ప్రహ్లాద చరిత్ర, నృసింహావతారం, హిరణ్యకశిపుడి సంహారం
శ్రీ మహాభాగవత కథ-39
వనం జ్వాలా నరసింహారావు
కంII చదివెడిది భాగవతమిది,
చదివించును
కృష్ణు, డమృతఝరి పోతనయున్
చదివినను
ముక్తి కలుగును,
చదివెద
నిర్విఘ్నరీతి ‘జ్వాలా’
మతినై
హిరణ్యకశిపుడుకీ-లీలావతికీ అధ్బుత చరిత్రకలిగిన
నలుగురు కొడుకులు పుట్టారు. వారిలో ప్రహ్లాదుడు ఒకడు. ప్రహ్లాదుడు జన్మించి
పుట్టుకతోనే విష్ణు భక్తుడు అవుతాడు. అతడు భగవంతుడైన విష్ణువును అనుదినం ఆరాధిస్తూ, ధ్యానిస్తూ ఉండేవాడు. సదా విష్ణు
చింతనలో, విష్ణు ధ్యాసలో వుంటూ, అన్నీ మరచిపోయి నిశ్చేష్టుడి లాగా, జడుడిలా కనిపించేవాడు. నిరంతరం
శ్రీమన్నారాయణుడిని పాదపద్మద్వయాన్ని ధ్యానించడం వల్ల ఈ బాహ్య ప్రపంచాన్ని
మరిచాడు.
ఇది చూసి చింతించిన ఆతడి తండ్రి, తన కొడుకు విద్య నేర్చుకుంటేనే
కాని బాగుపడడని భావిమ్చాడు. హిరణ్యకశిపుడు రాక్షసుల గురువైన శుక్రాచార్యుడి
కొడుకులు చండుడు, అమర్కుడులను పిలిపించి తన కొడుక్కు విద్య నేర్పి, నీతిశాస్త్రంలో నేర్పరిని చేయమని
కోరాడు. గురువులకు కొడుకును అప్పగించాడు. వారు అతడిని తీసుకునిపోయి చదవాల్సిన అనేక
శాస్త్రాలను చదివించారు. ప్రహ్లాదుడు గురువులు చెప్పినవన్నీ నేర్చుకున్నప్పటికీ
విష్ణుభక్తి మాత్రం మానలేదు. గురువులు ఏవిధంగా బోధన చేస్తే, ఆ విధంగానే చదివాడు కాని వారికి
అడ్డు చెప్పలేదు. కొడుకు ఎలా చదువుతున్నాడో తెలుసుకుందామని ఒకనాడు ప్రహ్లాదుడిని
గురువులతో సహా పిలిచాడు. ఆయన చదివిన విషయాలు చెప్పమనగా విష్ణు సంబంధమైన విషయాలనే
చెప్పాడు ప్రహ్లాదుడు. “హరి, గిరి అంటూ అంధకారంలో ఎందుకు పడ్డావు” అని
ప్రశ్నించాడు కొడుకును. జవాబుగా ప్రహ్లాదుడు:
సీ: మందార మకరంద మాధుర్యమున దేలు, మధుపంబు
పోవునే మదనములకు ?
నిర్మల మందాకినీ వీచికల దూగు, రాయంచ చనునే ? తరంగిణులకు
లలిత రసాల పల్లవ ఖాది యై చొక్కు కోయిల సేరునే
కుటజములకు ?
బూర్ణేందు చంద్రికా స్పురిత చకోరకం, బరుగునే
సాంద్రనీహారములకు?
తే: నంబుజోదర
దివ్య పాదారవింద, చింతనా మృత పాన విశేషమత్త
చిత్త మేరీతి నితరంబు జేర నేర్చు? వినుత గుణశీల
! మాటలు వేయునేల ?
