ప్రపంచోత్పత్తి, సృష్టి వివరణ ఆరంభం
శ్రీ మహాభాగవత కథ-22
వనం జ్వాలా నరసింహారావు
కంII చదివెడిది భాగవతమిది,
చదివించును
కృష్ణు, డమృతఝరి పోతనయున్
చదివినను
ముక్తి కలుగును,
చదివెద
నిర్విఘ్నరీతి ‘జ్వాలా’
మతినై
పరీక్షిన్మహారాజుకు శుక మహర్షి
చెప్పిన అంశాలలో భాగంగా, పరీక్షిత్తు వేసిన ఒక ప్రశ్న, సమస్త ప్రాణికోటి తోడి-పొందిక ఏవిధంగా ఏర్పడింది?
దానికి కారణం ఏమిటి? అలా ఏర్పడడం వ్యక్తి పూర్వం చేసిన కర్మల
వల్లనా? అని. ఆవివరాలన్నీ తనకు విడమర్చి చెప్పమని అడిగాడు
శుకుడిని పరీక్షిత్తు. అలా మొదలైంది ప్రపంచోత్పత్తి, సృష్టి వివరణ.
‘పరమాత్మ నాభి కేంద్రంగా, పద్నాలుగు భువనాలకు కారణమైన ఒక పద్మం పుట్టింది. అందులో నుండి
బ్రహ్మ పుట్టాడు. ఆ బ్రహ్మ పూనుకుని జీవులను సృష్టించాడని చెప్పుకున్నాం కదా!
అలాంటి బ్రహ్మ ఏవిధంగా పరాత్పరుడి రూపాన్ని కళ్లారా చూడగలిగాడు? విష్ణువుకు, బ్రహ్మకు, అవయవాల
రూపులో కాని, వాటి కూర్పులో కాని,
భావంలో కాని, జాడల్లో కాని ఏమైనా తేడా వుందా? ఆ సర్వాత్ముడు మాయా నిర్దేశకుడై ఏవిధంగా, ఎక్కడ
పవళించాడు? ఆ మహాపురుషుడి అంగాల నుండి లోకాలు ఎలా
కల్పించబడ్డాయి? కాలాల స్వభావం ఎలా ఉంటుంది? దేవతల, పితృదేవతల, మానవ
మాత్రుల ఆయుః పరిమితి ఎంత? కాల ప్రవృత్తి ఏమిటి? ప్రాణులు వారి కర్మానుసారం ఏఏ లోకాలకు వెళ్తారు?
ఎలాంటి కర్మలు చేస్తే దేవతలుగా అవతరించవచ్చు?’
‘ఈ నేల అట్టడుగున ఉండే పాతాళలోకం, దిక్కులు, నింగి,
గ్రహాలూ, చుక్కలు, కొండలు, నదులు, సముద్రాలు,
దీవులు.....ఇవన్నీ ఏవిధంగా పుట్టాయి? వీటిలోని ప్రాణికోటి
జననాలు ఎలా ఉంటాయి? ఆకాశం లోపలి, బ్రహ్మాండం వెలుపలి కొలమానం
ఎంత? విష్ణువు అవతార చరిత్రలు, యుగాలు, యుగాల కొలమానాలు, యుగధర్మాలు,
ఒక్కో యుగంలో మానవులు పాటించాల్సిన సామాన్య-విశేష ధర్మాలు,
ఆయాజాతుల ప్రత్యేక ధర్మాలు, రాజర్షి ధర్మాలు, ఆపద్ధర్మాలు, బతుకు తెరువుకు ఉపకరించే ధర్మాలు ఎలా
ఉంటాయి? దేవుడిని పూజించే పధ్ధతి ఏమిటి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ,
ధ్యాన, సమాధి అనే ఎనిమిది యోగాలు ఎలా ఉంటాయి? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశిత్వ,
వశిత్వ, అనే ఎనిమిది సిద్ధుల విధానం ఎలా ఉంటుంది? వాళ్ల “అర్చిరాది” మార్గాలు ఏమిటి?’
