ప్రద్యుమ్న కుమార, సత్రాజిత్తు, శ్యమంతకమణి వృత్తాంతం
శ్రీ మహాభాగవత కథ-69
వనం జ్వాలా నరసింహారావు
కంII చదివెడిది భాగవతమిది,
చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్
చదివినను
ముక్తి కలుగును,
చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై
విష్ణుమూర్తి అంశతో జన్మించిన మన్మథుడు పరమశివుడి కంటి మంటలకు ఆహుతై,
శరీరాన్ని కోల్పోయి, ఆయన్నే మళ్లీ ప్రార్థించి, ఆయన కృపాకటాక్షంతో రుక్మిణీ శ్రీకృష్ణులకు కుమారుడిగా జన్మించాడు.
ప్రద్యుమ్నుడు అనే పేరుతో అతిలోక సుందరుడిగా వెలుగొందాడు. అతడు బాలుడిగా పురిటి
గదిలో వున్నప్పుడే, శంబరుడనే రాక్షసుడు శిశువుని అపహరించి సముద్రంలో పారవేయగా ఆ
శిశువును ఒక పెద్ద చేప మింగింది. ఆ చేపను జాలరులు పట్టుకున్నారు. దాన్ని తెచ్చి
రాక్షసరాజైన శంబరాసురుడికి కానుకగా ఇచ్చారు. చేపను వండమని వంటశాలకు పంపాడు రాజు. వంటవాళ్లు
దాన్ని కోసేసరికి అందులో రాచబిడ్డ (ప్రద్యుమ్నుడు) కనిపించాడు. వారా విషయాన్ని
రతీదేవి (మన్మథుడి భార్య) కి చెప్పారు. ఆమెకేమీ అర్థం కాలేదు. అదే సమయంలో నారదుడు
వచ్చి అసలు విషయం ఆమెకు చెప్పాడు. మాయావతి అనే పేరుతో రతీదేవి, ఆ శిశువును (తన
భర్తను) పెంచి పెద్ద చేయడానికి శంబరాసురుడి అనుమతి తీసుకుంది.
రతీదేవి పెంచుతున్న ప్రద్యుమ్నుడు శీఘ్రకాలంలోనే పెరిగి పెద్దవాడయ్యాడు.
మన్మథుడి లాగా, వర్ణనాతీతమైన సౌందర్యంతో ప్రద్యుమ్నుడు ప్రకాశించాడు. మాయావతి
పేరుతో మెలగుతున్న రతీదేవి ప్రద్యుమ్నుడిని మోహించి, తన కోరికను చూపులతో
ప్రకటించింది. ఆమెను మోహ దృష్టి నుండి మరల్చడానికి ప్రద్యుమ్నుడు ప్రయత్నించాడు.
తాను ఆమెకు కొడుకుననీ, తనను మోహించడం ధర్మం కాదనీ అన్నాడు.
రతీదేవి జరిగిన విషయమంతా చెప్పింది. పూర్వం తామిద్దరం భార్యాభర్తలమని అప్పటి వరకు
జరిగినందంతా వివరించింది. మాయావైన శంబరాసురుడిని వధించమంటుంది. శత్రువుల మాయలు
నశింపజేసే ‘మహామాయా విద్య’ను ఉపదేశించింది ప్రద్యుమ్నుడికి.
ఆయన వెంటనే శంబరాసురుడి మీదికి యుద్ధానికి పోయాడు. యుద్ధంలో ప్రద్యుమ్నుడు
శంబరాసురుడిని సంహరించాడు.
శంబరాసురుడిని చంపిన తన భర్త ప్రద్యుమ్నుడితో రతీదేవి ఆకాశమార్గంలో
ద్వారకానగరం పైభాగం వద్దకు వచ్చింది. అక్కడి నుండి అంతఃపురానికి వచ్చారు.
అక్కడున్న అంతఃపుర కాంతలు అందగాడైన ప్రద్యుమ్నుడిని చూసి అతడు శ్రీకృష్ణుడే
అనుకున్నారు. చివరకు అతడు కృష్ణుడి లాగానే వున్నాడు కాని కృష్ణుడు కాదని
నిర్ణయించారు. ఈ విషయం రుక్మిణీదేవికి తెలిసింది. ఆమె కూడా ప్రద్యుమ్నుడిని
చూడడానికి వెళ్లింది. చూసి, ఒక్క నిమిషం పుత్ర వాత్సల్యంతో తొట్రుపడి, తన
మనోభావాన్ని చెలికత్తెకు చెప్పింది. తనకు ఎక్కడలేని సంతోషం కలుగుతున్నదని అన్నది.
