కపిలాచార్యుడి తత్త్వజ్ఞానం, భక్తియోగం
శ్రీ మహాభాగవత కథ-27
వనం జ్వాలా నరసింహారావు
కంII చదివెడిది భాగవతమిది,
చదివించును
కృష్ణు, డమృతఝరి పోతనయున్
చదివినను
ముక్తి కలుగును,
చదివెద
నిర్విఘ్నరీతి ‘జ్వాలా’
మతినై
కర్దమ
ప్రజాపతి అరణ్యాలకు పోయిన తరువాత దేవహూతి కపిల మహర్షిని చూసి తనకు మోహాంధకారం
నుండి బయటపడే ఉపాయం చెప్పమని అడిగింది. తల్లి వాక్యాలను విన్న కపిలుడు సమాధానంగా
దేవహూతికి తత్త్వజ్ఞానం, భక్తియోగం తెలియ చేశాడిలా:
‘సంసార బంధానికి కారణమైన
చిత్తాన్ని శ్రీహరి మీద లగ్నం చేస్తే అది మోక్ష కారణం అవుతుంది. “నేను” అనే
అహంకారం, “నాది”’ అనే మమకారం
మనస్సు నుండి విడివడినప్పుడు ప్రశాంతత కలుగుతుంది. సహనాన్ని కలిగి, సహృదయులై, శాంతమూర్తులుగా ఉంటూ, కర్మకా ఫలాలను
విడిచి, నా పాదాలను ఆశ్రయించుకుని, నా గుణాలనే ధ్యానం చేస్తూ, నా కథలనే ప్రసంగిస్తూ, వాటిని వినడం వల్లే
ఆనందాన్ని పొందుతూ ఉండేవారు పరమ భాగవతోత్తములు. నా లీలా విహారాలను చింతన చేస్తూ
దానివల్ల పుట్టిన భక్తితో మనస్సు ఏకాగ్రత కోసం యోగ మార్గంలో సిద్ధిని పొందుతాడో
అతడు “యోగి” అవుతాడు’.
‘వేదాలు ఈ జగత్తులోని పదార్ధం
తత్త్వాన్ని తెలియచేస్తాయి. దానికి అనుగుణమైన కర్మాచారాలకు దేవతలు తృప్తి
పొందుతారు. ఏ ఫలాన్ని కోరకుండా చేసే భగవత్సేవ ముక్తి కంటే గొప్పది. “ఆత్మ” అనేది
భూమికి-స్వర్గానికి మధ్య అనేకసార్లు తిరుగుతూ ఉంటుంది. ఎవరైతే నన్ను ఏకాగ్రతతో
ధ్యానం చేస్తారో వారిని నేను సంసార సముద్రం నుండి తరింప చేస్తాను’.
‘తత్త్వ గుణాలను ఎరిగిన
మానవులు ప్రకృతి బంధాల నుండి విముక్తులవుతారు. పరమాత్మ అనాది. సత్వరజస్తమోగుణాలు
లేనివాడు. ప్రకృతి గుణాల కంటే వేరైనవాడు. ప్రత్యక్ష స్వరూపుడు. స్వయం ప్రకాశకుడు.
ప్రకృతి త్రిగుణాత్మికయై ప్రజా సర్గాన్ని సృజించడం ప్రారంభించింది. దానికి పురుషుడు
మోహాన్ని పొందాడు. ప్రకృతిని ఆశ్రయించాడు పురుషుడు. ఆ విధంగా ప్రకృతి-పురుషుల
అన్యోన్యం కలిగింది. పురుషుడు సంసార బద్ధుడై స్వాతంత్ర్యాన్ని కోల్పోయాడు.
ఈశ్వరుడు కేవలం సాక్షి మాత్రమే. ఆత్మకు కార్యకారణ కర్త్రుత్వాలు లేవు. అవి ప్రకృతి
అధీనంలో ఉంటాయి. సుఖ దుఃఖాలు అనుభవించడం పురుషుడివి’.
