భక్తికి అందరూ అధికారులే
శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-28
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (05-10-2020)
“శత్రుసంహార దక్షుడైన రాజకుమారుడు శ్రీరామచంద్రమూర్తి శబరిని కలిశాడు. ఆమె
నిండు శ్రద్ధా భక్తులతో సమర్పించిన ఆతిథ్యాన్ని కడు ప్రీతితో స్వీకరించాడు. సీతను
వెతికే పనిలో తన అభీష్టం నెరవేరేందుకు శబరి చెప్పిన విధంగానే పంపా సరస్సు
చేరుకుంటాడు రాముడు”.
(ఈ పంపే కన్నడంలో హంపి అయింది. ఇది బళ్లారి దగ్గరుంది. రాముడు తాను చేసిన
ప్రతిజ్ఞ నెరవేర్చే గుణంగలవాడని చెప్పడమే అరణ్యకాండ సారాంశం. దాన్నింతవరకు
చెప్పాడు నారదుడు. స్నేహితులకై చేపట్టిన కార్యాన్ని నెరవేర్చడమనే గుణాన్ని
కిష్కింధ కాండ సారాంశంగా ముందు చెప్పబోతున్నాడు).
"పంపా తీరంలోని వనంలో హనుమంతుడనే వానరుడిని చూసి, ఆయన మాటపై గౌరవం వుంచి,
సూర్య నందనుడైన సుగ్రీవుడితో స్నేహంచేసాడు రాముడు. తనకథ, సీత వృత్తాంతం మొత్తం ఆయనకు చెప్పాడు రామచంద్రుడు. చెప్పిన తర్వాత, సుగ్రీవుడు రాముడితో అగ్ని సాక్షిగా స్నేహితులయ్యారు”.
(రాముడు వానరుడితో స్నేహం చేశాడంటే అది అతడి సౌశీల్యాతిశయం గురించి చెప్పడమే.
గుహుడు హీనజాతివాడైనా,
పురుషుడైనందున అతనితో స్నేహం చేసినందువల్ల రాముడి సౌశీల్యం
చెప్పడం జరిగింది. హీన స్త్రీ అయిన శబరితో స్నేహం చేయడంవల్ల రాముడు మిక్కిలి
సౌశీల్యవంతుడయ్యాడు. వానరుడైన సుగ్రీవుడితో స్నేహమంటే మీదుమిక్కిలి సౌశీల్యం చూపడం
జరిగింది. దీన్నిబట్టి తెలిసేదేమిటంటే, భక్తికి అందరూ
అధికారులేనన్న విషయం. అట్టి అధికారం నీచ జాతులని చెప్పబడేవారిలోనే విశేషంగా
కనిపిస్తుంది. జ్ఞానంతో రామచంద్రమూర్తిని ఆశ్రయించేవారు కొందరే. భక్తితో
ఆశ్రయించేవారు కోటానుకోట్లు. ఫలితం ఇరువురికీ సమానమే).
తనకూ-తన అన్న వాలికి విరోధం కలిగిన విధాన్ని సుగ్రీవుడు
రాముడికి వివరిస్తాడు. వాలిని చంపుతానని రాముడు ప్రతిజ్ఞ చేస్తాడు. వాలి బల
పరాక్రమాలు వినిపించి అంతటి బలవంతుడిని చంపగలడా రాముడని సందేహం వెలిబుచ్చుతాడు
సుగ్రీవుడు. తనకు నమ్మకం కలిగేలా, ఓ పెద్దకొండలాగున్న
దుందుభి అనే రాక్షసుసుడి కళేబరాన్ని చూపించి, దాన్ని చిమ్మమని రాముడిని
కోరతాడు సుగ్రీవుడు. ఇంత చిన్న పరీక్షా అని చిరునవ్వుతో, దాన్ని అలకగా కాలిబొటనవేలితో, పేడును చిమ్మినట్లు, పది ఆమడల దూరంలో పడే విధంగా చిమ్ముతాడు రాముడు. వాలికంటే రాముడు బలశాలి అనే
నమ్మకం కుదిరేందుకు మరో పరీక్ష పెట్టాడు సుగ్రీవుడు. సాల వృక్షాన్ని భేదించ
మంటాడు. ఆయన కోరిక నెరవేర్చేందుకు, మళ్ళీ సందేహానికి
తావులేకుండా వుండేందుకు,
సాల వృక్షాలను ఛేదించి, అవుండే కొండను భేదించాడు.
ఆయన బాణం రసాతలానికి పోయి తిరిగి ఆయన చేతిలోకి వచ్చింది. దాంతో సుగ్రీవుడు
తృప్తిపడ్డాడు. తనపగ తీరబోతుందన్న నమ్మకంతో వానర రాజ్యం లభించబోతుందన్న ఆశతో, సంతుష్టి పడిన మనస్సుతో, రామచంద్రమూర్తిని
తీసుకొని కిష్కింధకు పోయాడు".
"ఆ వెంటనే బంగారువన్నె దేహ కాంతిగల వానరేశ్వరుడు-సూర్యపుత్రుడు, సుగ్రీవుడు సింహనాదం చేశాడు. ఆ ధ్వనిని విన్న ఇంద్రకుమారుడు వాలి సుగ్రీవుడితో
యుద్ధం చేయడానికి బయల్దేరతాడు. రాముడి సహాయం సుగ్రీవుడి కుందని తార
ఆయనకడ్డుపడుతుంది. తమ్ముడితో సంధిచేసుకొమ్మంటుంది. ఇతరులతో యుద్ధం చేస్తున్న తనను ధర్మాత్ముడైన
రామచంద్రమూర్తి ఎందుకు చంపుతాడని తారను సమాధాన పరిచి సుగ్రీవుడిని యుద్ధానికి
ఒప్పిస్తాడు. తన మిత్రుడిని తన ఎదుటే నొప్పిస్తుంటే కళ్ళారా చూసిన రాముడు, శరణాగత ఆర్తత్రాణపరాయణత్వం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడని భావించి, ఒకే ఒక్క బాణంతో వాలిని నేలగూల్చుతాడు. వాలిని యుద్ధంలో చంపిన రాముడు, సుగ్రీవుడు కోరినట్లే,
వాలి పరిపాలిస్తున్న వానర రాజ్యానికి, సుగ్రీవుడిని వాలి స్థానంలో ప్రభువును చేస్తాడు".
