శ్రీకృష్ణుడి గ్రహణ స్నానం, నారదాది మహర్షుల రాక
శ్రీ మహాభాగవత కథ-81
వనం జ్వాలా నరసింహారావు
కంII చదివెడిది భాగవతమిది,
చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్
చదివినను
ముక్తి కలుగును,
చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై
బలరాముడు, శ్రీకృష్ణుడు ద్వారకానగరంలో సుఖంగా కాలం
గడుపుతున్న సమయంలో, చూడశక్యం కాని ఒక సూర్య గ్రహణం
రానున్నదని తెలుసుకున్న యాదవులంతా గ్రహణ స్నానానికి బయల్దేరారు. పరమ పవిత్ర
‘శ్యమంత పంచకం’ తీరానికి బలరామ కృష్ణులు కూడా గ్రహణ
స్నానానికి బయల్దేరారు. స్నానానికి బయల్దేరుతూ ద్వారకానగర సంరక్షణ బాధ్యతను యాదవ
వీరుల మీద వుంచారు. బంధుమిత్ర సమేతంగా అంతా కలిసి స్నానం చేసి ఉపవాసం కూడా చేశారు.
జపధ్యానాలను చేశారు. గ్రహణానంతరం విడుపు స్నానాలు చేశారు. ఆ తరువాత పొన్న చెట్ల
నీడలో ఉల్లాసంగా వినోదించారంతా.
శ్యమంత పంచక పుణ్య
తీర్థాన్ని సేవించాలని ఎందరో రాజులు కూడా అక్కడికి వచ్చారు. గోపాలురు, గోపికా సమూహం, పాండవులు, కుంతీదేవి, గాంధారీ, ధృతరాష్ట్రుడు, భీష్ముడు, ద్రోణుడు మొదలైన వారంతా వచ్చారు. అంతా
శ్రీకృష్ణుడిని దర్శించారు. బలరాముడు, శ్రీకృష్ణుడు
రాజులందరినీ తగిన విధంగా పూజించారు, సత్కరించారు. అక్కడికి వచ్చినవారంతా యాదవులు
చేసుకున్న పుణ్యాన్ని పొగిడారు. శ్రీకృష్ణుడితొ వుండే అదృష్టం వారికి కలిగిందని
అన్నారు.
అప్పుడు అక్కడే వున్న
కుంతీదేవి ధర్మరాజాదులు అడవుల్లో పడుతున్న కష్టాలను వసుదేవుడికి చెప్పుకుని
దుఃఖించింది. వారి బాగోగులు చూడమని అడిగింది. విధిని ఎదిరించి నడవడం ఎవరికీ
చేతకాదని వసుదేవుడు చెల్లెలు కుంతీదేవిని ఓదార్చాడు.
అదే సమయంలో నందుడు, యశోద గోపాలకులతో, గోపికలతో కలిసి
కృష్ణుడిని చూడడానికి వచ్చారు. అలా వచ్చిన నందాదులను యాదవులు చూశారు. వసుదేవుడు
వారందరికీ సకల సత్కారాలు చేశాడు. బలరాముడు, శ్రీకృష్ణుడు
వినయంతో సాష్టాంగ నమస్కారం చేశారు. యశోదాదేవి కొడుకులిద్దరినీ గుండెలకు
హత్తుకుంది. కౌగలించుకుంది. రోహిణీదేవి, యశోదాదేవి, దేవకీదేవి, ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.
ఇంతలో ఎప్పుడెప్పుడు కృష్ణుడిని చూద్దామా అని ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న గోపికలంతా
అక్కడికి వచ్చి చేరారు. శ్రీకృష్ణుడిని చూసి వారంతా కనురెప్పలు వాల్చలేకపోయారు.
హృదయాలలోనే ఆయన్ను కౌగలించుకున్నారు.
గోపికలంతా కృష్ణుడిని దర్శించుకోగానే,
భక్తి పారవశ్యంలోకి జారుకున్నారు. శ్రీకృష్ణుడు గోపికారమణుల అంతర్భావాన్ని
గ్రహించాడు. వారందరినీ ఒక ఏకాంత ప్రదేశానికి రమ్మని, అక్కడ వారిని ప్రేమతో కౌగలించుకుని ఆనందపరవశులను చేశాడు. తాను
వారిని కలవడం ఆలశ్యం అయినందున, తన మీద అలగవద్దని అన్నాడు.
గోపికలకు పరమాత్మ తత్త్వాన్ని బోధించాడు శ్రీకృష్ణుడు. వారు దాంతో ఆత్మజ్ఞానాన్ని
పొంది, బంధాలను వదిలేశారు. ఆయన్ను స్తుతించారు. ఆయన
పాదపద్మాలను తమ మనస్సులలో స్థిరంగా నిలిచే వరం ఇవ్వమని కృష్ణ పరమాత్మను
ప్రార్థించారు. శ్రీకృష్ణుడు తనను భక్తితో కొలిచిన గోపికలను తరింప చేశాడు.