‘ప్రకృతి 24 తత్త్వాలతో కూడి
ఉంటుంది. నేల, నీరు, నిప్పు, గాలి, నింగి...ఈ అయిదు పంచభూతాలు. గంధం, రసం, రూపం, స్పర్శ, శబ్దం.....ఈ
అయిదు వాతి గుణాలు అంటే పంచతన్మాత్రలు. చర్మం, నాలుక, కన్ను, ముక్కు, చెవి....ఈ
అయిదు పంచ జ్ఞానేంద్రియాలు. వాక్కు, చేతులు, కాళ్లు, మలావయవం, మూత్రావయవం.....ఈ అయిదు పంచ
కర్మేంద్రియాలు. మనస్సు, బుద్ధి,
చిత్తం, అహంకారం....ఈ నాలుగు అంతఃకరణ చతుష్టయం. ఇవన్నీ కలిసి
24 తత్త్వాలతో కూడిన “సగుణ బ్రహ్మ సంస్థానం” అనే పేరుతొ ఒప్పుతూ ఉంటుంది. కాలం
అనేది 25వ తత్త్వం. పురుషుడు అనే శబ్దంతో ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నామో
దానినే “కాలం” (ఈశ్వరుడు అని కూడా) అని అంటారు. భగవంతుడి చేష్టా విశేషాలు దేనివల్ల
ఉత్పన్నమవుతాయో అదే “కాలం”. ఆత్మమాయ కారణంగా ఈ జగత్తుకు కారణమైన ప్రకృతిలో పరమాత్మ
తన వీర్యాన్ని ప్రవేశపెట్టగా ఆ ప్రకృతి హిరణ్మయమైన మహాత్తత్వాన్ని పుట్టించింది. ఆ
తరువాత ఈశ్వరుడు తన సూక్ష్మ రూపంలో ప్రపంచాన్ని వెలిగిస్తూ తమస్సును హరించాడు’.
‘వాసుదేవ వ్యూహం అనేది
ఆకలిదప్పులు, శోకమోహాలు, జరామరణాలు అనే ఆరు ఊర్ముల నుండి
విడివడి; ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, శ్రీ, జ్ఞానం, వైరాగ్యం అనే
ఆరు గుణాలతో పరిపూర్ణమై; సత్త్వప్రధానమై; స్వచ్చమై, శాంతమై; నిత్యమై; భక్తజన సేవ్యమై ఒప్పుతూ ఉంటుంది. మహత్తత్వం నుండి క్రియాశక్తి రూపమైన
అహంకారం పుట్టింది. అది వైకారికం, తైజసం, తామసం అనే మూడు రకాలుగా ఉంటుంది. ఇందులో వైకారికాహంకారం అనేది మనస్సుకు, అయిదు ఇంద్రియాలకు, ఆకాశాది పంచభూతాల పుట్టుకకు, స్థానమై దేవతారూపంలో ఉంటుంది. తైజసాహంకారం బుద్ధి రూపంలోనూ, ప్రాణ రూపంలోనూ ఉంటుంది. ఇక తామసాహంకారం ఇంద్రియాలతో కలిసి ప్రయోజన
మాత్రమై ఉంటుంది’.
‘వైకారికమైన
సాత్త్వికాహంకారాన్ని అధిష్టించి సంకర్షణ వ్యూహం ఉంటుంది. సంకర్షణ పురుషుడు
పంచభూతాలతో, పంచేంద్రియాలతో, మనస్సుతో నిండి ఉంటాడు.
కర్తృత్వం, కార్యత్వం, కారణత్వం అనే రప్ప భేదాలు కలిగి, శాంతత్వం, ఘోరత్వం, మూఢత్వం
లక్షణాలతో ఉల్లాసంగా ఉంటాడు. సంకర్షణ వ్యూహం నుండే మనస్తత్వం పుట్టింది. దీనికి
చింతన సహజం. అవి సామాన్య, విశిష్ట అనే రెండు చింతనాలు.
వీటికే సంకల్పం, వికల్పం అని పేర్లు. ఈ రెండూ కామ సంభవాలే!
దీన్నే ప్రద్యుమ్న వ్యూహం అని అంటారు’.
