చాడు జమదగ్ని. ఆయన అలా చేసి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు.
కొంతకాలం తరువాత ఒకనాడు జమదగ్ని భార్య
రేణుకాదేవి నీళ్లు తేవడానికి గంగానదికి వెళ్లింది. అదే సమయంలో అక్కడ అప్సరసలతో
కలిసి స్నానం చేస్తున్న చిత్రరథుడనే గంధర్వుడిని ఆసక్తిగా చూస్తూ నీరు తెచ్చే
విషయం మర్చిపోయింది. ఆలశ్యంగా వచ్చిన భార్యను చూసి దానికి కారణాన్ని దివ్యజ్ఞానంతో
పసిగట్టాడు జమదగ్ని. కొడుకులను పిలిచి ఆమెను చంపమని ఆజ్ఞాపించాడు జమదగ్ని. వారు
ఆయన మాట వినకపోవడంతో కొడుకులనూ, భార్యనూ చంపమని పరశురాముడిని
ఆదేశించాడు. ఆయన తండ్రి చెప్పినట్లే వారిని నరికి చంపేశాడు. ఆ తరువాత తండ్రిని
సమీపించి వారిని బతికించమని ప్రార్థించాడు. ఆయన అలాగే అని వారిని బతికించాడు.
పరశురాముడు ఆశ్రమంలో లేని సమయంలో
కార్తవీర్యార్జునిడి కుమారులు ఆశ్రమానికి వచ్చి భీభత్సాన్ని సృష్టించి, జమదగ్ని శిరస్సు ఖండించి వెళ్లిపోయారు. పరశురాముడు రాగా, అతడిని చూసి, తల్లి ఇరవై ఒక్క సార్లు తల
కొట్టుకుని ఏడ్చింది. పరశురాముడు వెంటనే పోయి కార్తవీర్యార్జునుడి కుమారులందరినీ
హతం చేశాడు. అంతటితో ఆగకుండా 21 సార్లు దండెత్తి ఎక్కడెక్కడున్న రాజులందరినీ
వెతికి-వెతికి మరీ చంపాడు. భూమ్మీద రాజు అనే పదం లేకుండా చేశాడు. తరువాత శమంత
పంచకంలో రాజుల రక్తాన్ని తొమ్మిది మడుగులు చేసి, తన తండ్రి శిరస్సును ఆయన దేహానికి కూర్చి యాగం చేశాడు.
జమదగ్ని సశరీరుడై తపోబలం వల్ల వినువీధిలో సప్తర్షి మండలంలో సప్తమ మునిగా
విరాజిల్లాడు. పరశురాముడు తరువాతి మన్వంతరంలో సప్తర్షులలో స్థానాన్ని
అలంకరిస్తాడు. ఆ తరువాత అతడు మహేంద్రగిరికి తపస్సుకై పోయాడు.
(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)
No comments:
Post a Comment