గోపికల దగ్గరికి ఉద్ధవుడిని పంపిన శ్రీకృష్ణుడు
శ్రీ మహాభాగవత కథ-65
వనం జ్వాలా నరసింహారావు
కంII చదివెడిది భాగవతమిది,
చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్
చదివినను
ముక్తి కలుగును,
చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై
కంసుడిని వధించిన అనంతరం, ఆయనతో పాటు
చనిపోయినవారికి ఉత్తర క్రియలు జరిపించిన తరువాత, కృష్ణుడు, చెరనుండి విడిపించిన తల్లిదండ్రులు దేవకీవసుదేవులకు నమస్కారం చేశాడు.
దేవకీవసుదేవులు కొడుకులను చూసి వారు సాక్షాత్తూ భగవంతులు అని అంతా
సంశయిస్తున్నారని అన్నారు. అప్పుడు కృష్ణుడు తన మాయతో వారికి కలిగిన
తత్త్వజ్ఞానాన్ని పోగొట్టాడు. తల్లిదండ్రులైన వారిద్దరూ కొడుకుల బాల్యాన్ని
చూడలేదని, గారాబంగా పెంచే అదృష్టాన్ని పొందలేదని, అలాగే వారి
లాలనను పొందే అదృష్టం తమకు కూడా లభించలేదని కృష్ణుడు వారితో అన్నాడు. ఇన్ని రోజులు
వారిని చెరనుండి విడిపించలేక పోయినందుకు మన్నించమని అడిగాడు. ఆ తరువాత తాతగారైన
ఉగ్రసేనుడిని పలకరించి, కొడుకు మరణానికి దుఃఖిస్తున్న అతడిని
ఓదార్చి, మథురా నగరానికి రాజును చేశాడు.
కంసుడికి భయపడి అన్య దేశాలకు వలసపోయిన వారందరినీ రప్పించాడు. మథురలో వున్న
బంధువులందరికీ సుఖాన్ని కలగచేసి వ్రేపల్లెకు వస్తామని తనను పెంచిన తండ్రైన
నందుడికి చెప్పాడు. అలా చెప్పి నందాదులను వ్రేపల్లెకు సాగనంపాడు. అనంతరం వసుదేవుడు
తన కొడుకులకు గర్గుడు మొదలైన బ్రాహ్మణులతో శాస్త్రప్రకారం ఉపనయనాన్ని చేయించాడు.
దాంతో వారు ద్విజరాజత్వాన్ని పొందారు. ఆ తరువాత వారిద్దరూ బ్రహ్మచారులై
ఆచార్యుడిని అన్వేషిస్తూ బయల్దేరారు. కాశీ పట్టణానికి చేరుకున్నారు. అక్కడ
నివసిస్తున్న సాందీపుడు అనే విద్వాంసుడిని గురువుగా చేసుకున్నారు. ఆయన దగ్గర
నాలుగు వేదాలు, ఆరు వేదాంగాలు,
ధనుర్విద్య, సిద్ధాంత విషయమైన గ్రంథాలు, మన్వాది శాస్త్రాలు, నీతి శాస్త్రం, తర్క శాస్త్రం, రాజనీతి మొదలైన సకల విద్యలు
అభ్యసించారు. అరవైనాలుగు రోజుల్లో అరవైనాలుగు విద్యలను నేర్చుకున్నారు.
విద్యాభ్యాసం పూర్తైన తరువాత గురుదక్షిణగా, సముద్ర స్నానం చేస్తూ నీట మునిగిన, తన కుమారుడిని తెచ్చి ఇవ్వమని అడిగాడు సాందీపుడు. వెంటనే వారు
సముద్ర సమీపానికి పోయి నీట మునిగిన గురువుగారి కుమారుడిని ఇవ్వమని సముద్రుడిని
శాసించారు. బాలుడు స్నానం చేస్తున్నప్పుడు పంచజనుడు అనే రాక్షసుడు మింగాడని
చెప్పాడు సముద్రుడు. వెంటనే సముద్రంలో ప్రవేశించి పంచజనుడి పొట్ట చీల్చాడు
కృష్ణుడు. అయినా ఆ బాలుడు కనపడలేదు. ఆ రాక్షసుడి దేహంలో పుట్టిన పాంచజన్యం అనే
శంఖాన్ని తీసుకున్నాడు. అక్కడి నుండి రథం ఎక్కి బలరాముడితో కలిసి యముడి పట్టణానికి
పోయాడు. వచ్చినవాడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువే అని గ్రహించిన యముడు కృష్ణుడు
కోరినట్లే గురుపుత్రుడిని ఆయనకు అప్పగించాడు. ఇచ్చిన మాట ప్రకారం గురుపుత్రుడిని
ఆయన తండ్రి సాందీపుడికి గురుదక్షింగా అప్పచెప్పారు. ఆ తరువాత ఆయన దగ్గర సెలవు
తీసుకుని మథురకు వచ్చారు బలరామకృష్ణులు.