‘తైజసాహంకారం వల్ల బుద్ధి
తత్త్వం పుట్టింది. జ్ఞానం, ఇంద్రియానుగ్రహం,
సంశయం, మిథ్యాజ్ఞానం, ఇంద్రియ నిశ్చయం, స్మృతి అనేవి బుద్ధి లక్షణాలు. తైజసాహంకారం వల్ల ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, క్రియాజ్ఞాన సాధనాలు
ఏర్పడ్డాయి. ఈ అహంకారం వల్లే ప్రాణానికి క్రియాశక్తి,
బుద్ధికి జ్ఞాన శక్తి కలిగి, అవి రెండూ కర్మేంద్రియ,
జ్ఞానేంద్రియాలను పనిచేయిస్తాయి’.
‘తామసాహంకారం నుండి
శబ్దతన్మాత్రం పుట్టింది. దీన్నుండి ఆకాశం ఏర్పడింది. ఆకాశం వల్ల శ్రోతేంద్రియం
పుట్టింది. శ్రోతం శబ్దాన్ని గ్రహిస్తుంది. శబ్దం అర్థానికి ఆశ్రయమై, ఆ శబ్దాన్ని వినేవాడికి జ్ఞానం కలగడానికి కారణభూతం
అవుతున్నది. శబ్దతన్మాత్రం వల్ల ఆకాశం ఏర్పడి, అది సకల జీవులకు అవకాశం ఇస్తూ, ఈ ఆత్మ ప్రాణానికి, ఇంద్రియాలకు ఆశ్రయమై ఉంటున్నది. ఆకాశం వల్ల స్పర్శను, స్పర్శ వల్ల వాయువు, ఆ వాయువు వల్ల స్పర్శను
గ్రహించగల చర్మం పుట్టి స్పర్శజ్ఞానాన్ని కలిగించింది’.
‘వాయువుకు కదలడం, కదిలించడం, వేరుచేయడం, కలపడం, ద్రవ్య నేతృత్వం, శబ్ద
నేతృత్వం అనేవి లక్షణాలు. వాయువు వల్ల రూపం, దానివల్ల
తేజస్సు పుట్టాయి. కంటితో చూసిన రూపానికి వృత్తులు: ఉపలంభకత్వం (అనుభవం కలగడం),
ద్రవ్యాకార సమత్వం (ద్రవ్యం ఆకారాన్ని ఉన్నదున్నట్లుగా చూపడం), ద్రవ్యోపసర్జనం
(ద్రవ్యం అప్రధానం కావడం), ద్రవ్య పరిణామ ప్రతీతి ( ద్రవ్యం మార్పు) తెలియచేయడం.
తేజస్సుకు సాధారణ ధర్మాలు ద్యోతం, పచనం, పిపాస, ఆకలి, చలి. ద్యోతానికి
ప్రకాశం, పచనానికి బియ్యం, పిపాసకు
పాణం, ఆకలికి ఆహారం, చలికి శోషణం
వృత్తులు’.
‘తేజస్సు వల్ల రసతన్మాత్రం
పుట్టింది. దాని వల్ల జలం పుట్టింది. రసం ఒక్కటే అయినా, భూత వికారం వల్ల వగరు, చెడు, కారం, పులుపు, తీపి, ఉప్పు అనే రుచులుగా మారింది. ఇక జల వృత్తులు అనేక రకాలుగా ఉంటుంది. జలం
నుండి గంధతన్మాత్రం పుట్టింది. దాని వల్ల భూమి పుట్టింది. ముక్కు వాసనను
గ్రహించేది అయింది. ఈ గంధం వాసన ఒకటే అయినా, అనేక రకాల
వాటితో కలిసిన కారణంగా, మిశ్రమ గంధం అనీ, దుర్గంధం అనీ, సుగంధం అనీ,
శాంతగంధం అనీ, ఉగ్రగంధం అనీ, ఆమ్లగంధం
అనీ, అందులో కలిసిన పదార్థాల స్థితిగతులను బట్టి ఎన్నో విధాలుగా ఉంటుంది. ఆకాశం, వాయువు, తేజస్సు, జలం మొదలైన
వాటిని విభజించడం, సకల ప్రాణులకు స్త్రీ-పురుష భేదాలతో
దేహంగా ఉండడం లాంటివి పృధ్వీవృత్తులు’.