పాలిండ్ల నుండి పాలు స్రవిస్తున్నాయని చెప్పింది. అతడు తన కుమారుడేమో అని
తర్కించడం మొదలుపెట్టింది. ఏం చేయాల్నో తోచలేదు.
శ్రీకృష్ణుడికి సమస్తం తెలిసినా ఏమీ అనలేదు బయటకు. తల్లిదండ్రులైన
దేవకీవసుదేవులను వెంటబెట్టుకుని ప్రద్యుమ్నుడున్న ప్రదేశానికి వచ్చాడు. ఆ సమయంలో
నారదుడు అక్కడికి వచ్చి, శంబరుడు శిశువును ఎత్తుకు పోయిన దగ్గరి
నుండి సమస్త విషయాలు తెలియచేశాడు అందరికి. రుక్మిణీదేవి కుమారుడిని కౌగలించుకుని
పరమానందం పొందింది. ఆనందాశ్రువులు రాల్చింది.
ఇదిలా వుండగా, సత్రాజిత్తు అనే వాడు సూర్యభగవానుడి
వరప్రసాదం వల్ల శ్యమంతకమణిని పొందాడు. దాన్ని మెడలో ధరించి, ప్రకాశిస్తూ,
ద్వారకనగరానికి వచ్చిన అతడిని చూసి ద్వారకావాసులంతా సూర్యుడని భ్రమించి, అ ఆవిషయాన్ని కృష్ణుడికి చెప్పారు. అతడు సూర్యుడు కాదని, మణి ధరించి వున్న సత్రాజిత్తని, చెప్పాడు వారికి కృష్ణుడు. అనర్ఘమైన శ్యమంతకమణి
ప్రతి దినం ఎనిమిది బారువుల బంగారం ఇస్తుంది. ఆ మణిని యాదవ ప్రభువుకు ఇమ్మని
అడిగాడు కృష్ణుడు. సత్రాజిత్తు దానికి అంగీకరించలేదు.
ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడు మణిని ధరించి వేటకు పోయాడు. అతడిని
అడవిలో ఒక సింహం చంపి, మణిని తీసుకుని పరుగెత్తుతుంటే, భల్లూక రాజైన జాంబవంతుడు
సింహాన్ని వధించి మణిని తీసుకునిపోయి ఆయన వుంటున్న కొండ గుహలో తన కూతురు
ఆడుకోవడానికి ఇచ్చాడు. ప్రసేనుడు తిరిగి రాకపోవడంతో కృష్ణుడే మణిని అపహరించాడని
నింద మోపాడు సత్రాజిత్తు. తన మీద పడ్డ నిందను తుడిచేసుకోవడానికి శ్రీకృష్ణుడు
ప్రసేనుడిని వెతుక్కుంటూ పోయాడు. అడవిలో ప్రసేనుడి శవాన్ని, అతడిని చంపిన
సింహాన్ని చూసి, ఆ తరువాత గుహలోకి పోయిన ఎలుగుబంటి
నివాసాన్ని చూశాడు. గుహలోకి ఒక్కడే ప్రవేశించాడు. అందులో ఒక బాలిక ఆట వస్తువుగా
వేలాడుతున్న శ్యమంతకమణిని చూసి, దాన్ని తీసుకుపోవడానికి
ప్రయత్నించాడు. కృష్ణుడిని చూసిన ఆ బాలిక అరచింది. అది విని జాంబవంతుడు అక్కడికి
వచ్చి కృష్ణుడిని చూశాడు.
కృష్ణుడు త్రేతాయుగంలో తన ప్రభువైన శ్రీరామచంద్రమూర్తేనని గ్రహించలేక
యుద్ధానికి తలపడ్డాడు. ఘోరాతిఘోరంగా ఇరువురు 28 రోజులపాటు యుద్ధం చేశారు. శరీరం
అంతా పిండి పిండై పోయి, పూర్తిగా అలసిపోయిన జాంబవంతుడు, కృష్ణుడే శ్రీరాముడు అన్న నిర్ణయానికి వచ్చాడు. వెంటనే స్తోత్రం
చేయసాగాడు. ఆయన్ను గుర్తించలేక అపరాధం చేశానని క్షమించమని వేడుకున్నాడు.