ఆ తరువాత శ్రీకృష్ణుడు, ధర్మరాజు ఉభయ కుశలోపరి గురించి
మాట్లాడుకున్నారు. అలాంటి సమయంలో, శ్రీకృష్ణుడి భార్యలు
ద్రౌపదీదేవి స్నేహంగా కలసి మెలిసి ఒక చోట కూర్చుని సంతోషంగా కబుర్లాడుకున్నారు.
ద్రౌపదీదేవి కృష్ణ పత్నులను చూసి, వారిని శ్రీకృష్ణుడు
ఏవిధంగా వివాహం చేసుకున్నాడో చెప్పమని అడిగింది. రుక్మిణీదేవి, ఇతర భార్యలు
వారివారి పరిణయ వృత్తాంతాలను ద్రౌపదికి సవిస్తరంగా వినిపించారు. శ్రీకృష్ణుడి
భార్య లక్షణ తనను వివాహం చేసుకోవడానికి పూర్వం శ్రీకృష్ణుడు,
తన తండ్రి పెట్టిన నిబంధనకు అనుగుణంగా, ఎలా మత్స్య
యంత్రాన్ని కొట్టిందీ, ఆ తరువాత తనను ఎలా వివాహమాడిందీ
వివరించింది. తనను వివాహం చేసుకుని తీసుకుపోతుంటే ఆయన్ను అడ్డుకున్న శత్రు రాజులను
సంహరించి తనను ద్వారకానగరం తీసుకువచ్చిన సంగతి కూడా చెప్పింది.
ఇదిలా వుండగా, ఒకనాడు, బలరామ
శ్రీకృష్ణులను చూడడానికి, మహర్షి సత్తములైన దేవలుడు, ద్వితుడు, త్రితుడు, వ్యాసుడు, కణ్వుడు, నారదుడు, గౌతముడు, చ్యవనుడు, గార్గ్యుడు,
వశిష్ఠుడు, కాలవుడు, అంగీరసుడు,
కశ్యపుడు, అసితుడు, సుకీర్తి, మార్కండేయుడు, అగస్త్యుడు,
అంగీరుడు, యాజ్ఞవల్క్యుడు, ఋష్యశృంగుడు మొదలైన వారంతా
వచ్చారు. వచ్చినవారందరినీ పూజించి, సపర్యలు చేసి, వారు రావడం తన అదృష్టంగా భావిస్తున్నాని చెప్పి,
వారిని పరిపరి విధాల పొగిడాడు శ్రీకృష్ణుడు. వారంతా కూడా శ్రీకృష్ణుడిని అనేక
విధాలుగా స్తోత్రం చేసి, ఆయన లీలలను పొగిడి, ఆయన్ను చూడడం వల్ల తమ పుట్టుక, చదువు, తపస్సు అన్నీ సఫలమయ్యాయని అభినందించి, ఆయన అనుమతితో
తమ నివాసాలకు వెళ్లడానికి సిద్ధపడ్డారు.
అప్పుడు వసుదేవుడు ఆ
మునీశ్వరులకు నమస్కరించి, పాపకర్మలను పోగొట్టే
సత్కర్మలేవో చెప్పమని అడిగాడు. విష్ణుదేవుడిని గూర్చి యజ్ఞాలు చేస్తే సమస్త పాపాలు
నశిస్తాయన్నారు వారు. శ్రీకృష్ణుడే యజ్ఞాలన్నింటికీ అధీశ్వరుడు అనికూడా చెప్పారు.
మంచి యజ్ఞం చేసి దేవఋణం తీర్చుకోమని సలహా ఇచ్చారు. ఆ మునులనే ఋత్విక్కులుగా
వుండమని వసుదేవుడు కోరాడు.
శ్యమంత పంచక సమీపంలో
వసుదేవుడు 18 మంది భార్యలతో యజ్ఞ దీక్షను స్వీకరించి, యజ్ఞాన్ని పూర్తి చేశాడు. మహర్షులు ఆ
తరువాత వెళ్లిపోయారు. ఆ తరువాత కృష్ణుడు, బలరాముడు మరికొంత
కాలం అక్కడే వున్న్నారు. మూడునెలలపాటు అంతా కలిసి గడిపారు. ఆ తరువాత నందాదులు
యాదవుల దగ్గర వీడ్కోలు తీసుకుని, దృష్టి మొత్తం శ్రీకృష్ణుడి మీదే నిలిపి, వెళ్లిపోయారు. బలరామ కృష్ణులు ద్వారకానగారానికి వెళ్లారు. ద్వారకానగరంలో
సుఖంగా వున్నారు.
(బమ్మెర
పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)
No comments:
Post a Comment