‘ఇవి కాక పంచభూతాలకు అసాధారణ
ధర్మాలున్నాయి. అవి వరుసగా: ఆకాశానికి శబ్దం (దీన్ని చెవి గ్రహిస్తుంది), వాయువుకు
స్పర్శ (దీన్ని చర్మం గ్రహిస్తుంది), తేజస్సుకు రూపం (దీన్ని కన్ను గ్రహిస్తుంది),
జాలానికి రసం (దీన్ని నాలుక గ్రహిస్తుంది), పృధ్వికి గంధం (దీన్ని ముక్కు
గ్రహిస్తుంది). భూమికి ఆకాశంతో ఉన్న సంబంధం వల్ల,
శబ్ద, స్పర్శ,రూప, రస, గంధాలు అసాధారణ గుణాలయ్యాయి’.
‘మహత్తు, అహంకారం, పంచతన్మాత్రలు అన్నీ కలిసినా
పురుషుడిని కల్పించడానికి అసమర్థమయ్యాయి. అప్పుడు సర్వేశ్వరుడు అందులో
ప్రవేశించాడు. ఫలితంగా చైతన్యం లేని ఒక అండం పుట్టింది. అందులోనుండి
విరాట్పురుషుడు పుట్టాడు. ఆ అండాన్ని పొదుపుకుని పృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, అహంకారం, మహత్తు ఉన్నాయి. ఆ పొరలలో శ్రీమహావిష్ణువు విరాట్స్వరూపం వెలుగొందుతూ
ఉన్నది. ఆయన ముఖం నుండి వాని, దానితో పాటు అగ్ని పుట్టాయి.
ముక్కునుండి ప్రాణాలు, ఘ్రాణేంద్రియం పుట్టాయి. ఘ్రాణేంద్రియం
నుండి వాయువులు, ప్రాణవాయువులు ఆవిర్భవించాయి. ప్రాణవాయువుల
నుండి కన్నులు, దాన్నుండి సూర్యుడు పుట్టారు. దాంట్లో ధ్యానం
ఏర్పడగా చెవులు పుట్టాయి. దానివల్ల శ్రోతేంద్రియం, దిక్కులు
పుట్టాయి. చర్మం వల్ల గడ్డం, మీసాలు మొదలైన రోమ సమూహం, ఓషధులు పుట్టాయి’.
‘ఆ పైన మూత్రావయవయం దానివల్ల
రేతస్సు, దాని వల్ల జలం పుట్టాయి. తరువాత గుదం, దానివల్ల అపానం జన్మించాయి. దానివల్ల మృత్యువు పుట్టింది. విరాట్పురుషుడి
చేతుల వల్ల బలం, వాటివల్ల ఇంద్రుడు,
పాదాల వల్ల గమనం, వాతి వల్ల ఉపేంద్రుడు జన్మించారు. నాడుల
వల్ల రక్తం, దానివల్ల నదులు, జఠరం వల్ల
ఆకలిదప్పులు, ఈ రెంటివల్ల సముద్రాలు పుట్టాయి. హృదయం వల్ల
మనస్సు, దానివల్ల చంద్రుడు, బుద్ధి
పుట్టారు. చిత్తం వల్ల బ్రహ్మ, క్షేత్రజ్ఞుడు కలిగారు. ఈ
విధంగా ఆ అండం నుండి సృష్టికి కారణభూతుడైన పురుషుడు పుట్టాడు’.
‘విరాట్పురుషుడిలో ఉదయించిన
పంచ మహాభూతాలు, భూత తన్మాత్రలు, ఇంద్రియాలు, వాటి అధి దేవతలు వేర్వేరుగా ఉండిపోయాయి. విరాట్పురుషుడి కార్యమైనా
శరీరాలు పుట్టడం అనేది జరగలేదు. జీవోత్పత్తి జరగలేదు. పురుషాంగం రేతస్సును పొంది
కూడా సృష్టి కార్యాన్ని నిర్వర్తించలేక పోయింది. ఆ సమయంలో క్షేత్రజ్ఞుడు హృదయాన్ని
అధిష్టానంగా చేసుకుని చిత్తంలో ప్రవేశించాడు. అప్పుడు విరాట్పురుషుడు నీటిమీద
తేలాడుతున్న బ్రహ్మాండాన్ని పొంది సృష్టి ఆరంభించాడు. కార్యోన్ముఖుడయ్యాడు.
