ఇక్ష్వాకుడు, మాంధాత, హరిశ్చంద్రుడు, సగరుడు, భగీరథుడు
శ్రీ మహాభాగవత కథ-46
వనం జ్వాలా నరసింహారావు
కంII చదివెడిది భాగవతమిది,
చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్
చదివినను
ముక్తి కలుగును,
చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై
ఒకనాడు వైవస్వత మనువు
తుమ్మినప్పుడు అతడి ముక్కు రంధ్రం నుండి సూర్యవంశ దీపకుడైన ఇక్ష్వాకుడనే
పుణ్యాత్ముడు జన్మించాడు. అతడికి నూర్గురు కుమారులు కలిగారు. ఒకనాడు ఇక్ష్వాకుడు
తన పెద్దకొడుకైన వికుక్షిని పిలిచి అష్టకాశ్రాద్ధ కర్మ చేయడానికి మాంసం తెమ్మని
చెప్పాడు. అతడు అడవికిపోయి కుందేలును చంపి, దాని మాంసాన్ని కొంచెంతిని, మిగిలిన మాంసాన్ని తెచ్చి తండ్రికిచ్చాడు. అతడు చేసిన పనిని
కులపురోహితుడైన వశిష్టుడు అతీంద్రియ జ్ఞానంతో గ్రహించి ఆ విషయాన్ని ఇక్ష్వాకుడికి
చెప్పాడు. వెంటనే అతడు వికుక్షిని దేశం విడిచి పొమ్మన్నాడు. ఆ తరువాత ఇక్ష్వాకుడు
కొంతకాలానికి ముక్తి పొందాడు. తదనంతరం వికుక్షి శశాదుడనే పేరుతో రాజ్యాన్ని
పాలించాడు. అతడికి పురంజయుడు అనే పుత్రుడు కలిగాడు. అతడినే కకుత్‍స్థుడు అనేవారు.
అతడు దేవాసుర యుద్ధంలో ఇంద్రుడికి సహాయం చేశాడు. అతడి కొడుకే అనేనసుడు. అలా ఆ వంశ
క్రమంలో యువనాశ్వుడు జన్మించాడు.
యువనాశ్వుడికి నూర్గురు భార్యలైనా
సంతానం కలగలేదు. మునులు ఆయనతో ఇంద్రయాగం చేయించారు. భార్య తాగాల్సిన మంత్ర జలాలను
పొరపాటున భర్త తాగడం వల్ల, యువనాశ్వుడి కడుపున చక్రవర్తి
లక్షణాలతో కొడుకు జన్మించాడు. అతడికి ’మాంధాత’ అని పేరు పెట్టాడు ఇంద్రుడు.
కొంతకాలం తరువాత యువనాశ్వుడు తపస్సు చేసి సిద్ధిని పొందాడు. పరిపూర్ణ యవ్వనాన్ని
పొందిన మాంధాత రావణాది శత్రువులను జయించాడు. అతడు శ్రీమన్నారాయణుడిని ఆత్మలో
నిలుపుకుని ఎన్నో యజ్ఞయాగాలు చేశాడు. బిందుమతి అనే ఆమెను వివాహమాడి ముగ్గురు
కొడుకులను ఏభైమంది కూతుళ్లను పొందాడు. సౌరభి అనే గొప్ప తపస్వి ఆ ఏభైమంది
అమ్మాయిలను వివాహమాడాడు. అంతమందిని చేసుకున్నా అతడికి తనివి తీరలేదు. మునైన తను
సంసార సుఖాలలో పడ్డానేమిటని విచారించిన సౌరభి, ఒకనాడు, చాలా దుఃఖానికి లోనై, సంసారాన్ని విడిచి భార్యలతో సహా వానప్రస్థ ధర్మం
ఆచరించడానికి అడవికి పోయి తపస్సు చేశాడు. చివరకు యోగాగ్నికి అతడు, ఆ తరువాత ఆయన భార్యలు ఆత్మార్పణ కావించారు. మాంధాత పెద్ద
కొడుకు అంబరీషుడికి యువనాశ్వుడు, అలా...అలా...ఆ వంశంలో త్రిశంకుడని
పేరు పొందిన సత్యవ్రతుడు జన్మించాడు.
త్రిశంకుడు విశ్వామిత్రుడిని
ఆశ్రయించి స్వర్గానికి పోయే ప్రయత్నం చేయగా ఇంద్రుడు అంగీకరించక కిందికి తోశాడు.
తల్లకిందులుగా వున్న అతడికి ఆకాశంలో త్రిశంకు స్వర్గం ఏర్పాటుచేశాడు
విశ్వామిత్రుడు తన తపోబలంతో. త్రిశంకుడికి పుట్టినవాడే సత్య హరిశ్చంద్రుడు.
