Saturday, October 17, 2020

రుక్మిణీ శ్రీకృష్ణుల కల్యాణం .... శ్రీ మహాభాగవత కథ-68 : వనం జ్వాలా నరసింహారావు

 రుక్మిణీ శ్రీకృష్ణుల కల్యాణం

 శ్రీ మహాభాగవత కథ-68

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

విదర్భ దేశంలో, కుండిన నగరాన్ని రాజధానిగా చేసుకుని భీష్మకుడు అనే మహారాజు పాలిస్తున్నాడు. అతడికి ఐదుగురు కొడుకులు, ఒక కూతురు. అందరిలోకి పెద్దవాడైన రుక్మికి మంచి పేరు లేదు. కూతురు పేరు రుక్మిణి. రుక్మిణీదేవి పుట్టిన వేళావిశేషం వల్ల భీష్మక మహారాజు ఇల్లు దేదీప్యమానంగా ప్రకాశించసాగింది. చిన్నతనం నుండే ఆమె శ్రీకృష్ణమూర్తి కోసమే పుట్టిందా అన్నట్లు పెరిగి యౌవనవతి అయింది. అయిదుగురు అన్నలకు ముద్దుల చెల్లెలైన రుక్మిణి తన ఇంటికి వచ్చి పోయేవారి మాటలు ఆకళింపు చేసుకుని, తనకు శ్రీకృష్ణుడే తగిన వరుడని మనసులో నిశ్చయం చేసుకుంది. అయితే ఆమె అన్న రుక్మి మాత్రం ఆమెను శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించాడు.

రుక్మిణీదేవి అన్న అభిప్రాయాన్ని తెలుసుకుని ఎంతగానో దుఃఖించింది. తనకు ఆప్తుడైన ఒక బ్రాహ్మణుడిని పిలిచి, అతడిని ద్వారకా పట్టణానికి పోయి, తన అన్న రుక్మి అభిప్రాయాన్ని శ్రీకృష్ణుడికి విన్నవించమని కోరింది. తన తండ్రి కూడా తనను శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చెయ్యాలని రుక్మి చేస్తున్న ప్రయత్నాన్ని ఆపలేకపోతున్నాడని, కాబట్టి, తన మనస్సును కృష్ణుడికి తెలియచేసి అతడిని శీఘ్రంగా తీసుకుని రమ్మని బ్రాహ్మణుడిని కోరింది రుక్మిణి. ఇలా మరికొన్ని రహస్య వచనాలను చెప్పి, బ్రాహ్మణుడిని ద్వారకా నగరానికి పంపింది రుక్మిణి.

ద్వారకకు పోయిన బ్రాహ్మణుడు కృష్ణుడిని కలిశాడు. అతడిని పెండ్లికొడుకువు కమ్మని దీవించాడు. ఆయన మనస్సులోని మాట ఏమిటని ప్రశ్నించాడు కృష్ణుడు. విదర్భ దేశ రాజైన భీష్మకుడి కూతురు రుక్మిణి ఆదేశం మేరకు మంగళకరమైన వివాహ శుభ వార్తను ఆయనకు చేరవేయడానికి వచ్చానని చెప్పాడు బ్రాహ్మణుడు. రుక్మిణి సందేశాన్ని వినిపించాడు.

కృష్ణుడి మీదే తన మనస్సు లగ్నమై వుందని, తనను కరుణించమని, ఆయన్ను వివాహమాడుదామనుకున్న తనను శిశుపాలుడు వాంఛిస్తున్నాడని, ఆ అధముడిని యుద్ధంలో ఓడించి తన్ను పరిగ్రహించాలని, రుక్మిణి మాటలుగా చెప్పాడు బాహ్మణుడు. రాక్షస వివాహంలో తనను చేసుకుని తీసుకుపోవాలని రుక్మిణి చెప్పిందని, అలా తీసుకుపోవడానికి ఉపాయం కూడా ఆమె చెప్పిందని, పెళ్లికి ముందు పార్వతీదేవి ఆలయానికి మొక్కుకోవడానికి తనను పంపుతారని, అప్పుడు తనను తీసుకుపోవచ్చని రుక్మిణి అన్నదని బ్రాహ్మణుడు చెప్పాడు. కృష్ణుడి అనుగ్రహం తనమీద ప్రసరించకపోతే, వ్రతనిష్టను పూని, నూరు జన్మలకైనా కృష్ణుడే తన భర్త కావాలని ధ్యానిస్తూ ప్రాణాలను ఆయనకే అర్పిస్తానని రుక్మిణి చెప్పిందని కూడా అన్నాడు. ఇలా రుక్మిణీదేవి పంపిన సందేశాన్ని తెలియచేసిన బ్రాహ్మణుడు ఆమె రూప సౌందర్యాలను వర్ణించాడు. ఇద్దరూ ఒకరికొకరు సరైన ఈడూజోడని వెంటనే వచ్చి రుక్మిణి తీసుకుపో అని చెప్పాడు.