‘ఋగ్యజుస్సామాధర్వాది నాలుగు వేదాలు,
ధనుర్వేదం, ఆయుర్వేదం,
గాంధర్వవేదం, అథర్వవేదం అనే నాలుగు ఉపవేదాలు, పద్దెనిమిది స్మృతులు, ఇతిహాసాలు, పురాణాలు పుట్టిన తీరుతెన్నులు ఎలాంటివి? కల్పాల
నడుమ సంభవించే ప్రళయం, దాని రూపు,
కల్పాంతంలో సంభవించే పెద్ద ముప్పు ఎలా ఉంటుంది? యాగాది
సంబంధిత కర్మలు, నూతులు, కొలనులు, చెరువులు, గుళ్లు లాంటి వాటి నిర్మాణం, అన్నదానం, ఉపవనాల ఏర్పాటు,
ధర్మశాస్త్రాలు వచించిన పనులు ఎలా చేయాలి? హోమాదుల ఆచరణ పద్ధతులు, ప్రాణుల పుట్టుక, ధర్మార్థకామాలనే మూడు
పురుషార్థాలను అమలుపరిచే తీరు, దైవాన్ని, వేదధర్మాలను విశ్వసించనివారి జన్మలు, జీవాత్ముడిని
కట్టి వుంచే విధం, ముక్తిని సాధించే తీరు, తన ఇచ్చానుసారం సంచరించే ఈశ్వరుడి విషయం, సర్వాధిపతిగా
భగవానుడు జీవులతో వినోదించే విధానం.’
భాగవత పురాణం చెప్తానన్న శుకుడు
ఈ విషయాలన్నీ చెప్పమని అడిగాడు
శుకమునిని పరీక్షిత్తు. జవాబుగా శుకుడు, ‘భాగవత
పురాణాన్ని చెప్పుతాను విన’ మని అన్నాడు. వాస్తవానికి ఆ
పురాణాన్ని బ్రహ్మ-నారద సంవాదం రూపంలో ఆవిర్భవించింది మొదలు. అది వేదంతో
సమానమైనది. దాన్ని మొదలు సర్వేశ్వరుడు బ్రహ్మకల్పంలో బ్రహ్మకు బోధించాడు. ఇదే
విదుర మైత్రేయ సంవాదంగా భాగవతంలో చెప్పడం జరిగింది. దాన్నే సూతుడు శౌనకాది
మహాయోగులకు చెప్పాడని శుకుడు పరీక్షిత్తుతో అని, ఆ విషయాలను
ఆయనకు తెలియచేశాడు సవివరంగా. అవి:
జీవికి శరీరంతో సంబంధం కలిగే అవకాశం
ఎలా ఏర్పడుతుందనేది చాలా ముఖ్యంగా అవగాహన చేసుకోవాల్సిన అంశం. పరమేశ్వరుడి మాయ
లేకపోతే ఆ బంధం ఏర్పడదు. జీవి విష్ణుమాయా మహిమవల్ల పంచ భూతాలతో కూడిన దేహసంబంధం
కలవాడు అవుతాడు. ఆ మాయ వల్లే జీవి బాల్యం, కౌమారం, యవ్వనం అనే వయో వ్యవస్థలను పొందుతాడు. విష్ణుమాయా ప్రభావం వల్లే జీవి
మానవుడిగానో, దేవతగానో ఆకారం పొందుతాడు. “నేను”, “ఇది నాది”
అనే భావనలతో సంసార మాయకు కట్టుపడి పోతాడు. పరమాత్ముడి మాయే అన్నిటికీ మూలకారణం.
ఇలా బందితుడైన ప్రాణికి భగవంతుడి మీద భక్తి కలగడం వల్ల మోక్షం ఏవిధంగా
కలుగుతుందనేది ప్రశ్నార్థకం. అదెలా అంటే, ఎప్పుడూ జీవిలో
ప్రకృతినీ, పురుషుడినీ అధిగమించే “బ్రహ్మతత్త్వం” ఉంటుంది.
బ్రహ్మ ధ్యానంలో జీవి శ్రద్ధ చూపినప్పుడు మోహం వీడిపోతుంది. “నేను”, “నాది” అనే
సంసార బంధం వదిలిపోతుంది. దాంతో మోక్షాన్ని పొందుతాడు.