క్షేత్రజ్ఞుడు అలా ప్రవేశించేసరికి దేవాది శరీరాలు ఒక్కసారిగా కదలడం
ప్రారంభించాయి. అలాంటి విరాట్పురుషుడిని అందరూ ఎల్లవేళలా సేవిస్తుంటారు’.
‘ప్రజల ఫలభేదం, సంకల్ప భేదం వల్ల భక్తియోగం సిద్ధిస్తుంది. అది కూడా అనేక
విధాలుగా ఉంటుంది. తామసం, రాజసం,
సాత్త్వికం అని భక్తి మూడు విధాలు. తోటివారిని హింసిస్తూ,
ఆడంబరం, ద్వేషం, రోషం, అజ్ఞానం లాంటివి ప్రదర్శిస్తూ భేదబుద్ధితో పరమాత్మ మీద భక్తిని ప్రదర్శించే
వాడు తామసుడు. వాడిది తామస భక్తి. అనేక
ఇంద్రియ విషయాల నైపుణ్యాలను, సిరి సంపదలను, కీర్తి ప్రతిష్టలను కోరి పూజా ద్రవ్యాలతో పూజార్హుడైన విష్ణువును భజించడం
రాజస భక్తి అవుతుంది. గతంలో చేసిన పాపాలను పరిహరించేది భగవద్భక్తి ఒక్కటే అనే
పరిపూర్ణ నమ్మకంతో, మంగళకరమైన చరిత్ర కలవాడు భగవంతుడే అని
భావించి, భక్తితో తాను చేస్తున్న సమస్తమైన పనులు భగవదర్పణ
బుద్ధితో చేస్తూ, జనులకు హితమైన పనులు చేయడం సాత్త్విక
భక్తి. ఎల్లప్పుడూ పరమేశ్వరుడిని విడవకుండా నిర్హేతుకంగా ఆయన కొరకే చేసే వ్రతమే
గొప్ప భక్తి అని భావించాలి. అలాంటి భక్తియోగం వల్ల సాలోక్య,
సామీప్య, సారూప్య, సాయుజ్యాలనే
ముక్తులు ప్రాప్తిస్తాయి. భగత్సేవ తప్ప ఇతర కర్మలు ఆచరించడానికి ఇష్టపడక పోవడమే
“ఆత్యంతిక భక్తియోగం” అంటారు’.
‘ఈశ్వరుడు జీవ స్వరూపాన్ని
పొంది అందులో ప్రవేశిస్తాడు. అలాంటి ఈశ్వరుడిని యోగ మార్గంలో కానీ, భక్తిమార్గంలో కానీ, పురుషుడు
పొందుతాడు. ఆ ఈశ్వరుడు ప్రకృతి-పురుషులతో కూడి కర్మలను చేస్తూ ఉంటాడు. ఆ ఈశ్వరుడే
ప్రకృతి నుండి వేరై కర్మలను చేయనివాడుగా కూడా ఉంటాడు. అదే భగవంతుడి రూపం.
భగవంతుడైన విష్ణువు యజ్ఞఫలాన్ని ఇచ్చేవాడు కాబట్టి సమస్త ప్రాణులను తన అధీనంలో
ఉంచుకుని పరిపాలిస్తూ ఉంటాడు. ఈశ్వరాజ్ఞకు లోని ఈ సకల చరాచర ప్రపంచం
నడుచుకుంటుంది. ఈ సకల ప్రపంచం భగవతుడి అధీనంలో ఉన్నది. భగవంతుడిని గుర్తించే శక్తి
ఎవ్వరికీ లేదు’.
ఈ విధంగా శ్రీమన్నారాయణుడి అవతారమైన
కపిలుడు తన తల్లైన దేవహూతికి తత్త్వజ్ఞానం,
భక్తియోగం తెలియ చేశాడు.
(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)
No comments:
Post a Comment