తాను తక్షణమే విదర్భ దేశానికి వచ్చి రుక్మిణీదేవిని తీసుకుని వస్తానని, శత్రువులు అడ్డుకుంటే యుద్ధంలో హతమారుస్తానని చెప్పాడు కృష్ణుడు. రుక్మిణీదేవి పెళ్లి ముహూర్తం ఎప్పుడో అడిగి తెలుసుకున్నాడు కృష్ణుడు. బ్రాహ్మణుడితో కలిసి రథం ఎక్కాడు. ఒక్క రాత్రిలో విదర్భ దేశానికి చేరుకున్నాడు. అక్కడ రుక్మిణిని శిశుపాలుడికి ఇవ్వడానికి పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రుక్మిణీదేవిని పెళ్లికూతురుగా తగు రీతిలో అలంకరించారు. పున్యాహవచనం చేయించారు. శిశుపాలుడు కుండిన నగరానికి చేరుకున్నాడు. అతడికి మద్దతుగా జరాసంధుడు, దంతవక్త్రుడు, సాల్వుడు, విదూరకుడు, పౌండ్రక వాసుదేవుడు మొదలైన వారొచ్చారు. కృష్ణుడు ఒక్కడే వెళ్లాడని తెలుసుకున్న బలరాముడు కూడా బయల్దేరి వచ్చాడు.

ఇదిలా వుండగా కృష్ణుడి రాక కోసం ఎదురు చూస్తున్న రుక్మిణి ఇంకా ఆయన రాలేదేమిటా అని మనసులో సంశయించ సాగింది. తనలో తానే ఇలా తర్కించుకున్నది.

మ: ఘను డా భూసురు డేగెనో? నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో

విని కృష్ణుం డిది తప్పుగా దలచెనో? విచ్చేసెనో యీశ్వరుం

డనుకూలింప దలంచునో తలపడో? యార్యామహాదేవియున్

నను రక్షింప నెరుంగునో ఎరుగదో నా భాగ్యమెట్లున్నదో?

తన విచారాన్ని రుక్మిణి కనీసం తల్లికి కూడా చెప్పుకోలేదు. కృష్ణుడు వచ్చే మార్గం వైపే చూపులను నిలిపింది. కృష్ణ్డు ఎప్పుడొస్తాడో అని ఎదురు చూస్తున్న ఆమె ఎడమ కన్ను, ఎడమ భుజం అదిరాయి. ఇంతలో ఆమె పంపిన బ్రాహ్మణుడు వచ్చాడు. శ్రీకృష్ణుడు నగరానికి వచ్చాడని శుభవార్త చెప్పాడు. బలరామకృష్ణులు కూడా తన కూతురు వివాహానికి వచ్చారని విన్న భీష్మకుడు వారికి తగురీతిన మర్యాదలు చేశాడు. నగరంలోని వారంతా కృష్ణుడు వచ్చిన వార్త తెలుసుకుని అతడే రుక్మిణికి సరైన భర్త అని అనుకున్నారు.

ముత్తైదువలు తన వెంట రాగా, రుక్మిణీదేవి, పార్వతీదేవి పూజకు బయల్దేరింది. శ్రీకృష్ణుడిని మనస్సులో తలుస్తూ రుక్మిణి గౌరీదేవి ఆలయానికి వచ్చింది. గౌరీదేవికి బ్రాహ్మణులు అభిషేకం చేశారు. అప్పుడు రుక్మిణీదేవి గౌరికి మొక్కుతూ ఇలా ప్రార్థన చేసింది:

ఉ: నమ్మితి నా మనంబున సనాతను లైన యుమామహేశులన్

మిమ్ముఁ బురాణదంపతుల మేలు భజింతుఁ గదమ్మ! మేటి పె

ద్దమ్మ! దయాంబురాశివి గదమ్మ! హరిం బతిఁ జేయు మమ్మ! నిన్

నమ్మినవారి కెన్నడును నాశము లేదు గదమ్మ! యీశ్వరీ!        

ఇలా ప్రార్థించి ముత్తైదువులను పూజించింది. వారామెను దీవించారు. తలమీద శుభాక్షతలు వుంచారు. గౌరీదేవికి మొక్కి రుక్మిణి ఆలయం నుండి బయల్దేరింది. కాలి నడకన శ్రీహరి రాక కోసం ఎదురు చూస్తూ, రాజవీరులను మోహింపచేస్తూ వీరమోహినియై రుక్మిణీదేవి నడచి వస్తున్నది. రుక్మిణీదేవిని చూసి రాజులంతా మోహాన్ని పొందారు. రాజసమూహాన్ని చూస్తూ నడవ సాగింది.

