Thursday, October 29, 2020

కుచేలోపాఖ్యానం .... శ్రీ మహాభాగవత కథ-80 : వనం జ్వాలా నరసింహారావు

 కుచేలోపాఖ్యానం

శ్రీ మహాభాగవత కథ-80

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

శ్రీకృష్ణుడికి ఒక ప్రియమిత్రుడుండేవాడు. అతడి పేరు కుచేలుడు. అతడు వేదవేదాంగాలను చదివిన బ్రాహ్మణోత్తముడు. మహా విజ్ఞాని. ఆధ్యాత్మిక తత్త్వవేత్త. భక్తాగ్రగణ్యుడు. అతడిని దారిద్ర్యం పట్టి పీడించసాగింది. భార్యాబిడ్డలను ఏదో రకంగా పోషిస్తూ జీవనయాత్ర సాగిస్తున్నాడు. కుచేలుడి భార్య సద్గుణ సంపన్నురాలు. మహా పతివ్రత. ప్రతిరోజూ, పట్టెడన్నం పెట్టమని దీనంగా అడిగే తన పిల్లలను చూసి, ఆమె హృదయం ద్రవించి పోయేది. తమ దరిద్రం పోవడానికి ఏదైనా ఉపాయం ఆలోచించమని భర్తను వేడుకుంది.

చిన్ననాటి మిత్రుడైన శ్రీకృష్ణుడి దగ్గరికి పోయి, తాము పడుతున్న అవస్థల గురించి చెప్పి, ఆయన కృపా కటాక్షంతో తమ దారిద్ర్యాన్ని పోగొట్టమని సలహా కూడా ఇచ్చింది. కుచేలుడిని చూసీచూడగానే శ్రీకృష్ణుడు సాటిలేని సంపదలు ఇస్తాడని చెప్పింది. ధర్మపత్ని ఇచ్చిన సలహా మేరకు శ్రీకృష్ణ పరమాత్మను దర్శించడం ఇహపర సాధనమౌతుందని నిశ్చయించుకున్నాడు కుచేలుడు. ఆ భగవంతుడి దగ్గరికి వెళ్లేటప్పుడు ఏం కానుక తీసుకెళ్లాలని భార్యను అడిగాడు. భర్త చినిగిన కొంగులో కొన్ని అటుకులు మూటలాగా కట్టి, వాటిని కృష్ణుడికి కానుకగా ఇవ్వమని చెప్పి భర్తను అనునయంగా ద్వారకానగారానికి పంపించింది ఆయన ధర్మపత్ని. కృష్ణుడిని ఎప్పుడు చూస్తానా అన్న ఉత్సాహంతో కుచేలుడు త్వరత్వరగా నడక సాగించాడు.

కుచేలుడు ప్రయాణం చేస్తూ, తాను ద్వారకానగారాన్ని చూడడం ఎలా అనీ, ఆ నగరంలోకి ప్రవేశించడం ఎలా అనీ, శ్రీకృష్ణుడిని ఏవిధంగా దర్శించగలననీ, అంతఃపురం వాళ్లు అడ్డుతగిలితే ఏమని సమాధానం ఇవ్వాలనీ, వాళ్లకు కానుకలిద్దామంటే తనదగ్గర ఏమీ లేవుకదా అనీ, తన అదృష్టం ఎలా వుందోననీ, శ్రీకృష్ణుడు తనను చూసిన తరువాత వదులుతాడా అనీ, ఏమీ పాలుపోవడం లేదనీ అనుకుంటూ ద్వారకలోకి ప్రవేశించాడు. తరువాత రాజమార్గంలో నడవసాగాడు. మొదలు పదహారువేలమంది సుందరాంగుల బంగారు మేడలను చూసి మురిసిపోయాడు. ఒక మందిరంలో తన మిత్రుడు శ్రీకృష్ణుడు కనిపించాడు కుచేలుడికి. ఆయన రూప సౌందర్యాన్ని తనివితీరా చూశాడు కుచేలుడు.

శ్రీకృష్ణ పరమాత్మను తన్మయత్వంతో చూస్తూ ఆయన్ను సమీపిస్తుండగా, దారిద్ర్యంతో పీడించబడిన ఆ పేద బ్రాహ్మణుడిని చూసిన శ్రీకృష్ణుడు వెంటనే ఆశ్చర్యంతో తాను కూర్చున్న హంసతూలికా తల్పం దిగాడు. బాల్యమిత్రుడిని చూడగానే ప్రేమగా ఎదురుగా వెళ్లాడు. కుచేలుడిని గట్టిగా కౌగలించుకున్నాడు. అభిమానంగా తీసుకువచ్చి తన తల్పం మీద కూచోబెట్టాడు. బంగారు కలశంలోని నీళ్లతో స్నేహితుడి కాళ్లు కడిగాడు. ఆ జలాలను తన శిరస్సుమీద చల్లుకున్నాడు. చందనాన్ని కుచేలుడి శరీరం మీద చల్లాడు. విసనకర్రతో విసిరాడు. హారతులిచ్చాడు. పూలమాలలు వేశాడు. తాంబూలం ఇచ్చాడు. గోవును దానంగా ఇచ్చాడు. శ్రీకృష్ణుడి ఆదరాభిమానాలకు బ్రాహ్మణుడు పులకించిపోయాడు.