ఒకనాడు కృష్ణుడికి గోపికలు గుర్తుకు వచ్చారు. బృహస్పతిని పోలిన ఉద్ధవుడిని
పిలిచి వ్రేపల్లెకు వెళ్లమన్నాడు. తన ఎడబాటు వల్ల దుఃఖిస్తున్న గోపికలను పలకరించి, తాను వారిని విడవనని, త్వరలోనే బృందావనం వస్తానని తన సందేశంగా
వాళ్లకు చెప్పమన్నాడు. సూర్యాస్తమయ సమయానికల్లా ఉద్ధవుడు వ్రేపల్లె చేరి నందుడిని
కలిశాడు. అతడినే కృష్ణుడిగా భావించిన నందుడు కుశల ప్రశ్నలు వేశాడు. మథురలో వున్న
వారందరి క్షేమ సమాచారం అడిగాడు. కృష్ణుడు ఎప్పుడొస్తాడని అడిగాడు. యశోదాదేవి కూడా
కృష్ణుడి గురించి అడిగి కళ్లనీళ్లు పెట్టుకుంది. త్వరలోనో వస్తాడు కృష్ణుడని
చెప్పాడు ఉద్ధవుడు.
ఆ రాత్రి హరి మహిమలు చెప్పుకుంటూ గడిపారు. మర్నాడు నిద్ర లేచి, ఉద్ధవుడు అనుష్టానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఒక ఏకాంత
ప్రదేశంలో వున్నప్పుడు, గోపికలక్కడికి వచ్చారు. వారంతా ఉద్ధవుడిని చూసి, కృష్ణుడిలాగానే ప్రకాశిస్తున్నాడని అనుకున్నారు. తమ క్షేమ సమాచారం
కనుక్కునేందుకు కృష్ణుడు ఆయన్ను పంపారని తెలుసుకుని సంతోషించారు. వచ్చిన వారిలో ఒక
గోపిక కృష్ణ చరణ ధ్యానంలో పరవశురాలయింది. ఆమె ఒక తుమ్మెదను చూసింది అక్కడ. దాన్ని, కృష్ణుడు పంపిన దూతగా కల్పించుకుని, ఉద్ధవుడికి అన్యాపదేశంగా
తెలిసేట్లుగా ఆ గోపిక కృష్ణుడి లీలావతారాలను గురించి మాట్లాడ సాగింది. ఆమెతో పాటు
అంతా గొంతు కలిపి భ్రమర గీతాలు పాడారు, మాట్లాడారు. వారిని
చూసి, వారి మాటలు విని, ఉద్ధవుడు, ప్రియమైన మాటలతో వారిని ఊరడించాడు. కృష్ణుడు గోపికలకు చెప్పమని చెప్పిన
మాటలన్నీ చెప్పాడు.
కృష్ణుడి మాటలుగా, ‘మీరు చేసే నిరంతర ధ్యానం వల్ల నేను మీలోనే
వున్నాను. మీరు ఎప్పుడూ నన్ను తలస్తూ వుండాలనే కోరిక వల్ల నేను ఈ విధంగా మీకు
దూరంగా వున్నాను. కాబట్టి మీరు ఎడతెగని ధ్యానం ద్వారా నన్ను పొందగలరు’ అని ఉద్ధవుడు
చెప్పాడు. గోపికలు కృష్ణుడిని గురించి పరిపరి విధాలుగా అడిగారు. తాము పడే అవస్థను
తమ ప్రాణ నాయకుడైన కృష్ణుడికి చెప్పమని ఉద్ధవుడిని ప్రార్థించారు. ఆయన రావడం
ఆలశ్యం చేస్తే శ్రీకృష్ణుడిని ఎడబాసిన తమ దేహాలు భూమ్మీద నిలవవవి చెప్పమన్నారు.
అసలు శ్రీకృష్ణుడు ఎప్పటికైనా వ్రేపల్లెకు వస్తాడా అన్న సందేహం కూడా వెలిబుచ్చారు.
ఆ తరువాత కృష్ణుడు చెప్పి పంపిన మరి కొన్ని మాటలు ఉద్ధవుడు చెప్పగా, గోపికల
మనస్సులు కుదుట పడ్డాయి. ఆయన్ను పూజించారు. ఇలా కృష్ణ లీలా వర్ణనలు చేస్తూ
వ్రేపల్లెలో మరికొన్ని నెలలు వుండి, నందాదుల దగ్గర సెలవు తీసుకుని మథురకు
బయల్దేరాడు ఉద్ధవుడు.
(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం
ప్రచురణ ఆధారంగా)
No comments:
Post a Comment