ఇది
విన్న హిరణ్యకశిపుడు, గురువులని చూసి, కొడుకును తీవ్రంగా దండించి మరీ
చదువు నేర్పమన్నాడు. ఆ గురువులు ప్రహ్లాదుడికి, అసుర సంప్రదాయం ప్రకారం సర్వ
శక్తులు ఒడ్డి ధర్మార్థకామాలను బోధించసాగారు. సామ దాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించి
శిష్యుడికి బోధించారు. రాజనీతిలో అతడు సుశిక్షితుడైనాడని నమ్మకం కుదిరిన తరువాత ఆ
విషయాన్ని తల్లి లీలావతికి చెప్పారు. ఆమె ప్రహ్లాదుడిని తండ్రి దగ్గరికి వెళ్లమని
చెప్పింది. గురువులు ఆమె సలహా మేరకు ప్రహ్లాదుడిని ఆయన తండ్రి గారి దగ్గరకు
తీసుకుపోయారు. విష్ణు సంబంధమైన విషయాలు రాక్షస రాజు దగ్గర వల్లె వేయవద్దని అతడిని
బ్రతిమిలాడి మరీ చెప్పారు. రాక్షసరాజు సముఖంలో శత్రువైన విష్ణు ధర్మాలను
ప్రస్తావించవద్దని అన్నారు. కుమారుడి విద్యా కౌశలాన్ని పరిశీలించమని రాజును
కోరారు. ధర్మ శాస్త్రాలు, అర్థ శాస్త్రాలు అనేకం గురువుల దగ్గర నేర్చుకున్నాననీ, చదువులలోని రహస్యార్థమంతా
గ్రహించాననీ, హరి భక్తి లేని వారి జీవితం వ్యర్థమనీ, దాని ప్రకారం శ్రీహరిని
నమ్ముకోవడమే క్షేమకరమనీ, ఇలా అంటాడు ప్రహ్లాదుడు తండ్రితో.
సీ: కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు
వర్ణించు జిహ్వ జిహ్వ,
సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు, శేషశాయికి
మ్రొక్కు శిరము శిరము,
విష్ణునాకర్ణించు వీనులు వీనులు, మధువైరిఁ
దవిలిన మనము మనము;
భగవంతు వలగొను పదములు పదములు, పురుషోత్తముని
మీఁది బుద్ధి బుద్ధి
తే. దేవదేవుని జింతించు దినము దినము, చక్రహస్తునిఁ
బ్రకటించు చదువు చదువు,
కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు, తండ్రి! హరిఁ
జేరు మనియెడి తండ్రి తండ్రి!
ఇంకా ఇలా అంటాడు:
సీ: కంజాక్షునకుఁ గాని కాయంబు కాయమే? ; పవన గుంఫిత చర్మభస్త్రి గాక;
వైకుంఠుఁ బొగడని వక్త్రంబు వక్త్రమే? ; ఢమఢమధ్వనితోడి ఢక్క గాక!
హరిపూజనము లేని హస్తంబు హస్తమే? ; తరుశాఖనిర్మిత దర్వి గాక!
కమలేశుఁ జూడని కన్నులు కన్నులే? ; తనుకుడ్యజాలరంధ్రములు గాక!
ఆ: చక్రిచింత లేని జన్మంబు జన్మమే?, తరళ సలిలబుద్బుదంబు గాక!
విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుఁడే?, పాదయుగముతోడి పశువు గాక!
తన
మార్గానికి రాని కొడుకును హిరణ్యకశిపుడు అనేక విధాలుగా హింసించాడు. కొడుకును
తిరస్కారం కొద్దీ రాక్షసరాజు తన ఒడిలోనుండి కిందకు పడేశాడు. వాడిని వెంటనే
వధించమని మంత్రులను ఆజ్ఞాపించాడు. వెంటనే అనేకమంది రాక్షసులు అతడిని దండించడం
ప్రారంభించారు. చిత్రహింసలు పెట్టారు. సముద్రంలో తోశారు. విషాన్నం పెట్టారు. అయినా
ప్రహ్లాదుడిలో మార్పు రాలేదు. మళ్లీ తీసుకెళ్లి గురుపుత్రులు అతడికి త్రివర్గాన్ని
(ధర్మ, అర్థ, కామాలు) ఉపదేశించారు. ఈ సారి తనతోటి రాక్షస బాలురను నేర్పుగా చేరదీశాడు.
రహస్యంగా విష్ణు తత్త్వాన్ని వారికి బోధించాడు. తాను ఈ పరమార్థ జ్ఞానాన్ని, భాగవత ధర్మాన్ని నారద మహర్షి
ద్వారా విన్నానని వారికి చెప్పాడు. అదెలా జరిగిందో వారికి వివరించాడిలా:
"నా తండ్రి ఘోరతపస్సు చేస్తున్నప్పుడు ఆయన లేని
సమయం చూసి దేవతలు దండెత్తి వచ్చారు. అప్పుడు రాక్షసులు పారిపోయారు. ఇంద్రుడు మా
తల్లి లీలావతిని చెరబట్టాడు. ఆమెను తీసుకుపోతున్నప్పుడు దైవ వశాత్తు నారదుడు
చూశాడు. గర్భవతైన ఆమెను విడవమని బోధించాడు. ఆమె గర్భంలో పెరుగుతున్నది విష్ణు
భక్తి మహిమకలవాడని చెప్పాడు. ఇంద్రుడు మా అమ్మను విడిచాడు. నారదుడు మా తల్లిని తన
ఆశ్రమానికి తీసుకుపోయాడు. నారదుడు మా అమ్మ అక్కడున్న సమయంలో ఆమె గర్భంలో వున్న
నన్ను ఉద్దేశించి జ్ఞానాన్ని ఉపదేశించాడు" అని నారదుడు బోధించిన విషయమంతా
రాక్షస బాలకులకు వివరంగా చెప్పాడు. చెప్పి, చదువు నేర్పే గురువులు తమకు
తెలిసిన విషయాలనే చెప్తారు కానీ విష్ణు సన్నిధి చేరే మార్గాన్ని చెప్పరని అన్నాడు.