ఇంతలో రుక్మిణీదేవి వచ్చి వింజామరతో విసరసాగింది. కుచేలుడి అదృష్టానికి అంతఃపురకాంతలు అబ్బురపడిపోయారు. శ్రీకృష్ణుడు స్నేహితుడి చేయి తన చేతిలో తీసుకుని గురుకులం రోజులనాటి ముచ్చట్లు, విద్యను అభ్యసించినప్పుడు చేసిన పనులను గురించి చెప్పాడు. కుచేలుడి కుటుంబ విషయాలు అడిగాడు. ఆయన భార్యా పిల్లల గురించి వివరాలు అడిగాడు. గురువుగారి దగ్గర నేర్చుకున్న విషయాలు గుర్తున్నాయా అని ప్రశ్నించాడు. వారి గురువైన సాందీప మహర్షి గొప్పదనాన్ని, వైదుష్యాన్ని, వాత్సల్యాన్ని గురించి మరీమరీ గుర్తు తెచ్చుకున్నాడు శ్రీకృష్ణుడు. గురుకులంలో వున్నప్పుడు ఒకరోజున గురుపత్ని తమను అడవిలో కట్టెలు తెమ్మన్న విషయం, తాము వెళ్లగానే ఉరుములతో పెద్ద వర్షం కురియడం, చీకటి వ్యాపించడం, ఇద్దరూ తడిసిపోవడం, చలికి తమ శరీరాలు వణికిపోవడం, తెల్లవార్లూ అడవిలో గడపడం, తమ గురువు సాందీపముని తమను వెతుక్కుంటూ రావడం, తమ గురుభక్తికి ఆయన మెచ్చుకుని దీవించడం, ఇంటికి తీసుకువెళ్లడం గుర్తుకు తెచ్చాడు శ్రీకృష్ణుడు.

తమ స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ కృష్ణుడు పలికిన పలుకులకు కుచేలుడు ఆనందించాడు. తన దగ్గరకు వచ్చేటప్పుడు తనకు కానుకగా ఏమి తెచ్చావని అడిగాడు కుచేలుడిని కృష్ణుడు. తాను తెచ్చిన అటుకుల కానుకను శ్రీకృష్ణుడికి ఇవ్వడానికి సంకోచించాడు కుచేలుడు. ఏమీ మాట్లాడకుండా మౌనంగా వుండిపోయాడు. శ్రీకృష్ణుడు దివ్యదృష్టితో స్నేహితుడి అభిప్రాయాన్ని గ్రహించాడు. కుచేలుడికి అఖండ సంపదలు ప్రసాదించాలని నిశ్చయించాడు. అటుకుల మూటను చూసి, తనకు దాన్ని చూపలేదేమిటని అంటూ విప్పాడు కృష్ణుడు. వాటిలోంచి కొన్ని అటుకులు తీసుకుని తనకవే చాలునన్నాడు. ఆ కాసిని అటుకులే సమస్త లోకాలనూ సంతృప్తి పరుస్తాయన్నాడు. ఒక పిరికెడు తిని, మరో పిరికెడు తీసుకుంటుంటే రుక్మిణి వారించి, ఒక పిరికెడు చాలన్నది.

కుచేలుడు ఆ రాత్రి శ్రీకృష్ణ మందిరంలోనే గడిపాడు. మర్నాడు పొద్దున్నే తన ఊరికి బయల్దేరాడు. కృష్ణుడు కొంతదూరం స్నేహితుడితో కలిసి నడిచి ఆయన్ను సాగనంపాడు. శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకున్నందుకు సంతోషిస్తూ ప్రయాణం సాగించాడు కుచేలుడు. తన పురం చేరుకున్నాడు. తన ఇల్లు వుండాల్సిన చోట బంగారు భవనాలను చూశాడు. సుందర ఉద్యానవనాలను చూశాడక్కడ. సరోవరాలను చూశాడు. దాసదాసీ జనాలతో అలరారుతున్న తన సౌధాన్ని చూశాడు. శోభాయమానంగా కనిపిస్తున్న ఆ సౌధాన్ని చూసి ఆలోచించసాగాడు.

ఇంతలో కుచేలుడికి స్వాగతం చెప్తూ, దేవకాంతల్లాగా వున్న కొందరు స్త్రీలు ఆయన్ను లోపలికి తీసుకుపోయారు. అక్కడ ఆయన తన ధర్మపత్నిని చూశాడు. ఆమె ఆయన పాదాలకు నమస్కరించింది. పరిచారికలు సేవిస్తుంటే భాగ్యసౌభాగ్యాలతో అలరారుతున్నది భార్య. అలా శ్రీకృష్ణుడు ప్రసాదించిన సిరిసంపదలతో ఆ దంపతులిద్దరూ ఆనందంలో మునిగిపోయారు. మహా వైభవంగా వున్న ఆ భవనంలో కుచేలుడు భార్యతో, పుత్రులతో సుఖంగా కాలం గడిపాడు. నిర్మలమైన ప్రవర్తనతో సజ్జనుడిగా మెలగసాగాడు. ఇన్ని వున్నా, కుచేలుడు భోగ భాగ్యాలపట్ల ఏవిధమైన ఆసక్తి చూపకుండా భగవంతుడినే ధ్యానం చేస్తూ, మోక్ష సామ్రాజ్యాన్ని చేరుకున్నాడు.                       

       (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

No comments:

Post a Comment