ఇంతలో, శ్రీకృష్ణుడిని చూసింది రుక్మిణీదేవి. ఆ మహానుభావుడి తేజస్సుకి సంతోషించింది. త్వరగా ఆయన రథం ఎక్కాలన్న కుతూహలం బలపడింది. పుండరీకాక్షుడు కూడా ఆమెను చూసి, తక్షణమే, శత్రురాజులు చూస్తుండగా, రుక్మిణీదేవిని తీసుకుని వచ్చి తన రథం మీద కూచోబెట్టుకున్నాడు. శంఖాన్ని పూరిస్తూ, బలరామాదులు, సైన్యం వెంట రాగా, ద్వారకా నగరం వైపు వెళ్లాడు. ఇది చూసి జరాసంధుడు మొదలైన రాజులు రోషావేశంతో, తమ తమ చరురంగ బలాలతో యదువీరులను అడ్డుకున్నారు. ఇది చూసి బలరామాది యాదవ వీరులు శత్రురాజుల మీద బాణపరంపరలను కురిపించారు. ఆ ధాటికి రాజ సమూహం చెదిరిపోయింది. రణరంగ భూమి చాలా భీభత్సంగా తయారైంది. జరాసంధుడు, శిశుపాలుడు ఒకరినొకరు ఊరడించుకున్నారు. దేహంలో ప్రాణం వుంటే ఏ విధంగానైనా జీవించవచ్చని అనుకున్నారు. ఆనాటి పరిస్థితిలో కృష్ణుడిని జయించడం కష్టమని జరాసంధుడన్నాడు. అంతా కలిసి శిశుపాలుడికి నచ్చ చెప్పి యుద్ధాన్ని విరమించుకున్నారు.

అనంతరం రుక్మిణీదేవి అన్నైన రుక్మి ఒక అక్షౌహిణి సేనతో కృష్ణుడిని వెన్నాడుతూ పోయాడు. సారథిని అదలించి రథాన్ని కృష్ణుడి సమీపానికి తోలించాడు. మూడు వాడి బాణాలను కృష్ణుడి మీద ప్రయోగించాడు. కృష్ణుడికి మానం, మర్యాద లేవని, ఆయన రాజు కూడా కాదని, వావి వరుసలు లేవని దూషిస్తూ, తన చెల్లెలిని వదలకపోతే అతడి అహంకారాన్ని అణచి వేస్తానని కృష్ణుడితో అన్నాడు రుక్మి. శ్రీకృష్ణుడు నవ్వి, ఒకేఒక్క బాణంతో రుక్మి ధనస్సును నరికాడు. సారథిని చంపాడు. జండాని నరికాడు. అతడి ఆయుధాలన్నీ ముక్కలు చేశాడు. రుక్మి ఆగకుండా రథం దిగి కత్తి పట్టి కృష్ణుడి మీదికి ఉరికాడు. ఇది సహించని కృష్ణుడు తన ఒరలో కత్తిని తీసి అతడి శిరస్సు ఖండించాలని తయారయ్యాడు. అప్పుడు రుక్మిణీదేవి అడ్డం వచ్చి అపరాధం చేసిన తన అన్నను కాపాడమని కృష్ణుడిని ప్రార్థించింది. తన తల్లిదండ్రులకు పుత్రశోకం కలిగించవద్దని కోరింది. దాంతో కృష్ణుడు రుక్మిని చంపడం మానుకున్నాడు. కాకపోతే, గడ్డం, మీసం, తల గొరిగి కురూపిని చేశాడు. అన్న గర్వ భంగానికి ఖిన్నురాలైన రుక్మిణిని బలరాముడు ఓదార్చాడు.

శత్రువులందరినీ గెలిచిన కృష్ణుడు రాజసంతో రుక్మిణీదేవిని తన పట్టణానికి బంధువులంతా స్తుతిస్తుంటే తీసుకుని వచ్చాడు. పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. వివాహానికి ఆహ్వానించబడ్డ రాజులు రాసాగారు. ఎక్కడ చూసినా తోరణాలు కట్టబడి వున్నాయి. జెండాలు ఎగిరాయి. ఆ శుభ సమయంలో శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని వివాహం చేసుకున్నాడు. ఆయన కీర్తి నాల్గు దిక్కులా వ్యాపించింది. రుక్మిణీ శ్రీకృష్ణులకు పురజనులంతా కానుకలు సమర్పించారు. రాజులంతా సంతోషించారు. ఆదిలక్ష్మి అయిన రుక్మిణీదేవితో శ్రీకృష్ణుడు కూడి వుంటే ప్రజలు అన్ని భయాలు వదిలి మహదానందాన్ని పొందారు.                             

            (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

No comments:

Post a Comment