ఇలా ప్రహ్లాదుడు రహస్యంగా సమయం దొరికినప్పుడల్లా రాక్షస బాలురకు మోక్షమార్గాన్ని
తెలియపర్చేవాడు. ఇది తెలుసుకున్న గురువులు ఇక ఆయన కుమారుడిని ఆయనే చక్కదిద్దుకోవాలని
హిరణ్యకశిపుడికి చెప్పారు.
చివరకు తండ్రీ-కొడుకులకు మధ్య శ్రీహరి విషయంలో సంవాదం
జరిగింది. విసిగిపోయిన హిరణ్యకశిపుడు తన తమ్ముడిని చంపిన నారాయణుడి కొరకు ఎంత
వెతికినా కనపడలేదని, మరి వాడు ఎక్కడున్నాడురా! అని ప్రహ్లాదుడిని
నిలదీశాడు. జవాబుగా ప్రహ్లాదుడు ఇలా చెప్పాడు:
మ: కలడంభోది
గలండు గాలి, గల డాకాశంబునం. గుంభినిం
గల డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోతచంద్రాత్మలం
గల, డోంకారమునం
ద్రిమూర్తుల ద్రిలింగవ్యక్తులం దంతటం
గల దీశుండు గలండు తండ్రి! వెదకంగా నేల యీ యా యెడన్
క: ఇందు
గల డందు లేడని, సందేహము వలదు, చక్రి
సర్వోపగతుం,
డెం దెందు వెదకి చూచిన, నందందే కలడు, దానవాగ్రణి !
వింటే.
భగవంతుడైన
శ్రీహరి లేనిచోటు ఈ విశ్వంలో లేదన్నాడు. ఈశ్వరుడు అంతా వ్యాపించి వున్నాడని
చెప్పాడు. ఇలా అనగానే పక్కనే వున్న
స్తంబాన్ని చూపించి అందులో ఉన్నాడా అని అడిగాడు. ఉన్నాదని చెప్పగానే ఆ స్తంబాన్ని
గట్టిగా పగలగొట్టాడు హిరణ్యకశిపుడు. వెంటనే ఆ స్తంబాన్ని చీల్చుకుంటూ శ్రీ
నరసింహదేవుడు ఆవిర్భవించాడు. ఆయనది అప్పుడు మానవ రూపం కాదు, సింహాకృతీ కాదు; మానవ-సింహ రూపంగా ఉన్నది.
విష్ణుమాయ వల్ల నిర్మితమైన దివ్యరూపం అది. ఆ ఆకృతిని చూడగానే తన మరణం తధ్యం
అనిపించింది హిరణ్యకశిపుడికి. అయినా తన బలశౌర్యాలు ప్రదర్శించాడు. చివరకు
నరసింహుడికి హిరణ్యకశిపుడు లొంగిపోయాడు. అతడిని పట్టుకుని తన తొడల మీదకు చేర్చి తన
గోళ్లతో హిరణ్యకశిపుడి హృదయాన్ని చీల్చి వేశాడు. గర్వంతో అతడి ప్రేగులను మెడలో
హారంలాగా ధరించాడు.
కాసేపటికి
బ్రహ్మాది దేవతలు వచ్చి నృసింహుడిని స్తుతించారు. ప్రహ్లాదుడు నరసింహమూర్తిని
స్తోత్రం చేసి శాంతపరిచాడు. తన నరసింహావతారాన్ని, ప్రహ్లాదుడి స్తుతి గీతికలను మననం
చేసినవారికి పునర్జన్మ ఉండదని చెప్పి నరసింహస్వామి అంతర్థానం అయ్యాడు.
(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)
No comments:
Post a Comment