విశ్వామిత్రుడు అతడితో అబద్ధం ఆడించాలని ఎంత ప్రయత్నం చేసినా అతడు అబద్దం ఆడలేదు.
హరిశ్చంద్రుడిని ఇక్కట్లకు గురిచేసిన విశ్వామిత్రుడిని గద్దవు కమ్మని శపించగా, విశ్వామిత్రుడు వశిష్టుడిని కొంగవు కమ్మని శపించాడు.
పక్షిరూపాలలో కూడా వారిరువురు పోట్లాడుకున్నారు.
వరుణదేవుడి అనుగ్రహ ఫలితంగా
హరిశ్చంద్రుడికి రోహితుడనే కుమారుడు కలిగాడు. హరిశ్చంద్రుడు ఇచ్చిన మాట ప్రకారం
వరుణదేవుడు రోహితుడిని యజ్ఞపశువుగా తీసుకుపోవడాకి వచ్చాడు. అలా ఇవ్వడం అనే
అంశాన్ని రోహితుడికి యుక్తవయస్సు వచ్చేదాకా వాయిదావేశాడు హరిశ్చంద్రుడు. తండ్రి
తనను బలి ఇవ్వాలనుకుంటున్న విషయం తెలుసుకున్న రోహితుడు అడవులకు పోయాడు.
కొన్నాళ్లకి తండ్రి అస్వస్తుడయ్యాడని తెలుసుకుని ఇంటికి పోదామనుకోగా ఇంద్రుడు
ఐదేళ్లపాటు రక-రకాలుగా అడ్డుపడ్దాడు. ఆరవ సంవత్స్రం తిరిగి వస్తూ తనకు బదులుగా
శునశ్శేపుడు అనే వాడిని యాగ పశువుగా తన తండ్రికి అప్పచెప్పాడు. ఇంద్రుడు సంతోషించి, బంగారు రథాన్ని హరిశ్చంద్రుడికి బహుమానంగా ఇచ్చాడు.
హరిశ్చంద్రుడి తరువాత ఆ వంశ పరంపరలో సగరుడు అనే కుమారుడు జన్మించి గొప్ప యశస్సుని
ఆర్జించిన చక్రవర్తి అయ్యాడు.
సగరుడు తన తండ్రి బాహుకుడి మీద
యుద్ధం చేసిన వారందరికీ బుద్ధి చెప్పాడు. శత్రు రాజులందరినీ జయించాడు.
శ్రీమహావిష్ణువు ప్రీత్యర్థం అనేక అశ్వమేధయాగాలు చేశాడు. అలా చేసిన యాగల్లో ఒకసారి
ఇంద్రుడు ఆయన గుర్రాన్ని తీసుకుపోయి నాగలోకంలో వున్న కపిల మహర్షి సమీపంలో
కట్టేశాడు. సగరుడి ఆజ్ఞానుసారం గుర్రాన్ని వెతికే ప్రయత్నంలో ఆయన కుమారులు భూమిని
తవ్వారు. కపిల మహర్షి సమీపంలో వున్న గుర్రాన్ని చూశారు. అతడే గుర్రాన్ని
దొంగిలించాడని భావించి అతడి మీదకు వెళ్లబోగా కపిల మహర్షి కోపాగ్నికి ఆహుతై పోయారు.
సగరుడి మరో భార్య కొడుకు కొడుకు అంశుమంతుడు. తాతగారి ఆదేశానుసారం యాగాశ్వన్ని
వెతుక్కుంటూ పోయి కపిల మహర్షిని, బూడిద రాశులను, గుర్రాన్ని చూశాడు. ఆయన్ను స్తుతించాడు. అతడు ప్రసన్నమై, గుర్రాన్ని తీసుకుపొమ్మని, బూడిదైన కుప్పలమీద గంగాజలం ప్రవహిస్తే శుభం కలుగుతుందని
చెప్పాడు. గుర్రాన్ని తీసుకుపోయి తాతగారికి అప్పగించాడు. ఆయన అశ్వమేధ యాగాన్ని
పూర్తి చేశాడు. ఉత్తమగతులు పొందాడు. అంశుమంతుడు, ఆయన కొడుకు దిలీపుడు గంగను తేలేకపోయారు.
దిలీపుడి కుమారుడు భగీరథుడు. అతడు
ఘోరమైన తపస్సు చేసి శివుడి జటాజూటంలో నాత్యం చేయనున్న గంగను దర్శించాడు. గంగ
అతడిని వరం కోరుకొమ్మన్నది. తన పూర్వీకులు భస్మరాశులై పడివున్నారనీ, ఆమె పావన జలధారలతో ముంచెత్తి స్వర్గాన్ని పొందేట్లు చేయమనీ, ఆమెను స్తోత్రం చేస్తూ అడిగాడు. ఆకాశం నుండి దిగివస్తే తన
వేగాన్ని ఆపగలిగేవారెవరని, ఆప లేక పోతే తాను భూమిని ఛేదించి
పాతాళానికి పోతానని అంటుంది గంగ. ఆమె ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి
పరమేశ్వరుడిని వేడుకుంటానన్నాడు. అని చెప్పి భగీరథుడు శివుడి కొరకు తపస్సు చేశాడు.