(తమ్ముడి భార్యతో సంగమించిన వాడికి శిక్ష వధ అని శాస్త్రాలు చెప్తున్నాయి.
శాస్త్ర బద్ధుడైన రాముడు అట్లే చేశాడు. నేలబడేటట్లు కొట్టాడే కాని, ప్రాణంపోయేటట్లు కొట్టలేదు. ఎందుకంటే వాడి దోషం గురించి వాడికి చెప్పి ఇది
ప్రాయశ్చిత్తం అని తెలియచేసేందుకే. దీన్ని బట్టి రాముడి ధర్మ బుద్ధి, సత్య పరాక్రమం స్పష్టమవుతుంది).
"శ్రీరామచంద్రమూర్తి తన కోరిక నెరవేర్చడంతో సుగ్రీవుడు తను చేసిన ప్రతిజ్ఞ
ప్రకారం,
మిక్కిలి బల పరాక్రమవంతులైన వానరులను, సీతాదేవిని వెదికేందుకు, నాలుగు వైపులకు
పంపించాడు. వారిలో ఒకడైన హనుమంతుడికి, జటాయువు సోదరుడైన సంపాతి, సీతాదేవి లంకలో వుందని చెప్తాడు. ఆయన మాట ప్రకారం, సుమారు నూరామడల సముద్రాన్ని సునాయాసంగా దాటి రావణాసురుడేలే లంకా పట్టణానికి
చేరుకుంటాడు హనుమంతుడు. లంక ప్రవేశించిన హనుమంతుడు, రావణుడి అంతఃపురం దగ్గరలోవున్న అశోక వనంలో శోకిస్తూ, తన భర్తనే ధ్యానిస్తూ,
తపోబలంతో-శీల సంపత్తితో, నిజ వర్చస్సుతో
ప్రకాశిస్తున్న సీతాదేవిని చూశాడు. అగ్నిహోత్రుడి మిత్రుడి కుమారుడైన హనుమంతుడు, సీతాదేవి తనను నమ్మేందుకు, శ్రీరామచంద్రమూర్తి
ఇచ్చిన రామ ముద్రికను చూపిస్తాడు. దుఃఖ పడవద్దనీ, రాముడు త్వరలో వచ్చి సీతను చెరనుండి విడిపిస్తాడని అంటూ ఆమెను సమాధాన పరిచాడు.
రామ లక్ష్మణులిరువురు సముద్రమెట్లా దాటుతారని-దాటినా, ఇంతటి బలశాలి రావణుడి నెట్లా జయించగలరని సందేహం వెలిబుచ్చుతుంది సీత.
సూర్యపుత్రుడైన సుగ్రీవుడితో రామచంద్రమూర్తికి
స్నేహం లభించిన విషయం చెప్తాడప్పుడు ఆమెకు ధైర్యం కలిగేందుకు
హనుమంతుడు".
"ఒక్క వానరుడే ఇంత పనిచేస్తే, వానర సేనతో
రామచంద్రమూర్తి వచ్చి,
లంకనంతా ధ్వంసం చేయడంలో సందేహం లేదు అని
రావణాసురుడనుకోవాలనీ-దాంతో సీతాదేవికి ధైర్యం కలగాలనీ భావించాడు హనుమంతుడు. అందుకు ముందుగా రావణుడి బలమెంతో
తెలుసుకునేందుకు,
వాడిని యుద్ధానికి ఈడ్చి తన్నాలనుకుంటాడు హనుమంతుడు. అలా
చేస్తే వాడికి తెలివొచ్చి సీతను అప్పగించి సమాధానపడ్తాడని తలుస్తాడు. వెంటనే హనుమంతుడు
పరాక్రమంతో ఉపక్రమించి,
అశోక వనం తలవాకిటున్న ద్వారాన్ని విరగ్గొట్టి, సేనానాయకులందరినీ-ఏడుగురు మంత్రి పుత్రులనూ చంపి, అక్షయ కుమారుడిని హతమార్చి, ఇంద్రజిత్తు ప్రయోగించిన
బ్రహ్మాస్త్రానికి కట్టుబడతాడు. బ్రహ్మ వరంతో ఆ కట్లు తెగిపోయినట్లు తెలిసినా, రావణుడిని చూసి వాడితో మాట్లాడాలని భావించి, తనను ఈడ్చుకుంటూ పోతున్న రాక్షసులను చంపక విడిచిపెట్టాడు. సీతాదేవిని తప్ప
తక్కిన లంకంతా భస్మం చేసి,
శీఘ్రంగా రామచంద్రమూర్తికి సీతాదేవి వార్త తెలపాలని, లంక విడిచి మరలి పోతాడు హనుమంతుడు. ధీరాగ్రగణ్యుడైన శ్రీరామచంద్రమూర్తికి
ప్రదక్షిణ చేసి,
’ రామా చూసితి సీతను - శీలం విడవక జీవించి వున్న దానిని
’ అని చెప్తాడు.
No comments:
Post a Comment