ప్రసన్నుడైన కృష్ణుడు జాంబవంతుడి శరీరాన్ని తుడిచి, గాయాలను
మాన్పి, తనపై పడ్డ నిందను గురించి చెప్పాడు. శ్యమంతకమణిని,
దానితో పాటు తన కుమార్తె జాంబవతిని కృష్ణుడికి కానుకగా ఇచ్చాడు జాంబవంతుడు.
శ్యమంతకమణిని, కన్యామణిని తీసుకుని శ్రీకృష్ణుడు ద్వారకా
నగరానికి చేరుకున్నాడు.
కృష్ణుడు జాంబవతీ దేవిని పత్నిగా స్వీకరించాడు. తరువాత సత్రాజిత్తును రాజసభకు
పిలిపించి జరిగిన వృత్తాంతాన్ని చెప్పి మణిని ఇచ్చాడు. సత్రాజిత్తు తానన్న మాటలకు
పశ్చాత్తాప పడ్డాడు. తాను చేసిన తప్పును గురించి పరిపరి విధాలుగా ఆలోచించిన
సత్రాజిత్తు దానికి పరిహారంగా, శ్యమంతకమణితో పాటు తన
కూతురు సత్యభామను శ్రీకృష్ణుడికి సమర్పించాడు. సత్యభామను శ్రీకృష్ణుడు
వివాహమాడాడు. కృష్ణుడు మణిని తిరిగి సత్రాజిత్తుకు ఇచ్చివేశాడు.
ఇది జరుగుతున్న సమయంలోనే పాండవులు తల్లితో సహా లక్క ఇంట్లో దగ్ధమైపోయారన్న
వార్త కృష్ణుడికి తెలిసింది. శ్రీకృష్ణుడు బలరాముడితో కలిసి హస్తినాపురానికి
వెళ్ళాడు. ఆయన లేని సమయంలో అక్రూరుడు, కృతవర్మ
మొదలైన కొందరు యాదవ ప్రముఖులు శతధన్వుడి దగ్గరికి వెళ్లి,
సత్రాజిత్తు దగ్గర వున్న మణిని సంగ్రహించమని ప్రేరేపించారు. అతడు ఒకనాడు
సత్రాజిత్తును క్రూరంగా చంపి, శ్యమంతకమణిని తీసుకుని
పారిపోయాడు. తండ్రిని చంపిన విషయాన్ని కృష్ణుడికి చెప్పడానికి సత్యభామ హస్తినకు
వెళ్లింది. సవిస్తరంగా విన్న కృష్ణుడు, ద్వారకకు పోయి
శతధన్వుడిని చంపుతానన్నాడు. శతధన్వుడు భయపడి కృతవర్మ,
అక్రూరుల సహాయం కోరాడు. వారు తమ నిస్సహాయతను వ్యక్తపరిచారు. మణిని అక్రూరుడి దగ్గర
దాచిపెట్టి, పారిపోయాడు శతధన్వుడు. పారిపోతున్న వాడిని తన
సుదర్శన చక్రంతో సంహరించాడు కృష్ణుడు. వాడి దగ్గర కృష్ణుడికి మణి కనిపించలేదు.
వెతకమని చెప్పి బలరాముడు, విదేహదేశాదిపతిని చూడడానికి మిథిలానగరం పోయాడు. కొన్ని
సంవత్సరాలపాటు అక్కడే వుండిపోయాడు బలరాముడు. అప్పుడే దుర్యోధనుడు అతడి శిష్యరికంలో
గదా విద్యను నేర్చుకున్నాడు.
ద్వారకకు చేరుకున్న కృష్ణుడు సత్యభామకు అన్ని విషయాలు చెప్పాడు. సత్రాజిత్తుకు
పరలోక క్రియలు చేయించాడు. ఈ లోగా అక్రూరుడు, కృతవర్మ
కృష్ణుడికి భయపడి పారిపోయారు. అక్రూరుడు లేని ద్వారకలో వర్షాలు పడకపోవడంతో ఆయన్ను
క్షమించి పిలిపించమని కృష్ణుడిని కోరారు వృద్ధజనులు. కృష్ణుడు దూతలను పంపించి
అక్రూరుడిని పిలిపించాడు. అక్రూరుడు తన దగ్గర దాచి వుంచిన శ్యమంతకమణిని కృష్ణుడి
చేతిలో పెట్టాడు. కృష్ణుడు దాన్ని బంధువులందరికీ చూపించాడు. తిరిగి దాన్ని
అక్రూరిడికే ఇచ్చివేశాడు.
(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం
ప్రచురణ ఆధారంగా)
No comments:
Post a Comment