ఆయన కరుణించి, భగీరథుడి తపస్సుకు మెచ్చి, అతడి అభీష్టం ప్రకారం విష్ణు పాదోద్బవైన పవిత్ర గంగానదిని
దివి నుండి భువికి దిగివచ్చే సమయంలో తన శిరస్సులోని జటాజూటం మీద ధరిస్తానని చెప్పి
అలాగే చేశాడు.
గంగానదీ మహా ప్రవాహం పరమేశ్వరుడి
జటాజూటం నుండి; ఉరుకుతూ; భగీరథుడు ప్రయాణిస్తున్న మార్గం
వెంట పయనిస్తూ; బక కఛ్చాన్ని, తత్పరిసరపర్వత ప్రాంతాలను చుట్టి; శుక్తిమతి నదిని తనలో కలుపుకుని; ప్రవాహ మార్గంలో అనేక జనావాసాలను అధిగమిస్తూ; యమునానదిని ఆక్రమించి; వరుణా, పుష్కర నదులను విలీనం చేసుకుని; తన పవిత్ర జలాలతో భూమిని తడుపుతూ; తనతో పోటీ పడుతున్న చిన్న-పెద్ద ప్రవాహాలను ఉదారబుద్ధితో
తనతో కలిపి వేసుకుంటూ; లక్ష్యాన్ని చేరుకునే దిశగా
ప్రవాహం సాగిపోయింది. భగీరథుడి రథం వెనుక, గంగానది సగర రాజకుమారుల భస్మరాశులను ముంచెత్తి ప్రవహించగా, వారంతా స్వర్గాన్ని చేరుకున్నారు.
భగీరథుడి తరువాత ఆ వంశ క్రమంలో
శ్రుతుడు, నాభవరుడు, సింధు ద్వీపుడు, అయుతాయువు, ఋతుపర్ణుడు, సర్వకాముడు, సుదాసుడు పుట్టారు వరుసగా.
సుదాసుడినే కల్మాషపాదుడని కూడా అంటారు. అతడు వశిష్టుడి శాపానికి గురై సంతానం
లేనివాడయ్యాడు. శాపకారణాన రాక్షసుడిగా సంచరిస్తూ, బ్రాహ్మణ దంపతులను చూసి, భర్తను పొట్టన పెట్టుకున్నాడు కల్మాషపాడుడు. స్త్రీ సంగమం
చేస్తే చచ్చిపోతావని అతడిని శపించింది భార్య. వశిష్టుడి శాప విమోచనం అయిన తరువాత
ఒకనాడు భార్య పొందుకోరగా బ్రాహ్మణ స్త్రీ శాపం తెలిసిన భార్య భర్తను వారించింది. ఆ
కారణంగా అతడికి పిల్లల్ని కనే యోగ్యత లేకుండా పోయింది. అప్పుడు వశిష్టుడు
కల్మషాపాదుడి అనుమతితో ఆయన భార్య మదయంతికి గర్భదానం చేసి గర్భం కలిగేట్లు చేశాడు.
ఏడేళ్ల తరువాత ఆమె ప్రసవించడానికి కష్టపడుతుంటే, రాతి మొనతో ఆమె కడుపు చీల్చగా ఆమెకు అశ్మకుడనే కొడుకు
పుట్టాడు. అతడి కొడుకుకే మూలకుడని, నారీకవచుడని పేర్లున్నాయి.
మూలకుడికి విశ్వసహుడు, అతడికి ఖట్వాంగుడు జన్మించారు. ఖట్వాంగుడు చక్రవర్తై దేవతల
మాట మీద రాక్షసులను సంహరించాడు. ఆ తరువాత దేవతలను తన జీవితకాలం ఇంకా ఎంతుందని
అడిగాడు. ఎంతో సమయం లేదాన్నారు వాళ్లు. వెంటనే దివ్య విమానం ఎక్కి తన రాజధానికి
వచ్చాడు. వచ్చి, పరమేశ్వరుడి మీద మనస్సు లగ్నం చేశాడు. చివరకు ఆ పరబ్రహ్మంలో
లీనమయ్యాడు. ఖట్వాంగుడికి దీర్ఘబాహువు, అతడికి రఘువు జన్మించారు. రఘువుకు
పృథుశ్రవుడు అతడికి అజుడు, అతడికి దశరథుడు జన్మించారు. దేవతల
ప్రార్థన మీద శ్రీమన్నారాయణుడు శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుడు అనే పేర్లతో దశరథుడికి
జన్మించారు.
(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)
No comments:
Post a Comment