జీవుడికీ, పరమాత్ముడికీ శారీరక సంబంధాలు కన్పిస్తుంటాయి. అలాంటి
శరీరాన్ని ధరించిన భగవంతుడి పట్ల భక్తి కలిగి ఉండడం వల్ల జీవుడికి మోక్షం ఎలా
కలుగుతుందనే ప్రశ్న రావచ్చు. జీవుడు అవిద్యాప్రభావం కలవాడు. దానివల్ల, కర్మానుసారంగా శరీర బంధం ఏర్పడుతుంది. ఆ సంబంధం మిధ్యా రోపమైనది.
పరమేశ్వరుడు తన యోగ మాయా ప్రభావం వల్ల విలాసవంతమైన శరీరాలలో ప్రకాశిస్తుంటాడు.
అందువల్ల జీవుడికి భగవద్భక్తి మోక్షాన్ని తప్పక ప్రసాదిస్తుంది.
బ్రహ్మ తన పుట్టుకకు చోటైన పద్మం
గురించి తెల్సుకోవాలనుకున్నాడు. చుట్టూ ఉన్న నీళ్లలో వెతికాడు కాని, పద్మం మూలం కనుక్కోలేక విసిగి పోయాడు. వెనక్కు వచ్చి, మళ్లీ ఆ కమలంలోనే కూర్చున్న అతడికి లోకాలను సృష్టించాలనే కోరిక కలిగింది.
ఎలా చేయాలో అర్థం కాలేదు. ఇంతలో నీళ్ల మధ్య నుండి ఒక ధ్వని వినపడింది. “తప” అనే పదం
విన్నాడు ఆ ధ్వనిలో నుండి. ఆ పలికింది ఎవరో అతడు తెలుసుకోలేక పోయాడు. ఆ శబ్దం తనను
తపస్సు చేయమని ఆదేశించినట్లు భావించాడు. వేయి దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు
బ్రహ్మ. ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. పరమపదాన్ని తన ఎదుట చూశాడు. అక్కడ అంతా
“విష్ణుమయం” గా కనిపించింది. వేదమంత్రాలు వినపడ్డాయి. వైకుంఠ భవనం మహిమతో
వెలిగిపోతూ ఉన్నది. అక్కడ లక్ష్మీదేవి సరసన అన్ని ఐశ్వర్యాలతో, అతిశయించినవాడు, సర్వేశ్వరుడు, పరమపురుషుడు, పద్మాక్షుడు అయిన శ్రీమన్నారాయణుడు
బ్రహ్మకు దర్శనమిచ్చాడు.
బ్రహ్మ తపస్సుకు మెచ్చాననే, ఏమి కావాలనో కోరుకోమనీ అన్నాడు విష్ణుమూర్తి. ఆ మహాత్ముడి
మహాత్మ్యాన్ని గ్రహించుకునే తెలివిని ప్రసాదించమని కోరాడు బ్రహ్మ. లోక సృష్టి
నిర్మాణంలోని మాయావిధానం గురించి కూడా అడిగాడు. దాన్ని తెలియపరుస్తానని అన్నాడు
విష్ణువు ఈ విధంగా: ‘లేని పదార్ధం నా
ప్రభావంతో ఉన్నట్లుగా, తిరిగి చూస్తే లేనట్లుగా తోచడమే నాదైన
మాయా ప్రత్యేకం. పంచమహా భూతాలు, భౌతిక వస్తువులలో ఏవిధంగా
ప్రవేశించి ఉంటానో ఆ విధంగానే నేను ఈ భూత-భౌతికాలైన సమస్త కార్యాలలో సత్త్వాది
రూపాలలో చొచ్చి ఉంటాను. భూత-భౌతికాలు కారణదశను పొంది, నాలో వ్యక్తరూపాన్ని పొంది, స్ఫుటంగా ఉండవు. అన్ని ప్రదేశాలలో, అన్ని వేళలా, ఏది ఆకళింపుకు వస్తుందో అదే పరబ్రహ్మ స్వరూపం. నా తత్త్వస్వరూపకమైన
అర్థమే పరబ్రహ్మ స్వరూపం అని తెలుసుకోవాలి. దీన్ని నీ మనసులో నిలుపుకుని సృష్టి
సాగిస్తే ఎలాంటి మొహమూ నీ దగ్గరకు రాదు’ అని భగవానుడు
భోదించాడు.
(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం,
రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)
No comments:
Post a Comment